Pages

Sunday, September 4, 2011

అమెరికా రాయబారి వ్యాఖ్యల ఆంతర్యం?

ఉపసభాపతిగా వున్నప్పుడు నాదెండ్ల మనోహర్‌( ప్రస్తుత సభాపతి) చేసినట్టుగా చెప్పబడుతున్న వ్యాఖ్యలపై గతంలో చర్చించాము. అమెరికా ప్రతినిధులు నిష్కామకర్మగా నివేదిస్తారనే భావన సరికాదని కూడ పేర్కొన్నాను.ఇప్పుడు అమెరికా రాయబారి పేరుతో వచ్చిన వ్యాఖ్యలు వాటికంటే ఎన్నో రెట్లు తీవ్రంగా వున్నాయి. కేంద్రం లొంగుబాటు ప్రదర్శించిందనీ, ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడుతుందనీ సూటిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అభిప్రాయాల తప్పొప్పులు ఏమిటన్నది ఒకటైతే ఇంత సున్నితమైన సమస్యపై ఇంకా పరిణామాలు జరుగుతుండగానే వ్యాఖ్యానాలు చేయడం అమెరికా అమితాసక్తిని తెల్పుతుంది. అమెరికా పేరు ప్రస్తావించగానే వులిక్కిపడే వారు ఈ వాస్తవాలను గమనించాల్సి వుంటుంది. దేశ దేశాలలో తలదూర్చడం వారికి బాగా అలవాటైన విద్య. ఆధిపత్య వ్యూహాలలో భాగం కూడా. నిజానికి భారత దేశంలో అనేక వేర్పాటు వాద ఉద్యమాలను వారు ప్రోత్సహించడమే గాక ఈశాన్య రాష్ట్రాలలో ప్రాజెక్టు బ్రహ్మపుత్ర పేరిట విచ్చిన్నకర పథకాలను అమలు చేశారు. కాశ్మీర్‌ విచ్చిన్నకర ఉగ్రవాదుల మానవ హక్కులపై మాజీ అద్యక్షుడు బిల్‌ క్లింటన్‌ లేఖ రాసిన సంగతి, ఖలిస్తాన్‌ వాదులు అమెరికా కెనడాలలో తిష్టవేసిన సంగతి గుర్తుంచుకోవాలి. తెలంగాణా వాదాన్ని, అనేక అస్తిత్వ వాదాలను అక్కడి నుంచి బలంగా సమర్థించేవారు చాలా మంది వున్నారు. ఆ మాటకొస్తే టిఆర్‌ఎస్‌లో కీలక పాత్ర వహిస్తున్న కొందరు కూడా ఇటీవలి వరకూ అమెరికాలో స్థిరపడిన వారే. విచిత్రంగా అటు లగడపాటి,ఇటు మధు యాష్కీ వంటివారు ప్రవాస భారతీయులుగా అమెరికాలో బలమైన వ్యవస్తాగత సంబంధాలు కలిగివున్నవారే. మన దేశంలో అస్థిరత్వం పట్ల అమెరికా ఆసక్తి తెలియనిదేమీ కాదు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా వుండగా ప్రత్యేకాంధ్ర(!) ఉద్యమాన్ని తీసుకురావడానికి నిధులు పంపించారని ఆయన కార్యదర్శిగా పనిచేసిన ప్రసాద్‌ రాశారు. అలాగే మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణా వేదిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిరాగాంధీ ఆర్థిక సహాయం చేశారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఒకసారి నేను పాల్గొన్న చర్చలో చెప్పారు. ఈ నేపథ్యంలో చూస్తే తెలంగాణా పరిణామాలపై రాయబారి వ్యాఖ్యలను లోతుగా పట్టించుకోవలసిన అవసరం కనిపిస్తుంది.అలాగే ఇవి తెలంగాణా సీమాంధ్ర ప్రాంతీయ రేఖలకు పరిమితమైనవి కావనీ తెలుస్తుంది.ఇవన్నీ ప్రయోజనాల ఘర్షణలు రాజకీయ పాచికలు మాత్రమే. వీటిని ఆ విధంగానే చూడాలి.

No comments:

Post a Comment