Pages

Tuesday, March 13, 2012

సర్కారు సమర్థనలు- జగన్‌ వర్గం విన్యాసాలు





వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించి ఆ నాటి మంత్రులకు ఐఎఎస్‌లకు సుప్రీం కోర్టు నోటీసులివ్వడంపై ఇప్పుడు చర్చలు కేంద్రీకృతమైనాయి. ఈ సందర్భంగా అటు ప్రభుత్వ ప్రతినిధులు ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వాదనలలో ద్వంద్వత్వం బాహాటంగానే తెలిసిపోతున్నది. తమపై సాగే దర్యాప్తు ఏకపక్షమంటున్న వైఎస్‌ఆర్‌ పార్టీ వారు మంత్రులకు నోటీసులివ్వడాన్ని స్వాగతిస్తున్నారు. జగన్‌పై దర్యాప్తును హర్షిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు అదే మంత్రులను వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన ప్రభుత్వాన్ని నేరుగా కోర్టు ప్రస్తావించకపోయినా అదే ధోరణిలో మాట్లాడారు. నోటీసులు ఇచ్చింది వ్యక్తిగతంగా ఆ మంత్రులకే తప్ప ప్రభుత్వానికి కాదు. గతంలో శంకర్‌రావు పిటిషన్‌పై ఇదే సమస్యలు వచ్చినపుడు ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. కనక ఇప్పుడు సమర్థనకు దిగాల్సిన అగత్యమేమిటి? మంత్రులు తెలిసి ఈ 26 జీవోలపై సంతకాలు చేసివుంటే నైతికంగా అనర్హులు, తెలియకుండా ఇదంతా జరిగిపోయిందంటే అప్పుడు రాజ్యాంగ రీత్యా అనర్హులు. ఏమైనా వారు పదవులలో కొనసాగుతుంటే నిస్పాక్షికమైన దర్యాప్తు ఎలా జరుగుతుంది? గతంలో లిక్కర్‌ మాఫియాలో చిక్కిన వాళ్లను అధినేత సమర్థించిన తర్వాత మొదట విషయాలు బయిటపెట్టిన నున్నా వెంకట రమణ కూడా అడ్డం తిరిగిన తీరు చూశాం. ఇప్పుడు కూడా ఈ దర్యాప్తునకు అదే గతి పట్టించదల్చుకున్నారా? ఇక పొతే వైఎస్‌ఆర్‌ పార్టీవారు తమపై దర్యాప్తు కక్ష సాధింపు అంటూనే మంత్రులపై విచారణకు అంత ఆనందించాల్సిన అవసరమేమిటి? వారు చేసింది తప్పయితే వారితో పాటు తమూ మునగాలి. తాము తప్పుచేయలేదంటే అప్పుడు మంత్రులూ చేయనట్టే. ఇదే సూత్రం ఐఎఎస్‌లకూ వర్తిస్తుంది. మొత్తంపైన ఇదంతా చూస్తుంటే అవినీతి కేసులను దారి తప్పించే దాగుడుమూతలు సాగుతున్నాయా అని సందేహం మాత్రం కలుగుతుంది. కాని 2 జి స్పెక్ట్రం తదితర కేసుల పర్యవసానాలు చూసిన తర్వాత కూడా కిరణ్‌ ఆ మార్గాన్ని అనుసరించి నిందితులను కాపాడితే అప్పుడు కాంగ్రెస్‌ మరింతగా దెబ్బ తినడం తథ్యం. సిబిఐ దర్యాప్తు అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఆయన అనడం కూడా హాస్యాస్పదంగా వుంది. అవినీతి దేశాభివృద్ధికి అతి పెద్ద అడ్డంకిగా వుందని రాష్ట్రపతి,సోనియా గాందీ తదితరులంతా చెబుతున్న మాట ఆయన చెవిన పడలేదని అనుకోవాలి.

1 comment:

  1. రవిగారు, నమస్తే ! మంత్రులు తప్పు చేసినా దాని వల్ల లాభపడినవాళ్ళు కోర్టు నోటీసులు మంత్రులకి ఇవ్వడం చూసి చంకలు గుద్దుకోవటం మీరన్నట్లు
    వింతగా వుంది. తమతో బాటూ వాళ్ళనీ గోతిలోకి లాగుదాం అన్నట్లుగావుంది,ఈ తోడుదొంగల తమషా !!

    ReplyDelete