Pages

Wednesday, August 24, 2011

హజారే దీక్ష- వాస్తవిక వైఖరి



అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్ష ఇటీవలి కాలంలో మరే ఉద్యమమూ కలిగించనంత ప్రభావం ప్రసరించింది. ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాకపోవడం వల్ల అందరూ బలపర్చే అవకాశం ఏర్పడింది. ఆ పైన అవివేకంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన మన్మోహన్‌ ప్రభుత్వ చర్య కూడా అందరికీ ఆగ్రహం తెప్పించింది. కేవలం ఆయనకే గాక ప్రజాస్వామ్య హక్కులు కోరేవారందరికీ సవాలుగా అనిపించింది.మొదటి సారి దీక్ష సందర్భంలో హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అని రాసిన ఈ బ్లాగు రచయిత కూడా ఈ తేడాను గమనించాడు. అయితే ప్రజాగ్రహం ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా అన్నాను వదలిపెట్టి ఆయన రామ్‌లీలా మైదానంలో దీక్ష చేసుకోవడాన్ని అనుమతించిన తర్వాతనే ఆయనపై విమర్శలు పెరగడం
విశేషం. అవినీతి వ్యతిరేకత అంటూ సరళీకరణ విధానాలు కార్పొరేట్‌ కాలుష్యం గురించి ప్రస్తావించకపోవడంపై వామపక్షాలు గాని విమర్శించడం గతసారి జరిగింది. అలాగే ఆయనను దీక్ష విరమించగానే మోడీని కీర్తించడం, ఈ సారి అమెరికా ఆయనకు వత్తాసుగా రావడం కూడా విమర్శలకు దారి తీశాయి. అయితే దీక్ష మొదలైన తర్వాత మన్మోహన్‌ ప్రభుత్వం దీక్షకు ముందే మొదలుపెట్టిన దాడి నిర్బంధం అన్నాను జాతీయ హీరోను చేశాయి. ఇన్నిటి తర్వాత ఆయన చుట్టూ ఏర్పడిన ఆరాధక బృందం తీరు తెన్నులు విమర్శల వర్షానికి దారి తీశాయి. అన్నా నే ఇండియా అని కీర్తించిన కిరణ్‌బేడీ మాటలను ఖండిస్తూ హిందూ సంపాదకీయమే రాసింది. స్వచ్చంద సంస్థలకే చెందిన అరుణా రారు, అరుంధతీ రారు, వంటి వారు కూడా ఈ ధోరణి మంచిది కాదని బహిరంగంగా ధ్వజమెత్తారు. ఆరెస్సెస్‌ ప్రత్యక్ష పరోక్ష పాత్ర కొన్ని విమర్శలకు కారణమైతే తన ముసాయిదా(జన లోక్‌పాల్‌)పైనే ఆగష్టు 30 లోగానే చర్చ పూర్తి కావాలని అన్నా బృందం షరతు విధించడాన్ని ప్రభుత్వ ప్రతిపక్షాలు కూడా ఆచరణ యోగ్యం కాదని చెప్పక తప్పలేదు.అఖిలపక్షంలోనూ అదే భావన వచ్చినట్టు కనిపిస్తుంది. అన్నా బృందం ముసాయిదాతో సహా అన్ని సూచనలూ చర్చించవచ్చు గాని అది పార్లమెంటులో జరగాలి. రాజకీయ పార్టీలే చొరవ తీసుకోవాలి.స్వచ్చంద సేవకులు సంస్థల పాత్ర ఎక్కడో ఒక చోట పరిమితమై పోతుంది. రాజకీయ వేత్తలు మంచివారు కాదనుకుని వ్యక్తులకు తాళాలు అప్పగిస్తే వారు చాలా ఉత్తమంగా వుంటారనడానికి భరోసా ఏమీ లేదు. కనక రాజ్యాంగ బద్దమైన ఏర్పాటును నమ్ముకోవడమే ఉత్తమం.అన్నా నిరాహారదీక్ష ఆ క్రమాన్ని వేగవంతం చేసిందనడం నిస్సందేహం.అయితే అవాస్తవికంగా వ్యవహరిస్తే మొదటికే మోసం రావచ్చు. పట్టణ మధ్య తరగతి విద్యాధికులకే పరిమితమైన తమ ఆందోళన స్వభావాన్ని కూడా వారు అర్థం చేసుకోవాలి. అన్నాకు అభినందనలు తెల్పుతూనే ఈ అంశాలను కూడా పరిశీలించాలని చెప్పవలసి వస్తున్నది.ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వీలు వెంట చూద్దాం.

8 comments:

  1. చాలా బేలన్స్‌డ్‌గా రాశారు. అన్నా మొండి పట్టుదల అని అంతర్గతంగా ఒప్పుకోవచ్చు, కాని...కాని... అవినీతిపరుల 60ఏళ్ళ ప్రజాప్రతినిధుల అరాచకపాలన ముందు, అది సరైనదే అనిపించేలా పాలకులు చేశారు.

    /రాజకీయ వేత్తలు మంచివారు కాదనుకుని వ్యక్తులకు తాళాలు అప్పగిస్తే వారు చాలా ఉత్తమంగా వుంటారనడానికి భరోసా ఏమీ లేదు/

    పనిచేసే భరోసాలు/Gaurenteeలు 60ఏళ్ళుగా ఎవరు ఇస్తున్నారని?పనిచేసే భరోసాలు/Gaurenteeలు 60ఏళ్ళుగా ఎవరు ఇస్తున్నారని?! జోక్‌పాల్ పెడుతూ కపిల్ సైబాల్ దీంతో అవినీతి తగ్గుతుందన్న గ్యారెంటీలేదు అన్నాడు. మరెందుకు చట్టాలు చేస్తున్నారు?!!!

    ఇప్పుడు వున్న వ్యవస్థ చాలు అంటారే కాని, పదవిలో వున్నంతవరకూ జలయజ్ఞాలు, బోఫోర్స్‌లు, స్పెక్ట్రం, MPల question for cash, గడ్డి స్కాములు, నట్వర్‌లాల్ కేసుల్లో ప్రస్తుతం వున్న వ్యవస్థ/చట్టాలు ఏమి సాధించాయో అందరికీ తెలుసు. అందుకే ఇంకా కఠిన తరమైన చట్టాలు వుంటే ఎంతో కొంత బాగుపడతామేమో అన్న ఆశ. అవినీతిలో 84వ స్థానం నుంచి 25కు పెరిగినా అది స్వాగతించాల్సిన విషయమే. అన్నా హజారే రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నాడని ఏడ్వటం బదులు, జైల్లో వేసి రాజ్యాంగ బద్ధంగా మూసేయండి. ఆపని చేయడానికీ ధైర్యం లేని నికృష్ట/నిస్సహాయ పర్తిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకుంది? కాబట్టీ ఈ పరిస్థితి స్వయం కృతం. అన్నానే ఇండియా ...సరే ... ఇందిరే ఇండియా అని ప్రభుత్వ ప్రచారసాధనాలను వాడి వూదరగొట్టినపుడో!? మరుగుదొడ్లను మొదలుకుని అంతర్జాతీయ విమానాశ్రయాలవరకూ రాజీవ్ పేరు, విగ్రహాలు పెట్టినపుడో?!

    ReplyDelete
  2. రవి గారు,

    ఈ వ్యాఖ్యానం మీ విశ్లేషణ చూసిన వెంటనే వ్రాస్తున్నాను. ఈ రోజు (8/24/2011) NTv లొ మీ విశ్లేషణ చాలా బాగుంది, బహుశా ఇదే బెస్ట్ అని నా అభిప్రాయం. మీ విశ్లేషణ అన్ని ప్రోగ్రాం లొ చూడలేదు బహుస ఇంత కంటే కూడా బాగా చేసి ఉండవచ్చు అనుకొంటా. కొంతమంది విశ్లేశాకులుగా ఈలాంటి Tv డిబేట్ లొ పాల్గొనే వారు మొహమాటానికి ఏ చానెల్ వారు ఏ పార్టీ కొమ్ముకాస్తారో వారి మనుస్సు నొప్పి కలగకుండా విశ్లేషణ చేస్తుంటారు. అలాగని వారికి ఏది న్యాయం ఏది అన్యాయం తెలియక కాదు మనకేందుకొచ్చింది తంటా అని సదరు చానెల్ కి ఇబ్బంది కలగకుండా చూస్తారు. మీరు ఇలాగే పక్షపాతం లేకుండా ఇటువంటి విశ్లేషణలు మరెన్నో చేయాలని కోరుకొంటున్నాను.

    మన్నించాలి ఈ comment ఇక్కడ పోస్ట్ చేసినందుకు, నాకు మీ mail ID తెలియదు అందుకే ఇక్కడ పోస్ట్ చేసాను

    ReplyDelete
  3. శంకర్‌,

    నా వ్యాఖ్యలు బేలన్స్‌గా వున్నాయన్నందుకు ధన్యవాదాలు. అన్నా దీక్షలకు మరో కోణం చెప్పానే గాని తప్పు పట్టలేదు. ఇందిరే ఇండియా అన్న మాట వెనువెంటనే మీకు గుర్తుకు వచ్చిందంటే ఈ వైఖరిలో లోపం అక్కడే వుందని కూడా మనం గుర్తించాలి. వాస్తవాలు తెలిసిన వాళ్లుగా ఇప్పుడు అన్నా వెనక కూడా ఏ శక్తులు లేవని అనుకోలేము. అవి కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పేలాటివి కాకపోవచ్చు గాని ఆధారాలు కూడా కొన్ని వున్నాయి. నేను హజారే దీక్ష ప్రభావాన్నీ ప్రత్యేకతనూ మొదట్లోనే విశదంగా చెప్పాను. ఇందులో మనం వాదించుకోవడానికి పరస్పరం వ్యతిరేకించుకునేందుకు ఏమీ లేదనుకుంటాను.

    అరవం,

    నిజంగానే ఈ రోజు ఎన్‌టివిలో ఒక పాత్రికేయుడుగా విశ్లేషకుడుగా నేను బాధ్యతగానే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రథమ స్థానంలో వున్న టీవీ9, చాలా ఆచితూచి ఆహ్వానించే ఈటీవీ, ఈ వివాదంలో తరచూ ప్రస్తావనకు వచ్చే సాక్షి తో సహా ఎక్కడకు వెళ్లినా మనం చెప్పదలచుకున్నది, చెప్పవలసి వున్నది చెప్పడం తప్ప మరో విధంగా మా ట్లాడటం జరగదు.చాలామంది అంటున్నట్టు ఆరోపిస్తున్నట్టు నా అభిప్రాయాల ప్రకారమే చెప్పడం కూడా జరగదు. వాస్తవాలు వ్యాఖ్యానాల మధ్య తేడాను జాగ్రత్తగా పాటించడమే మీడియా ధర్మం. కాకపోతే అక్కడా సమస్యలుంటాయి.వాటిని అనేక వ్యాసాల్లో పుస్తకాల్లో రాస్తుంటాను. ఈ రోజు చేసిన వ్యాఖ్యలు కీలకమైనవేననడంలో సందేహం లేదు. పట్టుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  4. చాలా చక్కటి విశ్లేషణ. మొన్న ఒక టీవీ ఛానెల్లో చూసేను.ముంబైలో అన్నా హజారేకి సపోర్ట్ చేస్తూ ఉన్నావిడ అంటోంది నూటికి తొంభై అయిదు శాతం ప్రజలు అన్నా హజారేతోనే ఉన్నారని.అంటే తొంభై అయిదు శాతం ప్రజలు సఛ్ఛీలురే అన్నమాట.ఇదే నిజమయితే మనకి ఏలోక్ పాల్ బిల్లూ అక్కరలేదు.పటిష్ఠమైన లోక్ పాల్ బిల్లు అవసరాన్ని ఎవరూ కాదనరు.కాని అటువంటి బిల్లులు రోడ్లమీద తయారుకాకూడదు.ప్రజాభీష్టాన్ని పార్లమెంటు గుర్తించేలా చేయడమే ఎవరైనా చేయాల్సిన పని.అంతవరకే.అన్నాహజారే ప్రస్తుతానికి దీక్ష విరమించి కొంత సమయమిచ్చి సరైన బిల్లు రాకపోతే మళ్ళాప్రజల్ని చైతన్యపరచవచ్చు.హజారేని సమర్ధించే వాళ్ళందరూ తమతమ ఆస్థులను ప్రకటించి అవి ఎలా సంపాదిచేరో కూడా చెప్తే వాళ్ళలో దొంగలు చేర లేదని తెలుస్తుంది.లేకపోతే మొత్తం ఉద్యమం అపహాస్యం పాలయే ప్రమాదం ఉంది.భజన పరులతోకూడా హజారే చాలా జాగ్రత్తగా ఇండాలి. సంయమనంతో ఉద్యమం నడపాలి.దొంగలని చేరనీయకుండాచూసుకోవాలి.జై హజారే.

    ReplyDelete
  5. హజారే దీక్ష గురించి మీరు రాసినదీ, దానికి వచ్చిన కామెంట్ లూ చదివేను.
    హజాేను బలపరుస్తున్న వారిలో ఇప్పటికే వారి రాజకీయ ప్రవర్తనా శైలుల గురించి , వారి అవినీతి గురించి, వారి రెండు నాల్కల గురించి అనుమానాస్పదంగానూ, నిర్ధారణతో కూడినవిగానూ అయిన అభి ప్రాయలను ప్రక్కన పెడితే జన సామాన్యం మాత్రం చాలా పాజిటివ్ గానూ ఆశావహంగానూ ఉన్నమాట వాస్తవం. వాళ్ళంతా సచ్ఛీలురు అవునా కాదా అను కోవడం అనవసరం. అవినీతి మరకలు అంటుకున్న వాళ్ళే అయినా ఏదో మార్పు రావాలని తహతహలాడుతూ ఉండే వారనేది మాత్రం నిజం. జన లోక్పాల్ బిల్లు మాత్రమే రుజాగ్రస్త భారతానికి సకలౌషధం కాజాలదు.
    హజారే దేశ పర్యటన విరివిగా చేసి జనసందోహంలో మానసిక సరివర్తనని తెస్తూ, పోరాటాలకు సంసిద్ధులను చేయాలని నేను భావిస్తున్నాను. అందరూ అనుమాన పడుతున్నట్టుగానే సంకుచిత భావజాలం కలవారి, ఇంకా అసాంఘిక శక్తుల మాలిన్యం వారికీ వారి ఉద్యమానికీ అంట కూడదనుకునే వాళ్ళలోనేనూ ఒకడ్ని. మౌనం వీడిన పరమ రుషుల కోసం మనం ఇప్పుడు ఎదురు చూడాలి. నా రాతలలో ఏమైనా అవగాహనా లోపం ఉంటే మన్నించాలి.

    ReplyDelete
  6. జోగారావు గారి వ్యాఖ్యచూసేను.నిశ్చయముగా జనసామాన్యం అంతా ఆశతోనూ ఆతృత తోను ఉద్యమ ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు.ఈఉద్యమం రాజకీయవేత్తలు హైజాక్ చేసుకోకుండా కాపాడుకోవలసిన అవసరంఉంది.కొంత పట్టువిడుపులూ ఉండాలి.మరీముఖ్యంగా పదవిలో ఉన్నప్పుడు అవినీతి గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిఏదో ప్రయోజనాన్ని పొందాలనుకునే గుంటనక్కలని కని పెట్టి ఉద్యమం తప్పుదోవ పట్టకుండా చూడాలి.దేశానికి మంచి జరగాలని ఆసిద్దాం.

    ReplyDelete
  7. Ravi gaaru,I agree with you to a large extent. ప్రభుత్వం కొన్ని strategic mistakes చేసింది. అన్నాను అవినీతి పరుడని అనటం, ఆయనకున్న మీడియా, పౌర సమాజం అండదండలను తక్కువగా అంచనా వెయ్యటం, ముందుగా అరెస్ట్ చెయ్యటం, వెంటనే తగ్గటం ఇవన్నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, సమస్యని పక్కదారి పట్ట్తించటానికి ఉపయోగపడ్డాయి. ఇది ఒకరకంగా ప్రభుత్వపు స్వయంక్రుతాపరాధం.మీరన్నట్టు UPA ఎన్నో మెట్లు కిందకి తిగింది. దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇంకా అన్నా బెట్టు చెయ్యటం బాగాలేదు.

    నాకున్న అవగాహన బట్టి..మనకు చట్టాలకు కొదువలేదు. వాటిని అమలుపరిచే వ్యక్తుల్లో నిజాయితీనే లేదు. అది లేనప్పుడు, ఇలాంటి నిరంకుశ చట్టాలు చాలా ఎక్కువగా MISUSE అయితాయని నా ఉద్దెశ్యం. SC/ST Attrocities act, 498A లాంటివి రెండు ముఖ్యమైనా ఉదాహరణలు. జగన్ ని ఊపిరి సలపకుండా చేసే ఈ చట్టాలే, అస్మదీయుల జోలికి అంత తేలిగా పోవు గాక పోవు. ఈ చట్టాలు తల్చుకుంటే పీవీ లాంటి వారిని రోడ్డున నిలబెట్ట గలవు..అవే రాజీవుడికి రక్షణగాను నిలవగలవు. అదీగాక కేవలం అధికారులతో నిండిన లోక్పాల్ నిజంగా సర్వ స్వతంత్ర సంస్తగా, నిస్పాక్షికంగా ఉండగలదా.నాయకులనించి, వారిని గెలిపించిన ప్రజలనించి వచ్చేవత్తిడిని తట్టుకోని నిష్కళంకంగా మనగలదా. ఒకాసారి పదవిలో ఉన్నysr ని కోర్టుకీడ్చడం ఊహించుకోండి..అలాగే సోనియాని, రాహుల్ ని, ఇంకా అనేకానెక మహిళా, దలిత, వెనుకబడ్డ, మైనారిటీ నాయకుల్ని. నాయకూడంటేనే అవినీతిపరుడని మన నమ్మిక కదా..మరి ఎంత మందిని జైల్లో పెట్టగలరో చట్టాలున్నయికదా అని. అవినీతి కొత్తరూపు తీసుకోటానికి ఇలాంటి చట్టాలు ఉపయోగపడ్తాయి. మధ్యపాన నిషేధం ఉన్నప్పుడే తాగుబోతులెక్కువయ్యారు..నేరాలు పెరిగాయి.డబ్బు వ్రుధా మరింత పెరిగింది--ఈ మాటలన్నది నేను కాదండి. ఆ సారాకేసులెన్నిట్నో వాదించిన రావిశాస్త్రి గారు..ఆరు సారా కథలులో.

    రేపీ లక్షణలే మరింతగా విజ్రుభించటాని కావాల్సిన అన్ని హంగులు జన లోక్పాల్ బిల్లులో ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదగాల్సిన ఇలాంటి అతి ముఖ్యమైన చట్టాన్ని ఒకేసారి తీసుకోరావటం సరైంది కాదు. దానికన్నా ముందు పారదర్శికత, effective use of technology, decentralization..ఇలాంటివి కనీసం కిందస్థాయిలో అవినీతిని తగ్గిస్తాయి.
    అలాగే మీడియా, ప్రతిపక్షాలు పైస్థాయిలో ఉన్న అవినీతిని(ఉన్నా,లేకున్న )నిరంతరం ఎండగడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలుకూడా మునపటిలాగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కుదరదు. ఒక చోట అవినీతి జరుగుతుందంటే దానిని అధికారులకి, మీడియాకి, న్యాయస్థానాలికి చెప్పటాని ప్రస్తుతం ఏమి అడ్డంకులున్నాయో నాకు తెలియదు. భయం, మనకెందుకులే అనుకోవటం తప్ప అడ్డంకులేవీ లేవనే నా నమ్మకం.
    అయినా ఇంత అవినీతి ఎందుకుందంటే ...సమాధనం కోసం నావరకు నేనైతే అద్దంలో చూసుకుంటా.

    I do not think creating a revenge society(like US) helps the nation. It leads to a police state, increase in beaurocracy, delays, increase in costs. It keeps officials in defensive mode, hide under one rule or other. US is one great example of this. Other than the improvement in quality and transparency in some areas, in every other aspect US govt. is as inefficient, as corrupt, as lethargic, as expensive as it is in India. They fear everything. Machine replaced the common sense long back. I doubt emerging economies like India can bear such huge cost. Thats why there should be moderation and balance in everything one does. This bill should not be an exception to that rule.

    (I posted similar post elsewhere too..because your articles are so similar and I do not have two different opinions on same topic. regards)

    ReplyDelete
  8. /వాళ్ళంతా సచ్ఛీలురు అవునా కాదా అను కోవడం అనవసరం. అవినీతి మరకలు అంటుకున్న వాళ్ళే అయినా ఏదో మార్పు రావాలని తహతహలాడుతూ ఉండే వారనేది మాత్రం నిజం. జన లోక్పాల్ బిల్లు మాత్రమే రుజాగ్రస్త భారతానికి సకలౌషధం కాజాలదు./
    Absolutely correct, Jogarao garu.

    Hope your words would enlighten those, who are blindly following illogical and baseless arguements/allegations by the Govt Propaganda.
    ---------------
    Where was the sovereignty when:
    1) MPs displayed lakhs of bribe money; they received to cross-vote to save UPA govt, on the Atomic bill?
    2) PM openly admitted to his inaction on scams by the DMK ministers, citing that as 'coalition Dharma'.
    3) 150+ honourable MPs have criminal cases pending on them are our law makers.

    So, effort by any reasonable person to bring tougher laws/punishments against the corrupt politicians, officials should be welcomed or supported, whether the bills are drafted on roads or in public toilets @ పంతుల గోపాల కృష్ణ garu

    ReplyDelete