Pages

Monday, September 26, 2011

టీ కాంగ్రెస్‌ నేతల ఆగ్రహావేశాలు


సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణా కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సోమవారం తీవ్రస్థాయిలోనే రంగంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిపైనా నేరుగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధిష్టానంపైన కేంద్రంపైన మాత్రం ఇంకా విశ్వాసం ప్రకటించడం గమనించదగ్గది. ప్రాంతీయ విధేయతకు పార్టీ విధేయతకూ మధ్యన వారు తమ స్థానాన్ని నిర్ణయించుకోనంత వరకూ ఈ మాటల వల్ల ప్రయోజనం వుండదు.దామోదరరెడ్డి అవసరమైతే కొత్త పార్టీ వస్తుందని అన్నప్పటికీ ఆ మాటలలో వుండాల్సిన తూకం లేదు. ఇదే సమయంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణా రాష్ట్రం రావడాన్ని ఎవరూ వ్యతిరేకించదం లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజునే ఈ మాట చెప్పడం మరో విశేషం. నిన్న మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ తమ పాత విధానాన్నే పునరుద్గాటించారు. వీటన్నిటిని బట్టి సమ్మె ఉధృతిని బట్టి ఏదో ఒక పరిష్కారం రాబోతుందని అనుకోవడానికి ఆస్కారముంది.అయితే కాంగ్రెస్‌ ధోరణి రీత్యా అలా అనుకోవడం అవాస్తవికతే అవుతుంది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ఏ సమస్యనూ వారు పరిష్కరించకుండా అట్టిపెట్టి రాజకీయం నడపడానికి అలవాటు పడిపోయారు. ఒక విధానం చెప్పి దానిపై నిలబడటం కంటే ఏమీ చెప్పకుండా అందరినీ ఆడించుకునే అవకాశవాదం
గతంలో అనేక సార్లు ప్రదర్శించారు.ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ విధంగానే వ్యవహరించబోతున్నారు తప్ప ఏదో పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు నిజంగా తీవ్రమైన చర్యకు దిగితే రాష్ట్రపతి పాలన వంటిది విధించే అవకాశముంటుంది తప్ప రాష్ట్రంపై సంచలన ప్రకటన చేసే సూచనలు కనిపించడం లేదు. వుంటే ఇంత సమయం ఇంత సంధిగ్ధత సంఘర్షణ అవసరం వుండేది కాదు.టీ కాంగ్రెస్‌ నేతలు కూడా సంధిగ్ధంలో వున్నారు గనకే తీవ్రంగా మాట్లాడుతూనే తీర్థయాత్రలు కొనసాగిస్తుంటారు. ఇదొక ప్రదిక్షిణల ప్రహసనం.అంతే.బాన్స్‌వాడలో పోటీ చేయాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్‌ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు దేశం పోటీ చేయరాదని నిర్ణయిస్తే అది కూడా ఆపహాస్యం చేయబడుతున్నది. అంటే తెలంగాణా రాజకీయాలలో ఈ త్రికోణ సంఘర్షణ ఇకముందూ కొనసాగడం అనివార్యంగా కనిపిస్తుంది. ఈ మధ్యలో వారిలో వారు కాంగ్రెస్‌ నేతలే ఘర్షణ పడి ప్రజలను ఉద్రేకాలకు గురి చేయడం వాంఛనీయం కాదు. మంత్రులు ఎంపిలు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి వంటి వారి మధ్య బహిరంగ వివాదం ప్రచారానికి పనికి రావచ్చు ప్రాంతీయ పునాదిని కాపాడుకోవడానిక ఉపకరించవచ్చు గాని ప్రయోజనం ఎంత అన్న ప్రశ్నకు సమాధానం వుండదు. ఇప్పుడు ఎపిఎన్‌జివో ల సంఘం నాయకులు కూడా దాడుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు గనక ఆ వాతావరణం రాకుండా సూచన ప్రాయమైన ప్రకటనైనా చేసి సత్వర పరిష్కారం చూపించాల్సింది కేంద్రమే.

No comments:

Post a Comment