Pages

Saturday, September 15, 2012

సిఎం కిరణ్‌ మార్పు కథనాలు కథలేనా?
శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఢిల్లీ మీడియాలో వచ్చిన కథనాలు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలలో ఆసక్తి పెంచాయి. గత కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మార్పు గురించి వినిపిస్తున్న వూహాగానాలకు ఎన్‌డిటివి నుంచి వత్తాసు దొరకడంతో తెలుగు ఛానళ్లు కూడా దానిపై కేంద్రీకరించాయి. కొత్తగా మొదలైన సివిఆర్‌ ఛానెల్‌కు మరేదో అంశం కోసం వెళ్లినప్పటికీ ఈ అంశం ముందుకు రావడం తొలుత దానిపైనే చర్చ జరిగింది. తిరిగి వచ్చేప్పుడు సాక్షి ఛానెల్‌ ఫోన్‌ ఇన్‌ కూడా దీనిపైనే నడిచింది. ఎందుకైనా మంచిదని ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ మాట్లాడితే ఇవన్నీ కావాలని సృష్టిస్తున్న కథలని కొట్టిపారేశారు.మహబూబ్‌ నగర్‌లో ముఖ్యమంత్రి పర్యటన అత్యంత విజయవంతంగా సాగడం సహించలేకనే ఇవన్నీ పుట్టిస్తున్నారని కూడా విశ్లేషించారు. పైగా సదరు ఛానల్‌ ముఖ్యులు కూడా ఈ కథనాన్ని బలపర్చడం లేదని ఆయన అన్నారు. అనేక సార్లుముఖ్యమంత్రి మారిన మహారాష్ట్రను కూడా ఈ జాబితాలో చేర్చడం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతేగాక
కేంద్రంలో స్థానం పొందే రాష్ట్ర నేతల జాబితా కూడా చాలా పెద్దదే ఇచ్చారు. కనకనే ఈ కథనం కొంత ప్రశ్నార్థకం అయింది.
అందుకే దీనిపై మరో ప్రముఖ పాత్రికేయుణ్ని సంప్రదిస్తే ఏమీ చెప్పలేమని మార్పు అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రకటించేట్టయితేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జైపాల్‌ రెడ్డి షరతు పెడుతున్నారని గతం నుంచి వినిపిస్తున్న సమాచారాన్ని ఆయన మరోసారి చెప్పారు. తమాషా ఏమంటే అదే జరిగేట్టయితే అప్పుడు తెలంగాణా ప్రాంతం నుంచి ఆయనను ఎంపిక చేయవలసిన అవసరం పెద్దగా వుండదు. అలా చెయ్యకుండా ప్రాంత ఎంఎల్‌ఎలను వీలైతే ఇతరులను సంతృప్తి పర్చడానికే జైపాల్‌ రెడ్డి వంటి పేర్లు వినిపిస్తుంటాయి. (అయితే ఇంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఆయన వయస్సు శారీరక స్థితి విస్త్రత క్రియాశీలపాత్రకు సహకరిస్తాయా అన్నది కూడా చాలా మందిలో వున్న సందేహం) జానారెడ్డి, రాజనరసింహ, డి.శ్రీనివాస్‌ ఇలా పెద్ద జాబితానే వుంది. తెలంగాణా అభివృద్ధి మండలి సందర్భంలోనూ ఈ పేర్లు వస్తుంటాయి.
2014 వరకూ కిరణ్‌ కొనసాగుతారనే మాట కాదుకదా సూచన కూడా అధిష్టానం ప్రతినిధులు ఇవ్వకపోవడం సందేహాలకు దారితీస్తుంది. అవినీతి ఆరోపణలు కోర్టు నోటీసుల కారణంగా మంత్రులను మార్చాల్సి వస్తే పునర్యవస్థీకరణకు బదులు ప్రభుత్వాన్నే మార్చేయవచ్చుకదా అన్నది మరో తర్కం.ఇంతకూ మార్పు వుంటుందా లేదా అంటే ముందో వెనకో తప్పదనే సమాధానం వస్తోంది.ఈ సమయంలోనే బొత్స ఢిల్లీ వెళ్లడం కొసమెరుపై అలరిస్తోంది...

No comments:

Post a Comment