Pages

Saturday, July 28, 2012

ఓనమాలు .. మానవత్వం ఆనవాలు..


సకుటుంబంగా సలక్షణంగా చూడదగిన చిత్రం కోసం నిరీక్షించే వారికి సంతోషదాయకమైన కానుక సన్‌షైన్‌ ఫిలిమ్స్‌ ' ఓనమాలు'. వర్తమాన యుగంలో వక్రధోరణులనూ అక్రమాలను అనౌచిత్యాలనూ చూసినప్పుడు కలిగే ఆవేదనకు తెర రూపం ఈ చిత్రం. యువ దర్శక నిర్మాత క్రాంతి మాధవ్‌ తొలి ప్రయత్నంలోనే ఇలాటి అర్థవంతమైన చిత్రం అందించడం అభినందనీయం.
నారాయణ రావు మాష్టారు( ఇంకెవరు, రాజేంద్ర ప్రసాదే) ఆ వూరితో పెనవేసుకుపోయిన మానవతా మూర్తి. పిల్లలకు చదువులతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పే గురువు. భార్య రుక్మిణి(కళ్యాణి) కోపతాపాలను మురిపెంగా సర్దుబాటు చేసుకుంటూ వూరి గురించే ఆలోచించిన వ్యక్తి. భార్య చివరి కోర్కె మేరకు అమెరికాలో కొడుకు దగ్గరకు వెళ్లినా నిరంతరం వూరే ఆయన మదిలో మెదులుతుంటుంది.ఆ జ్ఞాపకాలు మనవళ్లకు చెబుతూ కాలక్షేపం చేస్తుంటాడు. స్వదేశాగమనాన్ని ఏళ్లతరబడి వాయిదా వేస్తున్న కొడుకుతో పోట్లాడలేక తనకు తానుగానే వచ్చేస్తాడు. మధుర జ్ఞాపకాలతో బయిలు దేరిన నారాయణరావు స్వగ్రామం చేరుకోవడం ప్రథమార్థమైతే ఆయన ప్రతిస్పందన ద్వితీయార్థం.
పల్లెల్లో ఒకనాటి ఆత్మీయ సంబంధాలు, కుల మత ప్రసక్తి లేని అన్యోన్యతలు, ె్లబడి పిల్లల సహజ సిద్ధమైన ఆటలు అసూయలు, దాంపత్య జీవితపు సరదాలు, జాతరలు, ఆచారాలు,
పశుగణాలతో అనుబంధాలు, కుర్రకారు హుషార్లు, మొదటి భాగంలో నడుస్తాయి. చొచ్చుకు వచ్చిన ప్రపంచీకరణ విష సంసృతి ప్రభావాలు, విషాదమైన పల్లె జీవిత చిత్రాలు,ఛిద్రమైన మానవీయ సంబంధాలు, రివాజుగా మారిన అవినీతి అక్రమాలు, సంఘర్షణలో చిక్కిన కొత్తతరం తప్పటడుగులు, నిరాదరణకు గురైన పెద్దతరం నిర్వేదాలు, సెల్‌ఫోన్లు,మినరల్‌ వాటర్లు ఇవన్నీ ద్వితీయార్థంలోవుంటాయి. నారాయణరావు శిష్యుల్లో పాఠాలు చెప్పే సరళ, నిబద్ద పాత్రికేయుడుగా నిలబడిన ఖాదర్‌, స్కీముల స్కాముల్లో చిక్కుకుపోయిన రామకృష్ణ, వూరి సర్పంచ్‌ పీఠం డబ్బుతో గెలిచిన సురేష్‌, వ్యవసాయ సంక్షోభానికి ప్రాణాలిచ్చిన రైతు చిట్టిరాజు తదితరులుంటారు. చలించి పోయిన నారాయణరావు తన విద్యార్థులందరిని రప్పిస్తాడు. ఎవరు ఎంత ఎదిగినా పల్లెను తల్లిని మరిచిపోరాదనే సందేశంతో కళ్లు తెరిపిస్తాడు. చిత్రం రెండో సగం మరింత ఆసక్తికరంగా నడుస్తుంది. ప్రతివారూ ఏదో ఒక సన్నివేశంలో సంభాషణలో తాదాత్మ్యం చెందకుండా వుండరు. 1992ను ఈ తేడాలకు కొలబద్దగా తీసుకుని నాటి విద్యార్థులను రప్పించడంలో సరళీకరణ గురించిన సృహ వుంది.
నూటికి నూరు పాళ్లు రాజేంద్ర ప్రసాద్‌ చిత్రమిది. స
హజంగా ఆ నలుగురు,మీ శ్రేయోభిలాషి పాత్రలకు కొనసాగింపుగా కనిపించినా వాటికన్నా సమగ్రత ఇందులో ఎక్కువని చెప్పాలి. కాకపోతే ఆ మధ్యతరగతి పాత్ర వ్యక్తిగత పరిమితిలో ఉద్యమాలు వగైరాల వరకూ వెళ్లే అవకాశం వుండదు. ఇప్పటి తెలుగు చిత్ర వాతావరణాన్ని గమనిస్తే రాజేంద్రుడు మాత్రమే ఇలా నటించగలరని ఎవరైనా అనుకుంటారు. హాస్యాన్ని అవలీలగా పండించిన నటకిరీటి గాంభీర్యాన్నిపెద్దరికాన్ని కూడా అంతకన్నా అలవోకగా పలికించడం అరుదైన ప్రతిభ. మిగిలిన నటీనటులంతా ఆయన పాత్ర ఆలంబనగా నడిచిన వారే. చలపతి రావు, శివ పార్వతి, గిరిబాబు, అనంత్‌, కొండవలస ఇలా పరిచిత వదనాలున్నా శిష్య పాత్రల్లో ఎక్కువగా వర్థమాన తారలే కనిపిస్తారు.
గతంలో అనేక మంచి చిత్రాలిచ్చిన తమ్ముడు సత్యం ఈ చిత్ర కథకుడు.నిజానికి ఇందులో కథకన్నా వివిధాంశాల కూర్పు ఎక్కువ. అలాటివి మరీ ఎక్కువయ్యాయా అని సందేహం కలిగినా రాజేంద్ర ప్రసాద్‌ పరిణత నటన ఆ సందేహాన్ని కప్పేస్తుంది. కథకుడు ఖదీర్‌ బాబు తొలిసారి సమకూర్చిన సంభాషణలు ముఖ్యంగా ద్వితీయార్థం తర్వాత బాగా ఆకట్టుకుంటాయి.''పల్లె నాశనమైతే భరత మాత గర్భసంచీ తీసేసినట''ే్ట, ''కుండల్లోనూ గుండెల్లోనూ తడి ఆరిపోయింది'' వంటి మాటల్లో సందేశంతో పాటు నేటి సందర్భం కూడా కళ్లకు కడుతుంది. కోటి సంగీతం ముఖ్యంగా నేపథ్య సంగీతం కథకు బాగా తోడైంది. సీతారామశాస్త్రి పా టల్లో సూరీడు వచ్చిండు, పిల్లలూ బాగున్నారా వంటి పాటలు బాగున్నాయి. పాటలు ఇంకా బాగుంటే అదనపు బలం వచ్చి వుండేది. అందమైన ఫోటోగ్రప హరి అనుమోలు ˜ీ ఎడిటింగ్‌. గౌతం రాజు
దర్శక నిర్మాత క్రాంతి మాధవ్‌ అనుకున్న సందేశం అందించడంలో కృతకృత్యులయ్యారు. నేటి తెలుగు సినిమా బీభత్స విన్యాసాల మధ్య ఆహ్లాదకరమైన ఆటవిడుపు కల్పించినందుకు అభినందనలందుకొంటాడు. ఇది కేవలం పల్లె పట్నం సమస్య లేదా వ్యక్తిగత చైతన్య సమస్య కాదు గనక పల్లె పతనం వె నక వున్న ఆర్థిక కారణాలను కూడా సృశించి వుంటే బావుండేది. సీనియర్‌ నేత కె.ఎల్‌ నరసింహారావు మనవడైన క్రాంతి తొలి చిత్రానికి అమ్మమ్మ ్మ దుర్గాదేవి సమర్పకురాలు. ఇలాటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే సమాంతర భావాలకు నూతన ప్రయోగాలకు ఆస్కారం కలుగుతుంది.
ఇప్పటికి ఇంతే. చిత్రంపై సమగ్ర చర్చ మరోసారి.

No comments:

Post a Comment