Pages

Monday, September 5, 2011

ఆలస్యమైనా, అనివార్యంగా అరెస్టులు


కర్ణాటక కార్పొరేట్‌ రాజకీయ ప్రముఖుడు గాలి జనార్ధనరెడ్డి అరెస్టు ఆలస్యంగా అనివార్యంగా జరిగిందే. సుప్రీం కోర్టు అనేక సార్లు అక్షింతలు వేసినా ఆయన కొనసాగగలిగారనేది తెలిసిందే. అయితే స్వంత పార్టీనే అభిశంసించి మంత్రివర్గంనుంచి తప్పించిన తర్వాత,తామే నియమించిన లోకాయుక్త సంతోష్‌ హెగ్డే తీవ్రాతితీవ్రంగా ఎండగట్టిన తర్వాత దేశంలో అవినీతి వ్యతిరేక వాతావరణం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఈ పరిణామం వూహాతీతమైంది కాదు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో రాజ్యమేర్పరుచుకుని రెండు ప్రధాన పార్టీలైన బిజెపి కాంగ్రెస్‌లనూ, రెండు రాష్ట్రాలనూ కూడా ఆటాడించేందుకు యత్నించిన ఆయన ఆఖరికి చట్టం బోనులో బందీ అయ్యారంటే అందుకు బలమైన కారణాలున్నాయి. ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ పేరుతో సరిహద్దులను అతిక్రమించి అనుమతులను ఉల్లంఘించి ప్రకృతిని ధ్వంసమవుతున్నా ప్రజలపై ప్రభావం పడుతున్నా ఖాతరు చేయకుండా ఆయన చెలరేగిపోయారు. అందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కర్ణాటక బిజెపి అండ లభించింది.ఎన్ని లక్షల టన్నులు అక్రమంగా తవ్వారు ఎన్ని వేల కోట్లు నష్టం తెచ్చారు అన్నది సుప్రీం సాధికార నివేదికలోనూ లోకాయుక్త అభిశంసనలోనూ వివరంగా వుంది. నిజానికి మన మైనింగ్‌ విధానంలో ప్రైవేటుకు పెద్ద పీట వేసిన తర్వాత ప్రకృతిపైన ప్రజాధనంపైన జరుగుతున్న దాడిలో ఇది ఒక భాగం.అయితే గాలి సోదరులు ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నందువల్ల ఆ దాడి మరీ ఇష్టానుసారంగా సాగించగలిగారు. బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో పెట్టని పరిశ్రమకు గనులు కట్టబెట్టిన అప్పటి ్‌ ప్రభుత్వ నిర్వాకం గురించి ఎంత చెప్పినా తక్కువే.సరిహద్దుల ఉల్లంఘన, అనుమతి మించి తవ్వకం,తవ్వింది చూపకపోవడం,రవాణాలో అక్రమాలు, రోడ్ల నాశనం, అటవీ సంపదపై దాడి, ఆరోగ్యాలపై ప్రభావం, స్వంత పార్టీ ప్రభుత్వాన్నే గడగడలాడించి ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కంటతడి పెట్టించిన పెత్తనం ఇవన్నీ ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరులు కొల్లగొట్టిన ఫలితంగా దక్కిందే.బళ్లారి అనేది వారి స్వంత రాజ్యంగా మారిపోయిందిన లోకాయుక్త హెగ్డే తేల్చిచెప్పారు. ఇంత జరిగినా ఆయనను వెనకేసుకొచ్చిన ఇంకా వస్తున్న బిజెపి అగ్రనేతల నీతి వచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో రాజకీయం వుండొచ్చు గాని నిర్దోషులపై చర్య తీసుకున్నట్టు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం. ఇక జగన్‌ మోహన్‌ రెడ్డి గాలి తో తనకు సంబంధం లేదని చెప్పడం చెల్లుబాటయ్యేది కాదు. వైఎస్‌ తన తండ్రి అంటున్న గాలితో ఆయన కుటుంబానికి సంబంధం లేదని ఎవరూ నమ్మరు. పోనీ అరెస్టును ఆహ్వానిస్తున్నారా అంటే అదీ లేదు. పైగా ఆ విషయం తనను ప్రశ్నించడమే మీడియా నైతికతకు విరుద్దమని విరుచుకుపడడం మాత్రం వింత గొల్పుతుంది. అంగ బలం అర్థ బలం పుష్కలంగా గల గాలి రేపు న్యాయసహాయంతో తప్పక తన పోరాటం తాను చేయొచ్చు. చివరకు జరిగేది జరుగుతుంది.కాని మైనింగ్‌ చట్టాలను మార్చకపోతే మాత్రం రేపటి తరాలకు మిగిలేదేమీ వుండదు. ఆ వివరాలు,ఇతర అంశాలు మరో సారి చర్చించుకోవచ్చు.

1 comment:

  1. వెయ్యి గుడ్లు తినేసీ వరకూ రాబందులని ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్ధం కాదు... పైగా ఈ రాబందు ఒక్కడి వల్ల కాదు.. ఎంతో మంది నక్కలు, తోడేళ్ళూ కలస్తేనే గాని దానికి ఎంతో కాలం (సుమారు పదేళ్ళ పాటు) తినేసే వరకూ ఎందుకు ఊరుకుంటున్నారు...

    ReplyDelete