Pages

Saturday, September 3, 2011

ఆస్తుల ప్రకటన ఆఖరి వాక్యం కాదు


తనపై వచ్చే ఆరోపణలను పదే పదే వినిపించే విమర్శలను అలా సాగనివ్వడం కన్నా తనుగా ఏదైనా ప్రకటన చేయాలని చంద్రబాబు భావించడం మంచిదే. అయితే ఎవరి గురించి వారు చెప్పుకునేదానికి ఎప్పుడూ పరిమితులు,భిన్నాభిప్రాయాలు వుంటాయి. ఈ విషయమైనా అంతే. అయితే ఈ ఆస్తుల ప్రకటన వల్ల వాటికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనేది వారి ఇష్టం. ఎప్పటికప్పుడు వ్యక్తుల చుట్టూ తిరగడం లేదా తిప్పడం అలవాటైన మన రాజకీయం ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై కేంద్రీకృతమైంది. ఇందుకు సంబంధించిన ఆయన సవాళ్లపై గతంలోనే వ్యాఖ్యానించాను.ఇక ఇప్పుడు ఆయన ఐచ్చికంగా చేసిన ప్రకటన వల్ల విమర్శలు అగడమంటూ జరగదు. ఇంత తక్కువ అస్తులున్నాయా బినామీలు లేవా అంటూ సందేహాలు ముందుకు రావడం సహజమే.అయితే వివాదాల ద్వారా అవి నివృత్తి అయ్యేవి కావు. ఆసక్తి గల వారు చట్టరీత్యా తాము తీసుకోగలిగిన చర్యలు తప్పక తీసుకోవచ్చు. వీలుంటే న్యాయస్థానాల సహాయం తీసుకోవచ్చు. అలా గాకుండా వూరికే వాదోపవాదాలు అరోపణలతో ఎంత సమయం వెచ్చించినా వొరిగేదేమీ వుండదు. జగన్‌పై ఆరోపణలకు చంద్రబాబుపై ఆరోపణలకు పోటీ పెట్టి చూడటం నిరర్థకం.తాను వ్యాపారం బాగా చేయడం వల్ల పెట్టుబడులు భారీగా వచ్చి పడ్డాయని జగన్‌ స్వయంగా చెప్పుకోవడం, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయనేదానిపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు వున్నాయి గనక దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించడం రీత్యా కూడా ఉభయుల వ్యవహారంలో తేడా వచ్చింది. వీరిద్దరే గాక అందరిపైనా కూడా చట్టపరమైన దర్యాప్తులు తప్పక జరపొచ్చు.కాని ఒకరి విషయం వచ్చినప్పుడు మరొకరి సంగతి లేవనెత్తడం వల్ల చిక్కులో వున్న వారిని కాపాడ్డమే జరుగుతుంది. .. భారీ ఎత్తున రాజకీయ చదరంగాలు నడిపేవారికి అంగబలం అర్థబలం పుష్కలంగా వుంటాయని ప్రతివారికీ తెలుసు. అలాటి భావన వుండటం వేరు,భౌతికంగా నిరూపించడం వేరు. ఇలాటి అంశాలు విధానపరంగా చూడాలే తప్ప వ్యక్తులపై కేంద్రీకరించి వాదనలు సాగదీయడం వల్ల ఫలితమేమీ వుండదు. వైఎస్‌ కుటుంబం,చంద్రబాబు కుటుంబం అంటూ ఈ ఉభయుల మధ్యనే పరిభ్రమిస్తుంటే వ్యవస్తాగతమైన కీలాకాంశాలు మరుగున పడి పోయే ప్రమాదం చాలా వుంటుంది.

2 comments:

  1. what you have written is correct .The only course open to those who want to contradict Mr.chandrababunaidu is to gather evidence and prove it by legal methods.this applies to all other political leaders who declare their properties and assets voluntarily.

    ReplyDelete
  2. చంద్రబాబు కూడా ముఖ విలువలు మాత్రమే ప్రకటించడం వల్ల తనకు తనే ఒక మరో వివాదాన్ని సృష్టించుకున్నారు.నిజాయితీని గురించిన ప్రశ్న ఉదయించకుండా వుండటానికైనా తాజా మార్కెట్ విలువల ప్రకారం ప్రకటించి వుండవలసింది.

    ReplyDelete