తాను బిజెపిలో చేరే ప్రసక్తి లేదు,కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే అవకాశం లేదు అంటున్న జగన్‌మోహన్ రెడ్డి 2014 లో యుపిఎలో చేరే విషయం ఆలోచిస్తానని చెప్పడం లొంగుబాటు అన్నట్టు వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో ఆశ్యర్యం ఏమీ లేదు. లొంగుబాటు,సర్దుబాటు, తత్తరపాటు పదం ఏదైనా సరే సిబిఐ దర్యాప్తు విషయంలో పునరాలోచనకు ఇది దోహదపడుతుందేమోనన్న ఆలోచన, ఆశ అందులో వున్నాయి. అరెస్టును నివారించాలన్న ఆందోళన ఆయనలో బలంగా వుంది. ఈ ఆత్మరక్షణ స్థితిలో కాంగ్రెస్‌పై నాయకత్వంలోని యుపిఎలో చేరిక అవకాశాన్ని గురించి సూచనలు వదలడం నిస్సందేహంగా రాజకీయ వ్యూహమే. సోనియాపై ధ్వజమెత్తుతూ ఆమె అద్యక్షతన గల యుపిఎలో చేరడానికి సిద్ధపడటం, బిజెపితో జత కట్టేది లేదంటూ దాని నాయకురాలైన సుష్మా స్వరాజ్‌ను కీర్తించడం రాజకీయ విచిత్రం..ఢిల్లీకి గతంలో ఆయన వెళ్లినప్పటికి ఇప్పటికి రాజకీయ ప్రతిపత్తిలో చాలా తేడా వచ్చింది.దానికి తోడు అదే రోజున గాలి జనార్థనరెడ్డి అరెస్టు జరగడంతో మరీ అననుకూల వాతావరణం. గాలి జనార్ధనరెడ్డి అరెస్టు తర్వాత అందరి చూపూ ఆయనకు సంబంధించిన కేసులపైకి మళ్లింది. గాలితో తనకు సంబంధం లేదని చేసిన వ్యాఖ్యలు మీడియాపై ఆసహనం అసంబద్దమైనవి. గాలితో కుటుంబ సంబంధాలే గాక ఏదో ఒక విధమైన ఆర్థిక ఆనుబంధాలు లేవని చెబితే ఎవరూ నమ్మలేరు. యుపిఎతో సంబంధాల విషయానికి వస్తే జగన్ వర్గీయులు మొదటినుంచి అనేక సార్లు ఈ మేరకు సూచనలు వదులుతూనే వచ్చారు.శరద్ పవార్, మమతా బెనర్జీవంటివారిని ఇందుకు ఉదాహరణలుగా వారు చూపించేవారు. ఇప్పుడు కూడా జగన్ వారికోసమే ఇలాటి ప్రకటన చేసి వుండే అవకాశం వుంది. యుపిఎ భాగస్వాములు తనను కలుసుకోవడాన్ని సమర్థించుకోవడానికి ఈ వ్యాఖ్యలు దోహదం చేస్తాయని ఆయన అంచనా కావచ్చు. (వామపక్షాలు తాము బలంగా వున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పైనే ప్రధానంగా పోరాడి యుపిఎ 1 కి బయిటనుంచి మద్దతు నిచ్చిన సందర్భం వేరు, ఇది వేరు. ఆ పరిణామం దశాబ్దాల చరిత్రకు కొనసాగింపు. పవార్, మమత వంటి వారు బిజెపితో కూడా కలసి వున్నారు. శరద్ పవార్ మహరాష్ట్ర రాజకీయాల రీత్యా అనివార్యంగా కాంగ్రెస్‌తో కలుస్తుంటారు.) ఇప్పుడు సిబిఐ దాడులనుంచి రక్షించుకోవడం ఆయనకు అన్నిటికన్నా ముఖ్యం గనక ఇలా మెతగ్గా మాట్లాడ్డంలో అశ్చర్యం లేదు. అయితే ఈ కారణంగానే కాంగ్రెస్ బాహాటంగా స్పందించే అవకాశం కూడా చాలా తక్కువ. ఇది తమ అంతర్గత వ్యవహారమైనట్టు సర్దుకుని వదిలిపెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు. రాజకీయంగా రాజీ కుదిరినా అది అమలులోకి రావడానికి చాలా దశలుంటాయి. ఏమైనా ఢిల్లీ ప్రకటన జగన్ బింకం సడలింపునే సూచిస్తుంది. కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శల విలువను ప్రశ్నార్థకం చేస్తుంది. పైగా మంత్రిత్వ శాఖలను గురించి కూడా మాట్లాడ్డం మరింత వింత గొల్పుతుంది.పార్టీలోనే వుంటే ఏదో ఒక దశలో ఆయనకు కేంద్రంలో పదవి లభిస్తుందని మొదట్లో అనేవారు. ఆ మార్గం వద్దనుకున్నతర్వాత ఇప్పుడు మాట్లాడ్డం అసందర్భమే.
ౖ
No comments:
Post a Comment