Pages

Monday, July 23, 2012

చేనేత విషాదం నేతల వివాదం  సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సిపి గౌరవాద్యక్షురాలు విజయమ్మ నిరాహారదీక్ష, నిరసన పేరిట దానిపై టిఆర్‌ఎస్‌,జెఎసిల రభస అనవసరమైన ఉద్రిక్తతల చరిత్రలో మరో ఘట్టం అనుకోవాలి. చేనేత కార్మికులు 642 మంది వరకూ గత కొద్ది కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆకలి చావుల పాలైనారు.గతంలో తెలుగు దేశం, తర్వాత వైఎస్‌ఆర్‌ హయాంలోనూ ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించి వుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అయితే వున్న మాట చెప్పాలంటే ఇప్పుడు నిరసన అంటున్న టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా ఆ నాడు ఆ ప్రభుత్వాలలో భాగస్వాములే! కపనక ఇక్కడ జరగాల్సింది చేనేతపట్ల విధానాల మార్పు గాని ప్రాంతాల పేరిట పార్టీల ప్రయోజనాల ఘర్షణ కాదు. ఈ వారం రోజులలోనూ అసలు చర్చించని అంశమేదైనా వుందంటే అది చేనేత సమస్య పరిష్కారమే. ఇవన్నీ చూస్తుంటే టిఆర్‌ఎస్‌ గత అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోలేదనిపిస్తుంది. మూడు ప్రధాన పార్టీలు తెలంగాణాపై స్పష్టమైన వైఖరి చెప్పలేదన్నది నిజమే అయినా ఆ పేరుతో అడ్డుకోవడం ఏ విధంగా సమంజసం? వారి మాటలు ఎంత విలువ ఇవ్వాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప వారిపేరిట ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఎవరికి మేలు చేసినట్టు? పరకాల ఉప ఎన్నికలో సురేఖకు భారీగానే ఓట్లు వచ్చిన దృష్ట్యా 2009లలో కె.తారకరామారావు రెండు వందల లోపు ఓట్ల మెజారిటితో గెలిచిన సిరిసిల్లను కాపాడుకోవడంపై ప్రత్యేకంగా కేంద్రీకరించారన్నది ఒక వాదన. ఆ ఓటింగు తర్వాత తెలంగాణాలో తమ సత్తా చాటడానికి విజయమ్మ వచ్చిందనేది మరో వాదన. తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో కె.టిఆర్‌ మెజార్టి పెరిగిన మాట నిజమే అయినా ఆయన సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల 21 రోజులు సమ్మె చేసినప్పుడు వ్యవహరించిన తీరుపైనా విమర్శలున్నాయి.అప్పట్లో కార్మికులు ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు కూడా. సింగరేణిలో టిఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన మాట నిజమే గాని మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో మహేంద్రా మహేంద్ర, పెప్సీ వంటి చోట్ల ఎన్నికలలో సిఐటియు చేతులో వారి ముఖ్య నాయకులే ఓడిపోయారు. రెండు మాసాలలో తెలంగాణా వచ్చేస్తుందని కెసిఆర్‌ ఆంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోవడాలు లేఖలు రాయడం అనే ప్రశ్నలు కూడా
వస్తున్నాయి. అవన్నీ ఒకటైతే ఈ యాత్ర విషయంలో టిఆర్‌ఎష్‌ వైఖరి అంతిమంగా వైఎస్‌ఆర్‌సిపికే ఉపయోగపడలేదా? ఆలోచించుకోవాల్సిన విషయం. తెలుగు దేశం, కాంగ్రెస్‌, బిజెపి వైఎస్‌ఆర్‌సిపి ఏ పార్టీ నేతనైనా అడ్డుకోవలసిన అవసరమేమిటి? ఔచిత్యమేమిటి?వారి వారి అ వకాశవాదాలను రాజకీయ విన్యాసాలను ఎలా చూడాలన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు. అలా గాక అడ్డుకునే అజెండాలు ముందుకు తేవడం వల్ల వారిపై కేంద్రీకరణ మరింత పెరగడం, తామేదో ఘన విజయం సాధించామని వారు చెప్పుకునే అవకాశమివ్వడం అవుతుంది. అదే జరిగింది కూడా.కాకపోతే ఈ క్రమంలో విద్యార్థి యుజనలు మహిళలు పోలీసుల దెబ్బలకు గురి కావడం బాధాకరం. పార్టీలు ప్రభుత్వాలు పోలీసులు కూడా సంయమనం పాటించాల్సిన సమయమిది. రాష్ట్రంలోని నాలుగు లక్షల చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలు చాలా వున్నాయి. ఆప్కో మూలనబడటం, నూలు రసాయనాలు రంగుల ధర పెరగడం వంటి సమస్యలు చాలా వున్నాయి. 22 శాతం గుడ్డ చేనేత నుంచి వస్తున్నా నేతన్నలకు మాత్రం భద్రత లేదు. అనవసరమైన వివాదాలు ఆధిపత్య పోరాటాలు ఆపి పార్టీలు ఆ అంశంపై కేంద్రీకరిస్తే మంచిది.

No comments:

Post a Comment