యుపిఎ ప్రభుత్వం అందులోనూ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నదో ఇటీవల వరుసగా సంభవిస్తున్న పరిణామాలు విదితం చేస్తున్నాయి. అంత సంక్షుభితమైన పాలక కూటమి ఏలుబడిలో దేశం, ప్రజల స్థితిగతులు మరెంత దారుణంగా వున్నాయో చెప్పాల్సిన అవసరం ఎలాగూ వుండదు. గత వారం అమెరికా పత్రిక టైమ్ ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్థత గురించి ముఖ చిత్ర కథనం ప్రచురించడంతో ఈ కలకలం మొదలైంది. దానికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీ అతిథి పాత్రకు పరిమితమైనందునే ఇలా జరుగుతున్నదని నిందాస్తుతి చేశారు.దీనిపై కొందరు వీర విధేయులు చిందులు తొక్కినా వాస్తవంలో ఆయన రాహుల్ రాకకు రంగం సిద్ధం చేసేందుకే అలా మాట్లాడారని అర్థమై పోయింది. తర్వాత పరిణామాలన్ని అక్షరాలా ఆ దిశలోనే నడిచాయి. ఉప రాష్ట్రపతి అన్సారీ నామినేషన్ ఘట్టంలో కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీ దీనిపై స్పందిస్తూ తాను ఏ పాత్ర తీసుకోవాలో నిర్ణయించుకోవలసింది రాహుల్ గాంధీయేనని వ్యాఖ్యానించారు. కాగా ఆ మరుసటి రోజునే ఆయన మాట్లాడుతూ తన స్థానం ఏమిటో నిర్ణయించాల్సింది సోనియా, మన్మోహన్‌లేనని వినయం ప్రదర్శించారు. ఇలా సాగుతున్న తల్లీ కొడుకుల ముచ్చట్ల వెనక బృహత్ వ్యూహం వుందని పసిగట్టిన వ్యవసాయ మంత్రి ఎన్‌సిపి అధినేత శరద్ పవార్,తన సహచరుడు ప్రపుల్ పటేల్‌తో సహా రాజినామాలు సంధించి కొత్త సంక్షోభానికి తెర తీశారు. ఎందుకంటే రాహుల్ రాకకు రంగం సిద్ధమయ్యేప్పుడే తను సాధించుకోవలసిన కోర్కెల జాబితా ఆయన దగ్గర వుంది.
నిజానికి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే సమయంలోనే లుకలుకలన్నీ వ్యక్తమైనాయి. కావాలనే దాన్ని జాగుచేయడం, మమతా బెనర్జీ వ్యతిరేకించడం వంటి పరిణామాలు కలిగాయి. నిజానికి వ్యక్తులు, పదవులు, ప్రయోజనాల వేట తప్ప వీటిలో ఎలాటి విధానపరమైన విభేదాలు లేవు. అధికధరలు అవినీతి వంటి ఏ అంశంలోనూ భాగస్వామ్య పార్టీలు గట్టిగా నిలబడుతున్నది లేదు. కాకపోతే ఆ సమస్యలను సాకులుగా చూపించి తమ వాటాలు వాదనలు నెగ్గించుకోవడమే జరుగుతున్నది. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు విషయంలో మమతా బెనర్జీ ఆఖరుకు ప్లేటు ఫిరాయించడం కూడా ఆ కోవలోదే. అయితే ఆమెకు బెంగాల్‌లో కాంగ్రెస్‌కు మధ్య వైరుధ్యాలు పెరుగుతున్న మాట కాదనలేనిది. సిపిఎంను దెబ్బ తీయడానికి ఆమె పల్లకీ మోసినా అతి కొద్ది కాలంలోనే ఆ అదరగణ్నం నాయకురాలిని భరించలేని దురవస్థ కాంగ్రెస్‌ది. ఇలాటి సమస్యలు ఇతర చోట్ల కూడా వున్నాయి. ఈ అవకాశం తీసుకుని అమెరికా అద్యక్షుడు ఒబామా చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించాలని సరళీకరణను వేగవంతం చేయాలని వత్తిడి చేస్తూ మాట్లాడారు.
అంతకు ముందే
ప్రధాని ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు లండన్‌లో మాట్లాడుతూ సంస్కరణల వేగం తగ్గడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రపతి పీఠం కోసం రాజినామా చేసిన ప్రణబ్ ముఖర్జీ ఆఖరులో ప్రకటించిన ఆర్థిక రాయితీలు చాలనట్టు వాటిని నిలిపి వేసి మన్మోహన్ మరింత 'వుదారంగా' వెళుతున్నారు. ఆ స్థానంలో ఆర్థిక మంత్రిగా మళ్లీ చిదంబరంనే తీసుకువస్తారని కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఒబామా వ్యాఖ్యలపై మన్మోహన్ సానుకూలంగా స్పందించారు కూడా. సిరియాలో జోక్యానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలో చైనా రష్యా వీటో చేసినా అమెరికాకు అనుకూలంగా ఓటు వేయడానికి కూడా భారత్ హడావుడి పడింది. ఇవన్నీ మన గమనం ఏ దిశలో వున్నదీ చెబుతున్నాయి. అంటే కాంగ్రెస్ దుర్బలత్వాన్ని భాగస్వామ్య పార్టీలు బయిటి దేశాలు కూడా వుపయోగించుకుని అవాంఛనీయమైన ఒత్తిడి చేస్తున్నాయన్నమాట.
ఈ ప్రహసనంలో భాగంగానే మన్మోహన్‌పైనా రాహుల్ పైనా చర్చ తీసుకురావడం. తద్వారా వారిని ప్రలోభపెట్టడం లొంగ దీసుకోవడం. అమెరికా సెనేట్‌కు కొంత కాలం కిందట సమర్పించిన నివేదికలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీలే ప్రధాన ప్రత్యర్థులైనట్టు వీరిలో మోడీకే మొగ్గు కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలొ సాగుతున్న రాజకీయ మధనం, రకరకాల విన్యాసాలను పట్టించుకోకుండా వారిద్దరి చుట్టూనే తిప్పే ప్రయత్నం జరిగింది. బిజెపి కూడా దానికి స్పందన అన్నట్టు తర్వాత మోడీ ఒత్తిడికి తలవొగ్గి ఆయనకు నచ్చని వారిని తొలగించింది. హిందూత్వ వాది ప్రధాని అయితే తప్పేమిటని ఆరెస్సెస్ వంత పాడింది. ఇందుకు సమాంతరంగా కాంగ్రెస్‌లోనూ రాహుల్‌ను తీసుకురావాలనే బృందగానం తీవ్రమైంది. ప్రస్తుత పరిణామాలు దానికి పరాకాష్ట అనొచ్చు.
ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ నాయత్వం వారసత్వ పాలన పాతుకు పోయాయి. ఆమె మొదట సంజరు గాంధీని తర్వాత రాజీవ్ గాంధీని క్రమపద్ధతిలోనే తీసుకొచ్చారు. వారి హత్యల అనంతరం సోనియా కూడా కాస్త తటపటాయించినా పార్టీ పగ్గాలు చేబట్టి ఆపైన ప్రధాని స్థానం వరకూ వెళ్లారు. విదేశీ వివాదం రాజ్యాంగ బద్దమైంది కాకున్నా వాస్తవ రాజకీయాల రీత్యా వెనక్కు తగ్గి గుత్తాధిపతులు ముద్దుబిడ్డ మన్మోహన్‌కు అధికారం అప్పగించి ఆజమాయిషీ తన కుటుంబం చేతుల్లో పెట్టుకున్నారు. ఆమె త్యాగం గురించి కీర్తించే కాంగ్రెస్ వారే రాహుల్ గాంధీ ఏ పదవితీసుకోకపోవడం కూడా గొప్ప త్యాగమన్నట్టు చిత్రిస్తుంటారు. ఆయన యువ రాజ హౌదాలో దేశం పర్యటిస్తూ సూక్తులు చెబుతూ కావలసినంత ప్రచారం పొందారు. అయితే ఆయన రాజకీయ సవాలుగా తీసుకున్న రాష్ట్రాలు వేటిలోనూ కనీస విజయాలు సాధించలేక చతికిల బడ్డారు. అంతేగాక తనకు అభ్యుదయ పురోగామి బావజాలం వుందని ఏ దశలోనూ వెల్లడించుకోలేకపోయారు. అయోధ్య పాకిస్తాన్ వంటి సమస్యలపై అరకొర వ్యాఖ్యలతో అజ్ఞానం బయిటపెట్టుకున్నారు. తమ కుటుంబం చేతుల్లో పాలన లేకపోవడం వల్లనే ఇవన్నీ జరిగాయని అతిశయం వెలగబెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అణు ఒప్పందంపై చర్చ సందర్భంలో లోక్‌సభలో ఆయన చేసిన తొలి ప్రసంగం హాస్యాస్పదంగా మారింది. ఆనాడు తాను పదే పదే ప్రస్తావించిన నిరుపేద కళావతి కుటుంబాన్నయినా ఆదుకోవాలన్న మెళకువ ఆయనకు లేకపోయింది. కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా నుంచి కన్యాకుమారిలో జయలలిత కనిమొళిల వరకూ , అఖిలేష్ నుంచి లోకేశ్ వరకూ వారసత్వ రాజకీయాలు స్తిరపడటానికి దోవ చూపింది ఇందిర కుటుంబమే గనక రాహుల్ కోసం వారు ఆర్రులు చాచడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.అయితే ఈ రాజకీయ రాహు కాలాన్ని రాహుల్ గాందీ ఏదో మార్చేస్తాడనుకోవడం భ్రమ. నిజంగానే తదుపరి ఎన్నికలకు ముందే ఆయనను ప్రతిష్టించడం ద్వారా భావి నాయకత్వానికి ఢోకా లేకుండా చేసుకోవాలన్న తాపత్రయం కూడా వుండొచ్చు. దానికి దేశ విదేశ కార్పొరేట్ శక్తుల ఆమోదం పొందాలన్న ఆరాటం.
బూర్జువా ప్రజాస్వామ్యంలో ఇలా కుటుంబ వారసత్వాలు కొనసాగించుకోవడానికి తెర వెనక సహకారం ఆ శక్తులదే. తమ పట్టు నిలబెట్టుకోవడానికి పనులు జరిపించుకోవడానికి ఇది వారికి అవసరం. అమెరికా వంటి చోట కూడా ఇద్దరు బుష్‌లు పదహారేళ్లు, క్లింటన్ ఎనిమిదేళ్లు పాలించింది చాలక ఆయన భార్య ఇప్పుడు కీలక పాత్ర ధారిగా కొనసాగుతున్నారు. మరో బుష్ ఇప్పటికే రెడీ అయిపోతున్నాడు.ఆసియా దేశాలు చాలా వాటిలో వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. ప్రత్యేకించి మన దేశానికి వస్తే కాంగ్రెస్ నేతలకు ఆ కుటుంబ స్తుతి తప్ప చెప్పడానికి కూడా ఏ ఘనతా లేని రాజకీయ దివాళాకోరుతనం!
ఇలాటి సమయంలోనే శరద్ పవార్ రాజినామాస్త్రం సంధించడంలోనూ -క్యాబినెట్‌లో తన సీనియారిటీ పదిలపర్చుకోవడం, తన కూతురుకు పదవి సంపాదించుకోవడం, కేంద్రంలోనూ రేపు మహారాష్ట్రలోనూ తమ పార్టీ వాటా పెంచుకోవడం వంటి లక్ష్యాలున్నాయి. గతంలోనూ ఇలా అలకబూని అనుకున్నది సాధించుకున్నారు. అయితే రాజకీయంగా ప్రతికూల పరిస్తితులు వున్నప్పుడు కొన్ని సార్లు టీ కప్పులో తుపానులా పోతాయనుకున్న సమస్యలు చినికి చినికి గాలి వాన కూడా కావచ్చు. అనేక కారణాల రీత్యా మంత్రివర్గ పునర్యవస్థీకరణ జరగవలసి వున్న ఈ తరుణంలో ఇతర భాగస్వామ్యపార్టీల ఒత్తిళ్లు కూడా తప్పక పెరుగుతాయి. ఆ సర్దుబాట్ల క్రమంలో ప్రజల సమస్యలు వెనక్కుపోయి వారి వారి వాటాల పంపకమే ఫ్రధానమవుతుంది. యుపిఎ భాగస్వాముల అసంతృప్తి గురించి బిజెపి మాట్లాడుతున్నా వారి ఎన్‌డిఎ పరిస్థితి కూడా అంతకన్నా మెరుగ్గా లేదని రాష్ట్రపతి ఎన్నికలతోనే తేలిపోయింది. పార్టీపై తిరుగుబాటు చేసి తిట్ల దండకం చదివిన జస్వంత్ సింగ్‌ను తెచ్చి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయించడంలోనే ఈ దుస్తితి కళ్లకు కడుతుంది. దేశంలో రెండు ప్రధాన కూటములు ఇంతగా గిజగిజలాడుతున్నా ప్రాంతీయ పార్టీలు ప్రత్యామ్నాయంగా ముందుకు రాలేకపోవడం ఒక రాజకీయ వాస్తవం. సమాజ్‌వాది,బిఎస్‌పి,ఆర్‌జెడి వంటివి ఇప్పటికీ యుపిఎను బలపరుస్తుంటే తెలుగు దేశం వంటివి విశ్వసనీయత పెంచుకోలేకపోతున్నాయి. వంటరి ప్రతిభపై నమ్మకం గల నవీన్ పట్నాయక్, జయలలిత వంటివారి వ్యవహారం ఇంకా అస్పష్టంగా వుంది. జగన్ పార్టీ వ్యూహంపై వూహలు సాగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజకీయ రణాల పునస్సమీకరణాల భావి గమనం ఏమిటో స్పష్టం కాని స్థితి.ఆ లోగానే తమ స్థానాలు పదిలపర్చుకోవాలని కాంగ్రెస్ గాని దాని యుపిఎ భాగస్వాములు గాని తొందరపడుతున్నారు. బహుశా ఏ పార్టీ ఏ మేరకు మేల్కొన్నా లేకపోయినా ప్రజలు ఎక్కువ కాలం సహనం వహించలేరు. ఎవరికి నేర్పాల్సిన పాఠం వారికి నేర్పుతారు.
No comments:
Post a Comment