Pages

Saturday, September 10, 2011

ఎమ్మార్పణకు పూజారిగా ఎపిఐఐసి






జగన్‌ ఆస్తులపై దర్యాప్తు, గాలి జనార్ధనరెడ్డి అరెస్టులతో పాటు రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారం ప్రయివేటీకరణ విధానాల వినాశకర ఫలితాలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ భూములనూ ప్రజల భూములను అప్పణంగా అప్పగించి ఇష్టారాజ్యం సాగించిన ఎమ్మార్‌కు ఎపిఐఐసి అధికారగణం దాసోహమైంది. ఒప్పందమే లోపభూయిష్టం కాగా దాన్ని కూడా అడుగడుగునా ఉల్లంఘిస్తుంటే ఉత్సాహంగా సహకరించింది. ఉద్దేశిత లక్ష్యాల నుంచి వైదొలగి వ్యాపారాలు చేసుకుంటున్నా, ఇష్టానుసారం ఒప్పందాన్ని మార్చేసి ఏకపక్షంగా కొత్త సంస్థలను సృష్టిస్తున్నా, వేల కోట్ల లాభాన్ని పూడ్చలేని నష్టంగా చూపిస్తున్నా అన్నిటికీ అప్పటి ఎపిఐఐసి పాలకవర్గం పూర్తిగా కుమ్మక్కయింది. బినామీ పేర్లతో ఖరీదైన కోటలు అనుమానాస్పదంగా కట్టబెడుతున్నా, దాన్ని మాఫీ చేసుకునేందుకు పెద్ద మనుషులు పందేరంలా ప్రముఖులకూ సౌధాలు కేటాయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది.దినేష్‌ రెడ్డి నాయకత్వంలోని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం జరిపిన దర్యాప్తులో ఇందుకు సంబందించి వెల్లడైన నిజాలు దిగ్బ్రాంతికరంగా
వున్నాయి. ఇంత బారీ కుంభకోణం లోతుపాతులు తెలియాలంటే మరింత విస్త్రతమైన దర్యాప్తు అవసరమని ఆయనే అభిప్రాయపడటం గమనార్హం. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు బాధ్యతను హైకోర్టు సిబిఐకి అప్పగించినందువల్ల మరిన్ని నగ సత్యాలు బయిటకు రావడం ఖాయం.

ఎపిఐఐసి.. ఆంధ్ర ప్రదేశ్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ 1972లో ఏర్పడింది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు సృష్టించేందుకు ఉద్దేశించిన ఈ సంస్థకు 1974 జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక శాఖ అధీనంలో వున్న ఇండిస్టియల్‌ ఎస్టేట్లన్నీ దఖలు పర్చాయి. ఆటోనగర్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, ఆపారల్‌ పార్కులు, బయోటెక్‌ పార్కులతో సహా మొత్తం 320 పారిశ్రామిక పార్కులు ఎపిఐఐసి తీర్దిదిద్దినట్టు లెక్కలు చెబుతున్నాయి.73 ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌లు) రాష్ట్రంలో ఏర్పాటయితే ఇందులో 17 నేరుగానూ,4 ప్రైవేటు రంగంతో కలసి ఎపిఐఐసి నిర్వహిస్తోంది.ప్రభుత్వ భూములకు తోడు రైతుల నుంచి సేకరించిన భూమి కూడా కలిసి మొత్తం 1,36,838 ఎకరాలు భూమి దాని అదీనంలో వుంది. తన అధీనంలో పథకాలు నడిచే చోట స్తానిక సంస్థల అధికారాలు కూడా చలాయించేందుకు ఎపిఐఐసికి చట్టం అనుమతినిస్తున్నది.ఐఎఎస్‌ అధికారులతో సహా విస్త్రతమైన పాలనా యంత్రాంగం వుంది.

ఇంత ఘనమైన ఎపిఐఐసి పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం అనబడే పిపిపి పద్ధతి వచ్చాక ఉపగ్రహం కన్నా అధ్వాన్నమైన స్థితికి ఎలా దిగజారిపోయిందో ఎమ్మార్‌-ఎంజిఎఫ్‌ ఉదంతం కళ్లకు కట్టి చూపిస్తున్నది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం విస్త్రతంగా జరిపిన దర్యాప్తులో వెల్లడైన విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.ఎవరు ఎంత వరకూ బాధ్యులనే చర్చ అటుంచి ప్రభుత్వ ఆస్తులు ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వనరులు ఏ విధంగా అవినీతి సంస్థలకు హక్కుభుక్తమై పోతున్నాయో ఈ నివేదికలో ప్రతి అక్షరం సాక్ష్యం చెబుతున్నది.
ఎపిఐఐసి ప్రైవేటు భాగస్వామ్యంతో మొదటి సారి ఎల్‌అండ్‌ టితోకలసి మాదాపూర్‌లో హైటెక్‌ సిటీని నిర్మించింది.ఇక టూరిజం, వాణిజ్యవేత్తల సమావేశాలకు నివాసాలకు సదుపాయాల కల్పన,గోల్ప్‌ కోర్సు మైదానం వగైరాల కల్పన కోసం ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌తో కలసిన సముదాయాన్ని నిర్మించడం కోసం దుబారుకి చెందిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ను ఎంపిక చేసింది. తెలుగు దేశం హయాంలో 2002 నవంబరు11న అవగాహనా ఒప్పందం, 2003 ఆగష్టు 19న పరస్పర భాగస్వామ్య ఒప్పందం కుదిరాయి. దానిపైన కూడా విమర్శలు వున్నా 2005 జనవరి 11న కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవోతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విజిలెన్స్‌ నివేదిక కూడా దాన్నే ధృవీకరిస్తున్నది. మరో పద్దెనిమిది రోజుల తర్వాత 29వ తేదీన ఈ ఒప్పందంలో స్టైలిష్‌ హౌమ్స్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థ ప్రవేశించింది. ఇది కోనేరు ప్రసాద్‌ ఆధ్వర్యంలో వున్నట్టు విజిలెన్స్‌ నివేదిక సూచించింది. వాస్తవానికి ఆయన ఎమ్మార్‌ గ్రూపుతో సంబంధం వున్నవారేనని నివేదిక పేర్కొంటున్నది. ఈ వ్యవహారంలో స్టైలిష్‌ హౌమ్స్‌ ఏకైక ఏజంటుగా తయారైంది. ధరల నిర్ణయం వగైరాలన్ని చేయడంతో పాటు కొనుగోలు దార్ల దగ్గర అదనంగా నాలుగు శాతం వసూలు చేసేందుకు దానికి అధికారం ఇవ్వబడింది.
2005 మే నెలలోనే ఎమ్మార్‌ ఎంజిఎఫ్‌ అనే కొత్త సంస్థ రంగం మీదకు వెచ్చింది. తర్వాత అది ఎమ్మార్‌ ఎంజిఎఫ్‌గా మారిపోయింది. ఇవన్నీ కూడా ఒకే యాజమాన్యం కింద నడుస్తుండడం ఇక్కడ గమనించవలసిన విషయం. కేవలం లెక్కలను తారుమారు చేసేందుకు రకరకాలైన నామకార్థపు సంస్థలను సృష్టించి వాటాలు వేసినట్టు స్పష్టమవుతుంది. ఈ మల్లగుల్లాల మధ్యలో ఎపిఐఐసి ఏం చేస్తున్నది సమావేశాల మినిట్స్‌ పుస్తకాల్లో కూడా సరిగ్గా లేదు. మొత్తం అరవై కీలక పత్రాలను నిర్ణయాలు ఒప్పందం ప్రతులను పరిశీలించిన విజిలెన్స్‌ వారిక అన్నీ అంతుపట్టలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహారాలు నడిచాయో తెలుస్తుంది.మొత్తానికి ఈ మతలబుల మధ్య ప్రభుత్వ సంస్థ అయిన ఎపిఐఐసి వాటా అసలే అంతంత మాత్రంగా వున్న 26 శాతం నుంచి 4 శాతానికి తగ్గిపోయింది. లాభంలో వాటా అని రాసుకోవడం వల్ల ఎమ్మార్‌ అంతా నష్టమే చూపించడం వల్ల అసలు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి జమ పడింది లేదు!
ఎంతో సమర్థతతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన ఎమ్మార్‌ పదే పదే తన దగ్గర డబ్బు లేదంటూ బీద అరుపులు అరవడం విచిత్రం. అయినా ఎపిఐఐసి ఎంతో ఉదారంగా ఆ భూమిని ఆక్సిస్‌ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి 150 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అంగీకరించింది. సత్యం రామలింగరాజు 108 నిర్వహణ కోసం అప్పగించిన 32 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి తెచ్చుకున్న తీరును ఇది గుర్తుకు తెస్తుంది. ఇక చదరపు గజం భూమి రు.50 వేలకు తక్కువ కాని చోట కేవలం రు.5000కే అమ్మినట్టు ఎమ్మార్‌ చెబుతున్నది.అది కూడా ప్రకటిత లక్ష్యంతో నిమిత్తం లేకుండా వందమందికి పైగా విఐపిలకు ఆ విల్లాలు కేటాయించారు. మరి వారు నిజంగానే కారు చౌకగా కొన్నారా లేక నల్లడబ్బు చాటుగా చెల్లించారా అన్నది సిబిఐ దర్యాప్తులో తేలాలి.ఈ ఒక్క తరహా ఆదాయమే రు.800 కోట్ల పైమాట.
ఇక పారిశ్రామిక వాణిజ్య సంస్థల కోటాలో ఉదారంగా తక్కువ ధరకు కేటాయించిన అనేక ఫ్లాట్లు వాస్తవంలో ఎమ్మార్‌ యాజమాన్యానికి నమ్మకస్తులైన ఉద్యోగులు అధికారులే తీసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. అంటే వారు ఇతరులకు బినామీలుగా వున్నారన్నమాట. వారికి ఏ పరిశ్రమలూ లేవు. ఈ వుదంతంలో ఇది మరో కోణం.
4000 కోట్ల రూపాయలకు పైబడిన విలువ గల భూమిపై ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మార్‌ ఉదంతంలో అనేక వంచనలు, మోసాలు,అవకతవకలు, ప్రలోభాలు, అక్రమాలు కోకొల్లలు. మొదటే చెప్పుకున్నట్టు ఘనత వహించిన ఎపిఐఐసి అధికారులు రాష్ట్ర వ్యాపితంగా ఇన్ని లావాదేవీల్లో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. ఎదురు సోమ్ములిచ్చి తిరుక్షవరం చేయించుకున్న చందం.
కొస మెరుపు: ఈ వ్యవహరంలో ప్రధాన బాధ్యుడుగా అరోపణలకు గురవుతున్న ఎపిఐఐసి పూర్వపు ఎండి బిపిఆచార్య ఆధ్వర్యంలో ఎవరైతే న్యాయ విభాగాన్ని చూశారో వారే ఇప్పటికీ సంస్థ న్యాయవిభాగాధికారిణిగా సారథ్యం వహిస్తుండడం ఇందులో కోస మెరుపు. వారికి నిజానిజాలు బయిటకు రావడం ఇష్టం వుంటుందా?ప్రస్తుత ఎండి బిఆర్‌ మీనా ఆలోచించవలసిన విషయం.

No comments:

Post a Comment