పాలక పార్టీలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్నయినా వ్యూహాత్మకంగా గందరగోళ పర్చడంలో ఎంతగా ఆరితేరిందీ తెలంగాణా రాజకీయాలు మరోసారి కళ్లకు కట్టి చూపిస్తున్నాయి. తెలంగాణా దాంతో పాటు మొత్తం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఎలా వుండబోతున్నాయనేదానిపై సూటిగా పారదర్శకంగా వ్యవహరించేబదులు తెరచాటు మంతనాలు జరుపుతూ ఎడతెగని వూహాగానాలకు ప్రజలను ప్రాంతాలను గురి చేయడమవుతున్నది.టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సెప్టెంబరులోగా రాష్ట్ర విభజన జరిగిపోతుందన్నట్టు అంచనాలు ఇచ్చి ఆ పైన సుదీర్ఘ మంతనాలలో మునిగిపోయారు. ఇందుకు భిన్నంగా మధుయాష్కి వంటి తెలంగాణా ఎంపిలు తాము అలాటిదేమీ ఆశించడం లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే తెలంగాణా ప్రాంత మంత్రులు ఎంఎల్‌ఎలు సోనియా గాంధీకి లేఖలు రాయడం ద్వారా ఇంకా ఏమీ తేలలేదన్న భావనకే అస్కారం ఇస్తున్నారు. దీనిపై ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే లగడపాటి రాజగోపాల్ వంటి వారు పరిపరివిధాల మాట్లాడి ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కెసిఆర్‌ను కలుసుకున్న తర్వాత సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా తెలంగాణా ఇప్పుడే వస్తుందన్న నమ్మకం కలగడం లేదని అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. పైరవీల ద్వారా వచ్చే అవకాశం కూడా లేదని ఆయన పరోక్షంగా కెసిఆర్ శైలితో విడగొట్టుకున్నట్టు విశ్లేషణలు వినిపించాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో తెలంగాణా తీర్మానం పెట్టే అవకాశం లేదని తేల్చిచెప్పడమే
గాక తనకు ఏ సంకేతాలు లేవన్నారు.గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నేతలను కలసిన తర్వాత ఎప్పుడూ ఆ విషయమే ఎందుకు అడుగుతారని విలేకరుపై విసుగుదల వ్యక్తం చేశారు. వాయిలార్ రవి తాజాగా స్వంత రాష్ట్రం కేరళలో మళయాల మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇంకా నిర్ణయం జరగలేదనే చెప్పారు.అఖిలపక్ష సమావేశం అనిశ్చితికి దారి తీసేదేనని గతంలోనే ఈ బ్లాగులో చెప్పుకున్నాం. నిజానికి టిఆర్‌ఎస్ నేతలు కూడా తమ అద్యక్షుడు కాంగ్రెస్ నాయకత్వంపై అతిగా ఆశలు పెంచుకోవడం అపహాస్య భాజనమవుతుందా అనే ఆందోళన అప్పుడప్పుడూ వెల్లడిస్తున్నారు. నేరుగా సోనియా గాంధీ నుంచే తమకు సంకేతాలు వస్తాయని అంటుంటారు గాని ఆమె ఆదేశమో అనుమతో లేకుండా ఇలా మాట్లాడతారా అనేది కూడా ఆలోచించవలసిన విషయం.
సెప్టెంబరు 30 తెలంగాణా మార్చ్, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు సందర్భంలో ఆ వేడి తగ్గించే దాగుడు మూతలలో భాగంగానే ఈ ప్రహసనం జరుగుతున్నదా అనే సందేహం నెలకొన్నది. స్పష్టత కోసం లేఖ ఇద్దామని నిర్ణయించుకున్నట్టు చెప్పబడిన తెలుగుదేశం నాయకత్వం కూడా ఇప్పుడు ఇదే సంధిగ్ధంలో చిక్కినట్టు కనిపిస్తుంది.శాసనసభలో టిఆర్‌ఎస్ సభ్యుల నిరసనలో ఇతర పార్టీల వారెవరూ గొంతు కలపకపోవడం, జెఎసి తలపెట్టిన మార్చ్ సన్నాహాలలోనూ ఆ పార్టీ నేతల పాత్ర పరిమితంగానే వుండటం పెరుగుతున్న వైరుధ్యాలను సూచిస్తున్నది.
కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్ విలీనం అవుతుందనే వార్తలు ఈ వారం రోజులలోనూ విపరీతంగా వినిపించాయి. వీటిపై టిఆర్‌ఎస్ నుంచి గాని వారి మీడియా సాధనాల నుంచి గాని బలమైన ఖండనలు కనిపించలేదు. పైగా అంతా అయిపోతుందన్న కథనాలే పతాక శీర్షికల్లో ఇస్తున్నారు. చర్చలు వగైరాలలోనూ టిఆర్‌ఎస్ నేతలు తమది తెలంగాణా అనే ఏకాంశ ఎజెండా గనక దానికి అంగీకరిస్తే విలీనంతో సహా ఏ షరతులనైనా పరిశీలిస్తామనే చెబుతూ వస్తున్నారు. ఇస్తే సంబరం, ఇవ్వకుంటే సమరం వంటి సాదారణ వ్యాఖ్యలతో సరిపెడుతున్నారు. తెలుగు మీడియాలోనైతే ప్రాంతాల వారీ ఆరోపణలు వస్తాయనుకోవచ్చు గాని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డిటివి వంటి జాతీయ మీడియా సంస్థ కూడా విలీనం కథనం ప్రసారం చేసింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా వివిధ దశల్లో వివిధ పార్టీలను విలీనం చేసుకున్న(తాజాగా ప్రజారాజ్యంతో సహా) కాంగ్రెస్ చరిత్ర రీత్యా ఈ కథనాలను తేలిగ్గా కొట్టిపారేయడానికి లేకుండా పోతున్నది.
ఇలాటి వాతావరణంలో శాసనసభ సమావేశాలు కూడా నిరర్థక తతంగంగానే ముగిసిపోయాయి. విద్యుచ్చక్తి సంక్షోభంతో సహా అనేక సమస్యలు ప్రజలను అతలాకుతలం చేస్తుంటే ఒక్క అంశంపై సభను స్తంభింపచేయడానికి టిఆర్‌ఎస్ ప్రయత్నించడం దాన్ని సాకుగా చూపించి ప్రభుత్వం సభను నిర్వహించకుండా పాయిదాలేని వాయిదాలతో ముగించడంలో రాజకీయం చాలా వుంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో నిమిత్తం లేకుండా సభను జరిపించుకుపోయే ఆనవాయితీ గల అధికార పక్షాలు అయిదు రోజుల్లో ఒక్కసారి కూడా అలాటి గట్టి ప్రయత్నం చేయకపోవడం సమస్యలపై చర్చను దాటేసేందుకేనని అందరికీ తెలుసు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ప్రభుత్వ వ్యూహానికి టిఆర్‌ఎస్ వైఖరి చక్కగా సరిపోయింది.
సభ చివరి దశలో ముఖ్యమంత్రి తెలంగాణా మార్చ్ వాయిదా వేసుకోవడం గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు. 29న వినాయక నిమజ్జనం, మొదటి తేదీ నుంచి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వున్న దృష్ట్యా వాయిదాను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. మార్చ్ నిర్వాహకులు, జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తాము గాంధేయ పద్ధతులలో జరుపుతామని అంటున్నా గతానుభవాలు,ఇటీవల కొందరి వ్యాఖ్యలు సందేహాలకు దారితీస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబును ఉద్దేశించి కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు, హైదరాబాదులో జరిగిన కొన్ని విధ్వంసక ఘటనలు, కొందరు నేతల ప్రకటనలు ఉద్రిక్తత పెంచేవిగా మారాయి. గతంలో ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల విధ్వంసం కారణంగా కూడా వివాదమేర్పడుతున్నది. పైగా కాంగ్రెస్ నాయకులు మంత్రులతో సహా తలో వైపున మాట్లాడుతూ ఈ ఉద్రిక్తల వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. నిజానికి కేంద్రం సూటిగా విధాన నిర్ణయం ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్రను సవ్యంగా నిర్వహిస్తే అన్ని ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు. దానికి బదులుగా మంత్రులు ప్రాంతాల వారిగా వర్గాల వారిగా సమావేశాలు జరుపుతూ తామే వివాదం పెంచుతున్నారు. పోటాపోటీ ఢిల్లీ యాత్రలతో కృత్రిమమైన ఆవేశాలను పెంచుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు లేదా కొనసాగింపు అనే తర్జనభర్జనలు ఇందుకు తోడై రాష్ట్ర పరిపాలనా ప్రతిష్టంభనను పరాకాష్టకు చేర్చాయి.
No comments:
Post a Comment