Pages

Saturday, July 28, 2012

మనుగడ కోసం మంత్రులకు రక్షణమాధ్యమిక విద్యా మంత్రి పార్థసారథి రాజీనామా చేయాలా వద్దా అనే దానిపై నిజానికి ఎలాటి సందేహాలు లేవు. ఆయన తప్పుకోవడం రాజకీయ విలువల ప్రకారమే గాక రాజ్యాంగ సూత్రాల ప్రకారం కూడా తప్పని సరి. అయినా దానిపై ఇదమిద్దంగా కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఏమీ చెప్పలేని స్థితి. ఎందుకంటే ఆయన రాజినామా ప్రసక్తి వస్తే వెంటనే మిగిలిన ఆరు మంది సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆరుగురు మరో ఆరుగురిని కలుపుకోగలిగితే ప్రభుత్వమే కుప్పకూలుతుంది.
పార్థసారథి రాజినామా చేయాలా అక్కర్లేదా అనే ప్రశ్న నిజానికి పెద్ద క్లిష్టమైనది కాదు. నేరం ఆర్థికమైన మరో రకమైనా ఇప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా శిక్ష ఇప్పుడు పడింది. కనక తప్పు జరిగిందా లేదా అనే ప్రశ్నకు ఆస్కారం లేదు. ఇన్నేళ్లుగా వె ంటాడుతున్న తప్పుకు ఇప్పుడు శిక్ష పడింది. బ్యాంకు రుణం మంజూరు కానందునే తాము అనుకున్న పరికరాలు దిగుమతి చేసుకోలేకపోయాము తప్ప వేరే అపరాధం లేదని మంత్రి అంటారు. బ్యాంకు రుణం మంజూరు చేయకపోవడానికి చాలా పొరబాట్లు కారణంగా చూపించింది. ఆ నాటి సంగతి వదిలేస్తే దానిపై ఈడీ నోటీసు మంత్రిగా వున్నప్పుడే వచ్చింది. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఆ వారంట్లను బేఖాతరు చేయడం
మంత్రిగా వుండగానే జరిగింది. చివరకు నెల రోజుల శిక్ష కూడా మంత్రిగా వుండగానే పడింది. ఈ మధ్యలో అఫిడవిట్‌లో ఆ అంశాలను పేర్కొనకపోవడం అనేది తోడైంది. కనక చూడదలిస్తే ఇక్కడ అక్రమ వ్యవహారాలు చాలానే వున్నాయి. ఒక వ్యక్తి హత్య కేసు లేదా మరొకటి మంత్రి కాకముందు చేశారు గనక తర్వాత దానితో సంబంధం లేదంటే కుదురుతుందా? స్థానం మారిందే తప్ప వ్యక్తి మారలేదు కదా? కనక దానికి ఎలాటి మూల్యం చెల్లించనవసరం లేదా? హిమచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా కొన్ని దశాబ్దాల కిందట చేసిన తప్పుకు శిక్ష పడితే కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ ఇటీవలనే రాజీనామా చేయలేదా? పై కోర్టుకు వెళ్లేందుకు అవకాశమిచ్చారంటే అంత వరకూ శిక్షను నిలుపు చేశారు గాని రద్దు చేసింది లేదు. నెల రోజుల వరకూ వైదొలగి ఆ కోర్టు ఆదేశాల తర్వాత కొనసాగవచ్చు కదా! ఒకసారి దిగితే మళ్లీ ఏమవుతుందోననే ఆందోళన.
పార్థసారథి ఒక్కరే కాదు.ఈ సమయంలోనే న్యాయ శాఖా మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. నిజానికి గాలి బెయిలు వ్యవహారం బయిటకు వచ్చిన మొదట్లోనే ఆయన పేరు కూడా వినిపించి తర్వాత వినపడ్డం మానేసింది. చర్యకు గురైన ఒక మాజీ న్యాయమూర్తి ఆయన ప్రమేయం వుందని మాత్రమే గాక ఆయనను తప్పించేందుకే తమను ఇరికించారని ఆరోపించాడు. ఇలాటప్పుడు ఆయనపైనా దర్యాప్తు జరపడం న్యాయకాదా? నిరూపిస్తే ఏమైనా చేసుకోండి అని సవాళ్లు చేస్తారు గాని పదవిలో వుండగా ఎవరైనా ఎలా నిరూపించగలరు?
అవినీతికి అవకాశం లేని పారదర్శక పాలన మాదని ముఖ్యమంత్రి చెప్పుకుంటారు గాని నిజానికి ఈ వ్యవహారాలన్నిటిలోనూ సాగుతున్నది దాటవేత మాత్రమే. జగన్‌పై ఆరోపణలతో ముడిపడి వున్న 26జీవోల కేసులోనూ ఇదే తంతు. వారందరినుంచి సంజాయిషీలు అడక్కపోయి సమర్థించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.వ్యక్తిగతంగా సమాధానాలిస్తారని మొదట చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత వారికి న్యాయ సహాయం చేయాలని నిర్ణయించారు.ఆ పైన ఐఎఎస్‌లకూ దాన్ని పొడగించారు.(ఇప్పటికే జైలు పాలైన శ్రీలక్ష్మి,మోపిదేవి వంటి వారు మాత్రమే మినహాయించబడ్డారంటే అది అనివార్యంగానే.)ఈ విధంగా ఆరోపిత వ్యక్తులకు అధికారికంగా సహాయం అందించిన ఉదంతం దేశ చరిత్రలోనే జరిగి వుండదు. ఇక్కడ వారు న్యాయ వాదులను నియమించుకుని వాదన వినిపించలేనంత దీనస్తితిలో లేరు. నిజానికి న్యాయ సహాయం ముసుగులో వారికి అనుకూలమైన రాజకీయ వాదన చేయడం, ప్రభుత్వం అధికారికంగా తప్పులే జరగలేదని వాదించడం ఇక్కడ కీలకం. ప్రజా ధనంతో ప్రజల ఆస్తులతో పరస్పర లబ్ది అన్న క్విడ్‌ ప్రో కో మూలమే ఇక్కడ దెబ్బతింటుంది. ఇదంతా తప్పు కానప్పుడు దాని వల్ల జగన్‌ ఎలా లాభం పొందగలరనే వాదనకు ఇది దారి తీస్తుంది.ఏతావాతా ఏడాదిగా నడుస్తున్న దర్యాప్తు తతంగమంతా దండగై పోతుంది.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అవుతుంది. నిజంగా రెండు కాంగ్రెస్‌ల మధ్య అవగాహన వుందా లేదా అనేది అటుంచితే ఆచరణలో ఉభయులూ సిబిఐకి వ్యతిరేకంగా వాదించడమే జరుగుతుంది. కనక పార్థసారథి కొనసాగింపు వెనక ఆయన చూపిస్తున్న బింకం వెనక ఇన్ని అంశాలున్నాయి.

1 comment:

  1. He should be dismissed from the position by the CM

    ReplyDelete