Pages

Saturday, September 10, 2011

సంపూర్ణ సంపాదకుడు..సున్నితమైన పద పొందిక, సముచితమైన వాక్య నిర్మాణం, సమతుల్య ప్రతిస్పందన కలిస్తే నండూరి రామమోహనరావు. ఆయన సంపాదక శాస్త్ర సాహిత్య వేత్త. తెలుగు సంపాదకులు సర్వజ్ఞులు అని ఆయన అంటుండేవారు. ఏ అంశంపైనైనా ఎడాపెడా రాసేస్తుంటారనీ, రాయాల్సి వుంటుందనీ ఆయన భావం. తను మాత్రం ఏది ఎడాపెడా రాయలేదు. ఆచి తూచి రాశారు. అలాగే జీవించారు. పాత్రికేయులకు ప్రామాణికంగా నిలిచార్తు. ఎన్నో వాద వివాదలతో నిండిన నేటి వాతావరణంలోనూ ప్రతివారూ ఆయనకు తలుచుకున్నారంటే కారణమదే. ప్రగతిశీల పాత్రికేయుడుగా మొదలై అనువాదాలలో రాణించి వైజ్ఞానిక రచనలకు వరవడి పెట్టి సంపాదకుడుగా స్థిరముద్ర వేసిన దినీ విజ్ఞాన సర్వస్వం ఆయన. అంత జ్ఞానవంతుడైనా ఒద్దికగా వుంటూ కలసిన ప్రతివారినీ ప్రభావితం చేసిన సంయమి.
నండూరి జీవిత సాఫల్యానికి బలమైన నేపథ్యమే వుంది. బళ్లో చదువుకుంటున్నప్పుడే విజ్ఞానం అన్న లిఖిత పత్రకను నడపడం ఆయన భావి జీవిత సంకేతం. అమ్మ సేకరించి పెట్టిన శ్రీ మహాభక్త విజయం చిన్నతనంలోనే చదివి దైవభక్తులతో పాటు దేశ భక్తుల జీవితాలూ తెలుసుకున్నారు. పెత్తండ్రి నండూరి శివరావు గుడివాడలో ప్రచురణాలయం స్థాపించడం వల్ల ద్విజేంద్రలాల్‌ రారు బెంగాలీ నాటకాల అనువాదాలు చదివే అవకాశం వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'తేళ్లకు జెర్రులకు కూడా వెరవక అటకపైన వున్న ఆ కట్టలు తీసుకుని' చదువుతుండేవారు. ఆ వూపులోనే
కాళిదాసు,భవభూతుల గురించీ ద్విజేంద్ర ద్వారానే తెలుసుకున్నారు.(పెత్తండ్రి భాగస్వామి అయిన జంధ్యాల శివన్న శాస్త్రి అనువాదంలో) లెక్కలేనన్ని సార్లు చదివి ఆస్వాదించిన కారణాన తనకు ప్రాచీన సాహిత్య పరిచయం కలిగించిన తొలి గ్రంధం అదే నని బల్లగుద్ది చెబుతారు.అక్కడే భారతి పాత సంచికలు వీణ పత్రిక ప్రతులు కూడా చూడగలిగారు.ఆ పాఠశాల రోజుల్లోనే పాంచ్‌ఖడీదేవ్‌ అపరాధపరిశోధక నవలలు కూడా వూదిపారేశారు.తర్వాత విశ్వనాథపుస్తకాలు వగైరా. బందరు, తర్వాత రాజమండ్రి కాలేజీ చదువుల రోజుల్లో నరసింహన్‌ అనే అధ్యాపకుడి ప్రభావంతో షేక్స్‌పియర్‌, షెల్లీ,కీట్స్‌ తదితరులను చదవడం ప్రారంభించారు. అధ్యయన శీలతే ఆయనకు అక్షర సంస్కారమిచ్చింది.
తెలంగాణా సాయుధ పోరాట కాలంలో సుందరయ్య రహస్య స్థావరం అయిన కృష్ణాజిల్లా గన్నవరం ప్రాంతంలో ఆరుగొలను గ్రామంలో జన్మించిన నండూరి రామమోహనరావు సహజంగానే ఆ ప్రభావంలో పడ్డారు. అదే గ్రామంలో మొఖాసాదార్ల కుంటుంబంలో పుట్టిన తొలితరం కమ్యూనిస్టునేత నండూరి ప్రసాదరావు ఆయనకు బాబారు కూడా. ప్రజాశక్తి నగర్‌తో సంబంధంలో వున్న నండూరి ఉద్యమంపై సాగిన నిర్బంధానికీ సాక్షి..ఆ నేపథ్యంలోనే 1948లో ప్రభుత్వ దాడి తీవ్రమైన సమయంలో ఆంధ్ర పత్రిక లో చేరారు.1955 మధ్యంతర ఎన్నికల పోరాటంలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఆంధ్ర పత్రిక వేదికగా మారింది. శ్రీశ్రీపై సంపాదకుడు పండితారాధ్యుల నాగేశ్వరరావు 'ఒక రచయిత' పేరుతో బనాయిస్తున్న వ్యాసాలకు నండూరి 'ఒకానొక రచయిత' పేరిట జవాబు రాయడం ఒక సాహసం. అదే ఎన్నికల కాలంలో ఆంధ్ర ప్రభలో కమ్యూనిస్టు వ్యతిరేకతకు పట్టం కట్టిన నార్ల వెంకటేశ్వరరావు కొన్ని పరిణామాల తర్వాత కెఎల్‌ఎన్‌ ప్రసాద్‌ స్థాపించిన ఆంధ్రజ్యోతి సంపాదకుడైనప్పుడు నండూరి సహ సంపాదకుడయ్యారు. నార్ల ప్రేరణతోనే పరిణామక్రమాన్ని చెప్పే విశ్వరూపం, నరావతారం అనే రెండు ప్రామాణిక గ్రంధాలు రాసి చరితార్థులయ్యారు. విశ్వరూపంలో ప్రతి అధ్యాయానికి ముందు ఒక కవితా చరణాన్ని లేదా పద్యపాదాన్ని ఇవ్వడం ఆయన సాహిత్యాభిరుచికి దర్పణం. ఇలాటి ఆయనకు మార్క్‌ ట్వేన్‌ రచనలు అనువదించడం పెద్ద పనేమీ కాదు.విశ్వ దర్శనం పేరిట ప్రపంచ తత్వవేత్తల పరంపరపై రాసిన పుస్తకం మరో పెద్ద కృషి. అక్షర యాత్ర పేరిట రాసిన దానిలో సాహిత్య లేఖనాలుంటాయి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలసి సంకలనం చేసిన మహా సంకల్పం ముందు మాట ఆయనలోని విమర్శకుణ్ని, పరిశీలకుణ్ని పట్టి చూపుతుంది. ఒక శాస్త్ర వేత్త ఏ విధంగా చైతన్యాన్ని జేగీయమానం చేస్తాడో ఒక కవి కూడా చైతన్యాన్ని కలిగిస్తాడంటూ 'శ్రీశ్రీ చేసింది అదే' అని ఆయన గొప్ప తీర్పు చెప్పారు. తెలుగు కవిత్వంలో నిర్వేదం ఎప్పుడు ఎలా ప్రవేశించిందో విశ్లేషణాత్మకంగా చెప్పింది చూస్తే తర్వాత సాహిత్య దశలను తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతాము.
ఇక సుపరిచితమైన ఆయన పత్రికా శైలి. నార్ల తర్వాత సంపాదక బాధ్యతలు స్వీకరించిన నండూరి బాషలోనూ భావ వ్యక్తీకరణలోనూ అనుసరణీయ ప్రమాణాలు నెలకొల్పారు. అనువాదం,ఉచ్చారణ వంటి విషయాలలో రాజీ పడలేదు.విశ్లేషణ చేసినా వివాదాలకు ఆస్కారం వుండదు. మరీ మెత్తగా వున్నారా అని ఎప్పుడైనా సందేహం కలిగినా తప్పును ఒప్పనడం జరగేదు. దివిసీమ తుఫానుపై (ఉప్పెన ఆలస్యంగా లోకానికి తెలిసింది) నవంబరు 19 రాత్రి అని ఆయన రాసిన సంపాదకీయం ఆ గండాన్ని ఎదుర్కొన్నప్పటి పరిస్తితినే కళ్లకు కట్టింది. సంపాదకీయాలు అలానూ రాయొచ్చని నిరూపించింది. సుందరయ్య కన్నుమూసినపుడు 'జీవించి వుండగానే కథాత్మక వ్యక్తులు(లెజెండ్స్‌)గా మారే వారు అరుదు.కాని సుందరయ్య విషయంలో చాలా దశాబ్దాల కిందటే అలాటి కథలు వినిపించేవి' అంటూ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ విజయ పరంపరలు వర్ణించడానికి హ్యాట్రిక్‌ అన్న పదం ఎప్పుడో అయిపోయినందున టెన్నిస్‌లోని గ్రాండ్‌ స్లామ్‌ అన్న మాటను తీసుకుంటున్నామని వివరణాత్మకంగా రాశారు. ఇలా ఒక సందర్భానికి తగిన మాట రాయడంకోసం ఆయన అంత ప్రాధాన్యతనిచ్చేవారు. అప్సర్‌ ఆధ్వర్యంలో సాహిత్యం కోసం ప్రత్యేకంగా పేజీ ప్రచురించడం కూడా ఆయన సాహిత్య నిబద్దతకొక నిదర్శనమే.
.1985 తర్వాత ఆరుద్ర ఎప్పుడు విజయవాడ వచ్చినా ముందు నేను కలుస్తుండేవాణ్ని. ఆయన అనుపమ హౌటల్‌లో దిగడం, మొదట నండూరికి ఫోన్‌ చేయడం పరిపాటి. అలాగే నవోదయ రామ్మోహనరావు, బాబ్జీ తదితరులకు.. ఈ దిగ్గజాలంతా మాట్లాడుతుంటే మధ్య మధ్య నేనూ మాట్లాడటం వినడం అదో ఆనందం, అనుభవం కూడా. సమగ్రాంధ్ర సాహిత్యంలో యుగ విభజనపై ఆరుద్ర నండూరి, పురాణం అభిప్రాయాలు అడిగినపుడు చెరో విధంగా స్పందించడం ఇప్పటికీ గుర్తుంది. రాజులను బట్టి గాక కవులను బట్టి విభజన చేస్తే విశ్వనాథ శ్రీనాధయుగంలోకి వెళతారని నండూరి అన్నారు. ఆయనతో కలసి కొన్ని సభల్లో పాల్గొన్నప్పుడు నేను చిన్నవాడినయినా సూటిగా మాట్లాడటాన్ని అభినందిస్తుండేవారు. తన సహచర సంపాదక రచయిత తుర్లపాటి కుటుంబరావు ఉపన్యాస కేసరి అయినా తను మాత్రం తక్కువగానే సభలకు వచ్చి ముక్తసరిగానే ముగించేవారు. మరో పత్రికలో బాధ్యుడుగా వున్నా ఆయన ఆంధ్రజ్యోతిలో నా వ్యాసాల ప్రచురణకు అప్పట్లో అవకాశమివ్వడం కూడా ఆయన సౌజన్యమే. ఈ గమనం దానికి కొనసాగింపే అనొచ్చు. ప్రజాశక్తి ప్రచురణగా కె.రామచంద్రమూర్తి రచించిన వార్తారచన అయనే ఆవిష్కరించారు. నండూరి, సి.రాఘవాచారి, తర్వాత పొత్తూరి, కాస్త విడిగా ఎబికె,గజ్జల మల్లారెడ్డి, వీరంతా గత తరం సంపాదక మూర్తులు.
కాట్రగడ్డ నరసయ్య కీశే మిక్కిలినేని, కీశే బొమ్మారెడ్డి వంటివారి సాంగత్యంలో నండూరి తరచూ కనపడుతుండేవారు. మలిదశలో కొంత ఆధ్యాత్మికత వంటపట్టించుకున్నట్టు కనిపించేదిగాని అది పెద్దగా మాట్లాడాల్సింది కాదు. 2008 తర్వాత ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తినిపోయిన కారణంగా నేను పెద్దగా కలుసుకోలేకపోయాను. కాకపోతే పైన పేర్కొన్న వృద్ధ పౌరుల ద్వారా ఆయన అభిప్రాయాలు, స్పందనలు తెలుస్తుండేవి. ఆయన తన పఠనాభిలాషపై విజయవాడ బుక్‌ ఎగ్జిబిషన్‌ సావనీర్‌ కోసం రాసిన వ్యాసాన్ని చాలాసార్లు పునర్ముద్రించుకున్నాను. నండూరి ఆరోగ్యం విషమించిందని విన్నా ఏదో వూరికి వెళ్లినందువల్ల టీవీ చూడకపోవడంతో మరణవార్త ఆలస్యంగా తెలుసుకోగలిగాను. ఈ సంగతి చెప్పిన మిత్రుడు కొండపల్లి పావన్‌ నన్ను మెచ్చుకుంటూ నండూరి అన్న మాటలు చెప్పినప్పుడు విచారంలోనూ విస్మయం చెందాను. హైదరాబాదు తిరిగివచ్చాను గనక మళ్లీ అంత దూరం వెళ్లే అవకాశం లేకపోయింది. నండూరి తీర్చి దిద్దిన పత్రికలో ఈ నివాళి అర్పించి ఆ లోటు తీర్చుకుంటున్నాను. రెండు మూడు తరాల పాత్రికేయులకు ఆయన పెట్టిన వరవడి, తెలుగు భాషా సాహిత్యాలలో శాస్త్ర విజ్ఞాన రచనల్లో ఆయన నుడి చిరకాలం నిలిచి వుంటాయి. ఈ హడావుడి కాలంలో వ్యర్థ వివాదాల మాయాజాలంలో నండూరి మార్గం స్మరణీయం, అనుసరణీయం. పుస్తకాలే తన నేస్తాలని ఘంటాపథంగా చెప్పడం ఆయన పుస్తకప్రేమను ప్రతిబింబిస్తుంది. అలాగే ఆయన కూడా అనేకానేకమంది అక్షర ప్రియులకు అభ్యుదయ వాదులకు నేస్తంగా గుర్తుండిపోతారు. సంపాదకుడున్న నాకింపారెడు భక్తి గలదు అన్న శ్రీశ్రీ ప్యారడీలోని చివరి వెటకారాన్ని తీసేసి సంపూర్ణమనుజాడతడు, సభ్యతకే మారు పేరు సిరిసిరి మువ్వా అని సవరిస్తే నండూరికి నప్పుతుంది.
ఆంధ్రజ్యోతి,గమనం, 16.9.11
 

No comments:

Post a Comment