సకల జనుల సమ్మె ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నా ప్రభుత్వాలలో ప్రతిస్పందన కనిపించడం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రతిష్టంభన కొనసాగించడం బాధ్యతా రహితం. రావణ కాష్టంలా రగులుతున్న ఈ సమస్యలో స్వీయ లాభ నష్టాల లెక్కలు తేలక కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంతో, ప్రజలతో చెలగాటమాడుతున్నది. రెండు వారాలకు చేరుతున్న సకల జనుల సమ్మె ప్రభావంతో పరిస్తితులు మరింత దిగజారుతున్న స్థితి. అయినా ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, అభిషేక్ సింఘ్వీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు స్పందనా రాహిత్యానికి అద్దం పట్టాయి. ఈ దశలో ఏ విధమైన ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకునేది లేదన్న సంకేతం పంపించడానికే కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఇలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం. మరోవైపు అదే అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులూ ఆఖరుకు మంత్రులూ ఆందోళన కారులను మించి పోయి మాట్లాడుతున్నారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ప్రత్యేక తెలంగాణా ప్రకటించేవరకూ సమ్మె ఆపేది లేదని ప్రకటిస్తున్నారు. ఈ పూర్తి విరుద్ధ వైఖరుల అనిశ్చితి ఇంకెంత కాలం సాగుతుందని అన్ని ప్రాంతాల ప్రజలూ ఆందోళనకు గురి కాక తప్పడం లేదు.అధిక ధరలు, కొత్త భారాలు, వ్యవసాయ సమస్యలు స్తంభించి పోయిన ఆర్థిక జీవితం, కొడిగట్టిన పరిపాలన, అవాంఛనీయ వాతావరణాన్ని సృష్టించాయి.
నాలుగు స్తంభాలాట
తెలంగాణా సమస్య అంటున్నప్పటికీ ఇది ఆంధ్ర ప్రదేశ్ మొత్తం భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరులను ఇప్పటికే తెలియజేశాయి. ప్రాంతాలను బట్టి మాట్లాడే కాంగ్రెస్ తెలుగు దేశం అదే వైఖరి కొనసాగిస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలోనే ప్రత్యేక రాష్ట్ర కోర్కెను వినిపిస్తూన్న కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, టిఆర్‌ఎస్‌లు తమ తమ వ్యూహాల సమరం సాగిస్తూనే వున్నాయి. ఇవి కొన్ని సార్లు మాటల యుద్ధాలకే పరిమితమైతే కొన్నిసార్లు ప్రత్యక్ష ఘర్షణలు దాడులుగానూ పరిణమిస్తున్నాయి. పార్టీలు మాత్రమే గాక రకరకాల జెఎసిలు కూడా ఏర్పడ్డాయి. ఇలాటి సమయంలో రాజకీయ శక్తులన్ని ఏకాభిప్రాయంతో ఏదో చెప్పేదాక పరిష్కారం ప్రసక్తి లేదని కేంద్రం చేతులు దులుపుకోవడం కుటిలత్వమే. అఖిల పక్ష సమావేశం ప్రకారం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికనిచ్చి ఎనిమిది మాసాలు గడిచిపోయినా ఏమీ తేల్చకుండా కాలం గడపడం వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే పథకం తప్ప మరేమీ కాదు. గతంలో అలాటి అనేక నిర్వాకాలకు కారణమైన కాంగ్రెస్ చరిత్రను ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు కూడా ప్రాంతాల వారిగా వీరంగం తొక్కుతున్న వారిలో కాంగ్రెస్ నేతలే ముందుండటం గమనించదగ్గది. తెలుగు దేశం నేతలు తర్వాతి స్తానం ఆక్రమిస్తున్నారు. ఇక బిజెపి అధికారికంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవన్నీ జాతీయ, రాష్ట్ర పార్టీలనుకుంటే ఒక ఉప ప్రాంతానికే పరిమితమైన టిఆర్‌ఎస్ కూడా వ్యూహపరమైన వైరుధ్యాలనే ప్రతిబింబిస్తున్నది. లాబీయింగు ద్వారా లక్ష్య సాధన చేస్తామన్న
ఆ పార్టీనేత అనేక సార్లు గడువులు ప్రకటించి దెబ్బ తిన్నారు. కేంద్రం వైఖరిని సూటిగా విమర్శించకపోగా అనేక సార్లు ఆశలు ప్రకటించి ఆరోపణలకు గురైనారు ఇన్ని అనుభవాల తర్వాత కూడా రెండు వారాల్లో అంతా అయిపోతుందని కెసిఆర్ కాంగ్రెస్ నిరాహారదీక్షల శిబిరంలో నుంచే ప్రకటించడం అసంబద్దంగా మారింది. విన్యాసాలతో కాలం వెళ్లబుచ్చుతున్న కాంగ్రెస్ నేతల స్థయిర్యం నిలబెట్టడానికి వ్యూహాత్మకంగా తాము అలా చేశామని సమర్తించుకోవడం ఇంకా హాస్యాస్పదంగా తయారైంది.
అంతా ఆ తాను ముక్కలే!
ఇప్పుడు నిర్ణయం జరక్కపోతే బానిసలుగా మారిపోతామన్నది కెసిఆర్ ప్రధాన నినాదంగా వుంది. వెట్టిచాకిరీపైన తిరుగుబాటు చేసి నిజాంనే కూల్చిన తెలంగాణా ప్రజలపై బానిసత్వం రుద్దడం ఎవరి వల్లా కాదని అందరికీ తెలుసు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, తర్వాతి తెలుగు దేశం ప్రభుత్వాల అలక్ష్యం వల్ల అనౌచిత్యాల వల్ల తెలంగాణాలో గాని ఇతర చోట్ల గాని అసమానతలు వెనకబాటు తనం కొనసాగుతున్నాయంటే పోరాడాల్సింది ఆ విధానాలపైనే. ఇక్కడ ప్రస్తావించిన నాలుగు ప్రధాన పక్షాలూ ఆ విధానాలను కొనసాగించేవే అయినప్పుడు కేవలం తెలంగాణా నామ స్మరణ చేసినంత మాత్రాన ప్రజలకు ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ప్రాంతాలను బట్టి గత పరిణామాలను బట్టి ప్రజలలో పాతుకుపోయిన మనోభావాలు కొన్ని వుంటాయి. మధ్యతరగతిలో ఈ ఉద్వేగాలు మరింత ఎక్కువ. గతంలో ప్రత్యేక తెలంగాణా ప్రత్యేకాంధ్ర ఉద్యమాలలో ఎక్కువగా నష్టపోయిన వర్గాలు వీరే. ఆ ఉద్యమాలను నడిపించిన చెన్నారెడ్డి గాని, అక్కడ బివిసుబ్బారెడ్డి తదితరులు తర్వాత అధికార పీఠాలలో హాయిగా ఇమిడిపోయారు. అయితే తెలుగు దేశం ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్‌ను ఓడించిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ 1999లో మరోసారి ప్రత్యేక తెలంగాణా నినాదం తెచ్చింది. ఆ సమయంలో కెసిఆర్ తెలుగుదేశంలోనే వున్నారు. అదే ఏకాంశంగా ఆయన టిఆర్‌ఎస్ ఏర్పరచిిన ఎనిమిదేళ్లలో అనేక ఎదురు దెబ్బలు తిన్న తర్వాతనే ఆ పార్టీ కేంద్ర స్థానంలోకి రాగలిగింది.అయినా ఇప్పటికీ రెండు పెద్ద పార్టీల రాజకీయ పునాదిని తాను వశం చేసుకోవలసే వుందని టిఆర్‌ఎస్‌కు తెలుసు. అధికార పక్షం కాంగ్రెసే గనక దానిపైన కన్నా తెలుగు దేశంపైన ముందు దాడి కేంద్రీకరించడంలో పరమార్థం అదే. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చదరంగ చారిత్రిక సత్యాలివి.ఎలాగో అధికారం కాపాడుకోవడం కాంగ్రెస్ లక్ష్యమైతే అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం ఆరాటం. పార్లమెంటులో తమ ఓట్లే కీలకం గనక వెనకబడి పోరాదని బిజెపి తాపత్రయం. వీటికి తోడుగా వామపక్షాలైన సిపిఐ, న్యూ డెమోక్రసీలు గత విధానాలు మార్చుకుని ప్రజలు కోరుతున్నారనే పేరుతో కలసి నడుస్తున్నాయి. ప్రాంతాల వారిగా కన్నా వర్గ ప్రయోజనాల వారిగానే రాజకీయాలు నడుస్తుంటాయని ఈ పార్టీలన్నిటికీ తెలుసు.అయినా ప్రాంతం ప్రాతిపదికే సర్వస్వమన్నట్టు ఇవి మాట్లాడటం దానికి సిద్దాంత పరిభాష పులమడం ఇంకా విడ్డూరం! ఖమ్మంలో సభ జరిపిన ఉత్సాహంలో న్యూ డెమోక్రసీ నేతలు సిపిఎంపై ఆరోపణలు గుమ్మరించడం , యుటిఎఫ్ వంటి ఉపాద్యాయ సంఘంపై దాడులు ి జరగడం ఇంకా అనుచితం.
ఉద్యమాల్లో ప్రజల పాత్ర
సకల జనుల సమ్మె గాని, అంతకు ముందు వివిధ పోరాటాలలో గాని ప్రజలు విస్త్రతంగానే పాల్గొన్న మాట నిస్సందేహం. అయితే బడా పార్టీల నేతల నుంచి బడుగు జీవుల వరకూ తెలంగాణా విభజనను ఒకే విధంగా చూస్తున్నారనడం అవాస్తవం. జీవిత భారాలు, ఎడతెగని సమస్యలతో సతమతమయ్యే ప్రజలు ఎక్కడైనా ఏవో పరిష్కారాల కోసంచూస్తుంటారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సర్వరోగనివారిణి అన్నట్టు చెబుతున్న మాటలు వారిలో చాలా మంది విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని నాయకులు విడిపోతే తమకు ఎక్కువ అవకాశాలు వుంటాయనుకుంటున్నారు గనక పార్టీల వారిగా పోట్టాడుకుంటూనే ఆ విషయంలో ఒకే పల్లవి పాడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాటి తేడాలున్నాయి. సీమాంధ్ర పేరిట కవ్వింపు వ్యాఖ్యలు చేసే టీజీ వెంకటేశ్ విడిపోవడమే జరిగితే రాయలసీమను కూడా విడగొట్టాలనడం ఎలాటి తర్కం? కనక ఈ నాయకులది వ్యూహాత్మక ప్రచారమైతే ఎక్కువ మంది ప్రజలపై వున్నది ఆ ప్రచారాల ప్రభావం. కాని దేశంలో అమలు జరుగుతున్నది ఉపాధి రహిత అభివృద్ధి. ఆహార రహిత అభివృద్ధి. కేంద్ర ఆర్తిక విధానాలు మారనంత వరకూ ప్రజల జీవనస్తితిగతులు మౌలికంగా మారవు. రెండు దశాబ్దాలకు పైగా పాలన చేసిన జ్యోతిబాసు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిమితులు ఎప్పుడూ నొక్కి చెబుతుండేవారు. అలాటిది ఒక ఉప ప్రాంతాన్ని విడదీస్తే పరిస్తితులు మౌలికంగా మారిపోతాయని నమ్మ బలకడం విజ్ఞతను పరిహసించడమే. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడంలోనే ఈ సంగతి తెలుస్తుంది. గతం నుంచి కాంట్రాక్టు విధానాలపైన ఔట్ సోర్సింగుపైన ఇదే రీతిలో పోరాడి వుంటే ఈ అభద్రత వుండేదా? పెట్రోలు రు.74 చేసినా వ్యాట్ భారాలు రుద్దినా 2 జి స్కాం జరిగినా దాని ప్రభావం దేశమంతా ఒకే విధంగా వుండదా? ఆర్థిక విధానాలపై పోరాటం, అధికార వర్గాల అవినీతి వంటివాటిని విధానపరంగా ఎదుర్కొవడం ముఖ్యం తప్ప తెలంగాణా, సీమాంధ్ర రేఖలను బట్టే అన్నీ జరగడం లేదు. అది ఒక ప్రధాన భాగం మాత్రమే. నదీ ప్రాజెక్టుల వంటివి ఎప్పుడైనా నిలదీసి పోరాడి సాధించుకోవచ్చు గాని పదవులు సంపాదించడంలో సంపదలు మూటకట్టుకోవడంలో గాని ఏ ప్రాంతంలో నేతలు ఎక్కువ జయప్రదమైనారనేది వారికి సంబందించింద. సామాన్య ప్రజలకు సంబందించింది కాదు.
ఎవరేం వొరగబెట్టారు?
పివి నరసింహారావు ప్రధాని అయితే తెలంగాణాకు, అనేక మంది ముఖ్యమంత్రులతో పాటు సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా వుంటే రాయలసీమకు, వివిగిరి రాష్ట్రపతిగా వుంటే ఉత్తరాంధ్రకు,ప్రకాశం పంతులు వల్ల ఆయన పేరు పెట్టిన ప్రకాశం జిల్లాకు వొరిగిందేమీ లేదు. కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా వున్నవారు తమ ప్రాతినిధ్య ప్రాంతాలకు నిజంగా చేయవలసిన మేలు చేశారా, చేస్తున్నారా అని పరిశీలిస్తే ఆగ్రహమే మిగులుతుంది. పెట్టుబడిదారులు కుబేర పారిశ్రామికుల సంగతి కూడా అంతే. అలాగే రెక్కాడితే గాని డొక్కాడని వారు, అహౌరాత్రులు అవస్తలు పడే వారు ఏ ప్రాంతంలోనైనా ఒకటే విధంగా కష్టాలనెదుర్కొంటారు.వారిని కదిలించి పోరాడిన కమ్యూనిస్టులు కార్మిక వ్యవసాయ కార్మిక తదితర సంఘాల వారే. అయినా ప్రాంతాలకు సంబంధించిన అంశాలను చర్చకు పెట్టి రాజకీయంగా రాజ్యాంగ పరంగా అప్పుడున్న శక్తుల బలాబలాలను బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు గాని అదే సర్వస్వమంటే చెల్లుబాటయ్యేది కాదు. జార్ఖండ్, చత్తీస్‌ఘర్,ఉత్తరాంచల్‌ల సగటు అభివృద్ది లెక్కలు కూడా ఇదే చెబుతున్నాయి.
వాస్తవాలేమంటున్నాయి?
రాష్ట్రాభివృద్ధిపై సామాజిక ఆర్థిక అధ్యయనాల కేంద్రం సెస్ తయారు చేసిన లెక్కల ప్రకారం 2008 నాటికి వివిధ ప్రాంతాలకు చెందిన 11 జిల్లాలు అభివృద్ధిలో వెనకబడి వున్నాయి. ఇందులో అయిదు తెలంగాణా, మూడు రాయలసీమ,మూడు కోస్తా జిల్లాలు. కనక వెనకబాటు తనం అంతటా వుంది. కేవలం విభజనను బట్టి అభివృద్ది లేదా వెనకబాటు వుంటుందని,పోతుందని చెప్పడం అశాస్త్రీయం. అయితే తమ వ్యూహాల కోసం రాజకీయ నాయకత్వాలు అదే జీవన్మరణ సమస్య అని ప్రచారం చేసినప్పుడు సహజంగానే ఆ ప్రభావం ప్రజలపై పడుతుంది. ఇంత మంది సమ్మెలో పాల్గొంటున్నారంటే కారణం అదే. జీత భత్యాలు, పని పరిస్తితులు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో కనిపించని స్పందన ఇప్పుడు కనిపిస్తుందేమిటని సందేహం కలుగవచ్చు. పెట్టుబడిదారీ పూర్వ ప్రభావాలైన కులం మతం ప్రాంతం వంటివి రగుల్కొల్పినప్పుడు పర్యవసానాలు ఇలానే వుంటాయి. అయితే ఇవే శాశ్వతం కాదని గత చరిత్ర అనుభవాలు చెబుతున్నాయి.
ఇప్పటికైనా స్పందించాలి!
ఇలాటి సమయంలో ప్రభుత్వ, ప్రతిపక్షాలు సంయమనంతో బాధ్యతా యుతంగా వ్యవహరించాలి తప్ప ఏ రోటి దగ్గర ఆ పాట చందంగా మాట్లాడకూడదు. గతంలో ఇలాటి మాటలు చెప్పిన వారంతా తర్వాత ఏం చేశారో తెలుసు గనకే విజ్ఞులైన ప్రజలు ఎందరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నారు. విభజన కావాలని వారు కూడా వివాదాలు కోరడం లేదు.కనక ఈ ప్రశాంతత ప్రజల చైతన్య ఫలితమే గాని నాయకుల ఘనత కాదు. కనకనే కేంద్రం తక్షణం తన నిర్ణయాన్ని ప్రకటించి ఈ అనిశ్చితికి తెర వేయాలని ప్రతి వారూ కోరుకోవాలి. ప్రాంతాల వారీగా ప్రతిస్పందనలకు భయపడి ప్రతిష్టంభనను కొనసాగిస్తే అది పరిస్తితి ఇంకా దిగజారడానికి స్వార్థ పరశక్తుల కుట్రలు తీవ్రం కావడానికి కారణమవుతుంది. ఏదో ఒక ప్రకటన చేయాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు గనక అవకాశవాదాలకూ వూగిసలాటలకూ స్వస్తి చెప్పి కేంద్రం సహేతుకమైన నిర్ణయం ప్రకటించి సంయమనాన్ని కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ పోకడలు మానుకుని రాజకీయ విజ్ఞతతో పరిష్కారాలు అన్వేషించాలి.
>>>>>
ReplyDeleteపెట్టుబడిదారీ పూర్వ ప్రభావాలైన కులం మతం ప్రాంతం వంటివి రగుల్కొల్పినప్పుడు పర్యవసానాలు ఇలానే వుంటాయి.
>>>>>
సమైక్యవాద ఉద్యమం మాత్రం ప్రాంతీయవాద ఉద్యమం కాదని నమ్ముతున్నారా? మేము హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాము కనుక హైదరాబాద్‌ని వదులుకోము అని సీమాంధ్ర నాయకులు బహిరంగంగా చెప్పుకుంటోంటే అది ప్రాంతీయవాద ఉద్యమం కాదని ఎలా నమ్మేది?
praveen sarma
ReplyDeleteఎవరు నమ్మమన్నారు? సమైక్య వాద ఉద్యమం అన్న మాటకు ఇప్పుడు వాడుతున్న అర్థం వేరు. నా వ్యాసంలో టిజి వెంకటేశ్ వంటి వారి ప్రస్తావనలు కూడా వున్నాయి. చూడండి.
tamasha emitante samikhaya vadam ante desa smagratha, samajika, ardhika, bhasha la konam ninchi pettubadi konam vaipu nunchi prcharam cheyabadutunnadi. Anduke CPM lanti party la samikytha neti varthallo pradhanamina amsam kadu.patrikala yajamanulu vaari varga, vypara projanala konam nuche ee telanagana vyavaharam ni chustunnai.
ReplyDeletekishore.k