Pages

Sunday, September 16, 2012

సెప్టెంబరు 17- విమోచన దిన పాఠాలు, విపరీత వాదనలు



సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరా మూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. పదిహేనేళ్ల కిందట బిజెపి విమోచన దినానికి తనదైన మతభాష్యం తెచ్చింది.బిజెపికి బొరుసు లాటి మజ్లిస్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలుగు దేశం నాయకులూ పరిణామ క్రమం గురించిన చారిత్రిక స్పష్టత లేకుండా రాజకీయ అవసరాల మేరకు మాట్లాడుతుంటారు. చరిత్ర కారులమని చెప్పుకునే మరికొందరు కూడా గజిబిజి పెంచడానికి కారకులవుతుంటారు. సెప్టెంబర్‌ 17కు ి ముందు వెనక వీర తెలంగాణా పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన యోధుల కన్నా ఇలాటి వారి హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీటన్నిటి మధ్యనా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఎప్పటిలాగే సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం. ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన ఆ పోరాట విజయాలను కొత్తగా చెప్పనవసరం లేదు. పది లక్షల ఎకరాల పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్తాపన వగైరా ఎప్పుడూ స్మరించుకునేవే. కాకుంటే ఈనాటి రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య తెలంగాణా పోరాట సందేశం కూడా తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ పోరాట కార్యక్షేత్రం తెలంగాణానే అయినా పోరాటంలో పాల్గొన్నవారిని ప్రాంతీయ రేఖలతో,కుల మతాల కొలబద్దలకు అతీతమైంది. సెప్టెంబర్‌ 1948 సెప్టెంబరు 13న ప్రారంభమైన పోలీసు చర్యకు ఆరు నెలల ముందు - ఫిబ్రవరి26న నిజాం ప్రభుత్వ డిఐజి నవాబ్‌ దీన్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌ తమ ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు:
'' గత కొంతకాలంగా ప్రజల దృష్టి నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కల్లోలిత పరిస్తితులపై కేంద్రీకృతమై వుంది. నిజాం స్టేట్‌ ఆంధ్ర మహాసభ(మరో విధంగా చెప్పాలంటే ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీగా పరిచితం) రావినారాయణ రెడ్డి అనే కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఫలితమే ఇది. ఆయనకు 1940 నుంచి భారత కమ్యూనిస్టుపార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి.1945 తర్వాత నెమ్మదిగా
కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై 1945 నాటికి పూర్తి స్తాయి కమ్యూనిస్టుగా మారాడు. రైతు రంగంలో కమ్యూనిస్టు విధానాలు కార్యక్రమాలు సాగిస్తున్నాడు. తెలంగాణా ప్రాంతంలోని ఈ కేంద్రాలలో కమ్యూనిస్టు ప్రభావాన్ని విస్తరింపచేయడంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి నుంచి బెజవాడలోని సిపిఐ రాష్ట్ర శాఖ ప్రభావంతో మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నది. పి.సుందరయ్య,కంభంపాటి సత్యనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య,చండ్ర రాజేశ్వరరావు ఇందుకు సంబందించిన ముఖ్యనాయకులుగా వున్నారు.వీరు తరచూ ఇక్కడ పర్యటిస్తూ కమ్యూనిస్టులకు ప్రత్యేకమైన వివిధ కార్యకలాపాలను నడిపిస్తున్నారు.కిసాన్‌ యాత్రలు, పశు ప్రదర్శనలు, బుర్రకథల వంటివి నిర్వహిస్తున్నారు.
గడచిన రెండున్నర సంవత్సరాలలోనూ నిజామాంధ్ర మహాసభ దేశ్‌ముఖులు వతన్‌ దార్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించింది.1945 డిసెంబరు నుంచి ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రెవెన్యూ పోలీసు శాఖల వారికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నది.ఈ కాలమంతటా కూడా వారి ఉద్యమానికి బెజవాడ నుంచి ప్రచురితమయ్యే తెలుగు పత్రిక ప్రజాశక్తి మద్దతునిచ్చింది. ఈ పత్రికలో నిజాం స్టేట్‌, బెజవాడ కమ్యూనిస్టులు ఉభయులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అతిశయోక్తులతో కూడిన రాతలు రాస్తున్నారు.''

దాదాపు 40 పేజీల ఈ నివేదిక నిండా కమ్యూనిస్టులపై నిందారోపణలు మాత్రమే గాక కమ్యూనిస్టుల దాడులంటూ కట్టలు కట్టలు జాబితాలు ఢిల్లీకి పంపించారు. నిజాం రజాకార్ల రాక్షస హత్యాకాండకు తలవంచని ఆ పోరాటాన్ని అణచేందుకే కేంద్ర సైన్యాలు దిగాయన్నది వీటన్నిటిలో రుజువయ్యే సత్యం. ఈ విషయంలో కాంగ్రెస్‌ వ్యూహమేమిటో ౖ పుచ్చలపల్లి సుందరయ్య చాలా స్పష్టంగా రాశారు:
'' స్వదేశీ సంస్థానాలను వాటి పాలకులైన రాజకుమారులను నవాబులను రద్దు చేయాలని పొరుగునే వున్న భాషా ప్రాంతాలలో విలీనం చేయాలని వివిధ జాతులకు నిజమైన ప్రజాతంత్ర వ్యవస్థ ఏర్పర్చాలని, స్వతంత్ర ప్రజాతంత్ర భారత సమాఖ్యను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వమూ దాని కాంగ్రెస్‌ నాయకులూ ఏ నాడూ ఆసక్తి ప్రదర్శించలేదు.వారు కోరుకున్నదల్లా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల నుండి అధికారాన్ని వారసత్వంగా పొందాలనీ, తమ స్వంత పెట్టుబడిదారీ(లాభార్జన లక్ష్యంగా గల పారిశ్రామికీకరణ) భూస్వామ్య దోపిడీని పెంపొందించాలని మాత్రమే.వారు స్వదేశీ సంస్తానాలలో ప్రజా పోరాటాలను పెంపొందించనూ లేదు. ప్రోత్సహించనూ లేదు.సర్వదా సంస్థానాధీశులను బుజ్జగించడానికి పూనుకున్నారు....... బ్రిటిష్‌ వాళ్లు భారత భూభాగంలోని స్వదేశీ సంస్థానాలన్నిటికీ భారత దేశంలో గాని పాకిస్తాన్‌లో గాని చేరడానికి లేదా స్వతంత్రంగా వుండిపోవడానికి అవకాశమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దుస్తంత్రాన్ని అధిగమించడానికి సంస్తానాధీశులు భారత యూనియన్‌లో చేరేలా ఒత్తిడి చేయడానికి మాత్రమే కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు...''
ఈ కారణంగానే నైజాం భారత యూనియన్‌లో చేరడానికి నిరాకరించినా నిర్యుద్ధ సంధి చేసుకుని ఆయుధాలను అందించారు. వీటిని ఉపయోగించుకునే రజాకార్లు ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. అయినా ప్రజా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలోనే సెప్టెంబర్‌ 13వ తేదీన జనరల్‌ జెఎన్‌చౌదరి నాయకత్వంలో పోలీసు చర్య ప్రారంభమైంది, కమ్యూనిస్టులను అణచివేయడం నీవల్ల కాదని నైజాంకు చెప్పి మరీ సైన్యాన్ని పంపించారు. వాస్తవానికి ఒకటి రెండు చోట్ల తప్ప నిజాం సైన్యాలు రజకారులు ప్రతిఘటించింది లేదు. అందుకే అయిదు రోజుల్లోనే 17 నాటికి నైజాం పూర్తిగా లొంగిపోయాడు. ఆ తర్వాత పదిహేను రోజులలోన అంటే సెప్టెంబరు నెలాఖరుకల్లా జెఎస్‌చౌదరి సైనిక ప్రభుత్వం కమ్యూనిస్టులపై ప్రజలపై హంతక దాడి ప్రారంభించింది. వివిధ ప్రాంతాలలో వందలాది సైనికులతో పెద్ద శిబిరాలు ఏర్పాటుచేశారు. గ్రామాల నుండిపారిపోయిన దేశ్‌ముఖ్‌లను ప్రజా శత్రువులను కాంగ్రెస్‌ వలంటీర్లను తీసుకొచ్చి వారి పెత్తనాన్ని పున:స్థాపితం చేసేందుకు కారకులయ్యారు. ప్రతి సైనిక శిబిరం పక్కనే కాంగ్రెస్‌ కార్యాలయం ఏర్పాటైంది! సైనిక దళాలకు లొంగిపోవాలని కమ్యూనిస్టు యోధులను పట్టివ్వాలని ప్రజలను కోరుతూ బెదిరిస్తూ వూరూరా తిరిగారు.
ఆ విధంగా పోలీసు చర్య అనేది కూలిపోతున్న రాజును రాజప్రముఖ పట్టంతో అభిషేకించి అంతకు ముందు కన్నా క్రూరంగా పోరాట వీరులను వూచకోత కోసే వున్మత్త హత్యాకాండకు వొడిగట్టింది. జనం తరిమేసిన దొరలకు కాంగ్రెస్‌ టోపీలు పెట్టి గడీల్లో పున:ప్రతిష్టించింది. తెలంగాణా జపంతో నాటి దొరల వారసత్వం కొనసాగడానికి బీజాలు అక్కడే వున్నాయి. నిజాం రాజ్యం కూలిపోవడం కలసి పోవడం వెనక ఇంత చరిత్ర వుంది. ఈ సారాంశం చూడకుండా పోలీసు చర్యనే విమోచన దినం అంటే చరిత్ర పరిహసిస్తుంది. సరోజిని నాయుడు తనయుడైన డా.జయసూర్య ఆరువారాల వ్యవధి ఇస్తే శాంతి స్థాపన చేయగలనని కోరితే జనరల్‌ చౌదరి అహంకారంతో ఆ లోపునే కమ్యూనిస్టులను అణచివేస్తానని ప్రగల్భాలు పలికాడు. కాని 1951లో పోరాటం విరమించిన తర్వాత జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులే అఖండ విజయం సాధించారు.
విమోచన కాదు విలీనం అనేది మరో వాదన. ఉత్తరాంధ్ర జిల్లాలను ఫ్రెంచి వారికి తర్వాతకట్టబెట్టడంతో మొదలుపెట్టి రాయలసీమను దత్తమండలం చేసేంత వరకూ కూడా తెలుగు ప్రజలను చీలికలు పేలికలు చేసింది నిజాం నిరంకుశత్వం. బ్రిటిష్‌ వారి పాదాల ముందు మోకరిల్లి స్వాతంత్రాన్ని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అప్పగించడమే కాదు, స్వతంత్రంగా పోరాడే టిప్పు సుల్తాన్‌ వంటివారిని తుదముట్టించేందుకు సహకరించిన దోషులూ ద్రోహులూ ఆ పాలకులు.. కనుక విప్లవ భాషణంతో కొందరు మేధావులు ''స్వతంత్ర'' నిజాంను బలవంతంగా విలీనం చేసినట్టు చెప్పడం వితండ వాదనే. నిజాం కూలడంతోనే స్వాతంత్రం, సమైక్యత సహజ సిద్ద పలితాలుగా సంక్రమించాయి. కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి మితవాద నాయకులు ఈ క్రమాన్నికాలడ్డం పెట్టడానికి ప్రయత్నించినా కాలం తోసిపుచ్చి తెలుగు జిల్లాలను ఒకటి చేసింది. ఇది రెండో వాదన సంగతి.
ఇక సెప్టెంబరు 17, 1998లో ఎల్‌కెఅద్వానీని సమక్షంలో రాజకీయ హడావుడి మొదలెట్టింది బిజెపి. ి బిజెపికి లేదా సంఘ పరివార్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతోగాని ఏ ఫ్యూడల్‌ వ్యతిరేక ఉద్యమాలతో గాని ఏ మాత్రం సంబంధం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక జునాగడ్‌ పాకిస్తాన్‌తో కలవడానికి మంతనాలు జరిపితే, కాశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ప్రయత్నించాయి. వీటికి ి ప్రతిరూపం లాటి రామరాజ్య పరిషత్‌ హిందువనే ఒకే కారణంతో కాశ్మీర్‌ రాజు కుట్రలకు వంతపాడింది! చరిత్ర తిరగేస్తే దేశానికి ద్రోహం చేసిన రాజులలో మీర్జాఫర్లూ వున్నారు, జయ చంద్రులూ వున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మత ప్రాతిపదిక తప్ప మానవ సమానత,లౌకిక కొలబద్దలు మతతత్వ రాజకీయాలకు అక్కర్లేదు.
అందుకే నిజాంను గద్దె దించడమే తప్పన్నట్టు మజ్లిస్‌ చేసే వాదన కూడా చాలా పొరబాటు. నిజాం ప్రజాస్వామ్య విలువలను కాలరాసి ప్రజలను వెట్టిచాకిరీకి గురి చేశాడు గనకే వ్యతిరేకించి పోరాడాల్సి వచ్చింది. ఇప్పటికీ ముస్లిం జన బాహుళ్యం దారుణ దారిద్య్రంలో జీవిస్తుండడంలోనే ఈ సత్యం వెల్లడవుతుంది. తెలంగాణా సాయుధ పోరాటంలో ఎందరో ముస్లిం నేతలు కీలక పాత్ర వహించారనేది బిజెప,ి మజ్లిస్‌ కూడా కాదనలేని వాస్తవం. నిజాంను నీ గోరి కడ్డం కొడకో అని హెచ్చరించింది నాటి తెలంగాణా పోరాట వీరులైతే నీ గోరికాడికొచ్చి నేను మొక్త కొడకో అన్నట్టు మాట్లాడేది కెసిఆర్‌. ఆయన తరచూ నిజాంను కాటన్‌ దొరతో పోల్చి ఏదో చెబుతుంటారు. ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన కాటన్‌ స్పష్టంగా పరాయి పాలకుల ఉద్యోగి. ఆయన తానొగా ఎవరినీ వెట్టిచాకిరీలో పీడించిన దాఖలాలు లేవు. కాదు, నిజాం గొప్పవాడేనని ఒప్పుకుంటే అంత గొప్పవాణ్ని పడగొట్టడం 'విమోచనం' ఎలా అవుతుంది?
ఆ నాడు పోలీసు చర్యకు, అనంతర నిర్బంధానికి కారణమైన కాంగ్రెస్‌ తర్వాత కాలంలో రకరకాలుగా ప్రాంతీయ ప్రజ్వలనాలకు కారణమైంది. గత రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. ఆ కాంగ్రెస్‌పై ఆశలు పెట్టుకుని గడువులు ప్రకటించేవారు కూడా విమర్శలనెదుర్కొంటున్నారు. ఏది ఏమైనా .ఈ హడావుడి చేసే వారెవరూ అసలు వీర తెలంగాణా సాయుధ పోరాటానికి నేతృత్వం వహించి అశేష త్యాగాలు చేసిన కమ్యూనిస్టులను పాత్రను పట్టించుకోకపోగా అపార్థాలు వ్యాప్తి చేస్తుంటారు. తెలంగాణా చరిత్ర సంసృతి అంటే మౌలికంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటమే. నాటి భూస్వామ్య దొరల వారసులైనా నేటి కార్పొరేట్‌ కామందులైనా దానికి ప్రతినిధులు కాజాలరు.సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలనే కోర్కెను కూడా ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. కనకనే ఈ సందర్భంలో చ రిత్ర సారాన్ని సరైన కోణంలో అర్థం చేసుకుని ఆ బాటలో నేటి పోరాటాలకు సమాయత్తమవడమే ప్రజాస్వామిక శక్తుల కర్తవ్యం.



8 comments:

  1. మీ వ్యాసం మొత్తం చదివాను. కాని ఇంతకూ మీ ఉద్దేషంలో ఇది విమోచనా,విలీనమా లేక విద్రోహమా అనేది ఎక్కడా కనబడలేదు. అసలు ప్రత్యక్షంగా పోరాటం జరిపింది రావినారాయణరెడ్డి, భీమిరెడ్డి నాయకత్వంలోని కమ్యూనిస్టులు కాగా మీరు బెజవాడ కమ్యూనిస్టులను హైలైట్ చెయ్యడానికి ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. వీరు ఏనాడూ చల్లపల్లి రాజా, ఇతర ఆంధ్రా జమీందార్లపై పోరాటం చేసిన దాఖలాలు కనబడవు. వీరిని తెల్లకమ్యూనిస్టులంటారని ఈమధ్యనే తెలిసింది.

    మీవ్యాసం ఏవిధంగానైతే విమోచనో, విద్రోహమో తేల్చలేకపోయిందో అలాగే కొన్నివిషయాలను నలుపూ, తెలుపుల్లో విడదీయలేం, అవి ఎక్కడో మధ్యలో ఉంటాయని నా అభిప్రాయం. నిజామ్ను తెరాస వెనకేసుకు రావడం కేవలం ప్రాంత అభివృద్దికే పరిమితం. నిజాం ప్రజలపై నిరంకుశంగా వ్యవహరించినా ప్రాంత అభివృద్ధిలో ప్రస్తుత ఆంధ్రదొరలపాలన కంటే నిజాం పాలన నయం కాదా? ఇప్పటి పాలనను విమర్శించడంకోసం నిజాంపాలనే నయం అంటే నిజాం చేసిన అన్ని దౌష్టీకాలనూ సమర్ధించినట్లు ఎలా అవుతుంది? పెనం మీంచి పొయ్యిలో పడితే పెనమే నయం అనుకుంటాం, ఇదీ అలాగే. కాలం గడుస్తున్నకొద్దీ ప్రపంచంలో అన్ని చోట్లా నిరంకుశత్వం పోయింది. ఇప్పుడు తెలంగాణలో నిజామే రాజుగా ఉన్నా పాలనలో నిరంకుశత్వం ఉండేది కాదు. కనుక నిజాం దౌష్టీకాన్ని బూచిగా చూపి ఇప్పటి పాలకుల వివక్షను వెనకేసుకు రావడం అవకాశవాదం.

    తెలంగాణ సాయుధపోరాటంపై మాట్లాడే హక్కు బీజేపీకీ, కాంగ్రేస్కూ లేనట్లే బెజవాడ తెల్లకమ్యూనిస్ట్లులవారసులకూ ఉండదు. ఆహక్కు అప్పటి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న తెలంగాణా కమ్యూనిస్టుల వారసులకు మాత్రమే ఉంటుంది. వారిలో అనేకులు ఇప్పటి తెలంగాణా ఉద్యమంలో అనేక ప్రజాసంఘాలతరఫున ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కాలం గడిచేకొద్దీ ఎందరో నాటి తెలంగాణ కమ్యూనిస్టులు కమ్యూనిస్టుపార్టీలను వదిలివేశారు భీమిరెడ్డితో సహా. బహుషా ఇప్పుడు రావినారాయణ రెడ్డి బ్రతికుంటే ఆయన కూడా కమ్యూనిస్టు పార్టీనుండి బయటికి వచ్చేవాడేమో. వారు ఏపార్టీలో ఉన్నా నాటిపోరాటంపై పేటెంటు ఉన్నది వారికే.

    ReplyDelete
  2. తెలంగాణ సాయుధ పోరాటం మొదలయింది నిజాం పాలనకు వ్యతిరేకంగా కాదు, నాటి దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా. ఆ దొరలకు నిజాం మద్దతు ఉన్న కారణంగా పోరాటం నిజాంపైకి మల్లింది. మీరు చెప్పినట్లు సైనికచర్యతరువాత భారతప్రభుత్వం ఈదొరలను గడుల్లో, తరువాత అసెంబ్లీలో ప్రతిష్టించింది. నాడు నిజాంకు తొత్తులుగా వ్యవహరించిన ఈదొరలు నేడు తమ అధికారంకోసం ఆంధ్ర పాలకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈదొరలను వదిలించుకోవాలంటే ముందు ఈఆంధ్రపాలకుల పాలననుండి బయటపడాలి, ఇప్పుడు తెలంగాన ఉద్యమకారులు చేస్తుంది అదే. దానికి మీవంటి కమ్యూనిస్టులు మద్దతు తెలపకపోవడం మీద్వంద్వ వైఖరిని సూచిస్తుంది.

    ఇప్పటి ఉద్యమంలో కొందరు నాటి దొరలు ఉండొచ్చు, కేసీఆర్ స్వయంగా దొర అయ్యుండొచ్చు.. కానీ దొరల పాలన అంతం కావాలంటే అది సమైక్యాంధ్రలో సాధ్యం కాదని ఇక్కడి ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఇక్కడి దొరలకంటే సీమాంధ్ర ఫాక్షన్, జమీందారీ, పెట్టుబడిదారీ వర్గం బలవంతమయినది. ఈసత్యం సీపీఎం నాయకులకు తెలుసనుకుంటాను.

    ReplyDelete
    Replies



    1. విశ్వరూప్‌,

      1. నా వ్యాసం చదివిన తర్వాత కూడా నిజాం పాలన కూలిపోవడం విమోచన అవునో కాదో అని మీలో సందేహం మిగలడం ఆశ్చర్యకరం.ఆ విమోచన సైన్యం వల్ల కాదు, అంతకు ముందు సాగిన సాయుధ పోరాట ఫలితం.
      2.నెహ్రూ సైన్యాలు పోరాడుతున్న ప్రజలపై దాడి చేయడం విద్రోహం వంటిదే. కాని కొంతమంది అంటున్నట్టు నిజాం విలీనం విద్రోహం కాదు.

      3.మీరు ఆంధ్ర పెత్తందార్లు, తెలంగాణా పెత్తందార్లు అంటే చెప్పగలిగింది లేదు. ఎక్కడైనా పీడకులు పీడకులు. తెలంగాణా పోరాటానికి ముందు పీడించిన వారు తర్వాత తిరిగి వచ్చి తిష్ట వేసిన వారు ఎవరు? మీరే ఆలోచించండి.
      4. ఉత్తరాంధ్రలో మందసా, చల్లపల్లి, మునగాల వంటి చోట్ల మొదలైన జమీందారీ వ్యతిరేక పోరాటాల ప్రభావం తెలంగాణాపైనా పడటం సహజం. ప్రపంచ స్థాయిలోనే అది గొప్ప పోరాటమని నేను ఎప్పుడూ చెబుతున్నాను.అయితే అందులో అన్ని ప్రాంతాల వారూ పాల్గొన్నారు.మీరు పేర్కొన్న బిఎన్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి ఆత్కకథలు చదవండి. వారికి ప్రేరణ ఎవరో శిక్షణ ఎవరు ఎక్కడ ఎచ్చారో తెలుస్తుంది. ఇప్పటి రాజకీయ వాదోపవాదాలలో పడి గత చరిత్ర సారాన్ని తప్పుగా అన్వయించకండి.
      5.కెసిఆర్‌ దొర అని మరొకటి అని నేనెప్పుడూ రాయను.ఎందుకంటే వ్యక్తిగత వ్యవహారాలు అవసరం లేనివి. అయితే ప్రాంతీయ నినాదం వెనక చాలా మంది ఫ్యూడల్‌ దొరలున్నారనేది నిజం, ప్రజల మనోభావాలు బలపడటం ఆ క్రమంలో జరిగింది గనక దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసిందే. ఆనాడు తెలుగు జిల్లాల ఏకీకరణను వ్యతిరేకించిన అతికొద్ది మంది అలాటి వారేనన్నది నిజం. ఇప్పటి రాజకీయాలు ఇప్పటివి. అయితే ఇప్పుడు కూడా అలాటి వారున్నారు. సమైక్యత అనే వారిలోనూ కొందరికి వారి రాజకీయ ప్రయోజనాలున్నాయి. సిపిఎం వంటి పార్టీకి దాని దేశ వ్యాపిత విధానాలున్నాయి. సిపిఎం రెండు చోట్ల రెండు రకాల మాట్లాడటం లేదు కదా.. ఇందులో ద్వంద్వత్వమేముంది? తెలంగాణా లేదా రాయలసీమ ఏదైనా రాజకీయ పరమైన నినాదమే తప్ప బ్రహ్మ పదార్థం కాదు, సర్వరోగనివారిణి అంతకన్నా కాదు. ఆ పేరిట జరిగిన, జరిగే రాజకీయ విన్యాసాలను అర్థం చేసుకోకపోతే ప్రజలు మరో సారి దెబ్బ తినొచ్చు.కనకనే ఇన్ని వివరణలు.

      Delete
    2. రవిగారూ,

      మీ సమాధానానికి ధన్యవాదాలు.

      /** ఆ విమోచన సైన్యం వల్ల కాదు, అంతకు ముందు సాగిన సాయుధ పోరాట ఫలితం. **/

      మీరే చెప్పినట్లు సైనికచర్య తరువాత భారతప్రభుత్వం తిరిగి దొరలను అసెంబ్లీలో ప్రతిష్ఠించింది, కమ్యూనిస్టులు ఆక్రమించిన జాగీర్లను లాక్కుంది. ఇంకా విమోచన ఎక్కడ జరిగినట్టు? విమోచనలో కమ్యూనిస్టుల పాత్ర నిస్సందేహమైనా అది లక్ష్యం చేరుకోలేదు కదా?

      /** మీరు ఆంధ్ర పెత్తందార్లు, తెలంగాణా పెత్తందార్లు అంటే చెప్పగలిగింది లేదు. ఎక్కడైనా పీడకులు పీడకులు **/

      నిజం. కానీ తెలంగాణ ప్రజలు వోటుహక్కు వినియొగించుకుని తెలంగాణ దొరలను వదుల్చుకోగలరు, ఆంధ్ర దొరలను వదుల్చుకోవడానికి విడిపోవడం తప్ప మార్గమేముంది?

      పాలకుల దోపిడీకి ప్రాంతీయభేధం ఉండదు అని మీబ్లాగులో మీరు చెప్పగా అనేకసార్లు చూశాను. అది కొంతవరకు మాత్రమే వాస్తవం. దోపిడీ చేసేవాడైన వోట్లకోసం ఎంతోకొంత మేలు చెయ్యకతప్పదు, అధికారం ఒకప్రాంతం వారి గుప్పిట్లో ఉన్నప్పుడు పాలకులు ఆప్రాంతానికే అభివృద్ధి చేస్తారు. ఇటీవలి ఉదాహరణలు డేడ్‌స్టోరేజీదిగువన ఉన్న సాగర్ నుండి డెల్టాకు నీటి విడుదల, మెడికల్ సీట్ల వ్యవహారం.


      /** తెలంగాణా లేదా రాయలసీమ ఏదైనా రాజకీయ పరమైన నినాదమే తప్ప బ్రహ్మ పదార్థం కాదు, సర్వరోగనివారిణి అంతకన్నా కాదు. **/

      తెలంగాణ కేవలం రాజకీయ నినాదం కాదు, అది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నాటి సీపీఐ అర్ధం చేసుకుంది గానీ సీపీఎం అర్ధం చేసుకోవడంలో విఫలమవడం శోచనీయం.

      /**అయితే ప్రాంతీయ నినాదం వెనక చాలా మంది ఫ్యూడల్‌ దొరలున్నారనేది నిజం**/

      కొద్దిమంది ఫ్యూడల్ దొరలు ఉన్నంటే ఉద్యమంలో బీద బడుగుల పాత్ర తక్కువవుతునదా? నిజానికి ఇప్పుడు ఉద్యమం నడిపిస్తుంది రాజకీయపార్టీలకన్నా అనేక ప్రజాసంఘాలకు చెందిన బీద బడుగు వర్గాలన్నది వాస్తవం కాదా?

      /**రెండు రకాల మాట్లాడటం లేదు కదా.. ఇందులో ద్వంద్వత్వమేముంది? **/

      ద్వంద్వత్వం అన్నది అందుకు కాదు, దోపిడీని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటూ పాలనలో వివక్షను చూసీచూడనట్లు వ్యవహరించడం.

      Delete


    3. మీరు వాస్తవానికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి మరో వైపు పోతున్నారు. ఇప్పుడు అదే పనిగా సాగుతున్న వాదనల ప్రభావమే అందుకు కారణమై వుంటుంది. మూడు ముక్కలు మాత్రం చెప్పి ముగిస్తాను.

      1.ఖచ్చితంగా విమోచన భాగం వుంది. ఎందుకంటే అంతకుముందు మాదిరిగా గడీల్లోంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం అంతమైంది,. అలాగే ఫ్యూడల్‌ రాజ్యం కూడా కాలగర్భంలో కలిసి పోయింది. విద్రోహం దేనికంటే తర్వాత దాడులకు గురైన ప్రజలకు.
      2.మీరే కాదు, చాలామంది మాటలు వింటుంటాను. తెలంగాణా నేతలు మాత్రమే తమ ప్రజలకు ద్రోహం చేసినట్టు ఇతర ప్రాంతాల నేతలు అక్కడి ప్రజలపై పక్షపాతం చూపించినట్టు భావిస్తుంటారు. ఇద్దరి స్వభావాలు మౌలికంగా ఒకటే. భౌగోళిక చారిత్రిక కారణాల వల్ల కలిగే ప్రయోజనాలు తప్ప ఏ నాయకులు తమ ప్రాంతాల వారికి వొరగబెట్టింది లేదు వారికి కావలసింది వారి పదవులు ప్రయోజనాలు తప్ప ప్రజలు కాదు. అన్నిచోట్లా అంతే. సీమాంధ్ర నేతలుగా విమర్శించే వారిని అనుకోకుండానే మీరు ే ఎక్కువ ప్రాంత భక్తులను చేస్తున్నారు. అలాటిదేమీ లేదు. మన్మోహన్‌ సింగ్‌ విదేశీ శక్తులకు లొంగిపోయినట్టే మనుగడ కోసం వీరంతా ఏదైనా చేస్తారు.
      3.చరిత్రలో పై వర్గాలు తమ లక్ష్య సాధనకోసం ముందుంచింది బడుగులనే అని ఎప్పుడూ మర్చిపోకండి. వారిని చూపించి తమ పబ్బం గడుపుకొంటారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలు లేరని నేనెక్కడా చెప్పలేదు. అంతమాత్రాన అది దోపిడీపై పోరాటం కాదు. విశాలాంధ్ర కోసం పోరాడినప్పుడు కూడా అది విప్లవోద్యమం అని గాని తమిళులకు వ్యతిరేకం అని గాని కమ్యూనిస్టులు ఎప్పుడూ అన్నది లేదు. ఇప్పుడు విభజన కోరడం కూడా ఒక పరిమితమైన కోర్కె తప్ప సమూల పరిష్కారం కాదు.(కొన్ని కొత్త సమస్యలూ రావచ్చు.) నాటి చెన్నారెడ్డి నుంచి నేటి పెద్దల వరకూ.. స్వార్థ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమే. అలాగే సరిహద్దు రేఖ దాటగానే సమైక్య నినాదం చేసే వారి మాట కూడా అంతే. కనకనే ఆ పేరిట రాజకీయాలు నడిపేవారి వలలో పడడం గురించే హెచ్చరించడం.

      Delete
    4. చల్లపల్లి, మానుగుల & ఇతర ఆంద్ర ప్రాంతాలలో కూడా కమ్యూనిస్టులు దొరలను ఎదిరించారు. అయితే అప్పటి మదరాసు ఆంతరంగిక వ్యవహారాల హోదాలో ఉన్న టంగుటూరి ప్రకాశం గారు వాటిని పోలీసు బలగంతో అణిచి వేసారు. బహుశా ఈ విషయం విశ్వరూప్ గారికి తెలియదేమో?

      ఈరోజు తెలంగాణా రాష్ట్రానికి అడ్డం పడుతున్న కమ్యూనిస్టులకు కొన్ని ప్రశ్నలు:

      1. కమ్యూనిస్టు పోరాటాన్ని అణిచి వేయడానికి విఫల ప్రయత్నం చేసిన నిజాము & రజాకారులు మాత్రమె మీరు ఎందుకు ఆడిపోసుకుంటారు? ఆంధ్రలో కమ్యూనిస్టులను ఊచకోత కోసిన టంగుటూరి గారిని ఆంద్ర కేసరి అంటూ నెత్తికి ఎక్కించుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు?
      2. మునగాల దివాను కొమర్రాజు లక్ష్మణరావు గారి గ్రంధాలయ ఉద్యమం మాత్రమె మీకు గుర్తుందా? మీ కామ్రేడులను విచ్చలవిడిగా చంపించినా, ఆయన మీకు ఆరాధ్యుడు ఎలా ఎవుతాడు?
      3. తెలంగాణా సాయుధ పోరాటానికి ఆంద్ర ప్రాంతంలోని కమ్యూనిస్టేతర నాయకులు ఒక్కరయినా సమర్తించారా? టంగుటూరి, అయ్యదేవర, తెన్నేటి లాంటి నాయకులు కనీసం తటస్థంగా కూడా ఉన్నారా లేదే? ఆ విషయాన్ని మరిచిపోయి విశాలాంధ్ర పేరుతొ వారితో చేతులు ఎందుకు కలిపారు?
      4. హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగేతరులు సాయుధపోరాటంలో క్రియాశీలక పాత్ర వహించారనేది వాస్తవం కాదా? మఖ్దూం, రాజ్ బహదూర్ గౌర్, కే.ఎల్. మహేంద్ర, వీ.డీ. దేశ్పాండే (పీ.డీ.ఎఫ్ సభాపక్ష నాయకుడు, హైదరాబాదు రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనాయకుడు) గార్లకు కమ్యూనిస్టు సిద్దాంతం ముఖ్యమా లేదా తెలుగు జాతి ఐక్యత ముఖ్యమా?
      5. దొరపెత్తనానికి ఒరిగిన మొదటి యోధుడు బందగీ, నిజాము నిరంకుశానికి బలి అయిన షోయెబుల్లా ఖాన్, నిజాముపై విఫల హత్యాప్రయత్నం చేసి చెరసాలలో మగ్గిపోయిన నారాయణ రావు పవారు లాంటి దేశభక్తులకు తగినంత గుర్తింపు రాకపోవడానికి కారణాలు ఏమిటి? వారు తెలుగేతరులు కావడం, పైగా కామ్రేడులు కాకపోవడమే వారు (& మేము) చేసుకున్న పాపమా?
      6. తెలంగాణా ఉద్యమంలో దొరలు ఉన్నారని నిందలు మోపే ముందు ఈ ప్రశ్నలు కూడా పరిశీలించండి. సాయుధ పోరాటంలో దొరలు లేరా? రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి భూస్వాములు కారా? జయసూర్య గారిది అరిస్తోక్రాట్ కుటుంబం కాదా? ఆనాడు ఈనాడు కూడా విశాలాంధ్రవాదులు అనేకులు భూస్వామ్య వర్గానికి చెందినవారు కాదా? డిసెంబర్ 10 ఆరాచక నాయకులు దాదాపు అందరూ దొరలు కాదా?

      కమ్యూనిస్టుల విశాలాంధ్ర వాదానికి కారణం "జాతుల సమస్య" అనే స్టాలిన్ పాంఫ్లెట్ మాత్రమె. This document is virtually obsolete in today's context. Moreover being an interpretation paper, this can't be called a core Marxist principle. I am yet to come across any red who can justify opposing Telangana on grounds drawn from original Marx/Engels/Lenin thoughts. FYI Stalin has never seriously been called an ideologue (except in his lifetime when not to do so would mean a trip to Siberia).

      Delete


    5. గొట్టిముక్కల గారూ,

      మీరు వేసిన ప్రశ్నలన్నిటిలోనూ అసహనం తప్ప అవగాహన కనిపించడం లేదు. ఆంధ్ర కేసరి అన్నది కమ్యూనిస్టులు కాదు, మహాత్ముడన్నదీ వారు కాదు. ప్రకాశం ఆర్డినెన్సును ప్రజాశక్తి నగర్‌పై దాడిని కమ్యూనిస్టులు ప్రతి సందర్భంలోనూ ఖండిస్తూనే వున్నారు. తర్వాత ఆయన కమ్యూనిస్టులతో కలసి ఫ్రంట్‌ కట్టారు. మరికొన్నాళ్లకు కాంగ్రెస్‌లో కలసి పోయి మొదటిముఖ్యమంత్రి అనిపించుకున్నారు(ఎందుకంటే అప్పటికే ఆయన బాగా వృద్ధులు. నీలం సంజీవరెడ్డిదే పెత్తనంగా వుండేది) ఇవన్నీ అవకాశవాద రాజకీయాల్లో భాగం.దీనికి ప్రాంతాల రాష్ట్రాల తేడాలు లేవని గుర్తించండి. ప్రతిదీ ప్రాంతాల ప్రకారమే జరుగుతుందన్న మీ ఆలోచన సరికాదు. నిజానికి నిజాంపై పోరాటానికన్నా ముందే మందసా చల్లపల్లి వంటి చోట్ల జమీందారీ వ్యతిరేక పోరాటాలు జరిగాయి. వారూ వీరూ కూడా కాంగ్రెస్‌లోనే దూరారు. తర్వాత అన్ని చోట్లా వారే రాజ్యం చేసి అన్ని ప్రాంతాలకూ అన్యాయం చేశారు. ఎవరైనా తెలంగాణా రాష్ట్ర విభజన నిరభ్యంతరంగా కోరుకోవచ్చు. కాని అలాటి నినాదాల మాటున సాగే కుటిల రాజకీయాలను కూడా గుర్తించాలి.

      Delete
  3. కొన్ని కొత్తవిషయాలు తెలిశాయి. బాగా వ్రాశారు. అభినందనలు.

    ReplyDelete