Pages

Friday, March 23, 2012

సిఎజి లీకేజిని ఖండిస్తే క్లీన్‌ చిట్‌ అవుతుందా?


సరికొత్త బొగ్గు కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలు నిజం కాదని సిఎజి వినోద్‌ రాజా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. వాస్తవం ఏమంటే సిఎజి నివేదిక లీకేజిపై ప్రధాని కార్యాలయం ఆరా తీస్తే దాన్ని మాత్రమే ఆయన ఖండించారు. విచారం వెలిబుచ్చారు. పైగా సిఎజిని సమాచార హక్కు చట్టం కింద చేర్చాలని కూడా కోరారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులో మాత్రం తాము ఎలాటి ముసాయిదా(చిత్తు ప్రతి) నివేదిక కూడా ఇంత వరకూ ఇవ్వలేదని ఇంకా పరిశీలన చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఒక కీలకమైన సాంకేతికమైన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఆడిటింగ్‌లో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం ఒక పట్టాన ముగిసేది కాదని, అప్పటి వరకు వాటిని తాత్కాలిక అభిప్రాయాలుగానే పరిగణించాల్సి వున్నందున తమ దృష్టికి వచ్చిన అంశాలను కూడా చెప్పగల స్తితి వుండదని సూచించారు. బొగ్గు కుంభకోణం విషయానికి వస్తే అలాటి ఆరోపణలే లేవని ఆయన లేఖలో ఎక్కడా పేర్కొనటేదు. సిఎజి లేఖ
పూర్తి పాఠం (ఈ కథనం బయిటపెట్టిన) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. అందులో ఒక పేరాగ్రాఫు పట్టుకుని అంతా సజావుగా వుందని బుకాయించడం చెల్లుబాటయ్యేది కాదు. 2 జి స్ప్రెక్ట్రం సందర్భంలోనూ ప్రభుత్వం ఇలాగే సమర్థించుకుని తర్వాత దారుణంగా దొరికిపోయి సంకీర్ణ ధర్మం అంటూ అధర్మపన్నాలు చెప్పింది. బొగ్గు ఉత్పత్తి ఖర్చుకు ప్రైవేటు కంపెనీలకు సరఫరా చేస్తున్న రేటుకు మధ్య తేడాను లెక్కకట్టి న సిఎజి తద్వారా ఖజానాకు రావలసిన ఆదాయం ఎంత గల్లంతు అవతున్నదో తేల్చింది. ఇంకా తొంభై శాతం బొగ్గు నిల్వలు వున్నాయి గనక దాన్ని 90 తో గుణించి 10 లక్షల కోట్ల నష్టం లెక్క తేల్చింది. ఇది వూహాజనితమేమీ కాదు. ఇప్పుడున్న ప్రైవేటీకరణ జపంలో అసాధారణమూ కాదు. పైగా ప్రధాని బొగ్గు శాఖ చూస్తున్నప్పుడే ఇదంతా జరిగింది. ఇది వరకటి పోస్టులో నేను ప్రకృతిని కొల్లగొట్టడం గురించి రాశాను. ఇక్కద సమస్య ప్రకృతి వనరులన్నదే తప్ప కేవలం సౌందర్యం పర్యావరణ పరిరక్షణ కాదు.ప్రపంచంలోని బొగ్గు నిల్వల్లో 7 శాతం మాత్రమే మన దేశంలో వున్నాయి. ఉత్పత్తిలో ఆరు శాతమే మనం చేస్తున్నాం. కనక అక్రమ లాభాల మాట అటుంచి వాటిని జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత కూడా మనపై వుంది. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు బహుళజాతి సంస్థలు పరిశ్రమల పూర్వ ఆర్థిక వనరులు అంటే భూములు గనులు నీరు రేవులు కొండలు వాయు తరంగాల వంటి వాటిపై కన్నేశారన్నది ప్రభాత్‌ పట్నాయక్‌ వంటి ఆర్థిక వేత్తల విశ్లేషణ. ఒకప్పుడు బ్రిటిష్‌ వారు మన దేశం వచ్చింది కూడా ముడి సరుకుల కోసమేనని మర్చిపోరాదు. ఇప్పుడు కూడా ఏదో విధంగా వనరులను తరలించుకుపోతున్నారు. కనక ఇది ఆర్థిక అంశమే గాని కేవలం పర్యావరణ పరిరక్షణ పాఠం కాదు.

No comments:

Post a Comment