Pages

Thursday, September 15, 2011

ఉద్వేగాల చెలగాటం రియాల్టీ 'షో'


ఈ రోజుల్లో ఏ రోజు ఎవరు మాట్లాడుకున్నా టీవీ ప్రసక్తి లేకుండా ముగియదు. ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్టు అనేవారు ఈ రోజున ప్రతిదానికి టీవీనే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే టీవీ జీవితాన్ని దృశ్యమానం చేసింది.
టెలివిజన్‌ కేవలం వినోద సాధనమే కాదు, సమాచార సాధనమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలన్నింటినీ ఒక్క దెబ్బలో సమన్వయ పర్చగలిగిన ఇలాంటి అపురూప సాధనం ఏదీ ఇంతకు ముందు మనుషులకు అందుబాటులో లేదు.
టీవీలో వచ్చే హింసా దృశ్యాలపైన లేదా వ్యాపార ప్రకటనలపైన తరచూ విమర్శలు వింటుంటాము. అవన్నీ నిజమే కాని అంతకంటే తీవ్రమైన ప్రభావం మన భావోద్వేగాలపై పడుతుంటుంది. అలాంటప్పుడు పది పదిహేనేళ్ల కిందటే ఈ మీడియా విస్తరించిన మన దేశం వంటి చోట్ల మరింత ఎక్కువగా ఈ ప్రభావం వుం డడం చాలా సహజం. మనకంటే దాదాపు యాభై ఏళ్ల ముందే టీవీ విప్లవం చూసిన అమెరికా వంటి దేశాల్లోనే దీని గురించి ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టీవీ చూడాలంటే ఏకకాలంలో మన కళ్లు చెవులు కూడా పనిచేయాలి. ఏది ఎంత వరకు స్వీకరించాలి, ఏది అట్టిపెట్టుకోవాలి, ఏది తోసిపుచ్చాలి అని విశ్లేషించుకోవడానికి మెదడుకు వ్యవధి కావాలి కాని అంత వ్యవధి తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. చూసే ప్రేక్షకుల పరిపక్వతను బట్టి అది ఆధారపడి వుంటుంది. అన్ని వయస్సుల వారు కలసి చూసే పరిస్థితిలో ఇది మరింత సత్యం. సమస్య ఏమిటంటే చూసే వారిపైనే కాదు, పాల్గొనే వారిపైన కూడా టీవీ కార్యక్రమాల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే అది అన్ని విధాల మనుషుల భావోద్వేగాలతో ముడిపడిన వేల కోట్ల రూపాయల వ్యాపారం. సామాజిక కళాత్మక కార్యక్రమంగా కనిపిస్తుంటుంది. కనుక పూర్తిగా వ్యాపారం అనడానికి కూడా వుండదు. సమాచార సంబంధమైన విధినిర్వహణగా అనిపిస్తుంటుంది. కాని.. ఆ క్రమంలో మన కష్టసుఖాలూ, బాధలూ భావనలూ, ప్రేమలు, చావులూ, హత్యలూ, భక్తి, రక్తి అన్నీ బహిరంగ విన్యాసాలుగా మారిపోతుంటాయి. ఎప్పుడైతే బహిరంగ
వ్యవహారాలయ్యాయో అప్పుడు వాటిని మరింత బాగా కనిపించేలా చేసే కృత్రిమత్వం చొరబడుతుంది.
జీడిపాకం సీరియల్స్‌లో ఒకప్పటి పాత సెంటిమెంట్లు గుప్పిస్తున్న తీరు సరే సరి. బహు భార్వత్యం, కుటుంబలాలలో కుళ్లు కుతంత్రాలే ఆసూయా ద్వేషాలూ, మూఢ నమ్మకాలు దయ్యాలూ భూతాలూ లెక్కకు మిక్కుటంగా వీటిలో కనిపిస్తూనే వుంటాయి. ఒకప్పటి వందమంది సూర్యకాంతాలను మించిన ఆడ విలన్ల విజృంభణతో బుల్లి తెర హడలగొడుతుంది. మరీ తమిళనాడు నుంచి వచ్చే డబ్బింగ్‌ ధారావాహికల్లోనైతే ఆ వేష భాషలే ఒక ప్రత్యేక కోవలో వుండి ఒక విధమైన జుగుప్సను అసౌఖ్య భావనను మనలో నింపేస్తాయి. సినిమా మూడు గంటల్లో ముగిసిపోతుంది. కాని సీరియల్‌ నెలల తరబడి నడుస్తూనే వుంటుంది. చివరకు అవి పాత్రలని కూడా మర్చిపోయేంతగా వాటితో మమేకమై పోతారు.
టీవీ ఛానళ్లలో ఎక్కువ సమయం ఆక్రమించేది లైవ్‌ షోలు, టాక్‌ షోలు, స్పాన్సర్డ్‌ పోటీలు, వివిధ రకాల ప్రత్యక్ష ప్రసారాలు, క్రైం కథనాలు వగైరా వుంటాయి. ఇవి కల్పిత కథలను మించి మనస్సులపై ప్రభావం చూపిస్తుంటాయి. మన సినిమాలన్నీ ఫార్ములాలపై ఆధారపడి వుంటాయి. ప్రేమ, కుటుంబ సంబంధాలు, పగలు ప్రతీకారాలూ, శృంగారం హింస వగైరాలతో రచయితలు దర్శకులు ఎంతో శ్రమపడి కథలు వండుతుంటారు. కోట్లు తగలేసి నిర్మిస్తుంటారు. కాని టీవీలలో ఆ శ్రమ లేకుండానే ఉద్వేగ ప్రేరేపణ జరిగిపోవడం గమనించని విపరీతం.
ఉదాహరణకు ఒక పిల్లవాడు విషాదకరంగా చనిపోయాడనుకుందాం. దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ఎలాగూ జరుగుతుంది.ఈ ప్రసారంతో పాటు అతనికి సంబంధించిన వారితో మాట్లాడించాలి. తలిదండ్రులతో మాట్లాడించడానికే ముందు ప్రాధాన్యత. కొంతమంది పట్టించుకోరు కూడా. కాని చాలామంది విషాద సందర్భాల్లో కూడా టీవీ మైకుల ముందు మాట్లాడ్డానికి సిద్ధమౌతారు. విషాదానికి సరిపడని రీతిలో కూడా వారు మాట్లాడ్డం కద్దు. అప్పటి వరకూ తాము ఇలాటి సందర్భాల్లో చూసిన రీతిలోనే మాట్లాడబోతారు. 'సరిగ్గా' రాలేదనుకుంటే ఆ టీవీ జర్నలిస్టు సూచనలు కూడా చేస్తాడు. ఆ దృశ్యాన్ని వూరికే చూపించినా, నేరుగా మైకు ముందు మాట్లాడించినా అసహజత్వం వచ్చేస్తుంటుంది. విషాద స్పర్శ పలచబడుతుంది. ఇదే పరిస్తితి సంతోష సందర్భాల్లోనూ కనిపిస్తుంది. ఆ విజయంలో విశిష్టత కన్నా వ్యక్తిగతంగా ఆకర్షణీయంగా చూపించడం ప్రధానమై పోతుంది. వారు కూడా ముందే ఒక ప్రత్యేక తరహాలో మాట్లాడ్డానికి చేయి వూపడానికి సిద్ధమై వుంటారు. విషాదం వినోదాలతో సంబంధం లేకుండా పక్కనుండి కనిపించాలనుకునే వారు సరే సరి. ఒకోసారి పరస్పరం పోటీ పడ్డం మరీ ఎబ్బెట్టుగా వుంటుంది.ఇవన్నీ కూడా సహజ స్పందనలను మొద్దు బారుస్తాయి.
లండన్‌లో రియాల్టీ షో సందర్భంలో శిల్పాశెట్టి జేడ్‌ గుడి వివాదం ప్రపంచ వ్యాపిత చర్చనీయాంశమై పోయింది. తర్వాత విచారకరంగా జేడ్‌ గుడీకి క్యాన్సర్‌ సోకింది. ఆమె తన ఆఖరి క్షణాలను కూడా టీవీ లైవ్‌ టెలికాస్ట్‌ హక్కులు అమ్మేసుకుంది. తన పిల్లల కోసం ఇదంతా చేసినట్టు చెప్పినా దాని వెనక సత్యం ఉద్వేగ వ్యాపారమే.
జేడ్‌ గుడీది విషాదాంతమైతే రాఖీ సావంత్‌ స్వయంవర వివాహ ప్రహసనం. తనకు కాబోయే వరుడిని ఎంచుకోవడానికి పురాణ కాలంలో వలె స్వయం వరం ఏర్పాటు చేసుకోవడం బాగానే వుంది.కాని దాన్ని బహిరంగ కార్యక్రమంగా మార్చుకోవడం ఈ తతంగానికి ముందస్తుగా అంత హంగామా దేనికి? పెళ్లి వ్యక్తిగత వ్యవహారమైతే వరుడి ఎంపిక మరింత వ్యక్తిగతంగా జరగాల్సిన తంతు. బుల్లితెరపై ఆమె ఒకో వరుణ్ని అడిగిన ప్రశ్నలు చూపించిన హావభావాలతో మామూలు ప్రేక్షకుడికి సంబంధం ఏమిటి? సినిమా తారల పట్ల ప్రత్యేకించి ఐటం సాంగ్స్‌ (వెనకటికి క్లబ్‌ డాన్స్‌ అనేవారు) నర్తకీమణుల పట్ల వుండే జనాకర్షణను ఇంకా చెప్పాలంటే పురుషాకర్షణను సొమ్ము చేసుకోవడం తప్ప ఇందులో వేరే పరమార్థం ఏమైనా వుందా? పిల్లలను కనడం పాలివ్వడం కూడా టీవీ ఛానెళ్లకు అమ్ముకున్న హాలివుడ్‌ తారమణుల గురించి లోగడ ఇదే శీర్షికలో చర్చించుకున్నాం కూడా. మీడియా వ్యక్తిగత జీవితాల్లోకి ఎక్కువగా తొంగి చూస్తుందని ఆరోపించేవారే ఇలాచేయడంలో ద్వంద్వత్వమే ఉద్వేగ వ్యాపారం!
టాక్‌షోలలో సెలబ్రటీల వ్యవహారం కూడా కాసుల పంట పండిస్తున్నది. అమితాబ్‌ బచన్‌ కౌన్‌ బనేగా కరోడ్‌ పతితో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లుతున్నది. ఒకో చోట ఒక సెలబ్రిటీ. ఇక్కడ హోస్ట్‌ అక్కడ గెస్ట్‌. అక్కడ హోష్ట్‌ ఇక్కడ గెస్ట్‌. తారల గురించి ప్రేక్షకుల మనస్సులో వుండే ఆకర్షణను ఆసక్తిని సొమ్ము చేసుకునే ప్రశ్నలు అదే పనిగా అడుగుతుంటారు. మధ్యలో వారికి సంబంధించిన వారిని ప్రవేశపెడతారు. కౌగిలించుకోవడం, ఎత్తుకుని తిప్పడం, ఏవేవో సరస శృంగారాంశాలు ప్రస్తావించడం.. ప్రేమ ప్రశ్నలు కురిపించడం ఇదంతా సగటు మనుషులకు రంజుగా వుండేందుకే. ఇది కూడా ఒక్కసారితో పూర్తికాదు. దశలవారిగా సాగిపోతుంటుంది. వారు మాట్లాడేప్పుడు మరెవరినో వారితో ముడిపడినట్టు పేరున్నవారిని చూపించడం... ఇవే విషయాలు ఒకప్పుడు ఏ చవక బారు సినిమా పత్రికలోనో శృంగార పత్రికల్లోనో వస్తే తిట్టి పోసేవారు.కాని ఇప్పుడు నేరుగా సకుటుంబ మధ్యంలోకి చొచ్చుకువస్తున్నాయి...
అందాల పోటీలు, క్యాట్‌ వాక్‌లు,మిడ్‌నైట్‌ మసాలాలు(వాటి తాలూకూ ప్రచార ప్రకటనలు లేదా ప్రోమోలు మాత్రం అన్ని వేళలా వస్తుంటాయి మరి) ఎంత ఎబ్బెట్టుగా వున్నదీ నిత్యానుభవమే. విదేశీ చానళ్లపై మనకు ఎలాటి అదుపు లేదు. పైగా మన ఛానళ్లువాటికన్నా తీసిపోయింది కూడా లేదు. ఏతా వాతా ఏదో దేశంలో ఏదో అసభ్య అవాంఛనీయ కార్యక్రమం ప్రసారమవుతూనే వుంటుంది. ఎ సర్టిఫికెట్‌ చిత్రాలలాగా ఎ ఛానళ్లు కూడా వుంటున్నాయి. పాశ్చాత్య దేశాల్లో నీలి చిత్రాలు కూడా నేరుగా ప్రసారమవుతుంటాయి. వాటిని ఎవరూ పెద్దగా చూడరని, కొంతకాలం గడిస్తే మన దగ్గర కూడా అలాటి స్థితే వస్తుందని కొంతమంది చేసే వింత వాదన. సాంస్కృతికంగా చారిత్రికంగా ప్రాచ్చ పాశ్చాత్య దేశాల మధ్య వుండే తేడాను పట్టించుకోదు. ఒక విధంగా ఆ విష సంసృతిని స్వాగతించే ధోరణి..... వాస్తవం ఏమంటే పశ్చిమ దేశాల్లోనూ దీనిపై ఆందోళనలు లేకపోలేదు. కళాశాలల్లో తుపాకుల స్వైర విహారం సామూహిక కాల్చివేతలు, స్కూలు పిల్లల గర్భధారణలూ ఇవన్నీ పై ప్రభావాల ఫలితమేనని వారూ అంగీకరిస్తున్నారు. ప్రత్యేకించి అమెరికాలోనైతే సెప్టెంబరు 11 తర్వాత పత్రికలు టీవీల ప్రభావాలను విడివిడిగా అధ్యయనం చేశారు. టీవీలు కలిగించే ఉద్వేగం చాలా ఎక్కువగా వుంటుందని నిర్ధారించారు.
ఇటీవల వరసగా పాటలు, డాన్సులు, విచిత్ర వేషాల పోటీలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిభ గల వారు అనేక మంది పైకి వస్తున్నారు. అవకాశాలు పొందుతున్నారు.అంతవరకూ బాగానే వుంది. కాని ఇదంతా జరుగుతున్న తీరులోనూ ఎంతో కృతిమత్వం .. చిన్నపిల్లలతోనూ ఒకప్పుడు మనం వద్దని తరిమేసిన మేజువాణీలనే భోగం డాన్సులను మించిపోయేలా జుగుప్సగొల్పే నృత్యాలు చేయించడం.. వాటిని ఆకాశానికెత్తుతూ న్యాయమూర్తులైన ప్రముఖులు మాట్లాడ్డం... వాటి కాన్సెప్ట్‌లోనే అసభ్యత పుష్కలంగా వుంటుంది. అది గాక పోటీలో విజేతలను నిర్ణయించే తీరు., చేసే వ్యాఖ్యలు... కావాలని వివాదాలు ఆహ్వానించడం, వారి కోపతాపాలను చూపించడం, న్యాయమూర్తులను తిట్టించడం.. గెలుపు ఓటములపై తీవ్రమైన సంగీతం తో మార్చి మార్చి చూపించడం... అంతా ఉద్వేగ వ్యాపారమే!
సభ్యమైన పాటలతో సాగే సంగీత పోటీలోనూ ఇదే ధోరణి.చిన్న పిల్లలా పెద్దలా అన్నదానితో నిమిత్తం లేకుండా పాడిన వారిపై పొడుగాటి విశ్లేషణలు.. వూకదంపుళ్లు.. ఆ పైన మార్కుల ప్రకటన.. విజేతల ఎంపిక.. దానికి ముందు వారి అంచనాలపై ప్రశ్నల ప్రహసనం. ఎలిమినేట్‌ అయితే ఏదో కొంప మునిగిపోతుందనట్టు పెద్ద పెద్ద డైలాగులు.. వారికి ఏదో పెద్ద జీవిత సమస్యలా ఉద్బోధలు... విషాద గంభీర శబ్దాలు.... ముఖ కవళికలను క్లోజప్‌లో చూపించడం,, వారు ఎంత ఉత్కంఠతో వూపిరి బిగబట్టి వుంటే అంత గొప్ప అన్నట్టు చిత్రించడం... ఫలితాల ప్రకటన తర్వాత వారిలో కొందరు కన్నీరు మున్నీరు కావడం.. వారితో పాటు న్యాయమూర్తులలోనూ విషాద భావనలు.. ఎంతో అసహజంగా అనవసరంగా జరిగే ఈ తతంగాన్ని టీవీ ఛానెళుఅనివార్యమైనదిగా చేశాయి.
పునర్జన్మలపైన కూడా సెలబ్రటీలు పాల్గొని షోలు నడిపిస్తుంటే ఏం చెప్పాలి?
పత్రికలతో పోలిస్తే మూఢనమ్మకాలను దొంగ స్వాములను ఎండగట్టడంలో టీవీ మీడియా మంచి పాత్ర వహించింది. కాని స్వభావ సిద్ధంగానే అది భక్తిప్రపత్తులకు ప్రచారక సాధనమవుతుంది. ఏ మారుమూల పల్లెలోనో జాతర లేదా తిరణాల వుంటే అక్కడికే పరిమితం. దాన్ని ఒకసారి చూపించి స్తానికులతో ఇంటర్వ్యూలలో చెప్పించిన తర్వాత అది మరింత విస్త్రతమై కూచుంటుంది.
ఇక రాజకీయ విషయాల్లోనూ రెచ్చగొట్టేట్టు మాట్టాడితేనే ఎక్కువ ప్రచారం లభిస్తుందన్న భావం బలపడటానికి మీడియా చేయగలిగినంతా చేస్తోంది.దానిపై మళ్లీ ప్రతిస్పందనలు ఖండన మండనలు.. ఇలా ఉపయోగం కన్నా ఉద్వేగమే ప్రధానంగా రోజూ ఉదయాన్నే స్క్రోలింగ్‌తో అజెండా నిర్ణయమై పోతుంది. వార్త చదవడానికి చూడటానికి చాలా తేడా వుంటుంది. ఏదైనా చూస్తే బావుండాలన్నది మీడియా అంతస్సూత్రం. అంటే వేడి పెంచాలి. గరం గరంగా వుండాలి. సమగ్రత కన్నా సంవాద శీలత ముఖ్యం.కోట్ల ఖర్చుతో నడిచే మీడియా వర్గ స్వభావం కూడా ప్రజల విజ్ఞానం పెంచడం కాదు, కాలక్షేపం చేయించడమే. అన్ని చూపించినట్టు వుండాలి, కాని అసలైన సారాంశం అందకూడదు.
బహుశా ఈ ఉద్వేగ వ్యాపారానికి పరాకాష్ట అనదగ్గది ఇటీవల నడుస్తున్న 'సచ్‌ కా సామ్‌నా' అన్న రియాల్టీ షో. భార్యా భర్తలను పిలిపించి వారి మనసులో మాట చెప్పించడం. ఆ పైన దాన్ని సత్యశోధన యంత్రంతో పరీక్షించడం.. మరీ ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించి మాట్లాడించి, అది నిజమో కాదో పరీక్షించడం.. ఈ ఫలితాలు వెనువెంటనే వెల్లడవుతుంటాయి. దీనిపైన ఎంత విమర్శ వచ్చిందంటే ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలుపు చేయించాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఆ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేసింది. ఇలాటి కార్యక్రమాలు చాలా అభ్యంతరకరమైనవని అభిప్రాయపడుతూనే నిషేదం అవసరం లేదని చెప్పింది.మంచి చెడ్డలు నిర్ణయించుకోగల విచక్షణ మన ప్రజానీకానికి వుందన్న విశ్వాసం వ్యక్తం చేసింది. అది నిజమే కావచ్చు గాని ఈ ఉద్వేగ వ్యాపారంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. మీడియాపై ప్రభుత్వ నిషేదాలను ఆంక్షలను ఏనాడూ అనుమతించకూడదు. అదే సమయంలో మీడియా వ్యాపారాత్మక స్వభావాన్ని కూడా విస్మరించకూడదు. దీనిపై ప్రజలలో అంటే ప్రేక్షకులలో చైతన్యం అవగాహన పెంచాల్సిందే. పశ్చిమ దేశాలలో ఇందుకు సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతుంటాయి. హింసాత్మక దృశ్యాలకు వ్యతిరేకంగా పోరాడే పెద్ద సంఘాలే వున్నాయి. తెల్లచుక్క అన్న ఉద్యమం అక్కడ వుంది. అంటే అవాంఛనీయ కార్యక్రమాలకు నిరసనగా ఒకరోజు టీవీ కట్టేస్తారు.అప్పుడు వచ్చేదే వైట్‌డాట్‌(తెల్లచుక్క) మన దేశంలోనూ మీడియాకు సంబంధించిన అనేక విమర్శలున్నాయి.చర్చలు జరుగుతున్నాయి. ఇవి అనారోగ్యకర పోకడలను నిరుత్సాహ పర్చే వైపు దారితీయాలని ఆశిద్దాం. సున్నితమైన భావోద్వేగాలతో ఆడుకోవడం లాభార్జనా సాధనం కారాదని కోరుకుందాం.
.....................
2000 కోట్ల వ్యాపారం ఒత్తిళ్లెన్నో!
మన దేశంలో ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపార ప్రకటనలు వస్తుంటాయి.ఎన్ని చెప్పినా టీవీ మీడియాకు అవే ప్రాణాధారం. అడ్వర్టయిజర్లకు కావలసింది జనాన్ని అలరించే కార్యక్రమాలే గాని ఆలోచింపచేసేవి కావు. అదే సమయంలో కీలకమైన అంశాలను అందించినట్టుగా కనిపించాలంటే కృత్రిమమైన అంశాలతో ప్రేక్షకులు ఉద్వేగాలను ఆకట్టుకోవాలి. వ్యాపార ప్రకటనల సంగతి చెప్పనే అవసరం లేదు. అంద చందాలు ఆకర్షణలే సర్వస్వమైనట్టు విలాసమూ వినియోగమే జీవితమైనట్టు చెప్పడానికి తారాతోరణంతో క్షణికమైన చిట్కా యాడ్లు ముంచెత్తుతుంటాయి. వీటిలోనూ స్త్రీలను చులకనగా చూపించడమే సర్వసాధారణం. తల్లిదండ్రుల ప్రేమనూ, దాంతప్య జీవితాన్ని, పిల్లల తెలివిని, యవ్వనాకర్షణనూ , ప్రతిదాన్ని వస్తు జాలం చుట్టూ తిప్పే మాయా లోకం ఇది. వాటిని చూసి మతి పోగొట్టుకోవాలంటే ప్రేక్షకుల మెదళ్లు ఖాళీగా వుండాలి. కాలక్షేపం తప్ప ఆలోచన రాకూడదు. కఠోర జీవిత వాస్తవాలనుంచి పలాయనానికి దోహదం చేసే మిథ్యా ఉద్వేగాలలో ముంచి తేల్చడమే ఏతావాతా మీడియా తాత్వికత.
................
కుటుంబాలపైనే వల
మీడియా కార్యక్రమాలకు పిల్లలే పెద్ద లక్ష్యాలు. ఎందుకంటే వస్తు సంస్కృతి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే తర్వాత అమ్మకాలు గ్యారంటీ. నెలల పిల్లలు కూడా వ్యాపార ప్రకటనలను గుర్తించగలుగుతారని పరిశోధనల్లో తేల్చారు. పిల్లలను భయపెట్టడం ఆకర్షించడం కూడా తేలిక. తద్వారా కొన్ని తరాల భావి ప్రేక్షక సముదాయం లభిస్తుంది. వాస్తవానికి టీవీ కార్యక్రమాలతో పిల్లలు సున్నితత్వం కోల్పోతున్నారని బాల వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారికి హింస రక్తం అన్నవి సర్వసాధారణమై పోతున్నాయి.దేనికి చలించని 'పిల్ల రాక్షసుల్లా' తయారవుతున్నారట. టెలి అడిక్షన్‌ అన్నది పెద్ద వ్యాధిలా మారుతున్నది. గతంలో పిల్లలను భయపెట్టిన దృశ్యాలు ఇప్పుడు వీరిని భయపెట్టడం లేదు. రక్తం చూసి భయపడరు గాని మొహంపై చిన్న మొటిమ చూసి హడలిపోతున్నారు.శక్తిమాన్‌లా స్పైడర్‌ మ్యాన్‌లా వూహించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారూ వున్నారు.ఇక తర్వాత లక్ష్య్యంస్త్రీలు. స్త్రీలంటే ఆలోచనా శక్తి లేని వారైనట్టు బంగారం లేదా పట్టుచీరలు తప్ప వారికేమీ పట్టదన్నట్టు చేస్తుంటారు. అంతకంటే కూడా - పాశ్చాత్య దేశాలలో వలె డాన్సులు చేయించడం స్టెప్పులు వేయించడం కొన్నిసార్లు భార్య భర్తలను టీవీ తెరపై సరస సల్లాపాలు చేయించడం అలవాటు చేస్తున్నారు. గతంలోని దేశీయ రీతుల్లో గాక సినిమా ఫక్కీకి మరలుస్తున్నారు. పోటీలలో పాల్గొన్నప్పుడు హుందాగా ప్రవర్తించడం గాక కేకలు ఈలలు ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం అలవరుస్తున్నారు. ఆనంద బాష్పాలైనా ఆశ్రు ధారలైనా వాటికవే రావాలి గాని ప్రదర్శన కోసం అన్నప్పుడు అసహజత్వం అనివార్యమవుతుంది. ఆ అసహజతే సహజత్వమై పోవడం ఇక్కడ మరీ విషాదం.
000000No comments:

Post a Comment