Pages

Thursday, September 1, 2011

ఉరిశిక్షల చర్చలో ఉచితానుచితాలురాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులైన మురుగన్‌,శంతన్‌,పెరిరవాళన్‌ల ఉరిశిక్ష విషయమై సాగుతున్న వివాదం సందర్భంగా అనేక అసందర్భ వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆ ముగ్గురికి ఉరి శిక్ష వేయకుండా క్షమాభిక్ష కోరుతున్న పిటిషన్లను సుప్రీం కోర్టు 1999లో తిరస్కరించింది. తర్వాత వారు రాష్ట్రపతికి మొరపెట్టుకున్నారు. వాటిపై అభిప్రాయం చెప్పడానికి , పరిశీలించి తిరస్కరించడానికి కేంద్రం అయిదేళ్లు తీసుకుంది.ఆ పైన రాష్ట్రపతి కార్యాలయం మరో ఏడేళ్లకు తిరస్కరణ నిర్ణయం ప్రకటించింది.ఇటీవల తమిళనాడు శాసనసభ వారి శిక్షను రద్దు చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాక వివాదం ముదిరింది. తమకు ముందు అధికారంలో వున్న డిఎంకె ఉరిశిక్ష అమలు చేయాలంటూ వత్తిడి చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత
చెబుతున్నారు.ఇప్పుడు శ్రీలంకలో ఎల్‌టిటిఇ పరాజయం తర్వాత తమిళులపై నిర్బంధం సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరవయ్యేళ్లు ఖైదులో వున్న వారిని ఉరి తీయనవసరం లేదన్నది తమిళ నాయకుల వాదన. దానిపై ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాని రాజకీయ అవసరాలను బట్టి వాదనలు చేయడం ఉద్రేకాలు పెంచడం మాత్రం తగని పని. కేంద్రం దీనిపై ఏమీ చెప్పకపోయినా మద్రాసు హైకోర్టు ముందు పిటిషన్‌ రావడంతో రెండు వారాల స్టే లభించింది. చివరకు ఏమవుతుందో తెలియకపోయినా ఇప్పటికి కొంత వూరట లభించినట్టయింది. ఆర్టికిల్‌ 72 ప్రకారం ఉరి శిక్ష రద్దు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి తమకు ఎలాటి ఆంక్షలు లేవని కేంద్రం అంటుంది. అది నిజమే కావచ్చు గాని దశాబ్దాల పాటు జాప్యం చేయడంలో మానవత్వమున్నట్టా? హైకోర్టు పరిశీలనకు వ్యవధి తీసుకోవడం వూరికే జరుగుతుందా?
ఇది ఇలా వుంటే కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్డుల్లా అఫ్జల్‌ గురు విషయంలో తమ శాసనసభ ఇలాటి తీర్మానమే చేస్తే ఏమవుతుందని ఒక అసందర్భ ప్రశ్న లేవనెత్తారు.అఫ్జల్‌ గురు నేరాన్ని బట్టి కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయొచ్చు లేదా రాష్ట్రపతి రద్దు చేయొచ్చు. ఎందుకంటే అలాటి విజ్ఞప్తి చేసింది అతనొక్కడే కాదు. కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకుని దీనికి మతం రంగు పులిమితే లౌకిక వాదులు న్యాయ నిపుణులు దాన్ని ఖండించారు. అయితే ఇప్పుడు ఒమర్‌ మాటలలోనూ ఆ మత రాజకీయాలే తొంగి చూడటం విచారకరం. కాశ్మీర్‌ కోణం కోసం ఆయన మాట్లాడి వుండొచ్చు గాని విశాల జన రాశుల దృష్టిలో అలాటి మతపరమైన తేడాలేమీ వుండవు.అలాగే అఫ్జల్‌ గురు ఉరి అర్జెంటుగా అమలు జరపడమే దేశ భక్తికి దాఖలా అని సంఘ పరివార్‌ గగ్గోలు పెట్టడంలోనూ అర్థం లేదు. రాష్ట్రపతి దగ్గర మొత్తం 18 పిటిషన్లు వుంటే అందులో అన్ని మతాల వారూ వున్నారు. కనక చేసిన నేరాన్ని ఘోరాన్ని బట్టి మాత్రమే నిర్ణయం జరగాలి. కొన్ని పేలుళ్ల కేసులో నిందితుడైన నిగమానందను ప్రాసిక్యూట్‌ చేయడమే నేరమైనట్టు సంఘ పరివార్‌ ఆందోళనలు చేసింది.టెర్రరిజానిక కారకులైన వారిని మతంతో నిమిత్తం లేకుండా శిక్షించాల్సిందే తప్ప ద్వంద్వ ప్రమాణాలు పనికి రావు.
చత్తీస్‌ఘర్‌లో మావోయిస్టులు సాగించిన ఒక వూచకోత కేసులో జీతన్‌ మరాండి,అనిల్‌ రామ్‌, మనోజ్‌ తన్వర్‌,ఛత్రపతి మండల్‌ల ఉరిశిక్షపైనా ఈ సమయంలోనే చర్చ జరుగుతున్నది. చాలా సందర్భాల్లో ప్రజల పాత్ర లేకుండా మావోయిస్టులు సాగించే నరమేధం ఎవరూ సమర్థించడానికి వీల్లేనిది. అయితే ఒకేసారి ఇంతమందికి ఉరిశిక్షలు వేయడానికి అది సమర్థన కాదు. మిగిలిన అన్ని సందర్బాల్లో వలెనే ఈ శిక్షలను కూడా న్యాయపరంగా పరిశీలించి తగు చర్య తీసుకోవాల్సి వుంటుంది.వారికి మావోయిస్టులతో సంబంధం లేదన్న వాదనలో నిజానిజాలు కూడా మరింత లోతుగా పరిశీలించి ఏవైనా పొరబాట్లు వుంటే సవరించుకోవాల్సిందే.గతంలో వినాయక్‌ సేన్‌ అనే వైద్యుడి విషయంలో జరిగిన పొరబాటు పునరావృతం కానివ్వరాదు.
మొత్తంపైన ఉరిశిక్షల రద్దు అభ్యర్థనల విషయంలో రాజ్యాంగమూ, అత్యున్నత న్యాయస్తానమూ కూడా స్పష్టమైన మార్గదర్శకాలే ఇచ్చాయి.72 వ అధికరణం రాష్ట్రపతికి,161వ అధికరణం గవర్నర్‌కు ఇస్తున్న మినహాయింపు అధికారం చాలా సున్నితమైంది, ఈ నిర్ణయం రాష్ట్రపతి కేంద్రం సలహాపై తీసుకోవాలని 1989లో ఇందిరాగాంధీ హత్య కేసు సందర్భంలో సుప్రీం కోర్టు చెప్పింది.ఆ కేసులో నిందితుడైన ఖేర్‌సింగ్‌కు క్షమాభిక్ష నివ్వాలని పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్రపతి తోసి పుచ్చారు. ఇందిర హయాంలోనూ కాశ్మీర్‌ ఉగ్రవాది మగ్బుల్‌ భట్‌ ఉరిశిక్ష రద్దుకు తిరస్కరించారు. ఎందుకంటే ఈ పరిశీలన కేవలం విచక్షణకు సంబందించినది మాత్రమే. సర్వాధినేతల దయాదాక్షిణ్యాలకు సంబంధించిన సమస్య కాదు.శిక్ష అమలు కన్నా రద్దుచేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తే తీసుకునే చర్య మాత్రమే. కాఠిన్యం అవాంచనీయమైనదని న్యాయేతర వ్యవస్త భావించి తీసుకునే ఉపశమనంగానే దాన్ని చూడాలి తప్ప మరో తీర్పుగా కాదు.తీర్పు రద్దు కూడా కాదు. రాష్ట్రపతి సాక్ష్ల్యాలన్నిటినీ మళ్లీ విచారించేందుకు కూడా అదికారం వుంటుంది.కాకపోతే కులం మతం ప్రాంతం వంటి వాటిని బట్టి ఉరిశిక్షల రద్దు తగడని మాత్రం సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించడం అవసరం. ప్రభుత్వాలు న్యాయస్థానాలు కూడా త్వరితంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ఇంకా అవసరం.

2 comments:

  1. అసలు మన న్యాయ వ్యవస్థ లొనె లొపముంది.దేశద్రొహులని,హంతకులను,ఉగ్రవాదులను విచారించి శిక్షించడానికి అన్ని సంవత్సరాలు తీసుకోకూడదు.2.సుప్రీం కోర్టు శిక్ష విధించాక వెంటనే అమలుపర్చక ఇన్ని ఏళ్ళు జాప్యం చెయ్యడం కేంద్ర ప్రభుత్వ బలహీనతను,అసమర్థతను ,ఊగిసలాటను సూచిస్తుంది.3.,మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడం ,తమిళ్నాడు అసెంబ్లీ తీర్మానము ,కాశ్మీరు ముఖ్యమంత్రి ప్రకటన ,అన్నీ తప్పే .4.ఇప్పుడైనా మరణశిక్షలన్నీ వెంటవెంటనే అమలుచెయ్యవలసిందే.

    ReplyDelete
  2. Please see at...
    http://analysis-seenu.blogspot.com/2011/08/blog-post_31.html#comments

    ReplyDelete