Pages

Monday, July 23, 2012

నేతలు,కోర్టులు,కేసులు, తీర్పులు
ఈ రోజు వరుసగా కోర్టులు రాజకీయ ప్రాధాన్యత గల తీర్పులు ఆదేశాలు ఇచ్చాయి., మరో వంక ఆ కోర్టుల ముందున్న కేసుల్లో కొత్త మలుపులూ వచ్చాయి.
.చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ విజయమ్మ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడం, దీనికి రాజకీయ దురుద్దేశాలున్నందున ప్రజా ప్రయోజన వాజ్యం కిందకు రాదని తేల్చి చెప్పడం విశేషం. అయితే దీనిపై తెలుగు దేశం నేతలు పూర్తిగా ఆనందించే అవకాశం లేకుండా ఇది క్లీన్‌ చిట్‌ కాదని కూడా కోర్టు ముక్తాయింపు జోడించింది. సంబంధిత శాఖల్లో సంస్థల్లో ఫిర్యాదు చేసుకోవచ్చని కూడా అవకాశమిచ్చింది. కనక ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయిందని అనుకోలేము.
.ఇక ఈ రోజునే జగన్‌ అదే సుప్రీం కోర్టులో బెయిల్‌ కోసం తను వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. నిజంతా ఇది నిశ్శబ్దంగా జరిగిపోయిన కీలక పరిణామం.ఈడీ విచారణ జరుగుతున్నదని సాకు చెబుతున్నా అది కొత్త సంగతేమీ కాదు. కాకుంటే బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైతే రేపు సహజంగానే విడుదల చేసే అవకాశాలు సన్నగిల్లుతాయని ఆయన అనుమానించి వుండొచ్చు. లేదా ఎలాగూ బయిటకు వస్తానన్న భరోసా చిక్కి వుండొచ్చు కూడా.

. ఈ రోజునే మంత్రి పార్థసారథిపై పాత కేసు ఒకటి ఈడీ తిరగదోడడం, నాన్‌ బెయిలబుల్‌ వారంటు జారీ కావడం ఆయనకే గాక కిరణ్‌ ప్రభుత్వానికి కూడా ఒక ఎదురు దెబ్బ. దీనితో పాటే గాలి బెయిల్‌ స్కాంలో న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి పేరు మళ్లీ ముందుకొచ్చింది. జైలులో వున్న ఇప్పటికే నోటీసులు అందుకున్న వారితో పాటు ఈ తాజా అభియోగాలు కూడా రావడం చాలా తీవ్రమైన విషయం. ఎన్ని ఆరోపణలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటామంటే అది చాలా అపహాస్య భాజనం. అభ్యంతర కారణం.

2 comments:

  1. ప్రణబ్దాతో క్విడ్ ప్రోకో ఒప్పందం ఖరారయ్యాక, రేపొద్దున మరణశిక్ష వేసినా భయం లేదు, వడ్డించేవాడు మనోడే. బాగుంది. :))

    ReplyDelete
  2. చివరకు ఒక రోజున మనం కేవలం కోర్టుల చుట్టూ తిరిగే నేరగాళ్ళ లేదా నేరారోపితవ్యక్తులతో నిండిన ప్రభుత్వాలను చూడబోతున్నామా? ఇప్పటికే చట్టసభలు ఇటువంటి వ్యక్తులకు దాదాపు మెజారిటి ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. చట్టసభలకు లోపలా బయటా కూడా ఇటువంటి వ్యక్తులతోనే సమస్తరాజకీయ పార్టీలూ నడుస్తున్నాయి. కొన్ని పార్టిలనయితే అటువంటివ్యక్తులే స్థాపించి నడుపుతుంటే, మిగతావాటిలో అటువంటి వారికి స్వాగతం చెప్పే పరిస్థితీ, అటువంటి వారిని కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాసంక్షేమం దేశక్షేమం అనే వాటికి యేమీ విలువ యివ్వకుండా ప్రజాస్వామ్యం అనేమాట విచ్చలవిడిగా దుర్వినియోగపరచబడు తున్నది. ప్రజలకు రాజకీయాలంటే అసహ్యం పుట్టటం అటుంచి అవినీతి సహజమే నన్న స్థబ్దతలో వాళ్ళు కూరుకు పోయే పరిస్థితిని పన పతనోన్ముఖవ్యవస్థ కల్పిస్తున్నది! చాలా ప్రమాదకర పరిణామం యిది!

    ReplyDelete