Pages

Saturday, March 17, 2012

అద్భుతం కాదు, అంతా అధ్వాన్నమే!


కొంతకాలం కిందట ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రయోగించిన సామెతతో చెప్పాలంటే కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పరిస్థితి పెనం మీంచి పోయిలోకి పడినట్టుగా వుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 2014లో కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం లేదని రాష్ట్ర మంత్రి జానారెడ్డి మొదటి సారి అర్థమయ్యేట్టు చెప్పగలిగారందుకే. తర్వాత మళ్లీ మీడియాపై నింద వేసి తప్పకోవడానికి కొత్త భాష్యం చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిజానికి మనసులో మాటనే చెప్పారు. నిజానికి ఆ మాట అందరి మనస్సులోనూ వున్నదే. అస్థిరత్వంతో అస్తుబిస్తుగా నడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించడమే గగనంగా వుంటే అద్బుతాలు ఏం జరుగుతాయి? అధ్వాన్నం కావడమే తప్ప!
మొదట రాష్ట్రం విషయమే తీసుకుంటే లిక్కర్‌ సిండికేట్ట వ్యవహారం మాఫీ చేసి హమ్మయ్య అనుకోకముందే ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. పైకి ఎంత గంభీరంగా కనిపించినా దీని రాజకీయ పర్యవసానాలు నేతలకు బాగా తెలుసు.అందుకే మొదట సూటిగా సమర్థించిన ముఖ్యమంత్రి తర్వాత కాస్త సర్దుకున్నారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కనక ఆయన హయాంలో జరిగిన వాటికి రాజకీయంగా ఆ పార్టీ బాధ్యత లేదని తప్పుకోవడం అసాధ్యం. అలాగే ఆ రోజుల్లో విడుదలైన 26 జీవోలకూ సంబంధిత మంత్రులకు సంబంధం లేదని తప్పుకోవడం అసలే అసంభవం. క్విడ్‌ ప్రో కో పద్ధతిలో ప్రభుత్వ ధనాన్ని ప్రకృతి సంపదను కొందరికి దోచి పెట్టి ప్రతిఫలంగా తమ సంస్థలలో పెట్టుబడులు పెట్టించారన్నదే ఇక్కడ కేసు. ఈ కేసులో
రెండవ, మూడవ నిందితులు ఇప్పటికే కటకటాల్లో వున్నారు. కొంతమంది ఐఎఎస్‌లూ అక్కడికే చేరారు. మొదటి నిందితుడిగో వున్న తమ నేతపై చేయేస్తే ఆ చేయి తీసేస్తామని అనుయాయులు వీరంగం తొక్కుతున్నారు. ఇవన్నీ రసవత్తరంగానే జరుగుతున్నాయి గాని ఈ క్విడ్‌ ప్రో కో కు ఉపకరించిన జీవోల జారీలో మంత్రి పుంగవులు మాత్రం హాయిగా సంచరిస్తున్నారు. సూక్తులు దంచేస్తున్నారు. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం మంత్రివర్గం సమిష్టి బాధ్యత అయినప్పుడు వారు చేతులు దులిపేసుకోవడం ఎలా చెల్లుతుంది? పోనీ బొత్స వంటి వారు అన్నట్టు తెర వెనక భాగోతాలతో సంబంధం లేదని సరిపెట్టినా ఆ మేరకు నేరుగా సంజాయిషి ఇవ్వనక్కర్లేదా? తెర వెనక భాగోతాలకు తెరపై సూత్రధారిగా నడిపించిన నాయకుడెవరో చెప్పనవసరం లేదా? నైతికంగా తప్పుచేసి వుంటే అదో అనర్హత- తప్పు జరుగుతున్నా ఆపలేకపోయి వుంటే అదో అసమర్థత. కనక ఏదో విధంగా ప్రజలకు కోర్టులకు సంజాయిషీ ఇవ్వకపోతే జవాబుదారీ తనం ఏముంటుంది? కాని సర్కారీ న్యాయ కోవిదులు కొందరు సుప్రీం కోర్టు నోటీసులు సిబిఐకి సంబంధించినవి తప్ప తమకు నిమిత్తం లేదంటున్నారు..

ఇది ఒక రోజులోనో ఒక ఘటనలోనో జరిగింది కాదు. సుదీర్ఘ కాలం పాటు విస్తారమైన పరిధిలో జరిగింది. ఈ 26 జీవలలో బ్రాహ్మణి స్టీల్స్‌, పెన్నా సిమెంట్‌ వగైరాలన్ని వున్నాయి. ఒక వేళ మంత్రులు మొదట చూసుకోకుండా సంతకం పెట్టారనుకున్నా ఇంత రభస జరిగిన తర్వాతనైనా సంతకం చేసిన కాగితాలు చూసి సత్యం వెల్లడించి వుండొచ్చు కదా? కనక ఇక్కడ అమాయక భంగిమలూ అసహాయ ఆర్తనాదాలు అక్కరకు వచ్చేవి కావు. వైఎస్‌ హఠాన్మరణం వల్ల తర్వాత జగన్‌ కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించడం వల్ల ఇవన్నీ బయిటకు వచ్చాయి తప్ప లేకుంటే వాళ్లలో వాళ్లు నిక్షేపంగా సర్దుబాటు చేసుకుని వుండేవారు. అప్పటిలాగానే ఇప్పుడు తెర వెనక ఏం జరుగుతుందో కూడా తెలియదు.లిక్కర్‌ వ్యవహారంలో నున్నా వెంకట రమణ అడ్డం తిరిగిన తీరు చూస్తే ఈ వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది.అస్తుబిస్తుగా అస్తిరంగా నెట్టుకొస్తున్న నేటి స్థితిలో కఠినమైన చర్యలు తీసుకోగల సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ క్రమంలో మంత్రులు తప్పు చేయలేదనేట్టయితే అప్పుడు కేసుకే ఆస్కారం వుండదు.
జగన్‌ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు సబ్బం హరి,సోమయాజలు వ్యాఖ్యలు మరో విధంగా వున్నాయిఈ జీవోల వల్ల లబ్ది పొందారో లేదో చూడాలని ఒకరంటే .ఈ జీవోలు తప్పో కాదో తేల్చాలని మరోకరన్నారు. అంటే కథ మళ్లీ మొదటికొచ్చేసిందన్నమాట. తప్పే లేదనకుంటే అప్పుడు మంత్రులనూ విచారించాలని మొదటి నుంచి వైఎస్‌ఆర్‌ పార్టీ ఎందుకు కోరినట్టు? పిటిషన్‌ వేసిన సుధాకరరెడ్డి కిందనుంచి పోరాడుతూ సుప్రీం వరకూ వెళ్లింది అదే అభ్యంతరంపై కదా? ఒక వేళ జీవోలు తప్పు కాదు, అవినీతి జరగలేదు అంటే మమ్ముల్ను వదిలేయమనాల్సింది గాని మంత్రులను విచారించాలని కోరే అవసరమేముండేది? అలాగే వారికి మూల విరాట్టుగా వున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు చేర్చడంపై అభ్యంతరాలెందుకు వచ్చేవి?ఇక్కడ సహ నిందితులుగా వుండాల్సిన వారు ఈ విధంగా పరస్పరం ఆరోపణలు చేసేసుకుని ఆ పైన సర్డుబాటు చేసుకున్నంత మాత్రాన వేల కోట్ల రూపాయల విలువైన అక్రమాలు హుష్‌కాకి అయిపోతాయా? అదే జరిగేట్టయితే ఇక చట్టసభలకూ న్యాయ స్థానాలకూ సిబిఐ దర్యాప్తులకు అర్థమేమిటి? రాజ్యాంగ రాజకీయ సూత్రాలకు విలువేమిటి?
జగన్‌ను అరెస్టు చేస్తారా లేదా అనే దానిపై అనేక వూహాగానాలు సాగుతుండగా కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఆ అవకాశం లేదని తేల్చేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం ధోరణి మారిందనీ చెబుతున్నారు. మహారాష్ట్రలో శరద్‌పవార్‌ ఎన్‌సిపితోనూ, బెంగాల్‌లో మమతా బెనర్జీ టిఎంసితోనూ చేతులు కలిపిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా యుపిఎను బలపరుస్తామని కొంతకాలం కిందట జగన్‌ చేసిన వ్యాఖ్యను ఆయన అనుయాయులు కొందరు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. అలా రెండు కాంగ్రెస్‌లు ఒకటై పోతే తాము ఏకైక ప్రత్యామ్నాయంగా ప్రయోజనం పొందవచ్చునన్న దింపుడు కల్లం ఆశ తెలుగు దేశం నేతలకూ వుంది. అయితే అంతర్గత కలహాలను బహిరంగంగా సాగనిచ్చి రాజకీయ దృశ్యాన్ని చిందరవందర చేయడం కాంగ్రెస్‌ను వెన్నతో పెట్టిన విద్య. వైఎస్‌ మరణానంతరం తమ పార్టీలో తలెత్తిన అంతర్గత కల్లోలాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రాజకీయ కాష్టంగా మార్చింది కేంద్రమే. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ ఏ ఎత్తు వేస్తుందో ఏ ముప్పు తెస్తుందో చూడాలి.
కాకపోతే దేశంలోనూ రాష్ట్రంలోనూ వరుసగా ఎదురుదెబ్బలతో శృంగభంగమైన కాంగ్రెస్‌ అధికారం నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా పెనుగులాడుతుంది. కేంద్రంలో రైల్వే బడ్జెట్‌పై మమతా బెనర్జీ సాగిస్తున్న ప్రహసనం ఇందుకో ఉదాహరణ మాత్రమే. ఈ విషయమై ఇదమిద్దంగా చెప్పకుండా లోలోపల సర్దుబాటు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నది.నాటకాలకు మారుపేరైన మమతా కూడా ఏదో విధంగా రాజీ పడే అవకాశమూ వుంది. శ్రీలంక సమస్యపై చిక్కులు పెట్టిన డిఎంకె ఇప్పటికే తోకముడిచింది. ఇది గాక ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌ వాది పార్టీ 22 మంది ఎంపిల మద్దతు పొందాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. ఇలా ఏదో విధంగా మనుగడ సాగించినప్పటికీ మర్యాద మాత్రం మంటకలుస్తోందని మన్మోహన్‌ సింగ్‌ వంటివారికి తెలియనిది కాదు. అందుకే వారు వున్న వ్యవధిలోనే కార్పొరేట్లకూ దేశ విదేశీ గుత్తాధిపతులకు శత విధాల మేలు చేసేయాలని ఉవ్విళ్లూరు తున్నారు. రైల్వే బడ్జెట్‌, ఆర్థిక బడ్జెట్‌ కూడా ఆకోవలోనే వున్నాయి. పణబ్‌ బడ్జెట్‌ను ఏ తరగతి ప్రజలూ హర్షించకపోగా అన్ని పత్రికలూ సామాన్యులకు చేటుగానే వర్ణించాయి. బడ్జెట్‌లో ఆర్థిక సంక్షోభాలు నిధుల కొరత గురించి కూడా చాలానే చెప్పాల్సి వచ్చింది. ఈ విధంగా ఆర్థిక రాజకీయ సంక్షోభాలు చుట్టుముడుతుంటే ప్రజలలో ఆగ్రహం అసంతృప్తి పెరగడం తథ్యం. విధానాలు సరిచేసుకోకుండా వికృత సమర్థనలతో వింత వాదనలతో నెట్టుకురావాలని చూడటమే కాంగ్రెస్‌ను మరింతగా కల్లోలాల వైపు తీసుకుపోతున్నది. అణు ఒప్పందం తరుణంలోనూ చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐల సందర్బంలోనూ అన్నట్టే ఇప్పుడూ కఠిన నిర్ణయాల కోసం అధికారాన్నయినా వదులుకుంటామని మన్మోహన్‌ ప్రవచించారు. కాకపోతే అక్రమలాభార్జనా పరులను అవినీతి నేతలపై అపార ప్రేమ కురిపిస్తూ అశేష జన సామాన్యం పట్ల కఠినంగా వుంటామంటున్నారు. ఇక ఇన్ని దుష్పరిణామాల తర్వాత ప్రజలు కూడా కఠినంగానే వుండటం అనివార్యమని ఉత్తర ప్రదేశ్‌ పంజాబ్‌ ఫలితాలే చెబుతున్నాయి. ఢిల్లీలోనూ హైదరాబాదులోనూ సాగుతున్నతాజా మల్లగుల్లాలు కాంగ్రెస్‌ను ఇంకా అస్తవ్యస్తం చేయడం తప్ప జానారెడ్డి చెప్పిన అద్బుతాలకు ఆస్కారమే లేదు.

No comments:

Post a Comment