Pages

Saturday, September 22, 2012

తేలిపోయిన తృణమూలాలు!

.
ఏదో ఒక విధమైన సంచలన చర్యతో దేశాన్ని ఆకర్షించాలని ముఖ్యంగా స్వరాష్ట్రంలో పునాది నిలుపుకోవాలని తంటాలు పడే తృణమూల్‌ అధినేత్రి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం తేలిపోయింది. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐల ప్రవేశానికి వ్యతిరేకంగా మంత్రివర్గం నుంచి తప్పుకోవడం గొప్పగా చెప్పుకుంటున్న ఆమె పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో అదే అనుకూలంగా వాగ్దానం చేసినట్టు వెల్లడైంది. ప్రణాళిక 43 వ పేజీలో 42 పేరాగ్రాఫులో ఈ అంశం పొందుపర్చి వుంది. చిల్లర వ్యాపారంలోకి దేశ విదేశీ పెట్టుబడులు రప్పించడం జరుగుతుంది అని ఆ ప్రణాళికలో తృణమూల్‌ వాగ్దానం చేసింది. నాటి వారి మిత్రపక్షం కాంగ్రెసూ, నేటికీ ప్రధాన ప్రత్యర్థి మాజీ పాలకపక్షం సిపిఎం వామపక్ష ఫ్రంట్‌ ఈ వాస్తవాన్ని బయిటపెట్టిన తర్వాత- ఖచ్చితంగా చెప్పాలంటే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తృణమూల్‌ వెబ్‌సైట్‌లో ఈ పేరాగ్రాఫు మాయమైంది! దీనికి మమత వివరణ మరింత తమాషాగా వుంది. ముసాయిదాలో వున్న ఆ భాగాన్ని తర్వాత మార్చామని మొదట పాఠమే వెబ్‌సైట్లో పెట్టేశామని అతకని సమర్థనకు దిగారు. అసలు కేంద్ర మంత్రివర్గంలో ఈ నిర్ణయానికి ఆమెపార్టీ వారు ఆమోదం తెలిపారని కేంద్ర ప్రతినిధులు ప్రకటించారు. డీజిల్‌ ధరల పెంపు కూడా పలుసార్లు జరిగింది తప్ప కొత్త కాదు. అందువల్ల మమతా బెనర్జీ నిర్ణయానికి ఇతరేతర కారణాలున్నాయి. ముఖ్యమైంది త్వరలో రానున్న పంచాయతీ ఎన్నికలు. గతంలోనూ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల కోసం 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి ఏదో సాకుతో వైదొలగి ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత మళ్లీ వెళ్లిచేరారు. ఇప్పుడు కూడా అదే జరగదని గ్యారంటీ ఏమీ లేదు.

1 comment:

  1. ఒక సిద్ధాంతం, ఎజెండా అంటూ లేకుండా, కేవలం సంచలనాలతో రాజకీయాల్లో ఎంతో కాలం నెట్టుకు రాలేరు. సంచలనాలు తప్ప తమకు తృణమూల్ చెయ్యగలిగింది ఏమీ లేదని ప్రజలు తొందర్లోనే realise అవుతారు. అప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. తృణమూల్ కి తామే ప్రత్యామ్నాయమని, దాన్ని ఓడించగల సత్తా తమకొక్కరికే ఉన్నదని సీపీఎం నిరూపించుకోవాలి మరి!!

    ReplyDelete