Pages

Thursday, September 1, 2011

వికీలీక్స్‌వివాదం: వివిధ కోణాలు


ప్రపంచాన్ని కుదిపేసిని వికీలీక్స్‌ పత్రాల సెగ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు తాకినట్టు కనిపిస్తుంది.రాష్ట్రం అట్టుడికి పోయిన 2009 డిసెంబరు 12 వ తేదీన డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అమెరికా కన్సలేట్‌ జనరల్‌తో చేసినట్టు చెప్పబడుతున్న వ్యాఖ్యానాలు ఇందుకు కారణం. అయితే ఆయన అలా చెప్పినట్టు అమెరికా ప్రతినిధి చెప్పడమే ఇందుకు ఆధారం. తాను అలా అనలేదని మనోహర్‌ ఖండిస్తున్నారు.ఇంతకూ మనోహర్‌ పేరిట అమెరికన్‌ కేబుల్‌లో వున్న విషయాలు ఆ రోజుల్లో చాలా మంది చెప్పుకున్నవే.ఇప్పటికీ అలాటి మాటలు వినిపించడం లేదని చెప్పడం కష్టం. తెలంగాణా విభజన కోసం సాగుతున్న ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర గురించి విరుద్ధ దృక్పథాలు కనిపిస్తుంటాయి. మావోయిస్టులు, లేదా వారితో సంబంధం గల వారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యమంలో పాత్ర వహించడం కనిపిస్తూనే వుంటుంది.నగ్జలైట్‌ గ్రూపులు కొన్ని నేరుగా ఉద్యమాన్ని బలపరుస్తుంటే మరికొందరు తమవైన వేదికలు ఏర్పాటు చేసుకుని స్వంత కార్యాచరణ సాగిస్తున్నారు. ఇటీవలనే బిజెపి నాయకుడు కిషన్‌ రెడ్డి ఒక ఉమ్మడి సభలో మాట్లాడుతూ మావోయిస్టులతోనైనా కలసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా.
ఉద్యమంలో మావోయిస్టులు ఎంత శాతం వున్నారు వారి ప్రభావం ఎంత అన్న దానిపై భిన్నాబిప్రాయాలున్నా వారున్నారనే అంశాన్ని ఎవరూ కాదనలేరు.ఉండటం తప్పని కూడా
చెప్పలేరు. నిజానికి మావోయిస్టులు వున్నారన్న మాటలపై ఆగ్రహించడం మావోయిస్టులకే ఎక్కువ కష్టం కలిగించాలి గాని వారెందుకో వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. ఈ మధ్యనే టిఆర్‌ఎస్‌ నాయకులు తాము అధికారంలోకి వస్తే నగ్జలైట్‌ అజెండా అమలు చేస్తామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. మావోయిజం లేద నగ్జలిజం అన్న పదాల వెనక వున్న ప్రగతిశీల యువతను ఆకర్షించాలనుకుంటూనే వారు ఉద్యమంలో వున్నట్టు చెప్పుకోవడానికి సంకోచించడం ఇక్కడ స్పష్టం.(బెంగాల్‌లో మమతా దీదీ లాగా) దళితుల విషయానికి వస్తే ఈ ఉద్యమంలోనే కాదు, ప్రైవేటీకరణ యుగంలో సామాజికంగా వెనకబడిన బలహీన వర్గాలే ఎలాగో తంటాలు పడి ప్రభుత్వ సంస్థలలో చదువుకుంటున్నారనేది సామాజిక పరిశీలకుల విద్యావేత్తల భావన. ఆ రీత్యా ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ దళిత సంఘాలు ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించడం కూడా కాదనలేని వాస్తవం. ఈ వ్యాఖ్యలు చేయలేదన్న మనోహర్‌ ఖండన ఒకటైతే అసలు వారు ఉద్యమంలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని చెప్పడాన్ని ఉద్యమ కారులే ఎందుకు తప్పు పడుతున్నట్టో అర్థం కాదు. ఉద్యమం అంతకన్నా విస్త్రతమైనదని చెప్పడం వేరు వారి పాత్రను ప్రస్తావిస్తే తప్పు పట్టడం వేరు. ఇదే ఇక్కడ వైరుధ్యం
ఇక అమెరికా వారితో మాట్లాడటం విషయానికి వస్తే స్పీకర్‌ కార్యాలయం ఖండన రీత్యా దీనిపై శ్రుతి మించిన వివాదం వల్ల ప్రయోజనం లేదు. ఇక ఈ సందర్భంలో అమెరికా దౌత్యాధికారులపై అమితమైన విశ్వాసంతో రాష్ట్రానికి చెందిన నాయకులు మాట్లాడటం మాత్రం వారి స్వభావాన్ని సరిగ్గా ప్రతిబింబించం లేదు. అన్ని చోట్లా తలదూర్చి చిచ్చు పెట్టే అమెరికా ఏదో సత్య సంధతతో వ్యవహరిస్తుందని అనుకోవడం అవాస్తవం.వికీలీక్స్‌ కూడా కేబుల్స్‌ అధికారికమైనవని తప్ప అందులోని సమాచారం వాస్తవమైందని హామీ ఇవ్వడం లేదు. నాయకుల మాటలను యథాతథంగా ఉటంకించం వేరు, వారి మాటలపై నివేదిక నివ్వడం వేరు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల వామపక్ష నేతలకు సంబంధించి అమెరికా దౌత్య ప్రతినిధుల వ్యాఖ్యానాలు వాటికవే తప్పుగా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పె ట్టమని ఆహ్వానించినంత మాత్రాన విపరీత భాష్యాలు చెప్పడం కనిపిస్తుంది.అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ పరిణామాల్లో కూడా వారికి స్వార్థ ప్రయోజనాలు వుండవని చెప్పలేము. రాష్ట్రంలో వివిధ ఎన్జీవోలకు, అన్ని రకాల ప్రాంతీయ ఉద్యమాలకు, స్వచ్చంద సంస్థలకు, మత సంస్థలకు కూడా అమెరికా నుంచి నేరుగా నిధులు ప్రోత్సాహం అందుతున్న సంగతి బహిరంగ రహస్యం. కనక వికీలీక్స్‌ పత్రాలలో అమెరికా మాటలను యథాతథంగా తీసుకుని ఉద్రేకాలు పెంచుకోనవసరం లేదు. వారితో మాట్లాడేప్పుడు అప్రమత్తంగా వుండాలని అన్ని విషయాలు పంచుకోనవసరం లేదని మాత్రం మన నాయకులు గుర్తుంచుకోవాలి. నాదెండ్ల మనోహర్‌ స్పీకర్‌గా కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన తరుణంలో ఈ వివాదం దృష్టి మళ్లించడానికి దారితీస్తుంది.

No comments:

Post a Comment