రాజకీయాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నప్పుడు పరాజయాలు వెంటాడుతున్నప్పుడు నాయకుడు అస్తిత్వ సవాలును ఎదుర్కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అలాటి స్థితి అందరూ ఏదో ఒక దశలో ఎదుర్కొన్నవారే. కాకపోతే పుట్టిన వెంటనే అధికారంలోకి వచ్చి తర్వాత కూడా గణనీయమైన కాలం పాలించిన తెలుగు దేశం రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే గాక ఆ తర్వాత వరుసగా వచ్చిన అరవై ఉప ఎన్నికల్లోనూ ఒక్కసారి కూడా విజయం చూడలేక పోవడం పెద్ద సవాలే. ఇదే గాక తెలంగాణా సమస్యపై తర్జనభర్జనలు కూడా కాదనలేని నిజమై ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. అటు కాంగ్రెస్ ఇటు టిఆర్‌ఎస్ కూడా దాడిని తనపై కేంద్రీకరిస్తుంటే ఇదమిద్దంగా చెప్పలేని స్తితిలోనే ఎక్కువ కాలం వుండిపోయింది.ఈ క్లిష్టతకు విరుగుడుగా స్పష్టత ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నా పరిస్తితి మరింత క్లిష్టమవుతూనే వుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా ఇప్పుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర ప్రకటనతో పాటే ఆ స్పష్టతా ఇచ్చేస్తామంటున్నారు. అయితే అంత మాత్రాన విశ్వసనీయత వస్తుందా విఘాతమే కలుగుతుందా అన్నది ఆ పార్టీ నేతలలో సందేహంగానే
వుంది. లాభనష్టాలతో నిమిత్తం లేకుండా స్పష్టమైన విధాన ప్రకటన చేయడం ఎప్పుడూ మంచిదే. కాని- నిజంగానే ఆ ఇచ్చే స్పష్టత ఎంత స్పష్టంగా వుంటుందో చూడాలి. ఒక వేళ అది గనక వుండాల్సిన విధంగా లేకపోతే నష్టమే ఎక్కువ. పైగా ఆ ప్రకటన వెంటనే మరిన్ని సవాళ్లు ప్రతిపాదనలు రావన్న హామీ కూడా లేదు.
ఇక అక్టోబరు 2 నుంచి జనవరి 26 వరకూ తలపెట్టిన పాదయాత్ర విషయానికి వస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానాన్ని గుర్తు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అంతకు ముందు ఆ తర్వాత కూడా అనేక మంది నాయకులు సుదీర్ఘ పాదయాత్రలు చేశారు. ఎన్టీఆర్ చైతన్య రథం వూరూరూ తిరిగింది. ఉదాహరణకు జిల్లాల స్థాయిలో 2003లో ఖమ్మం జిల్లాలో సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మహాప్రస్థానం మంచి ఫలితాలిచ్చింది. కెసిఆర్ కూడా పలు సార్లు యాత్రలు జరిపారు. జగన్ చాలా కాలం జరిపిన ఓదార్పు యాత్ర పాదయాత్ర కాకున్నా ప్రజలకు దగ్గర కావడానికి అక్కరకు వచ్చింది. ఆయన జైలులో వుండగానే పర్యటన పూర్తి చేయాలన్న ఆలోచన తెలుగు దేశం నేతకు వుంటే వుండొచ్చు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి తన పునాదిని పటిష్టం చేసుకోవాలని చంద్రబాబు కోరుకోవడంలో తప్పు లేదు. కాని తన పాలన గొప్ప తనాన్ని మాత్రమే చెప్పడం కోసం వెళ్లడం గాక దానిపైనా విమర్శలు స్వీకరించేందుకు తప్పులు చూపితే ఈ సారి జరక్కుండా చూసుకొంటానని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఫలితాలు మరింత బాగుంటాయి. ఆ లోపలే ఇవ్వాల్సిన స్పష్టతలన్ని ఇస్తానంటున్నాడు గనక అది కూడా ప్రజల స్పందనపై ప్రభావం చూపిస్తుంది.
No comments:
Post a Comment