Pages

Friday, September 28, 2012

మార్చ్‌కు అనుమతి మంచి పరిణామం



సెప్టెంబర్‌ 30న తెలంగాణా మార్చ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ అనుమతి లభించడం ఆహ్వానించదగిన విషయం. అన్ని పక్షాలూ పట్టువిడుపులు ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైంది. అదే సమయంలో తెలంగాణా సమస్యపై వివిధ పార్టీల ధోరణులేమిటో కూడా స్పష్టమై పోయింది. కనుక ఇప్పుడు జరగాల్సింది ప్రజాస్వామికంగా ఎవరి విధానాల మేరకు వారు ఉద్యమాలు చేయడమే. రాష్ట్ర విభజన వద్దని చెప్పే సిపిఎంతో సహా అందరూ ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలనే కోరారు. బహుశా మంత్రులు కూడా ఇంత సూటిగా బయిటకు రావడం ఇదే మొదటి సారి కావచ్చు. నిజానికి ఇలాటి కసరత్తు గతంలోనే జరిగివుంటే ఇంతటి ఉద్రిక్తత అవసరమై వుండేది కాదు. చివరలో కుదిరిన ఈ పరిష్కారం ఏ ఒక్కరి విజయమని భావించడం గాక తెలంగాణాతో సహా రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక సంప్రదాయాలకు మన్ననగా భావించాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని విధాల వివాదాలు సృష్టించినా విద్వేషాలు రగిలించినా రెచ్చిపోవడానికి ప్రజలు సిద్ధం కాలేదు. గతంలో చెప్పుకున్నట్టు ఈ దశలోనూ పలువురు నేతలు(పాలక పక్ష ఎంపిలతో సహా) కవ్వింపు వ్యాఖ్యలు చేయకపోలేదు. రెచ్చగొట్టేందుకు యత్నించక పోలేదు. అయితే చివరకు శాంతియుత వాతావరణం కాపాడుకోవలసిన అవసరాన్ని అందరూ గుర్తించడం ఆహ్వానించదగింది. తెలంగాణాపై కేంద్రం నుంచి ప్రతికూల ప్రకటనలు వచ్చినప్పటికీ దాన్నిబట్టి ఉద్యమాన్ని చిన్నబుచ్చే మాటలు మాట్లాడటం మంచిది కాదు. అలాగే తమ ప్రజాస్వామిక ఆకాంక్షను ఇతరులు గౌరవించాలంటే తాము కూడా సంయమనం పాటించాలని ఉద్యమ నేతలు గుర్తించాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే వారికి లభించిన ప్రజాస్వామిక మద్దతు సార్థకమవుతుంది. మొదటినుంచి మార్చ్‌కు అనుమతినిచ్చి శాంతియుతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న వ్యాఖ్యాతగా ఈ పరిణామాన్ని ప్రత్యేకంగా హర్షిస్తున్నాను.(చూడండి:ఆంధ్రజ్యోతి గమనం, 27.9.12)

No comments:

Post a Comment