
విద్యుచ్చక్తి రేట్ల పెంపు, సరఫరా సంక్షోభంపై వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సచివాలయ ముట్టడి సహజంగానే రాజకీయ వర్గాలనూ మీడియానూ కూడా బాగా ఆకర్షించింది. పుష్కరం కిందట ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన విద్యుత్తేజానికి సంధాన కర్తలు వామపక్షాలేనన్నది అందరికీ తెలిసిన విషయం. నాటి తెలుగు దేశం ప్రభుత్వ సంస్కరణలకూ భారాలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఉద్యమంలో కాంగ్రెస్ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చురుగ్గా పాల్గొన్నారు.తర్వాత అధికారంలోకి కూడా వచ్చారు.అయితే అదే సంస్కరణలు సాగించడమే గాక మరింత ఉధృతం చేశారు. అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేర్చారు. ఆ దశలో 2008లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల భూపోరాటం మళ్లీ సంచలనం కలిగించింది. విద్యుదుద్యమంలో బషీర్‌బాగ్, భూ పోరాటంలో ముదిగొండ రక్తసిక్తమయ్యాయి. నిజానికి వైఎస్ సంక్షేమ పథకాల హౌరు పెరిగింది ఆ తర్వాతే.ఆ నేపథ్యంలో చాలా తర్జనభర్జనల తర్వాత ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశం,టిఆర్‌ఎస్‌ల మధ్య సీట్ల పోట్లాట స్వల్ప తేడాతో వైఎస్ మళ్లీ గద్దెక్కడానిక కారణమైంది. ఆ తర్వాత ఆయన మరణం, జగన్ తిరుగుబాటు, కెసిఆర్ నిరాహారదీక్ష వగైరాలు రాజకీయాలను అనిశ్చితి అంచులకు తీసుకెళ్లాయి. ఈ క్రమంలో పేరుకు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నా యాత్రలు చేస్తున్నా ప్రధాన పార్టీలన్ని సీట్ల వేటలోనే
వున్నాయి. మీడియాలోనూ రాజీనామాలు ఉప ఎన్నికలు ఉద్రేకాలు వలసలు విచారణలు వంటి ప్రహసనాలు తప్ప ప్రజా సమస్యలపై ఉద్యమాలకు ప్రచారం తగ్గింది.కాంగ్రెస్ పరిశీలనా కమిటి సిఫార్సులలో ఇలాటి ప్రస్తావనలే లేకపోవడం, తెలుగు దేశం బిసి డిక్లరేషన్ చేసి స్వీయాభినందనల్లో మునిగిపోవడం, సిరిసిల్ల యాత్రలో వైఎస్‌ఆర్‌పార్టీ టిఆర్‌ఎస్‌ల బాహాబాహీ వంటివి ఇందుకు ఉదాహరణలు.ఇవన్నీ గమనంలోకి తీసుకుంటే విద్యుత్తేజం మరోసారి వికసించడంలోని విలక్షణతను ఎవరూ విస్మరించలేని స్థితి. ఇప్పటికిప్పుడు ఏం జరిగిందనే దానికంటే రాజకీయ ఎజెండాను ప్రజలవైపు మరల్చడానికి ప్రజలందరి సమస్యలపై సమరశీలత పెంచి పాలకుల మెడలు వంచడానికి ఈ సందర్భం దారి తీస్తుందని ఆశించాలి.
మళ్ళీ అనడం అవసరమా? అంటే పోయిన సారి ఉద్యమం ఎందుకు ఆపారు అని అడగాల్సి వస్తుంది.
ReplyDeleteపోరాటాలు చేయాలి మళ్ళీ మళ్ళీ... అన్నది వామపక్షాలకు మామూలే కదా.