Pages

Saturday, September 10, 2011

ఎమ్మార్పణంలో ఎన్నెన్నో విచిత్రాలు


వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాటిపై వచ్చే అపారమైన లాభాలను ఎమ్మార్‌కు కట్టబెట్టిన కథా క్రమంలో మలుపులకు లెక్కేలేదు. ఎన్ని మలుపులు తిప్పినా ఎమ్మార్‌ రథం నిరాఘాటంగా నడిచిపోయిందంటే ఏలినవారి ఆశీస్సులు ఎంత బలంగా పనిచేసిందీ తెలుస్తుంది.

తమ హయాంలో ఆరంభించినప్పటికీ భూములు సేకరణ, నిబంధనల మార్పు తర్వాతే జరిగిందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇ,చ్చారు.అయినా ఆరంభం అప్పుడే గనక తెలుగుదేశం ప్రస్తావన అనివార్యంగానే వస్తుంది. ఎపిఐఐసి అనే నోడల్‌ ఏజన్సీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, స్టార్‌ హొటల్‌, గోల్ఫ్‌ కోర్సు, విల్లాలతో కూడిన సమ్మిళిత నిర్మాణ పథకం(ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌) చేపట్టడానికి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) కోరుతూ ప్రభుత్వం 1999 ఏప్రిల్‌4,2000 మార్చి 30, 2001జూలై 26 తేదీలలో బిడ్లను ఆహ్వానించింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, పబ్లిక్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ లిమిటెడ్‌(పిజెఎస్‌సి)దుబారు యుఎఇ, ఐవోఐ కార్పొరేషన్‌ బెర్హాద్‌,మలేషియా, లార్సెన్‌ అండ్‌ టాబ్రో(ఇసిసి డివిజన్‌) షాపూర్జీ పల్టోన్జీ కంపెనీ లిమిటెడ్‌, ముంబాయి, సోమ్‌ ఆసియా లిమిటెడ్‌, హాంకాంగ్‌ అన్న అయిదు కన్సార్టియాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అంచనాల కమిటీ ఇందులో ఎమ్మార్‌, ఐవోఐ,ఎల్‌ అండ్‌ టి లను జాబితాలో వుంచి వారితో సంప్రదింపులు జరిపింది. అయితే ఒప్పందం ఖరారు ఆఖరు తేదీ అయిన 2001 డిసెంబరు 15 నాటికి ఎమ్మార్‌ ప్రతిపాదన వొక్కటే అందడంతో దాన్నే ఖాయం చేసింది.

అదనపు భూమికై ప్రతిపాదన
2002 సెప్టెంబరు4న జివోఎంఎస్‌359 ద్వారా ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ పిజెఎస్‌సి దుబారు సంస్థను ఎంపిక చేసినట్టు తెలియజేసింది. దానితో అవగాహనా పత్రం(ఎంవోయు)కుదుర్చుకోవడానికి ఎపిఐఐసి వైస్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు అధికార మిచ్చింది. అదే సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా ఆదేశించింది. దాన్ని రెండు భాగాలుగా
విభజించింది. మణికొండ గ్రామంలో 535 ఎకరాల భూమిలో గోల్ఫ్‌ కోర్సుఇతర బహుళార్థ నిర్మాణాల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఎస్‌పివి 1, ఏర్పాటు చేసి అందులో ఎమ్మార్‌కు 74 శాతం, ఎపిఐఐసికి 26 శాతం వాటా నిర్టయించింది. ఇక మాదాపూర్‌లోని ఎన్‌ఎసి మైదానంలోని 15 ఎకరాల స్థలంలో కన్వెన్షన్‌ సెంటర్‌, ఎగ్జిబిషన్‌ కేంద్రం వగైరాల నిర్మాణం ఎపిఐఐసికి 49 శాతం, ఎమ్మార్‌కు 51 శాతం వుండేలా నిర్ణయించింది. ఒప్పందంపై సంతకాలకు ముందే గచ్చిబౌళి, నానక్‌రాం గూడా,మణికొండ గ్రామాలలోని 454.93 ఎకరాల భూమిని ఎపిఐఐసికి బదలాయించింది. అది గాక మరో 80.35 ఎకరాల పట్టాభూమి కూడా కావాలని ఎపిఐఐసి 18.10.2000 నాడు కోరితే పరిశీలించి 18.7.2002న అంగీకారం తెలిపింది. చివరకు ఎపిఐఐసి- ఎమ్మార్‌ల మధ్యన 6-11-2002న ఒప్పందం పై సంతకాలు జరిగాయి. డెవలపర్‌గా వున్న ఎమ్మార్‌ తన వాటా పరిధిలో మరెవరినైనా కలుపుకోవడానికి, తన వాటా నుంచి పంచుకోవడానికి అందులో అవకాశం వుంది.అయితే ఆ పని ఎపిఐఐసి ఆమోదంతో జరగాలని,ఆ సంస్థ కూడా నిర్హేతుకంగా అడ్డుచెప్పకూడదని పేర్కొనబడింది. ఈ అంశాన్నే తర్వాత కాలంలో ఎమ్మార్‌ దుర్వినియోగపర్చినట్టు స్పష్టమవుతుంది.
ఇంత పెద్ద ప్రాజెక్టు డెవలపర్‌ బాధ్యత తీసుకుంటున్న ఎమ్మార్‌ ఎపిఐఐసికి కేవలం రు.2 కోట్లు మాత్రం కార్పొరేట్‌ గ్యారంటీగా చెల్లించాలని నిర్ణయమైంది.ఇది గాక మరో 2.5 కోట్లకు డిడిని కూడా ఇవ్వాల్సి వుంటుంది. ఒప్పందాన్ని మంత్రివర్గ ఉపసంఘం 28-6-2003న ఆమోదించగా ఎపిఐఐసి బోర్డు 12-3-2004న ఆమోదించింది. ఇందులో ఎమ్మార్‌ కీలకమైన నిర్ణయాలలో ఎపిఐఐసిని సంప్రదించాలని,మధ్యలో సమీక్షిస్తుండాలని, ఉమ్మడి ఇంజనీర్లు ఆడిటర్లను నియమించాలని కూడా పేర్కొనబడింది. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమేర్పడింది.
వైఎస్‌ ప్రభుత్వం కొత్త జీవో
2004 మేలో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.తర్వాత ఎమ్మార్‌ కథ వేగం పుంజుకుంది.11-1-2005న ప్రభుత్వం విడుదల చేసిన జీవో 14 అంతకు ముందున్న జీవో 359(2002)ను తిరగదోడింది. కొత్త జోవో ప్రకారం మణికొండలో టౌన్‌షిప్పుల నిర్మాణం ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌ షిప్ప్‌ ప్రై. లిమిటెడ్‌(ఇహెచ్‌టిపిఎల్‌) ద్వారా జరుగుతుంది. ఇక గోల్ఫ్‌ కోర్సు వగైరాలను బౌల్డర్‌ హిల్స్‌ ప్రై. లిమిటెడ్‌ (బిహెచ్‌ పిఎల్‌) చేస్తుంది. 6000మంది సీటింగ్‌ సామర్థ్యంతో కన్వెన్షన్‌ సెంటర్‌ వగైరాలు మరో పేరిట జరుగుతాయి. ఈ మూడింటిలోనూ గతంలో వలెనే 74,26 శాతం వాటాలు వుంటాయి. ఇందులో ఎపిఐఐసి వాటా ఎకరాకు రు.29లక్షల చొప్పున(వాస్తవానికి ఇది కనీసం రు.5 కోట్లకు పై మాటే) లెక్కకట్టి జమ చేసుకుంటారు. ఒక వేళ ఇది ఇవ్వాల్సిన వాటాకన్నా ఎక్కువగా వుంటే డిబెంచర్ల కింద పరిగణిస్తారు. దీనికి అనుగుణంగా ఒక అనుబంధ ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా ఎపిఐఐసిని ఆదేశించారు.అంతేగాక ఎమ్మార్‌కు ఇచ్చే భూమిని దశలవారీగా గాక ఒక్క సారిగానే అప్పగించాలని కూడా చెప్పింది.
మారిషస్‌ మతలబు
2003లో ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఎమ్మార్‌ కథను మారిషస్‌ మార్గం పట్టించింది. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపిబి) అనుమతి తీసుకుని మారిషస్‌ చట్టాల కింద తన స్వంత సంస్థగా ఎమ్మార్‌ హౌల్డింగ్‌ అనే కొత్త పేరును తీసుకొచ్చింది.ఈ మూడు పథకాలను దాని అధీనంలోకి మార్చింది.
27-1-2005న ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్య శాఖ జీవో 22 విడుదల చేస్తూ ఈ పథకంలో రెండవ ప్రాజెక్టు కింద నిర్మించే హౌటల్‌ లాభాలు పూర్తిగా ఎమ్మార్‌కే చెందుతాయని తెలిపింది.
కోనేరు ప్రసాద్‌ ప్రవేశం
కీలక పరిణామం
ఈ జీవో22 విడుదలైన తర్వాత రెండు రోజులకే జనవరి 29న ఒప్పందంలోకి మరో సూత్రధారి ప్రవేశం జరిగిపోయింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ స్టైలిస్‌ హౌమ్స్‌ ప్రై. లిమిటెడ్‌ను ఏజంటుగా నియమించుకుంటూ ఒప్పందంపై సంతకాలు చేసింది. విల్లాల అమ్మకం బాధ్యత దాని పరమైంది. ఈ ఒప్పందం కింద విల్లాలు అమ్మడంతో పాటు అదనంగా 4 శాతం కమిషన్‌ తీసుకోవడానికి కూడా స్టైలిష్‌ హౌమ్స్‌ అనుమతించబడింది. సూటిగా సాక్ష్యాలు లేనప్పటికీ స్టైలిష్‌ హౌమ్స్‌ కోనేరు ప్రసాద్‌కు సంబంధించిందని భావిస్తున్నట్టు దినేష్‌ రెడ్డి నివేదిక సూచించింది. ఆయనకు ఎమ్మార్‌తోనూ సంబంధాలున్న సంగతి ఎత్తిచూపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇదే కీలకమైన లింకు గనక దీనిపై లోతుగా పరిశోధన అవసరమని సిఫార్సు చేసింది. అందుకు చాలా కారణాలున్నాయి.

కొసమెరుపు: ఇంకా అనేక చిన్న చితక మలుపులు వున్నా చట్టాన్నే బేఖాతరు చేసిన విషయం ఒకటుంది. ఇరు సంస్థల మధ్య 28-12-2005న కుదిరిన కన్వీనెన్సు ఒప్పందాన్ని పది మాసాల తర్వాత 12-10-2006న గాని రిజిస్టరు చేయలేదు.వాస్తవానికి దీన్ని నాలుగు మాసాలలోగానే రిజిస్టరు చేయాల్సి వుంటుంది. అలా చేయకపోతే కారణమైనా లిఖిత పూర్వకంగా తెలియజేయాలి.ఇదేమీ జరగలేదు.

1 comment:

  1. రవి గారు,
    ఎమ్మార్‌ యొక్క అక్రమాల పూర్వ పరాల గురించి చాలా చక్కగా వ్రాసారు. ఇన్నాళ్ళు మాన రాష్ట్ర రాజకీయ నాయకులూ మీదే తప్పు అంటే మీదే ఇమీద తప్పు అనుకొంటూ ఒకరి మీద మరొకరు దొమ్మెత్తి పోసుకొంటూ అసలు విషయం పై రాష్ట్ర ప్రజానికాన్ని కన్ఫ్యూజ్ చేసేశారు. మీడియా డిబేట్ల లొ ప్రజలకు తెలిసింది ఒకటే ఎమ్యార్ లొ ఏదో జరిగింది. కాని దాని గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదను కొంటాను(నా వరకయితే తెలియదని 100% ఒప్పుకొంటాను). మీ ఆర్టికల్ లొ ఏ ఏ దశలలో ఈ ఇమార్ రాష్ట్ర ఖజానాకు గండికొట్టింది తెలిపారు. ఎమ్మార్ వారిని వారికి అండగా ఉన్నరాజకీయ నాయకులను, అధికారులను అరెస్ట్ చేసి వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయాలి.

    ReplyDelete