Pages

Tuesday, September 20, 2011

కెసిఆర్‌ మరో దీక్ష యోచన- రాజకీయ కారణాలు


మరోసారి నిరవధిక నిరాహారదీక్ష చేయాలని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్ర శేఖర రావు ఆలోచిస్తున్నట్టు మంగళవారం ఉదయం చాలా పత్రికలు వార్తలిచ్చాయి. ఉదయం టీవీ9 న్యూన్‌వాచ్‌లో ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ మాట్లాడినప్పుడు కూడా పరోక్షంగా అందుకు బలం చేకూర్చే వ్యాఖ్యలే చేశారు.మధ్యాహ్నం తర్వాతనైతే మరిన్ని ఛానళ్లు ఆ అంశం తీసుకొచ్చాయి.టీవీ5లో ఫోన్‌ ఇన్‌ ఇచ్చినప్పుడు మరో వైపు నుంచి తారక రామారావు కూడా మాట్లాడారు. ఎన్టీవీ కూడా దీనిపైనే అభిప్రాయం వివరంగా తీసుకున్నది. సాయింత్రం సాక్షికి వెళ్లినప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ ఉద్యోగుల సమావేశంలో దీనిపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌ చూడగలిగాను.

సకల జనుల సమ్మె సందర్భంగా విద్యార్థులపై సాగిన దాడికి దెబ్బలకు బాధ కలిగి కెసిఆర్‌ నిరాహారదీక్ష యోచన చేశారని పైన చెప్పిన నాయకులు అన్నారు.అయితే ఆయన మాటలు ప్రత్యక్షంగా విన్నప్పుడు మాత్రం
దెయ్యం వదిలించడానికి దెబ్బ కొట్టాలన్నట్టు వత్తిడి పెంచాలన్నట్టు మాట్లాడారు. ఆయన మాటలే వాస్తవానికి దగ్గరగా వున్నాయని చెప్పాలి.
1.సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్నప్పటికీ ఈ వత్తిడితోనే లక్ష్య సాధన జరిగేది కాదని కెసిఆర్‌ భావిస్తున్నారనుకోవాలి. ఈ ఉధృతి తగ్గకుండా వుండాలంటే కూడా తన దీక్ష యోచన ఉపయోగపడుతుందని ఆయన అంచనా కావచ్చు.
2.కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఈ విషయమై వస్తున్న సూచనలన్ని ప్రతికూల దిశలో వుండటం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ నాయకులు ఆ మాట అయోమయత్వం బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కెసిఆర్‌ అది సూటిగా చెప్పకుండా ఆందోళన తీవ్రం చేయాలనుకుంటున్నారు.
3.తెలంగాణా అంశం రంగం మీదకు తెచ్చింది తామైనప్పటికీ ఇప్పుడు వివిధ పార్టీలూ జెఎసిలు రావడంతో గజిబిజి వాతావరణం ఏర్పడింది. ఎన్ని తేడాలున్నా రాష్ట్రమే ముఖ్యమని అంటున్నా వాస్తవంతో టిఆర్‌ఎస్‌ కేంద్ర స్థానాన్ని కాపాడుకోవడం కెసిఆర్‌ కోరుకుంటారు. తను దీక్ష చేపడితే మరోసారి అందరి దృష్టి కేంద్రీకరణ పెరుగుతుందని, చొరవ పూర్తిగా తమ చేతుల్లోకి వస్తుందని కూడా భావించవచ్చు.
సమ్మె మొదలైన తర్వాత రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి స్పందన కూడా దీనివల్ల పరిష్కారం రాదన్న దిశలోనే వున్నాయి. అది అధిష్టానం వైఖరిగా స్పష్టమవుతున్నది.ఇది టీ కాంగ్రెస్‌ నేతలకే కలవరం కలిగిస్తున్నప్పుడు కెసిఆర్‌ వ్యూహాత్మకంగా ఆలోచించడంలో అశ్చర్యం ఏమీ లేదు.
చరిత్ర పునరావృతమవుతుంది, ఒకసారి సుఖాంతం(కామెడీ)గా మరోసారి అపహాస్యభాజనంగా(ఫార్సుగా)అని కారల్‌ మార్క్స్‌ సుప్రసిద్ధ వ్యాఖ్య. రాష్ట్రంతో కేంద్రం చెలగాటాన్ని వివిధ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలను రాష్ట్ర ప్రభుత్వ ఇరకాటాన్ని చూసినపుడు ఇది నిజమవుతున్నట్టు అనిపిస్తుంది. 2009 అనుభవాలు అందరికీ రకరకాల పాఠాలు నేర్పాయి గనక నాటి పరిస్థితులే ఇప్పుడు కూడా యథాతథంగా వస్తాయనుకోవడం అవాస్తవికమే. కనక సంక్షోభాన్ని పెరగనివ్వకుండా కేంద్రం తక్షణం ప్రకటన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. వీటన్నిటికీ తోడు కెసిఆర్‌ ఆరోగ్య సమస్యలు కూడా వున్నాయి గనకే ప్రస్తుతానికి వాయిదా పడినట్టు సందేహం కలుగుతుంది. ఏది ఏమైనా పరిస్తితులు దిగజారకుండా చూడటం ప్రతివొక్కరి బాధ్యత.

No comments:

Post a Comment