Pages

Wednesday, July 25, 2012

క్షుద్ర పూజల వ్యవహారంలో చిక్కు ప్రశ్నలు



డిజిపి దినేష్‌ రెడ్డికీ, సీనియర్‌ ఐపిఎస్‌ ఉమేష్‌ కుమార్‌కు మధ్యన సాగుతున్న వివాదంలో ఇప్పుడు దేవతలు పూజలు కూడా ప్రవేశించడం విడ్డూరం. ఈ సాయింత్రం మీడియాలో చూసిన ప్రకారం కొన్ని మాసాల కిందట ఒక సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, డిజిపికి హాని జరగాలని పూజలు చేయించారట. కొంతమంది పేరు చెప్పగా కొందరు చెప్పకుండా వదిలేశారు.చెప్పినా చెప్పకున్నా వూహకందనిదేమీ కాదు. ఇంతకూ ఇక్కడ పూజలు చేయించారా లేదా అన్నది ఒకటైతే పూజలు చేయిస్తే హాని జరుగుతుందా అన్నది మరొకటి. ఆ ప్రకారం కేసు పెట్టవచ్చునా అని ఒక రిటైర్డు పోలీసు ఉన్నతాధికారిని అడిగితే తనకూ స్పష్టత లేదన్నారు. వారి మధ్య వైరం గురించి ఎలాటి భిన్నాభిప్రాయాలు లేకున్నా మీడియలో ఒక వైపు కథనాలే వస్తున్నాయని గతంలో ఒకరు ఫోన్‌ చేసి చెప్పారు. ఇదంతా ఒక పోలీసు పోరు అనుకోవాలి. అది ఎలా వున్నా అశాస్త్రీయమైన పూజలు చేసినందుకు, రక్తం ఉపయోగించినందుకు కేసు పెట్టవచ్చునేమో గాని ఫలానా వారికి వ్యతిరేకంగా చేసినందుకు కేసు పెట్టే అవకాశం చట్టంలో వుందా? వుంటే చట్టం మూఢత్వాన్ని ఆమోదిస్తుందా?గతంలో చాలా మంది అధినేతలు రకరకాల యజ్ఞయాగాలు బలి క్రతువులు చేసినప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.

2 comments:

  1. :D
    ఆ కేసేదో దినేష్ రెడ్డి గారు ఒరిస్సా-ఆంధ్ర బార్డర్లోవుండే విషాచితో కాని, దార్కాతో గాని పెట్టిస్తే చవక, జడ్జీలు బెయిళ్ళకే కోట్లు మింగుతున్నారు. మళయాళ, నేపాలీ, మాత్రికులైనా మాయల మరాఠీలు ఇలాంటి కేసులు బాగా సెటిల్ చేస్తారట!

    ReplyDelete
  2. భారత విద్యావ్యవస్థ తయారు చేసిన అత్యున్నత అధికారులు వీళ్లు!! ఉన్నత విద్యావంతులై, బాధ్యత గల స్థానాల్లో ఉండి కూడా మూర్ఖుల్లా, మూఢుల్లా మంత్రాలూ తంత్రాలంటూ వెర్రి విన్యాసాలు చేస్తున్నారు.

    ఏ చదువూ రాని వాడు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ప్రత్యర్థులపై కేసులు మీద కేసులు పెడుతున్న ఈ రోజుల్లో, ఆ పోలీసు వ్యవస్థకే బాధ్యుడిగా ఉండి ఈ 'విద్యావంతులు' చేస్తున్న పని ఇది!! ఇంత కష్టపడి ఐఏఎస్ లూ, ఐపీఎస్ లూ కావడం దేనికి, దండగమారి చదువులు కాకపోతే!! మంత్రాలూ తంత్రాలూ ఒక నాలుగు పుస్తకాలు బట్టీపట్టేసి ఒక మంత్రశాల తెరిస్తే సరిపోయేది!!

    ReplyDelete