Pages

Saturday, July 28, 2012

హౌం శాఖ నివేదిక పేర నిరాధార వివాదం



సిరిసిల్ల ఘటనకు ముందే తెలంగాణా సమస్యకు సంబంధించి విభిన్న వూహాగానాలు వెలువడుతూ వచ్చాయి. మూడు మాసాల్లో వచ్చేస్తున్నట్టు తనకు సంకేతాలు అందాయని కె.సిఆర్‌ ప్రకటిస్తే అలాటివి తనకు రాలేదని కోదండరాం,విజయశాంతి ప్రకటించారు. ఎలాగూ వచ్చేస్తుంటే అడ్డుకోవడాలు ఎందుకనే ప్రశ్న కూడా సహజంగానే ఎదురైంది. తాడూ బొంగరం లేని ఈ కథనాల మధ్య ఇప్పుడు రాష్ట్ర విభజన సాధ్యం కాదంటూ హౌం శాఖ నివేదిక నిచ్చిందని మరో వార్త, దానిపై ఆరోపణలు ప్రత్యారోపణలు. అసలు నిర్ణయం తీసుకోవలసిన కేంద్రం కావాలని జాప్యం చేస్తుంటే నిరాధార వాదోపవాదాలు పెంచి ప్రజలు ప్రాంతాల మధ్య వాతావరణం కలుషితం చేయడం పరిపాటిగా మారుతున్నది. ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి కావడానికి ప్రాంతీయ సమస్య పరిష్కారానికి సంబంధం ఏమిటి? ఆయన పదవిలోకి రాగానే ఈ సమస్యపై నివేదిక తెప్పించుకున్నారని కథనాలు ఏమిటి? హౌం శాఖ ఆధ్వర్యంలోనే డిసెంబర్‌ 9 ప్రకటన,అఖిల పక్ష సమావేశాలు,శ్రీకృష్ణ కమిటీ నియామకం వగైరా జరిగాయి గనక వారి అధ్యయనం ఏదో వుంటే వుండొచ్చు గాని అధిష్టానం నిర్ణయం లేకుండా ఆ శాఖ చేసేదేమిటి? కాంగ్రెస్‌ ముందుగా నిర్ణయం చెబితే గాని ఏమీ చేయలేమని చిదంబరం ఇది వరకే చెప్పేశారు కూడా. కనక కేంద్రానికి సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని, సీమాంధ్ర మీడియా కథలు వదులుతున్నదని కొందరు , తెలంగాణా వాదమే ఎక్కువై మా వాదన వినిపించుకోవడం లేదని మరి కొందరు సాగిస్తున్న హడావుడి స్థానిక మనుగడ కోసమే. ఈ హడావుడిలో స్పష్టత ఇస్తామంటూ తెలుగు దేశం, మా వైఖరి స్పష్టమంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటిపై పెద్ద తర్జనభర్జనలు అవసరమే లేదు. రాష్ట్రపతి ఇలాటి విషయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం రాజ్యాంగంలోనే లేదు.

1 comment:

  1. సంకేతాలు కెసిఆర్‌కే ఎందుకొస్తున్నాయి? తక్కిన ఇద్దరూ రోజూ తప్పనిసరిగా మద్యం పుచ్చుకుంటే వాళ్ళకీ వచ్చేవి సంకేతాలు, పగటికలలూనూ. ఒకరి పగటి కలలను మరొకరు కాదనడం మానవహక్కులను కాలరాయడమే.

    ReplyDelete