Pages

Saturday, September 29, 2012

రాజకీయ మాయాజాలంలో రాష్ట్రం - సాగరహార నేపథ్యం


ఎట్టకేలకు సెప్టెంబరు 30 వ తేదీ తెలంగాణా మార్చ్‌కు ప్రభుత్వం అంగీకరించడం ఆహ్వానించదగినది. స్థలం మార్చుకోవడానికి, శాంతియుత నిర్వహణపై హామీ ఇవ్వడానికి జెఎసి అంగీకరించడమూ మంచిదే. ఆ ప్రకారమే సాగరహారం లేదా మార్చ్‌ శాంతియుతంగా జరగాలని ప్రతివారూ కోరుతున్నారు. ఇక ఈ మార్పులకు ముందు సాగిన రాజకీయ పరిణామాలు మరింత రసవత్తరమైనవి. ఆ పూర్వాపరాలు. అవి నేర్పే గుణపాఠాలు. వాటి వెనక వివిధ శక్తుల ప్రయోజనాల ప్రాకులాటలు. ఆవేశకావేశాలలో ఔచిత్యాలేమిటి? అరోపణలు ప్రత్యారోపణలలో నిజానిజాలేమిటి? ఎవరి విశ్వసనీయత ఎంత?
మొదటి విషయం- ఈ మొత్తం పరిస్థితికి కారణమైన కేంద్ర కాంగ్రెస్‌ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోకుండానే పావులు కదిలించగలిగింది. తెలంగాణా సమస్య లేదా రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయవలసిన బాధ్యత దానిది కాగా ఆ పనిచేయకుండా ఇతరులపై నెపం మోపి తప్పించుకున్నది. కేంద్రం రాష్ట్ర విభజనకు అంగీకరించి తెలంగాణా ఏర్పాటు చేయబోతున్నదంటూ ముహూర్తాలు కూడా ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో వాయిలార్‌ రవి తదితర నేతలతో నిగూఢ మంతనాలు సాగిస్తుండగానే ఆ వ్యాఖ్యలను వమ్ము చేసే మాటలు కాంగ్రెస్‌ నేతల నుంచి వెలువడ్డాయి. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల తరపున కాంగ్రెస్‌ నేతలే మాట్లాడుతూ వివాదం పెంచేందుకు కారకులయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజనకు ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఇప్పుడు వున్నదని తన కృష్ణా జిల్లా పర్యటనలో పిటిఐతో చెప్పారు. అ తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు హైదరాబాదులో సమావేశాలు జరుపుతూ మార్చ్‌ వివాదం పరిష్కారం చేస్తామన్న హామీలు ఇస్తుంటే జిల్లాల్లో అరెస్టులు అడ్డుకోవడాలు జరుగుతూనే వచ్చాయి.
శాంతియుత ప్రదర్శనకు తమకు అనుమతి ఇవ్వాలని జెఎసి నేతలు కోరుతుంటే ఒక పోలీసు అధికారి హింస జరుగుతుందన్న సూచనలు తమ దగ్గర వున్నాయని ఆందోళన పెంచే విధంగా మాట్లాడారు. విధ్వంసం చేస్తామంటూ మీడియాలో వచ్చిన కొన్ని ప్రకటనలు ఇందుకు తోడయ్యాయి. గత మార్చ్‌ సందర్భంలో ఘటనలూ వున్నాయి. ఏమైనా ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలన్న భావం బాగా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రితో తెలంగాణా మంత్రులు ఆయనతో మాట్లాడుతుండగానే డిజిపి మీడియా గోష్టి నిర్వహించి
మార్చ్‌కు అనుమతించేది లేదని ప్రకటించడం ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే పరిగణించాలి. ఆ తర్వాత కాస్సేపటికే కవాతును ట్యాంక్‌బండ్‌పై గాక నెక్లెస్‌రోడ్డులో నిర్ణీత సమయంలో జరుపుకోవాలన్న అంగీకారం కుదిరింది. ప్రత్యామ్నాయ స్థలానికి తాము వ్యతిరేకం కాదని మామూలుగా చెబుతూ వచ్చిన జెఎసి ప్రతినిధులు అధికారికంగా అందుకు అంగీకరించేందుకు సమయం తీసుకోగా అనుమతించడం అవసరమని తెలిసినా ఆఖరు వరకూ ప్రభుత్వం సాగదీసింది. ఈ కారణంగానే ఆఖరి వరకూ అనవసరమైన ఉత్కంఠకు ప్రజలు గురి చేయబడ్డారు. ఈ దశలో కూడా పాలకపక్ష నేతలే రకరకాలుగా మాట్లాడుతూ ఉద్రేకాలు పెంచేందుకు ప్రయత్నించారు. ఒక ప్రాంతం వారైనా అందరూ ఒకే రకంగా వున్నారా అదీ లేదు. ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ తెలంగాణా మంత్రులు జానారెడ్డి నాయకత్వాన సాగించిన మంతనాలలో పాలు పంచుకోకుండా తన స్వరం విడిగా వినిపించారు.ఆ మంత్రులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతుంటే కరీం నగర్‌ ఎంపి పొన్నం ప్రబాకర్‌ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. తర్వాత మంత్రి అరుణ, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి వంటి వారు ఆయనపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్‌ పరిస్తితి ఇలా వుంటే తెలంగాణా సమస్యపై స్పష్టత ఇస్తూ లేఖ రాస్తామని చాలా కాలంగా చెబుతున్న ఆ పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్షం జరపాల్సిందిగా ప్రధానికి లేఖ రాశారు. ఆజాద్‌ వ్యాఖ్యలు తర్వాత విడుదలైన ఈ లేఖ సారాంశం ఏమిటనే దానిపై రకరకాల భాష్యాలున్నా మొదట ఆ పార్టీ ప్రచారం చేసినంత స్పష్టత లేదనేది మాత్రం తేలిపోయింది.మార్చ్‌లో తెలుగు దేశం పాత్రలోనూ ఇదే ప్రతిబింబించింది. టిఆర్‌ఎస్‌, బిజెపి, నగారా ప్రతినిధులు జెఎసితో పాటు చర్చలు వగైరాల్లో పాల్గొనగా తెలుగుదేశం నాయకులు విడిగా తమ మద్దతు తాముగా ప్రకటిస్తూ వస్తున్నారు.సిపిఐ కూడా విడిగానే కవాతు జరపనున్నట్టు ప్రకటించింది. బిజెపి అయితే ఇది కాంగ్రెస్‌ మార్చ్‌గా తయారు చేసే ప్రయత్నం జరిగినట్టు ఆరోపించింది. నిజానికి సిపిఎం చాలామందికన్నా ముందే మార్చ్‌కు అనుమతించాలని స్పష్టమైన వైఖరి ప్రకటించింది. తాము విభజనకు వ్యతిరేకమైనా ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడం తగదని బి.వి.రాఘవులు వివరించారు. ప్రభుత్వం ఆ వాస్తవం గుర్తించడానికి చాలా సమయం తీసుకోవడం పరిస్తితిని ఉద్రిక్తం చేయడానికే పనికివచ్చింది.
మొత్తంపైన నెక్లెస్‌ రోడ్‌లో అనుమతినిచ్చినా మార్చ్‌కు సంబంధించిన అనేక సందేహాలు వున్నాయి. పరిమితమైన స్థలమే అంటున్నారనీ, అరెస్టులు వగైరాల నిర్బంధం కొనసాగిస్తున్నారనీ నిర్వాహకుల తరపున వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై వారి నేతలు కొందరు పరోక్ష హెచ్చరికలూ చేస్తున్నారు.కాంగ్రెస్‌ కేంద్ర,రాష్ట్ర నాయకత్వాలు ప్రజల ప్రాంతాల మనోభావాలతో చెలగాటమాడటంలో ఆరితేరారని మరోసారి రుజువైంది. టిఆర్‌ఎస్‌ కూడా విమర్శలలో చిక్కుకోవడం, కాంగ్రెస్‌ నేతలే రెండు రకాలుగా వాదిస్తూ ముందుకు రావడం మరో ప్రహసనం. తెలుగుదేశం ఏదో లేఖ రాయకతప్పని స్థితి కల్పించి ఆ పైన దాడికి దిగడం కూడా కనిపిస్తుంది. ఉద్యమానికి జెఎసి కోదండరాంలే నాయకత్వం వహిస్తున్నారన్న భావనకు ఆస్కారం కలిగించి కెసిఆర్‌ను తమ వ్యూహానికి దగ్గరగా తీసుకోవడంలోనూ కాంగ్రెస్‌(ఇప్పటికి) సఫలీకృతమైంది. జెఎసి నేతలు కూడా శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి అనుమతి తీసుకోవలసిన స్తితి ఏర్పడింది. రాష్ట్ర విభజనకు ఇప్పట్లో ఆవకాశం లేదని ముందస్తుగా ప్రకటించడం వల్ల మార్చ్‌ను సంకేత ప్రాయంగా మార్చినట్టయింది. తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రదర్శన ప్రశాంతంగా జరిగేట్టు అన్ని పక్షాలూ చూసినప్పుడే విశ్వసనీయత నిలబడుతుంది. విధ్వంసాలు విద్వేషాలు కోరుకునే శక్తులకు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా అందరికీ నష్టం జరుగుతుంది.కేంద్ర కాంగ్రెస్‌ నాయకత్వం ఎత్తులు పై ఎత్తులు అందుకు అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర నాయకుల తీరు,వివిధ పార్టీల మల్లగుల్లాలు కనిపిస్తూనే వున్నాయి. ఇప్పటి నుంచి రాబోయే ఎన్నికల ప్రకటన వరకూ రకరకాల మాయోపాయాలు పెరగుతాయే గాని తగ్గవు. గనక ప్రజలు మరింత అప్రమత్తత వహించవలసిందే.ఆ రీత్యా ఇది తెలుగు ప్రజలకు పరీక్షా సమయం.



1 comment:

  1. తెలంగాణా సమస్యకు సర్వజనామోదయోగ్యమైన శాంతియుత పరిష్కారం ఎవ్వరి దగ్గరా లేదని కనుచూపు మేరలో లభించే అవకాశం కూడా లేదన్నది చాలా స్పష్టమైన విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా అన్ని పార్టీలు ఈ విషయంలో భాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయన్నది తిరుగు లేని సత్యం.మేము తెలంగాణాకు అనుకూలురమనో ప్రతికూలురమనో చెప్పినంత మాత్రాన కూడా స్పష్టమైన వైఖరి అవలంబించినట్లు కాదు.అటు సీమాంధ్రులను ఇటు తెలంగాణ వాదులను తృప్తి పరచడానికి ఏమేం చేయాలో కూడా చెప్పగలిగి ఉండాలి.కాంగ్రెసు హైకమాండు వద్ద కూడా ఏ మంత్ర దండమూ లేదు. విధి లేని పరిస్థితిలో వారూ నాటకమే ఆడుతున్నారు.విమర్శించే వారెవరి దగ్గరైనా మంచి సొల్యూషన్ ఉంటే దానిని బహిర్గతం చేస్తే కాంగ్రెసు వారు దానిని అమలు చేయక పోతే వారిని తప్పు పట్ట వచ్చును.2014 ఎన్నికల ఫలితాలు ఈ సమస్యను మంచికో చెడుకో ఏదో రీతిన తీర్చక తప్పని సరి పరిస్థితులు కల్పిస్తాయి.అంత వరకూ వేచి ఉండక తప్పదు.

    ReplyDelete