Pages

Sunday, July 29, 2012

మోడీ ఉరి సవాలు - సరికొత్త వ్యూహం


గుజరాత్‌ మారణహౌమంలో తన పాత్ర వున్నట్టు తేలితే ఉరికైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నయా దునియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం రాజకీయంగా చాలా వ్యూహాత్మకమైంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల సన్నాహాలలో భాగంగానే దీన్ని చూడకతప్పదు. ప్రధాని అభ్యర్థిగా మోడీని ఆమోదించేందుకు ఆ పార్టీలోనే అనేక మంది సిద్దంగా లేరు. ఈ రాష్ట్ర బిజెపి నాయకత్వంలో కీలకమైన ఒక వ్యక్తి నాతోనే అలాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా బిజెపి ఇప్పుడున్న స్తితిలో మోడీని పూర్తిగా పక్కన పెట్టగల స్థితిలో లేదు గనకే ఆయన కోసం సంజరు జోషిని పక్కన పెట్టింది. అద్వానీ కూడా అప్పుడు గైర్‌ హాజరైనా తర్వాత మోడీని కలిసి ప్రశంసలు కురిపించారు. దేశ విదేశ కార్పొరేట్‌ ప్రతినిధుల్లో కొందరు మోడీని రంగం మీదకు తేవాలని ఉత్సాహంగా వున్నారు గనకే అమెరికా పత్రికల్లోనూ దేశ రాజకీయాలను మోడీ కి రాహుల్‌కు మధ్య పోటీగా చిత్రిస్తున్నారు.ఈ నేపథ్యంలోన కాస్త ఆమోదయోగ్యత పెంచుకోవడానికే మోడీ మొదట్లో చెప్పుకున్న వ్యాఖ్యల వంటివి చేస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించి తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అదే ఇంటర్వ్యూలో చెప్పిన మోడీ ఇక ఉరి వంటి పెద్ద శిక్ష ల గురించి ప్రస్తావించాల్సిన అవసరమేమిటి? కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ అన్నట్టు పదేళ్లలో ఆయనపై గుజరాత్‌ పోలీసులు ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేయనప్పుడు శిక్షల
వంటి ప్రసక్తి ఎక్కడ వస్తుంది? అయోధ్య విధ్వంసంలో మూడు రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు బర్తరఫ్‌ అయ్యాయి. అద్వానీతో సహా పలువురు నేతలు విచారణనెదుర్కొన్నారు. కాని గుజరాత్‌లో అంత ఘోర నరమేధం జరిగినా ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా విచారణ నెదుర్కోవడం గాని అభియోగాల వరకూ వెళ్లడం గాని జరగలేదు. తర్వాత విచారణ కమిషన్లు న్యాయ స్థానాల జోక్యం వల్లనే కొన్ని కేసులు కొంత ముందుకు నడిచాయి. కనక ఉరి తీయండి వంటి మాటలు ప్రచారానికే పనికి వస్తాయి!
మోడీ ప్రభుత్వ ప్రతిభను చాలా మంది పొగుడుతుంటారు గాని ఉపాధి కల్పనలో ఆ రాష్ట్రం సాధించిన ప్రగతి శూన్యం. అవినీతిలోనూ చాలా ఆరోపణలున్నాయి. తాజాగా 2008లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తుకు గవర్నర్‌ అనుమతి మంజూరు చేయడం ఈ విషయంలో తాజా పరిణామం.

3 comments:

  1. క్షమించాలి.
    మోడిపై కావలసినంత విచారణాప్రహసనం నడచింది, నడుస్తోంది. సాగదీయటం ఒక రాజకీయం‌. దీని ఆంతర్యం అల్లా అతడిపైన వ్యతిరేక ప్రచారం నిరంతరాయంగా సాగిస్తూ నిరంతరాయంగా లాభపడాలని కొన్న్ని ప్రార్టీల తాపత్రయం. విచారణలు ఒక కొలిక్కి రావటం‌వారికి ఇష్టం‌లేదు. ఎందుకంటే యమీ‌ఇదమిథ్థంగా ఋజువుకాకపోతే భారీ నష్టం అన్న భయం.

    విచారణ ముగుస్తే ప్రజలకు ఒక చీకాకు తప్పుతుంది. ఉరితీయండి లేదా వదిలేయండి అనే తీర్పుల్లో‌ యేది వచ్చినా మంచిదే! ఉరితీతకు మోడి సిధ్దమే అన్నాడు కదా. ఇంక గోల దేనికీ? అది ఎన్నికల యెత్తుగడ అయితే కానీండి. ఇతరపార్టీలు యెన్నికల యెతుగడలు వేయటం లేదా?

    ReplyDelete
  2. మోడీ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?గుజరాత్ లో జరిగిన మారణహోమంలో అతడి ప్రత్యక్ష పాత్ర ఉందో లేదో వదిలేయండి. ప్రతి చిన్న విషయానికీ న్యాయవిచారణ కోరే కమలనాధులు ఈ విషయంలో అప్పట్లో రాష్ట్రంలోనూ కేంద్రం లోనూ ప్రభుత్వంలో ఉండి కూడా న్యాయవిచారణ ఎందుకు జరిపించలేదు.అంత మారణ హోమానికి ఎవరో ఒకరో కొందరో బాధ్యులై ఉంటారుకదా?నిష్పాక్షికమైన న్యాయవిచారణ జరిపించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై అప్పుడు లేదా? ఆమధ్య తనను గౌరవించడానికి ప్రయత్నిస్తున్న పరమతానికి చెందిన వారిని తిరస్కరించిన మోడీని అందరం టీవీలో చూశాం.మన నాయకులు ఇవాళ ఏ పార్టీకి చెందిన వారయినా ఏమి మాట్లాడినా ప్రజలందరికీ వాటి అర్థాలూ వాటికివ్వాల్సిన విలువా తెలుసు.బహుశః విజ్ఞులైతే ఆ నాయకులకీ తెలిసే ఉంటుంది.అయితే ఇలా ఎందుకు మాట్లాడతారంటే, వారిని ఆ పార్టీకి అంకితమై పోయి వారి నాయకులు ఏ తప్పూ చేయరని భావిస్తూ ఫాలో అయిపోయే గొర్రెల లాంటి అనుచరగణం కోసం.అందరు నాయకులూ ఇంతే.మోడీ కూడా అలాంటి వాడే.తేడా ఏమీ లేదు.

    ReplyDelete