
దేశంలో సర్వ రంగాలనూ చుట్టుముట్టిన సంక్షోభం ఇప్పుడు సైన్యాన్నీ ఆవరించింది. సైన్యాధిపతి జనరల్ వి.కె.సింగ్ లేఖ బహిర్గతం కావడంపై పరిపరి విధాల ఆందోళన నెలకొనడంలో ఆశ్యర్యం లేదు. నిజానికి పారదర్శకత లేని సైనిక కొనుగోళ్లలో అంతులేని అవినీతి సాగుతుంటుంది.ఈ ఏడాది ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల రక్షణ బడ్జెట్ వుేంట్తే అందులో 80 వేల వరకూ కొత్త ఆయుధాల కొనుగోలుకు కేటాయించారు. కనక దీన్ని కబళించడానికి నాసి రకం వస్తువులు అంటగట్టేవారినుంచి కొన్ని రెట్లు ఎక్కువ ధర వసూలు చేసే కంపెనీల వరకూ రకరకాల శక్తులు కాచుకుని వుంటాయి. కనక వికెసింగ్ తనకు 14 కోట్లు లంచం ఇవ్వజూపారని చేసిన ఆరోపణను శంకించవలసిన అవసరం లేదు.అయితే దాన్ని రక్షణ మంత్రి ఆంటోనీ వెంటనే పట్టించుకోకపోవడం, సింగ్ కూడా దర్యాప్తుచర్యలకు సిద్దం కాకపోవడం సందేహాలు పెంచుతున్నాయి. ఇక ఆయన రక్షణ దళాల సమర్థత గురించి ప్రధానికి రాసిన లేఖ లీకు కావడం ఎవరి పుణ్యమో విచారణలో గాని తేలదు ఆయన తనుగా బయిటపెట్టి వుండకపోవచ్చు. ఎందుకంటే దాని పర్యవసానాలు ఆయనకు బాగా తెలుసు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు భారీగా అవకాశాలు కల్పించిన తర్వాత దాన్ని కైవశం చేసుకోవాలని కార్పొరేట్ శక్తులు ఆయుధ బేహారులు పోటీ పడుతున్నారు. కనక వీరంతా అవినీతిని పెంచడంలో ఆశ్చర్యం లేదు. గతంలో ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో సంచలం రేకెత్తించిన తెహల్కా టేపుల వ్యవహారం రక్షణ రంగంలో అవినీతిని చాటింది. ఇటీవల ఆదర్శ హౌసింగ్ స్కాం, సైనికాధికారులపై చర్యకు కారణమైన సుకోరు భూముల వ్యవహారం, 40 మందికి పైగా అధికారులు తమ ఆయుధాలను తక్కువ ధరకు అమ్ముకున్న కారణంగా తొలగించాల్సి
వచ్చిందని ఆంటోనీ చేసిన ప్రకటన ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.మిగిలిన వ్యాపారాల్లో కన్నా ఆయుధాల వ్యాపారంలో వందల రెట్లు లాభాలు వస్తాయి గనకే ఆయుధ కంపెనీలు దేశ దేశాల అధికారులపై వలలు వేస్తుంటాయి.వి.కె.సింగ్ పదవీ విరమణ వయస్సుపై వివాదం తర్వాతనే ఇవన్నీ ముందుకు వచ్చాయనేది నిజమే అయినా చర్చ అక్కడే ఆగిపోతే న్యాయం జరగదు. రక్షణ వ్యవస్థ సమర్థతను ప్రశ్నార్థకం చేయడం ప్రైవేటు కంపెనీల ప్రవేశానికి చాలా అవసరమని కూడా గుర్తుంచుకోవాలి.కనక ఈ వివాదానికి చాలా కోణాలున్నాయి. రక్షణ రంగ అవినీతి నిర్మూలనా చర్యలకు వ్యవస్థ ప్రక్షాళనకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది ఆంటోని నిజాయితీ లేదా సింగ్ ఉద్దేశాలు వంటి పైపై అంశాలకు పరిమితం కాకూడదు
No comments:
Post a Comment