ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ప్రభుత్వంలోనూ కూడా కలహాలు తీవ్రమవడం కళ్లెదుట కనిపిస్తూనే వుంది. ఉప ముఖ్యమంత్రి దాదాపు సవాలు చేసినట్టు మాట్లాడ్డం, మరో మంత్రి రవీంద్రా రెడ్డి రాజీనామా లేఖ సంధించడం, కేశవ రావు వంటి వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ఇవన్నీ చూస్తుంటే రెండు రకాల వ్యూహాలు గోచరిస్తాయి. మొదటిది ఈ ఫలితాలను ఆధారం చేసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రిని గద్దె దింపడం(వీలైతే తాము కూచోవడం). రెండవది ఉప ఎన్నికల ఓటమి దెబ్బ ప్రభావం తమపై పడకుండా కాపాడుకుంటూ రేపు ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి భూమిక ఏర్పర్చుకోవడం. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చాలా చురుగ్గా వుంటే కోస్తా రాయలసీమలలో మరో కథ నడుస్తున్నది.
తెలంగాణాలో యాభైలలోనూ అరవైలలోనూ ప్రత్యేక వాదాన్ని మొదట ముందుకు తెచ్చిన వారు కాంగ్రెస్ నాయకులే.1999 లోనూ టిఎన్‌సిసి పేరిట ఏర్పాటు చేసి సోనియా గాంధీకి రాష్ట్ర విభజన కోరుతూ మొదట మెమొరాండం ఇచ్చిందీ వారే. తర్వాత ఆ కోర్కెకు ప్రధాన ప్రతిబంధకంగా విమర్శలకు గురైన వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోనే ఈ తతంగమంతా జరిగింది. అప్పటికి కెసిఆర్ ఇంకా తెలుగుదేశంలోనే వున్నారు.ఈ నినాదానికి గల రాజకీయ చెల్లుబాటును గమనించిన తర్వాత, విద్యుచ్చక్తి ఉద్యమం అనంతరం ఆయన బయిటకు వచ్చారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఆ కోర్కెను ఆమోదించినట్టు
వాతావరణం సృష్టించి వుండకపోతే టిఆర్‌ఎస్‌కు కూడా అంత వూపు వచ్చేది కాదని అందరికీ తెలుసు. తర్వాత మాత్రం కాంగ్రెస్ రకరకాల విన్యాసాలు చేస్తున్నది. ఈ ప్రాంతంలో ఆ పార్టీ నేతలు ముఖ్యంగా ఎంపిలు సీమాంధ్ర కోణాన్ని గట్టిగా విమర్శిస్తూ తమ స్వంత పార్టీ వైఖరిపై ఆగ్రహం అసంతృప్తి వెలిబుచ్చుతూ రాజకీయ మనుగడ కాపాడుకుంటున్నారు. మళ్లీ వీరంతా ఢిల్లీలో హాయిగా కూచుని కబుర్లు చెప్పుకుంటూ కాంగ్రెస్ అధికారాన్ని కేంద్ర రాష్ట్రాలలో కాపాడుకుంటూ వస్తున్నారు.అయితే ఇప్పుడు టిఆర్‌ఎస్ క్రమేణా బలం పుంజుకుంటున్నది గనక ముగ్గురు తమ సభ్యులు ఆ పార్టీలో చేరి విజయం సాధించారు గనక మిగిలిన వారి వ్యూహంలోనూ మార్పులు సాధ్యం. వారు ఆ పార్టీ వైపు నడుస్తారా లేక ప్రాంతానికి పరిమితమైన కాంగ్రెస్ వేదికను ఏర్పాటు చేసుకుంటారా అన్నది చూడాలి.
మొన్న జగన్‌పైన కేసు వేసిన మాజీ మంత్రి శంకరరావు ఇప్పుడు ముఖ్యమంత్రిపైనా పిటిషన్ సంధించడం యాదృచ్చికం కాదు. అలాగే జగన్‌పై పోటీ చేసిన రవీంద్రరెడ్డి తనకు ఓట్టు రాకపోవడానికి ముఖ్యమంత్రి కారణమంటూ రాజీనామా చేయడంలోనూ రాజకీయం చాలా వుంది. మరో వంక వివేకానంద రెడ్డి పదవి కోసం పరిపరి విధాల చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం కనిపిస్తుంది. ఇవన్నీ మార్పులకు దారి తీసే అంశాలే.
ముఖ్యమంత్రిని సమర్థిస్తూ ప్రభుత్వంలో వున్న ఆయన వర్గీయులు కొందరు గట్టిగా మాట్లాడుతున్నా వాతావరణం ప్రతికూలంగా వుందనేది వాస్తవం. జగన్ పార్టీ కోవూరులో సాధించిన విజయాన్ని కూడా కలిపి చూస్తే అక్కడ కూడా కొత్త సమీకరణలు సాధ్యమేనని పిస్తుంది. తెలుగుదేశం కాంగ్రెస్ నేతల కొడుకులు కూతుళ్లు అల్లుళ్లు తమ్ముళ్లు పలువురు వైఎస్‌ఆర్ పార్టీలో చేరడం తెలిసిన విషయమే. తాజాగా సిపిఐ నేత పువ్వాడ కుమారుడు కూడా చేరారు. ఈ వలసల వరస ఎంతవరకూ పోతుందనేది రేపటి 18 ఉప ఎన్నికల తర్వాత మరింత స్పష్టమవుతుంది.
No comments:
Post a Comment