Pages

Saturday, March 17, 2012

ప్రణబ్‌ బడ్జెట్‌: ప్రజలపై దాడి



ఇరవయ్యేళ్ల సరళీకరణ అనబడే గరళీకరణ అనంతరం ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2012-13 కేంద్ర బడ్జెట్‌ ఎలా వుండాలో అలా వుంది. కఠిన నిర్ణయాలు తప్పవని ఒకటికి రెండు సార్లు చెప్పిన ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి ఆ కాఠిన్యం కష్టజీవులపైన సామాన్యుల పైన ఎక్కుపెట్టారు. కార్పొరేట్‌ కుబేరులకు, దేశ విదేశీ గుత్తాధిపతులకు సేవలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. సబ్సిడీలు తల్చుకుంటే నిద్ర పట్టడం లేదన్న ప్రణబ్‌ దాదాకు కార్పొరేట్లకు ఏడాదికి దాదాపు అయిదు లక్షల కోట్ల వరకూ ఇస్తున్న రాయితీలు హాయిగా నిద్ర పట్టించడమే గాక గురకలు పంచ రంగుల కలలు కూడా తెప్పిస్తున్నాయన్న మాట. అందుకే ఈ బడ్జెట్‌లో ఆ తరహా రాయితీలు బాగా పెంచేసి సామాన్యులకూ మధ్య తరగతి ప్రజలకూ వాతలు పెట్టేశారు. ఈ సారి బడ్జెట్‌ విశ్లేషణలో ఎలాటి తేడాలు లేకుండా అన్ని పత్రికలూ ఇదే చెప్పడం గమనార్హం. చాలా కాలం తర్వాత పరోక్ష పన్నులను బాగా పెంచేసి ప్రత్యక్ష పన్నులను మాత్రం మైనస్‌లోకి తీసుకెళ్లారు. ఆర్థికాభివృద్ధి శాతం 6.9 శాతం మాత్రమే వుంటుందని ఒక వైపున చెబుతూనే మరోవైపున అవే విధానాలను కొనసాగించాలనుకోవడం ఎంత అనర్థదాయకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆహార సబ్సిడీలను తప్ప అన్నిటినీ ఎత్తివేస్తానన్న మంత్రి ఆహారం కేటాయింపును కూడా కేవలం రెండు వేల కోట్లు మాత్రమే పెంచారు.పెరిగే ధరల భారంతో పోలిస్తే ఇది నామమాత్రమే.ఇక వ్యవసాయ సంక్షోభం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సర్వేలోనూ ఆ మాట చెప్పారు.కాని 14 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయానికి కేవలం 20 వేల కోట్ల కేటాయింపుతో సరిపెట్టారు.సర్వీసు టాక్సులు ప్రతిదానిపై పెంచడమే గాక చిన్న జాబితాకు మాత్రమే మినహాయింపు ఇచ్చి తక్కినవాటన్నిటిపైనా బాదేశారు. రక్షణకు మాత్రం 17 శాతం పైన కేటాయింపులు ఎందుకు చేశారంటే రేపు విదేశీ ఆయుధ కంపెనీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చి ఆదాయం పెంచడానికే! ప్రభుత్వ సంస్థలలో 30 వేల కోట్ల వాటాల అమ్మకం ఎజెండా కొనసాగించారు. బడ్జెట్‌కు ముందే ఎపిఎఫ్‌ వడ్డీ రేటు తగ్గించి ఉద్యోగులపై వేటు వేసిన ప్రభుత్వం ఆదాయం పన్ను మినహాయింపును 2 లక్షలకే పరిమితం చేసి అదో పెద్ద వరమైనట్టు చెప్పుకున్నది.ఆర్థిక మంత్రి బాధ్యతలు తీసుకున్నప్పుడు 3 శాతం వున్న ధరల పెరుగుదల ఇప్పుడు 9 శాతం దాటినా ప్రభుత్వ పంపిణీని మె రుగుపర్చే ఆలోచనలు చేయకపోగా అంతా మార్కెట్‌ దయా భిక్షకే వదిలేశారు. ఉపాధి పెరగడం లేదని ఆందోళన వెలిబుచ్చిన ప్రభువులు ఆ రంగంలో మాత్రం ఎలాటి చర్యలూ తీసుకున్నది లేదు. ఏతావాతా రానున్న కాలంలో ప్రజల జీవితాలు ఆర్థిక భారాలు దుర్భరంగా మారడం రోజు ప్రతి కీలక వస్తువు ధర పెరగడం అనివార్యం. పారాహుషార్‌!

No comments:

Post a Comment