Pages

Sunday, July 15, 2012

ఆవేశ కిరణాల ఆంతర్యం?




ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల కాస్త సూటిగానూ ఆవేశంగానూ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది.విద్యుచ్చక్తి సమస్యపై రిలయన్స్‌ గ్యాస్‌ సరఫరాకు సంబంధించి కేంద్రంపై పరోక్ష వ్యాఖ్యలు ఆ కోవలోవే. ఇందిరమ్మ బాటను మంత్రులు కొంతమంది వ్యతిరేకించినా కొనసాగించడంలోనూ అదే పట్టుదల కనిపిస్తుంది. తన స్థానంలో రావాలనుకుంటున్న వారికి బెస్టాప్‌ లక్‌ చెప్పారంటే పరోక్షంగా అది తన కేబినెట్‌ సహచరులకే తగులుతుందని కూడా ఆయనకు తెలుసు. ఈ దూకుడు బాగానే వుంది గాని ఆవేశం ఆలస్యమైందా? ఇందులో వున్నది ఆత్మ విశ్వాసమా?అభద్రతా భావమా? తన పర్యటనలో రాజీవ్‌ యువ కిరణాలపై విమర్శలకు సందేహాలకు సంబంధించి ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం మరింత ఆశ్చర్య కరంగా వుంది. 15 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామని తానంటే ఎంపిలే నమ్మలేదని ముఖ్యమంత్రి ఆవేదన చెందుతున్నారు. అంతేగాక ఆ కార్యక్రమానికి రావద్దంటూ ప్రధానికి లేఖ రాశారని కూడా విమర్శించారు. నిజానికి చాలా కాలంగా భర్తీ చేయని లక్ష ఉద్యోగాలలో నియామకాలు చేస్తామని ప్రచారం చేసుకుని వుంటే బాగుండేదని, తాడూ బొంగరం లేని 15లక్షల ప్రైవేటు ఉద్యోగాల గురించి మాట్లాడి లేనిపోని సందేహాలు కలిగించారని ఆయన అనుకూలులు కూడా అనేక మంది నాతో అన్నారు. ఈ పథకం ప్రారంభం సందర్భంలోనే ఆయనతో ముఖాముఖి చర్చలో నేను,
పొత్తూరి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నప్పుడు ఇలాటి ప్రశ్నలు వచ్చాయి. ఆయన అప్పుడూ ఇప్పుడూ ప్రైవేటు ఉద్యోగాలు 15 లక్షలని ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష పదిహేను వేలు అని చెప్పిన మాట నిజమే.అయితే ఆ పథకం వివరాలపై మంత్రులే అయోమయం వ్యక్తం చేసిన మాట మరింత నిజం. ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం విశ్వసనీయమైన సమాచారం విడుదల చేయలేదన్నది కూడా నిజం.కనక ఇతరులపై ఆగ్రహించడం కన్నా వివరాలు చెప్పడం, అతిశయోక్తి ప్రచారాలు ఆపడం ముఖ్యం. ముఖ్యమంత్రి మార్పు గురించిన కథనాల వల్ల కలిగిన ఆవేశమే ఇలా మాట్లాడిస్తుందని అందరికీ అనిపిస్తే అది వారి తప్పు కాదు.చాలా జరుగుతున్నా ప్రచారం చాలడం లేదన్న భ్రమ ముఖ్యమంత్రిని ఫ్రధానంగా నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది.నిజానికి సమస్యలు సంక్షోభాలు చాలా ఎక్కువగా వున్నాయిన ఆయన గుర్తించడం మంచిది.

No comments:

Post a Comment