Pages

Monday, September 12, 2011

వూహించిన రీతిలోనే కెసిఆర్‌ వ్యాఖ్యలు


కరీం నగర్‌లో టిఆర్‌ఎస్‌ జన గర్జన సభ జయప్రదమవుతుందనడంలో ఎవరికీ  సందేహాలు లేవు. అలాగే అక్కడ కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా వూహించిన విధంగానే వున్నాయి. అయినా సకల జనుల సమ్మె, దానికి ముందు వెనక వివిధరకాల పిలుపులు ప్రజాస్వామిక పద్దతుల్లో కొనసాగాలని, ప్రాంతాల ప్రజల మధ్యఉద్రిక్తతలు పెంచబోవని ప్రతివారూ కోరుకోవాలి. ఈ సభకు ముందు రోజే మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన అసందర్భ వ్యాఖ్యలు కెసిఆర్‌ బాగా కలిసి వచ్చాయి. ఈ సభ జరుగుతున్నప్పుడే ఢిల్లీలో కావూరి సాంబశివరావు తదితరుల ఆజాద్‌ను కలుసుకుని మీడియా దగ్గర స్పందిస్తున్నారు. ఈ పరస్పర ప్రాంతీయ భాషణాలు వారి వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వున్నాయనడం నిస్సందేహం. ఎందుకంటే అంతర్గతంగా చర్చించిన అంశాలు ప్రాంతాలను బట్టి నాయకులు ప్రకటిస్తుంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వ్యాఖ్యానిస్తుంటే ప్రజలు కోరుకునే ప్రశాంతత మరింత దూరమై పోతుంటుంది. గత కొన్ని వారాల విరామం తర్వాత వివాదాలు మళ్లీ రాజేయాలని వీరంతా కృత నిశ్చయంతో వున్నారు. వాటిని కెసిఆర్‌ ఇతరులు అందిపుచ్చుకోవడం ఎలాగూ
జరుగుతుంది. టీజీ వెంకటేష్‌ మాటలను ఈ రోజు ఉదయం హెచ్‌ఎంటివీలో నేనూ ఖండించాను గాని నాలుక కోయాలని చెప్పలేదు. ఎందుకంటే ప్రాంతం ఏదైనా స్వార్థ రాజకీయ వేత్తలకు అనేక నాల్కలుంటాయి. వారి కుత్సితాలను వమ్ము చేయడం ద్వారా నోళ్లకు ఎలాగూ మూతలు పడతాయి. ఇంత పెద్ద సభలో తమ విమర్శకు కేంద్రంగా వున్న రాయపాటి, కావూరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆయన మాట్లాడ్డం చూస్తే సహాయకులు సరైన సమాచారం ఇవ్వలేదనుకోవాలి.వాగ్ధాటితో ఎలాగో సర్దుకున్నా తడబాటు కనిపించింది. ఆయన అన్నట్టు లంకలో పుట్టినవారంతా రాక్షసులైతే తెలుగు వారంతా రాక్షసులో దేవతలో ఏదో ఒకటే అవుతారు. అలా గాకుండా అందరూ ప్రజాస్వామిక స్పూర్తితో సంయమనంతో వ్యవహరిస్తే సంక్షోభానికి పరిష్కారం సాధ్యమవుతుంది.ప్రజలను ఉత్సాహ పరచడానికి ఉద్రేకంగా మాట్టాడినా 2014 గడువుకు మానసికంగా సిద్ధం చేయడం టిఆర్‌ఎస్‌ ఉద్ధేశమని చాలా సార్లు స్పష్టమైంది. సూటిగా చెప్పకపోయినా కరీం నగర్‌లో కెసిఆర్‌ ప్రసంగం కూడా పరిస్తితి అనుకూలంగా లేదన్న సంకేతమే ఇచ్చింది. ఈ వేదికపై కోదండరామ్‌ను కెసిఆర్‌ పదే పదే ప్రస్తావించిన ప్రశంసించిన తీరు ఒకటైతే తానుగా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఆయన అనుమతి తీసుకోవడం కూడా అందరూ గమనించేరీతిలోనే జరిగింది.ఇప్పటికే ఇతర జెఎసిల నుంచి వేదికలు పార్టీల నుంచి విమర్శల నెదుర్కొంటున్న కోదండరామ్‌ దీనిపైన కూడా జవాబులు చెప్పవలసి రావచ్చు. సభకు సంబంధించిన వివిధాంశాలు వివరంగా చూస్తే మరిన్ని కోణాలు తెలుస్తాయి.

No comments:

Post a Comment