Pages

Friday, September 21, 2012

టిఆర్‌ఎస్‌ విలీనం వార్తల నేపథ్యం



కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనమవుతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా బలంగా చలామణి అవుతున్నాయి. వీటి వెనక ఎవరున్నారనేది ఒకటైతే రెండు పార్టీలూ వీటిని ఖండించేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడమే ఆసక్తి కలిగించే అంశం. మాది తెలంగాణా సాధన అనే ఏకాంశ పార్టీ గనక అందుకు అంగీకరిస్తే విలీనానికి అభ్యంతరమేమిటన్నది టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలే చాలా సార్లు అన్నారనడానికి ఈ బ్లాగరు కూడా సాక్షి. ఇటీవలి పది రోజులలోనూ కాంగ్రెస్‌ నేతలే అనేక ప్రతికూల ప్రకటనలు చేసినా కెసిఆర్‌ మాత్రం ఆ పార్టీపై అంతులేని విశ్వాసం వెల్లడిస్తూనే వున్నారు. నమస్తే తెలంగాణా పత్రికలోనూ ఆ విధమైన కథనాలే నిత్యం ప్రత్యక్షమవుతున్నాయి. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, వాయిలార్‌ రవి, షిండే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి అందరి వ్యాఖ్యలూ ప్రతికూల దిశలో వున్నప్పుడు టిఆర్‌ఎస్‌ ఆశాభావానికి ఆధారాలు తెలియదు. ఇక పోతే కెసిఆర్‌ తనను కలిసిన విషయంలోనూ విలీనంపైనా కూడా వాయిలార్‌ రవి కాస్త పలచనగా మాట్లాడినా స్పందన కరువైంది. ఆ తర్వాత ఏకంగా అఖిలపక్ష సమావేశం సంకేతం మళ్లీ మొదటికి తెచ్చింది. ఏదో జరగబోతుందని కావాలని కథనాలు గుప్పించడం వెనక 30 వ తేదీ మార్చ్‌ ని మెత్తబర్చేప్రయత్నమే వుందన్నది స్పష్టమవుతుంది. ఇలాటి చిట్కాలు గతంలో చాలా జరిగాయి. డిసెంబర్‌ 9 ప్రకటన గురించి ముఖ్యమంత్రిని అడిగితే 1969లో కూడా ఇందిరా గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు.తెలంగాణా విభజనపై జరుగుతుందనే నమ్మకం లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శిసురవరం సుధాకరరెడ్డి కెసిఆర్‌తో మాట్లాడిన తర్వాతనే చెప్పారు. హైదరాబాదులో నన్ను కలిసిన టిఆర్‌ఎస్‌ నేతలు, మీడియా మిత్రులు కూడా కెసిఆర్‌ ధోరణిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే వున్నారు.ఒక చిన్న భాగం మాత్రమే ఆయన విశ్వాసంలో పాలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌ మరోసారి మాయచేస్తే మన గతి ఏమిటని గులాబీ నేతలు అడుగుతున్నారు. హరీష్‌ రావు వంటి ప్రముఖ నాయకుడు కొంత వరకూ స్వంత వ్యూహంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. ఈ మల్లగుల్లాల మధ్య గురువారం ఎన్‌డిటివి విలీనం వార్తను విడుదల చేసింది.శుక్రవారం ఫ్రధానంగా హెచ్‌ఎం టివీ నా వ్యాఖ్యలు కోరితే వాటిలో ఆశ్చర్యం లేదన్నాను. ప్రజారాజ్యం ను కలుపుకొన్నట్టే ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను కూడా కలిపేసుకోవాలన్న కాంగ్రెస్‌ పాచిక పారుతున్నట్టే చాలా మంది భావిస్తున్నారు. వాస్తవంగా ఏమవుతుందో చూడాలి.

No comments:

Post a Comment