ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వూహించనివి కాకపోయినా అనంతర ప్రకంపనాలు మాత్రం వూహించిన దానికంటే తీవ్రంగా వున్నాయి. తెలంగాణా ప్రాంతంలోని ఆరు స్థానాలు, నెల్లూరు జిల్లా కోవూరు ఎక్కడా ప్రభుత్వ పక్షమైన కాంగ్రెస్ గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం గాని గెలవలేకపోయాయి. తెలుగు దేశం తెలంగాణాలో మూడు చోట్ల డిపాజిట్ కోల్పోగా కాంగ్రెస్ కొన్ని చోట్ల మూడవ స్థానంలో వుండి పోయింది. ఆ రెండు పార్టీల శాసనసభ్యులను చేర్చుకుని ఈ ఉప ఎన్నికలకు కారణమైన టిఆర్‌ఎస్ నాలుగు చోట్ల విజయం సాధించి మహబూబ్‌నగర్‌లో మాత్రం బిజెపికి సీటు కోల్పోయింది.నాగర్‌కర్నూలులో తెలుగు దేశం మాజీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి స్వతంత్రుడుగా గెలుపొందారు. కాగా కోవూరులో మాజీ తెలుగు దేశం సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సారి వైఎస్‌ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఫలితాలు వూహించినవే అయినా అవి వెలువడిన తర్వాత ఈ రెండు పార్టీలలోనూ ప్రత్యక్ష పరోక్ష ప్రకంపనాలు మాత్రం అనుకున్నదానికన్నా తీవ్రంగా వున్నాయి. ఒక విధంగా రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలకు పరిణామాలకు ఇవి సూచికలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం నినాదంతో ఏర్పడిన టిఆర్‌ఎస్ ఉద్యమాలలోనూ విమర్శలు వివాదాలలోనూ ముందున్నా రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్ తెలుగు దేశంల తర్వాతి స్థానమే దానిదనే భావన ఇప్పటి వరకూ వుంది. అది అవాస్తవం కాదు కూడా.అయితే కేంద్రం అనిశ్చిత వైఖరిని ఆసరా చేసుకుని ఆ పార్టీ క్రమేణా రాజకీయంగా ప్రధాన శక్తిగా రూపొందుతుందనే అభిప్రాయానికి ప్రస్తుత ఫలితాలు ఆస్కారమిస్తున్నాయి. రెండు పార్టీల నుంచి వచ్చి చేరిన వారి స్థానాలను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులోనూ తమ స్థానాలను కాపాడుకోవాలనుకునే మరింత మందికి ఆకర్షణీయమైన గమ్యంగా ఆ పార్టీ మారవచ్చు. మరో విధంగా చెప్పాలంటే వలసలకు కేంద్ర బిందువు కావచ్చు.దానివల్ల ఆ పార్టీలో ఇప్పటికే వున్న వారిపై ఎలాటి ప్రభావం పడుతుందనే దానితో పాటు ఎత్తుగడల్లోనూ మార్పులు రావచ్చు.
పైగా ఈ సారి విజయం సాధించినప్పటికీ తెలంగాణా ఎన్నికల క్షేత్రంలో టిఆర్‌ఎస్ వూపు కొంత తగ్గిందనే భావన కూడా ఏర్పడింది.ఎందుకంటే గతంతో పోలిస్తే గెలిచిన అభ్యర్థుల ఆధిక్యతలు తగ్గడం, గతంలో అన్ని చోట్లా డిపాజిట్టు పోగొట్టుకున్న తెలుగు దేశం రెండు చోట్ల తెచ్చుకోవడం, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడం
ఇందుకు కారణాలు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని చెప్పే సిపిఎం మూడు చోట్ల పోటీ చేసి ఇదివరకటి పరిమితమైన స్వంత ఓట్లను నిలబెట్టుకోగలిగింది. తెలంగాణా సమస్యపై ఇంతగా దోబూచులాడి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన కాంగ్రెస్ ఎక్కువ చోట్ల ద్వితీయ స్థానంలో వచ్చింది. టిఆర్‌ఎస్ రాజకీయ విజయాన్ని గుర్తిస్తూనే ఈ భాగాన్ని కూడా పేర్కొనడం వారికి మింగుడు పడని అంశంగా వుంది.సిపిఎం తప్ప మిగిలిన వారికి వచ్చిన ఓట్లన్నీ తెలంగాణా వాదానికి వచ్చినట్టే భావించాలని వారి వాదన. గతంలో ఈ శీర్షికలో చెప్పుకున్నట్టు మీరు ద్రోహులంటే మీరు దొంగలని ఆరోపించుకున్న పార్టీల నేతలకు వచ్చిన ఓట్లన్ని ఒకే తరహాలో చూడమంటే అది అసంబద్దమే. తెలంగాణా వాదం పేరిట జరుగుతున్న రాజకీయంలో టిఆర్‌ఎస్ ప్రథమ స్థానం పొందితే కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో వుంది. ఇప్పటికీ దీనిపై ఏం చెప్పాలో స్పష్టంగా తేల్చుకోలేక సంధిగ్ధావస్థలో వున్న తెలుగు దేశం విశ్వసనీయత పొందలేకపోతున్నది. ఇదీ సారాంశం.
ఇక బిజెపి అభ్యర్థి విజయానికి వస్తే అది కేవలం ప్రాంతీయ వాదంతోనే కొలవగలిగింది కాదు. దేశ వ్యాపితంగా మతతత్వ రాజకీయాలకు ప్రధాన ప్రతినిధిగా వున్న బిజెపి ఆ ధోరణులకు ప్రాంతీయ వాదాన్ని సామాజిక సమీకరణలను తోడు చేసుకోవడం వల్ల ఎట్టకేలకు విజయం సాధించింది. తన పాలనలోని కర్ణాటక గుజరాత్‌లలోనే ఉప ఎన్నికలలో స్తానాలు కోల్పోయిన పార్టీ ఇక్కడ విజయం సాధించడం ఆశ్యర్యకరమే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఇది ఆందోళనకరమని నేరుగానే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జెఎసి వేదికలో సాగిన అంతర్మధనం, వచ్చిన భిన్నాభిప్రాయాలు కూడా భావి తెలంగాణా రాజకీయాలకు సూచికలుగా వుంటాయి. 2009 ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకుముందే కెసిఆర్ మహాకూటమిని వదలి ఎన్‌డిఎ వైపు పరుగులు తీశారు. తర్వాత కాలంలో పార్లమెంటులో నిరసన తెల్పడానికి కూడా బిజెపి మద్దతు తీసుకున్నారు. కాని తర్వాత వారు ఆ మద్దతు నిచ్చింది లేదు. అద్వానీ రథయాత్ర వచ్చినపుడు మొదటగా తెలంగాణా విభజన కోర్కెనే వినిపించినా టిఆర్‌ఎస్ అధికారికంగా స్వాగతించలేదు. ఇలా పలు సందర్బాల్లో ఆ ఉభయుల మధ్య పొరపొచ్చాలు కనిపిస్తూనే వున్నాయి. కెసిఆర్ తెలంగాణా జనాభా పొందిక రీత్యా మైనారిటీల ఓట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను దూరం వుంచుతున్నారనే విమర్శ బిజెపిలో వుంది. ఇలాటి వైరుధ్యాలన్ని మహబూబ్‌నగర్ ఫలితంలో ప్రతిబింబిస్తున్నాయి. అంతేగాక ప్రాంతీయ తత్వం మతతత్వం కూడా కలగలపి రాజకీయం చేయడం ఎలా సాధ్యమో అర్థమవుతుంది. ఈ ఫలితం అన్నిచోట్లా పునరావృతం అవుతుందనే ఆశల్లో బిజెపి నేతలుంటే ఆ అవకాశం వుండదని టిఆర్‌ఎస్ చెబుతున్నది. ఏమైనా తెలంగాణా నామస్మరణతో మతతత్వ రాజకీయాలు ప్రబలకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా వుంటుంది. టిఆర్‌ఎస్ బిజెపి సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు రాష్ట్ర విభజనపై ఒకే వైఖరితో వున్నా వీరి మధ్య సఖ్యత ఐక్యత ఏ రూపంలో వుంటాయనేది పెద్ద సవాలే. మరోవైపున కాంగ్రెస్ తెలంగాణా నాయకులు కూడా తమ స్వంత వేదికను ఏర్పాటు చేసుకుని స్థానం నిలబెట్టుకోవాలని చూస్తారు.ఈ క్రమంలో టిఆర్‌ఎస్ తమకు చేరువ కావాలని కూడా చెబుతున్నారు. ఇక్కడ మేము అక్కడ జగన్ అన్న రీతిలో గతంలో మాట్లాడిన టిఆర్‌ఎస్ నేతలు ఆ పార్టీ పట్ల ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్న కూడా వుంది.
కోవూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం రేపు రావలసిన 17 స్థానాల ఉప ఎన్నికల పోరాటంలో వారికి ఉత్సాహమివ్వడం సహజం. అయితే ఒక చోటే సర్వశక్తులూ కేంద్రీకరించిన సందర్బానికి అనేక చోట్ల పోరాడవలసిన అవసరానికి మధ్య తేడాలు చాలా వుంటాయి.కోవూరులో కూడా వారు ఆశించిన ప్రకటించిన ఆధిక్యత రాలేదన్నది నిజం.అయితే అంతకన్నా ముఖ్యం- తెలుగు దేశం తన నుంచి ఫిరాయించిన నాయకుడి స్థానాన్ని తిరిగి రాబట్టుకోలేకపోయింది. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు పాత రివాజునే ప్రతిబింబించాయనుకున్నా అత్యధిక చోట్ల పోటీలు జరిగే ప్రాంతంలో కూడా తెలుగుదేశం పుంజుకోలేకపోవడం వారి ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీసే అంశమే. ఈ ఫలితాలకు కొంచెం ముందుగా జరిగిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కూడా తెలుగు దేశంలో అసంతృప్తిని పెంచింది. తాము గతం కన్నా మెరుగు పడ్డామని తెలుగు దేశం చెప్పడం, వారికన్నా మేము మెరుగ్గా వున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం వింతగానే మిగిలిపోయింది. ఉప ఎన్నికల ఫలితాలు ఉభయ పార్టీలలోనూ ప్రకంపనాలు పుట్టించాయనేది స్పష్టం.
అయితే అధికారంలో వుండటమే గాక ఇప్పటికే అనిశ్చితి అంచులలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌లో ఈ ప్రకంపనాలు ప్రతిధ్వని తీవ్రంగా వుంది. మంత్రి రవీంద్రారెడ్డి రాజీనామా లేఖ పంపితే ఉప ముఖ్యమంత్రి రాజ నరసింహతో సహా పలువురు ముఖ్యమంత్రి తప్పుకోవాలని సూచించారు. తెలంగాణా పార్లమెంటు సభ్యులైతే మరీ తీవ్రంగానే సవాలు చేశారు. అంతకన్నా ముందే కోస్తా జిల్లాల ఎంపిలు అధిష్టానాన్ని కలసి అసమ్మతి వినిపించి వచ్చారు.ఈ మధ్యలో అవినీతి కేసులలో కోర్టుల నోటీసులు జారీ అవుతున్నాయి. మాజీ మంత్రి శంకర్‌రావు ముఖ్యమంత్రితో సహా మరికొందరిపై ఎర్రచందనం అవినీతి కేసు వేశారు.వైఎస్.వివేకానందరెడ్డి అసంతృప్త రాగాలు తీవ్రం చేశారు. మొత్తంపైన చెప్పాలంటే కాంగ్రెస్ కలహాల నిలయంగా మారిపోయింది. ముఖ్యమంత్రి వర్గీయులు ఆయనను సమర్థించడానికి శాయశక్తులా తంటాలు పడుతున్నా పరిస్థితి ప్రతికూలంగా వుందనేది నిజం.
ఉప ఎన్నికల ఓటమి పాఠాలు నిజంగా నేర్చుకునేట్టయితే రాష్ట్రం భవిష్యత్తు విషయంలో అనిశ్చితికి స్వస్తి చెప్పి స్పష్టమైన ప్రకటన చేయడం కేంద్రం బాధ్యత. దానికి ఆ మేరకు నచ్చజెప్పవలసింది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. కాని ఈ పరిణామాన్ని తమ అంతర్గత కలహాల పరిష్కారం కోసం పదవీ రాజకీయాల కోసం వినియోగించుకునే ప్రయత్నమే కాంగ్రెస్‌లో ఎక్కువగా జరుగుతున్నది. ఇంకా చెప్పాలంటే తమను తామే ఓడించుకునే రీతిలో కాంగ్రెస్ వాదులు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి ఆలోచించడం లేదు. అవినీతిని ఎదుర్కొనే విషయంలోనూ చర్యలు లేవు. తాను అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తానని జగన్ చేసిన ప్రకటన కూడా హాస్యాస్పదంగానే కనిపిస్తుంది.గత వారం ఈ శీర్షికలో చెప్పుకున్నట్టు ఆయనపై దర్యాప్తు నెమ్మదించిందన్న కథనాలకు తగినట్టే కొత్త చర్యలు వేగంగా జరగడం లేదు. ఛార్జిషీటు గడువు ముగిసేలోగా సిబిఐ జగన్‌ను తప్పక అరెస్టు చేస్తుందనే అంచనాలు తక్కువగానే వినిపిస్తున్నాయి. పైగా వివేకానందరెడ్డి నుంచి రాజకుమారి వరకూ తాము జగన్ పార్టీ వైపు చూడటం లేదని వివరణలు ఇచ్చుకోవలసిన స్తితి కనిపిస్తుంది.ఈ దఫా ఉప ఎన్నికలలో పరకాల కూడా వుంటుంది గనక టిఆర్‌ఎస్ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వెల్లడవుతుంది. ఏది ఎలా వున్నా ప్రభుత్వంలోనూ రాజకీయాలలోనూ పెను మార్పులు రావచ్చనే ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.
ఈ మల్లగుల్లాల మధ్య వామపక్షాల పాత్రపైనా వ్యాఖ్యలు వస్తున్నాయి. అదిలాబాదు, స్టేషన్ ఘన్‌పూర్, కొల్లాపూర్‌లలో పోటీ చేసిన సిపిఎం తన ఓటింగును తాను నిలబెట్టుకుంది. ఏటికి ఎదురీతలా ఒక స్పష్టమైన విధానంతో వెళ్తున్న ఒకే ఒక పార్టీ గనక ఇంతకంటే గొప్ప ఫలితం వుంటుందని ఎప్పుడూ చెప్పుకున్నది లేదు.రాజకీయ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యలపై చర్చ జరిగేలా చూడాలన్న లక్ష్యం నెరవేరింది. ఇదే కోవలో రానున్న దఫా ఉప ఎన్నికలలోనూ నాలుగు చోట్ల పోటీ చేసే స్థానాలపై తొలి ప్రకటన వెలువడింది. అలాగే సిపిఐ కూడా పోటీ చేసే సంకల్పాన్ని ప్రకటించింది.రానున్న రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా పోరాడటం అవసరమన్న అభిప్రాయం సిపిఎం వ్యక్తం చేసింది. ఒట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రజా రాజకీయాలను ప్రతిధ్వనించేదుకు ఈ పోటీలు కూడా దోహదం చేస్తాయి. ఈ లోగా పాలక పార్టీల రాజకీయ విన్యాసాలు ఎలా వుంటాయో కూడా స్పష్టమవుతుంది.అవన్నీ అనిశ్చితిని పెంచేవిగా వుంటాయే తప్ప తగ్గించలేవు. కనకనే ఏ రాజకీయ పార్టీలైనా సమగ్ర దృష్టితో విశాల ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాలే తప్ప తాత్కాలిక మనుగడ కోసం అవకాశవాదానికి అభద్రతా వ్యూహాలకు పాల్పడటం మంచిది కాదు.
( ప్రజాశక్తి, మార్చి 25,2012 ఇందులో కొన్ని భాగాలు గతంలో బ్లాగు మిత్రులకు తెలిసినవే అయినా వ్యాసం పునర్ముద్రణ గనక పునరావృతి తప్పలేదు.)
బూర్జువా పార్టీల ఎత్తులు పై ఎత్తులు ఎలాగూ ఉంటాయి . ఈ ఎన్నికలలో సీ.పీ.ఎం ఎదురీత లో సైతం సాధించి ఓట్లు తక్కువ స్తాయి పాఠమేమీకాదు. గతంలో బూర్జువా పార్టీలతో అవసరానికి మించిన శృతితో అంటకాగిన అనుభవాల రీత్యా వామపక్షాలు ఒకరిపై ఒకరు పోటీలు పంతాలు, వివరణ స్వోత్కర్షలు మాని ప్రత్యామ్నయ శక్తులుగా ఎదగడానికి నికరమైన విశ్వసనీయమైన ప్రయత్నం చేయాలి. తమ మేధాశక్తినీ , పోరాట అనుభవాలను సక్రమంగా మలుచుకునే కీలక సమయమిది.
ReplyDeleteపల్లా కొండలరావు గారు, బూర్జువాలు వామపచ్చ పార్టీల్లో అస్సలు వుండరా? కేవలం బూర్జువా పార్టీలు అని వామపచ్చాలు అచ్చోసిన పార్టీల్లోనే వుంటారా? మద్యం బూర్జువాలు చందాలిస్తే రసీదులిచ్చామని వామపచ్చాలు రెండూ ప్రకటనలిచ్చాయి కదా? మరి బూర్జువాలు వామపచ్చాల వారిలా సంఘసంస్కర్తలు, సామ్యవాదులు, వితరణ శీలురనేగా దాని అర్థం?!! వుత్తి పుణ్యానికి లక్షల విరాళాలు ఎందుకిస్తారో మరి!
Delete@ SNKR గారూ !
Deleteవామపక్షం అంటే ఏమిటి ? బూర్జువా పార్టీ అంటే ఏమిటి ? ముందు తేడా తెలుసుకుని వాదిస్తే ఆ వాదనకో అర్ధం ప్రతివాదన కు అవకాశం ఉంటుంది. వామపక్ష పార్టీలలో బూర్జువాలూ ఉంటారు. వాళ్లేమీ ఆకాశం లోనుండి ఊడి పడరు. బుర్జువా పార్టీలలో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్లూ ఉండవచ్చు. ఒక పార్టీని చూసేదానికి , వ్యక్తిని చూసేదానికి తేడా ఉంటుంది. గుడ్డిగా విమర్శించడమే ఎక్కడైనా , ఎపుడైనా ఇదే వాదిస్తా అంటే ఆ అవకాశం మీ ఖాళీ సమయాన్ని బట్టి ఎంతైనా ఉపయోగించుకోవచ్చు.
తెలియకనేగా అడిగింది, అలా విరుచుక పడతారేమిటి సారూ?! చెప్పకుండా తెలియకుండా తెలియకుండా అంటారే కాని తెలిసినోళ్ళు చెబితేగా తెలిసేది? మరి బూర్జువాలు సర్వాంతర్యాములైనపుడు, బూర్జువా పార్టీలు అని ప్రత్యేకంగా అని ఎందుకంటున్నారో తెలుసుకోవాలనే నా ప్రయత్నం.
Delete@ SNKR గారూ ! నిజంగా తెలుసుకోవడమే ప్రధానం అయితే సారీ. రవిగారి బ్లాగును వేదికగా వాడుకోవడం కంటే , నాకు తెలిసిన మేరకు మీకు మెయిల్ చేస్తాను.
Delete/రానున్న రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా పోరాడటం అవసరమన్న అభిప్రాయం సిపిఎం వ్యక్తం చేసింది./
ReplyDeleteఇది మంచిదే. రాష్ట్రలో సరైన నాయకత్వం, నిలకడలేని, అసంబద్దప్రలాపాలు చేసి చమాపనలు, అట్రాసిటీ కేసులతో తిట్టించుకుంటున్న సిపీఇ, సిపిఎంలో కలిసిపోతే బాగుంటుంది.
sankar garu okasari aavu vyasam cheppandi?
ReplyDelete