Pages

Saturday, August 6, 2011

'సావధాన' చర్చలో సత్యాసత్యాలు- బిజెపి


లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు,బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ తెలంగాణా సమస్యపై ఇచ్చిన సావధాన తీర్మానం చర్చ వర్తమాన రాజకీయ వాస్తవాలు మరోసారి బహిర్గతం కావడానికి కారణమైంది. మతతత్వ రాజకీయాలకు పేరుమోసిన బిజెపి ప్రాంతీయ ఉద్యమాలను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి వువ్విళ్లూరుతున్న తీరును కళ్లకు కట్టింది. సహజ శైలిలో సుష్మా ఎంత నాటకీయంగా ఎంత ఉద్రేకపూరితంగా మాట్లాడినా ఈ విషయంలో బిజెపి ద్వంద్వ నీతి కూడా అనివార్యంగా అభిశంసనకు గురైంది. అదే సమయంలో రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలో ముంచిన హౌంమంత్రి చిదంబరం తెలుగు వాళ్లే తేల్చుకోవాలని హితబోధ చేయడం రాజకీయ కేంద్రం బాధ్యతా రాహిత్యానికి అద్దం పట్టింది. అనిశ్చితి ఇప్పట్లో తొలగేది కాదనీ తేలిపోయింది.

బిజెపి విషయానికి వస్తే తెలంగాణా విషయంలో వారి వైరుధ్యాలు విన్యాసాలు దేశమంతటికీ తెలిసినవే. స్వతహాగా చిన్న రాష్ట్రాల పేరిట  అద్యక్ష తరహాను ప్రతిష్టించాలనేది బిజెపి చిరకాల వాంఛ. కాంక్ష. తమ పాలన కాలంలో ఈ మేరకు సన్నాయి నొక్కులు నొక్కడమే కాక రాజ్యాంగాన్ని తిరగదోడటానికి విపల యత్నాలు
కూడా చేశారు.వివిధ ప్రాంతాల్లో విభజన ఉద్యమాలు వచ్చినప్పుడల్లా బిజెపి ఎక్కడికక్కడ వాటికి వంతపాడే విధానమే గతంలో అనుసరించింది. నిజానికి వెంకయ్య నాయుడు వంటి వారు జై ఆంద్ర ఉద్యమ తరుణంలోనే ప్రచారంలోకి వచ్చారు.1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం తీసుకునిి అప్పుడున్న పరిస్థితులలో మంచి ఫలితాలే సాధించారు. అయితే 1998లో రెండవ సారి విజయం సాధించాక ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. సమైక్యతకు కట్టుబడిన తెలుగు దేశం మద్దతు కారణంగానే దాన్ని తమ అజెండాలో పెట్టలేదని చెబుతుంటారు కాని అది పాక్షిక సత్యమే. అవసరార్థపు అజెండాలు, అసలు సిసలు ప్రచ్చన్న అజెండాలు అలవాటైన బిజెపికి ఇది పెద్ద విషయం కాదు కూడా. ఆ వూపులో అగ్రనాయకుడు ఉప ప్రధాని ఎల్‌కెఅద్వానీ తెలంగాణా విభజన అవసరం లేదని అనేక సార్లు ప్రకటించారు. మూడురాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఇదే ఆఖరు దఫా రాష్ట్రాల పునర్యవస్థీకరణ అని పార్లమెంటులో చెప్పారు.2002 ఏప్రిల్‌ 1న అప్పటి(ఇప్పుడు మళ్లీ చేరిన) నరేంద్రకు రాసిన లేఖలో అద్వానీ తెలంగాణా అభివృధ్ధికి వనరుల సక్రమ వినియోగంతో సాధించాలి తప్ప రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని, ఆ ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. రాజధానితో కూడిన ప్రాంతం విడిపోవడం దేశ చరిత్రలో ఎరగమని కూడా ఆయన చాలా సార్లు వ్యాఖ్యానించారు.తెలంగాణా ఏర్పడితే మైనారిటీల ప్రాబల్యం పెరుగుతుందనే కోణంలో ఆరెస్సెస్‌ కూడా విముఖత వ్యక్తం చేసింది. మొదట్లో టిఆర్‌ఎస్‌ నేతలు మద్దతు కోసం వెళ్లినప్పుడు కూడా బిజెపి ఎడమొహంగానే వ్యవహరించింది. మొదటి దఫా తెలంగాణా ఎంఎల్‌ఎల రాజీనామాలు చేసినప్పుడు కూడా నిజామాబాద్‌ నుంచి ఎన్నికైన లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు తప్ప హైదరాబాదుకు చెందిన కిషన్‌రెడ్డి చేయలేదు.శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి కూడా వెంకయ్య నాయుడు వ్యాఖ్యలకు ఇతరుల మాటలకు చాలా తేడాలు వచ్చాయి. ఇంతకూ ఆ కమిటీకి వారు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయం చెప్పనే లేదు. కమిటీని తాము గుర్తించడం లేదు గనక చెప్పలేదని అంటున్నా వాస్తవంలో లిఖితపూర్వకంగా కట్టుబడటానికి ఆ పార్టీ సిద్దంగాకపోవడం భవిష్యత్తులో అవకాశాలు అట్టిపెట్టుకోవడానికేనని చెప్పనవసరం లేదు. ఇన్ని పరిణామాల తర్వాత ఇప్పుడు సుష్మా స్వరాజ్‌ సావధాన తీర్మానం పేరిట విభజన వాదాన్ని వినిపించారు. ఈక్రమంలో ఆ జాతీయ పార్టీ నేత ఉప ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ను కూడా మించిపోయే రీతిలో అనేక అసంబద్దమైన విషయాలను ప్రస్తావించి ప్రయోజనాల పాకులాటను బయిటపెట్టుకున్నారు.
తెలంగాణాలో ఈ రోజున స్వాతంత్రం లేదని, మెడమీద కత్తి వేళ్లాడుతున్నదని ఆమె అన్న మాటలు ఇక్కడి వారు కూడా అన్నవి కావు. నిరంకుశన నిజాంపైన, పైశాచిక కేంద్రంపైన సాయుధ పోరాటం చేసి మరీ విముక్తి సాధించుకున్న వీరోచిత చరిత్రను కించపర్చే మాటలే ఇవి. చిన్న రాష్ట్రాల విధానం లేదా ప్రాంతీయ అసమానతల వంటి వాదనలతో విభజన కోరడం ఒకటైతే బిజెపి నేత అత్యుత్సాహంతో మరీ ముందుకెళ్లి మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆఖరులో తెలుగులో నాటకీయంగా విజ్ఞప్తి చేసిన సుష్మా అంతకు ముందు మాత్రం ఆత్మహత్య చేసుకున్న అసహాయ యువకుడి ఆఖరు లేఖలో అంశాలను కూడా ప్రస్తావించడం అత్యున్నత సభ సంప్రదాయాలకే విరుద్ధం.ఇటీవలనే జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ ఆ యువకుడిని భగత్‌సింగ్‌తో పోలిస్తే గట్టిగా ఖండించాల్సి వచ్చింది. ఎందుకంటే భగత్‌ సింగ్‌ సుఖదేవ్‌కు రాసిన లేఖలో ఆత్మహత్యలు ఏ పరిస్తితుల్లోనూ సరైనవి కావని మరీ మరీ చెబుతారు.అదే కోవలో కెసిఆర్‌కూడా తెలంగాణా రాకపోతే విషంతాగుతానని ప్రకటించి విమర్శలు మూటకట్టుకున్నారు. కాగా సుష్మా అత్యున్నత చట్టసభలోనే ఆ ధోరణిని కనపర్చడం బాధాకరం. ఒకసారి ఈ ప్రస్తావన వచ్చాక కావూరి సాంబశివరావు దానిపై వ్యాఖ్యలు చేయడం, చివరలో చిదంబరం కూడా వాటికి సంబంధించిన అంశాలపై నిజానిజాలు నిర్ధారణ కావాలని చెప్పడం కొనసాగింపుగా జరిగిపోయాయి. రాజకీయ ప్రధానమైన సమస్యలను ఉద్వేగాలవైపు ఉద్రేకాల వైపు మరల్చడం వల్ల కలిగే అనర్తాలే ఇవన్నీ. బిజెపి ఈ విషయంలో అనుసరించిన ద్వంద్వనీతిని సభలో మాట్లాడిన వారంతా ప్రస్తావించినా తెలుగు దేశంపై నెపం పెట్టడం తప్ప ఎలాటి జవాబు బిజెపి నుంచి రావడం లేదు. అంటే అధికారం కోసం దేన్నయినా పక్కనపెట్టడానికి నెత్తికెత్తుకోవడానికి సిద్దంగా వుండటం బిజెపి విలక్షణతలో భాగమనుకోవాలి.సుష్మా స్వరాజ్‌ తెలంగాణాలో ఏదో ఒక చోటి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
గత విధానాన్ని మార్చుకుని ఇప్పుడు తెలంగాణా ఏర్పాటును బలపరుస్తున్న సిపిఐ తరపున మాట్లాడిన గురుదాస్‌ గుప్తా ఆ వాదననసు బలపరుస్తూనే ఇతర ప్రాంతాల వారి మనోభావాలు కూడా గమనంలో వుంచుకోవాలని చెప్పడం ఒక రకంగా సుష్మా స్వరాజ్‌ మాటలకు ప్రతిస్పందన అనుకోవాలి. తమ వైఖరిని కూడా అపార్తాలు లేకుండా చేసుకోవాలని,అంతర్గత విమర్శలకూ జవాబివ్వాలని ఆయన అనుకొని వుండొచ్చు. ఇక కాంగ్రెస్‌ తరపున సుదీర్ఘంగా మాట్లాడిన సర్వే సత్యనారాయణ, కావూరి ఇద్దరూ ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి బొమ్మ బొరుసుగా కనిపించారు. ఏకాభిప్రాయం గురించి అందరికీ చెప్పే చిదంబరం సభలోనే ద్వంద్వ రాగాలు వినిపించడం ఇక్కడ విశేషం. విపరీతం కూడా.

నేను హైదరాబాదులో వున్నా ఢిల్లీలో తెలంగాణా మార్మోగిందని కెసిఆర్‌ అన్నారు గాని వాస్తవంలో ఆ ఆజెండాను తాను తీసుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నం ఆయనకూ తెలుసు. పార్లమెంటులో తమ మద్దతు ప్రధానం గనక ఈ విషయంలో మాదే కీలకపాత్ర అని బిజెపి, అధికారంలో వున్నాము గనక మేమే ముఖ్యమని టీ కాంగ్రెస్‌, మాపై దాడి చేసినా ఉనకిని కాపాడుకోగలిగామని తెలుగు దేశం ఫోరం తమ తమ దారుల్లో టిఆర్‌ఎస్‌తో పోటీ పడటానికి ప్రయత్నిస్తూనే వున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌కూ కొన్ని సహజ పరిమితులు వుండనే వున్నాయి. నేను లేకున్నా చర్చ వచ్చిందని కెసిఆర్‌ అంటున్నారంటే నా వల్లనే వచ్చిందని అర్థం. ఆ మాటకు బిజెపి ఒప్పుకోవడం కల్ల.బిజెపితో ఆయన కలిస్తే కాంగ్రెస్‌ వైఖరి మరింత బిగుసుకోవడమూ తథ్యం. గత సమావేశాల్లో అలాగే జరిగింది కూడా. ఇవన్నీ ప్రాంతీయ రాజకీయాలలో వైరుధ్యాలు, పరస్పర కుమ్ములాటలు కూడా. ప్రాంతాలను బట్టి మాత్రమే రాజకీయాలు నడవవనీ, ప్రయోజనాల ప్రకారం నడుస్తాయనీ ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఒకే ప్రాంతంలో వివిధ పార్టీలు వివిధ రకాలుగా మాట్లాడ్డం, ఒకే పార్టీ రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడ్డం, ఒకే పార్టీ వ్యక్తులు ఒకే ప్రాంతంలో పది రకాలుగా మాట్లాడ్డం ఇవన్నీ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల పాకులాటలో సహజంగా వుండేవే.అందుకే ఇదొక రాజకీయ రాజ్యాంగ అంశమే తప్ప రాగద్వేషాలకు ఉద్వేగాలు ఉద్రేకాలకు సంబంధించింది కాదని అన్ని ప్రాంతాల ప్రజలూ తెలుసుకుంటున్నారు కూడా.
ఇంతకూ చర్చ ముగింపులో చిదంబరం తెలుగు ప్రజలే తేల్చుకోవాలంటూ భారం రాష్ట్రంపై వేసి చేతులు దులిపేసుకోవడం దాగుడు మూతలకు అధికారిక కొనసాగింపు. తమ చర్చలకే కనీసం మూడు మాసాలు పడుతుందని ఆయన అన్నారు.సిపిఎం ఒక్కటే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నదంటూ గతంలో చేసిన పొరబాటును సవరించుకున్నారు.(నిజానికి ఈ వ్యతిరేకత తెలంగాణా సమస్యకే పరిమితం కాదు, దేశ వ్యాపిత విధానమది) బిజెపి మాటమార్పును ఎత్తిచూపుతూనే ఇప్పటికైనా చెప్పినందుకు సంతోషం ప్రకటించారు.అయితే వారు చెప్పినంత మాత్రాన బిల్లు తీసుకురాలేమని ముక్తాయించారు! ఇంకో మూడు పార్టీలు అభిప్రాయం చెప్పాలని అంటూ కాంగ్రెస్‌, తెలుగుదేశం, ఎంఐఎం,(వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా) పేర్లు చెప్పారు. చేయాల్సిన ప్రకటనలన్ని చేసి వేయాల్సిన కమిటీలన్ని వేసిన కేంద్రం ఇప్పటికైనా తన నిర్నయం ఏమిటో చెప్పకుండా తాడూ బొంగరం లేని సంప్రదింపులపేర కాలం వెళ్లబుచ్చడం కపటనీతి మాత్రమే. శ్రీకృష్న కమిటీ సిఫార్సులపైనా అభిప్రాయం చప్పని కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ మరెవరో చెప్పలేదని ఎలా తప్పు పట్టగలవు? ఏకాభిప్రాయం కోసం తమ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ చర్చలు జరుపుతున్నాడని చిదంబరం అన్నారు గాని ఆ చర్చలు డ్రామాలని కె.కేశవ రావు కొట్టి పారేశారు.ఈ మొత్తం రాజకీయ మాయాజాలంలో మతలబులు ఎన్ని వున్నాయో తెలియడానికి ఈ ఉదాహరణలు చాలు.
ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మె వగైరాలపై ఎస్మా ప్రయోగాన్ని అణచివేత చర్యలనూ అందరూ ఖండించారు. అయితే అదే సమయంలో దాడులు చేస్తామంటూ కొన్ని సంఘాలు శక్తులు చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరమైనవే. ఏది ఏమైనా సమస్యను నానబెట్టి ప్రాంతీయ ప్రజ్వలనానికి ఆజ్యం పోయాలని కేంద్రం చూస్తున్న తరుణంలో సంయమనం కాపాడుకోవడమే ఆలోచనా పరులైన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల కర్తవ్యం. అది తప్పని సరి అవసరం కూడా. ఎవరేమిటో స్పష్టంగా అర్థమయ్యే కొద్ది వివిధ తరగతులు ప్రాంతాల ప్రజలు మరింత విజ్ఞతాయుతంగానూ బాధ్యతా యుతంగానూ వ్యవహరిస్తారని ఆశించాలి.

2 comments: