Pages

Tuesday, September 27, 2011

లగడపాటి రాక- రాజకీయ కాక


సకల జనుల సమ్మె సగం నెల పూర్తి అవుతున్న సందర్భంలో విజయవాడ కాంగ్రెస్‌ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం పరిస్తితిని అకారణంగా వుద్రిక్త పరిచింది. ఆర్టీఏ అధికారి పినిశెట్టి శ్రీనివాస్‌పై దాడిని అందరూ ఖండించారు. అందుకు కారకుడైన వ్యక్తిని తామే అప్పగించామని కూడా జెఎసి నాయకులొకరు నాతో చెప్పారు. ఏపీ ఎన్జీవో సంఘం నాయకుడు గోపాల్‌ రెడ్డి కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చారు. అలాటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత పెరక్కుండా చూసుకోవలసింది.అయితే లగడపాటి రాజగోపాల్‌ పరామర్శ పేరిట రావడంతో పరిస్తితి రాజకీయ రంగు పులుముకోవడం సహజం. గతంలో కెసిఆర్‌ నిరాహారదీక్ష సందర్భంలోనూ ఆయన ఇలానే చేశారు.వీటివల్ల ఆయనకు రాబిన్‌ హుడ్‌ ఇమేజ్‌ వస్తుందనుకుంటారేమో గాని రాష్ట్రంలో పరిస్తితి దిగజారుతుందని గుర్తించాలి. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు (మళ్లీ కాంగ్రెస్‌ వాదులతో సహా) వెళ్లడం, పోలీసులతో ఘర్షణ, నాయకులపట్ట ప్రవర్తనపై ఆగ్రహం, హరీష్‌ రావు సొమ్మసిల్లేందుకు దారి తీసిన ఘర్షణ ఇవన్నీ గత పదిహేనురోజులలో లేని కొత్త పరిస్థితికి దారి తీశాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతివారిపై వుంది. ఢిల్లీలో నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని ముందే ప్రభావం ప్రసరించాలన్న ఆదుర్దా అందరిలో వున్నట్టు స్పష్టమవుతుంది. అది అర్థం చేసుకోవచ్చుగాని ఆ కారణంగా అవాంఛనీయ పరిస్తితులను సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదు.

1 comment:

  1. మీ విశ్లేషణ పక్షపాతరహితం.లగడపాటి గారు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని నా అభిప్రాయం.

    ReplyDelete