Pages

Thursday, September 15, 2011

అమర గాయకుని అద్భుత గీతావళి


  హీరో కృష్ణకు పద్మభూషణ్‌ పురస్కారం లభించగానే ప్రతి ఛానెల్‌లో కనిపించిన దృశ్యం 'తెలుగు వీర లేవరా' అన్న పాట. తెరపై ఎందరో నాయకులు నాయికలు ప్రతినాయకులు విదూషకులు, వుండొచ్చు. తెర వెనక దర్శకులు నిర్దేశకులు సాంకేతిక నిపుణులు మరింత మంది వుండొచ్చు. వారు కలసి రూపొందించిన చిత్రాల్లో అమోఘమైన సన్నివేశాలు పోరాటాలు, నృత్యాలు, సంభాషణలు మరెన్నో వుండొచ్చు. కాని - సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండి పోయేవీ, నిరంతరం పెదవులపై కదలాడేవీ మాత్రం అందులోని పాటలే. తరాలు మారినా తరగని మాధుర్యం వాటిలో ఇమిడి వుండటమే ఇందుకు కారణం. సైగల్‌, మన్నాడే, మహ్మద్‌ రఫీ, కిశోర్‌ కుమార్‌, లతా మంగేష్కర్‌ వంటి వారి పాటలు అప్పటికీ ఇప్పటికీ భారతీయుల హృదయాలలో వెన్నెల పూలు పూయిస్తూనే వున్నాయి. ప్రేమ వియోగం, విషాదం, వినోదం తదితర రకరకాల సందర్భాలలో మదిలో మెదులుతూనే వున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ ఆ కోవలో అగ్ర గణ్యుడు అమరగాయకుడు ఘంటసాల.
ఘంటసాల పేరు తల్చుకోగానే ఆయన మధుర స్వరం నుంచి జాలు వారిన మనోహర గీతాలు మనస్సును నింపేస్తాయి. వేయికి పైబడిన పాటలు, పద్యాలలో వారి వారి అభిరుచిని బట్టి అనుభూతిని బట్టి
ఎన్నెన్నో పాటలు ముప్పిరిగొంటాయి. అయితే కూనిరాగాలు తీసేవారైనా వేదికలెక్కి కచేరీలు చేసేవారైనా ఆయన పాటలను పాడకపోతే అంతా అసంపూర్ణమే. అయితే కాలం గడిచేకొద్ది పాటల రాగాలు గుర్తున్నంతగా చరణాలు గుర్తుండవు. వాటిలో మాటలు స్పష్టంగా గుర్తుండవు. ఫలానా పాట వుందని గుర్తించిన తర్వాత దానిలోని సాహిత్యం గుర్తు రాకపోతే చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇప్పుడు సీడీలు, టూ ఇన్‌ వన్‌లు ఎన్ని వచ్చినా లేక టీవీలలో మొత్తం పాటలను అహరహం ప్రదర్శిస్తున్నా వాటిలోని పదాల పొందిక ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టంగానే వుంటుంది.ఆ లోటు తీర్చే ఒకే ఒక సాధనం పుస్తకం.అందుకే డివివిఎస్‌ నారాయణ 'సహస్ర మధుర గీతాలు' పేరుతో ఘంటసాల పాటలను సంపుటీకరించారు.370 చిత్రాలలో ఆయన పాడిన 1005 పాటలు, పద్యాలు, ప్రైవేటు గీతాలు ఇందులో పొందుపర్చారు.పాటలతో పాటు రచయిత పేరు, సినిమాలో అభినయించిన నటీనటుల పేర్లు కూడా ఇచ్చారు. వీటన్నిటి వల్లా పాఠకుడికి ఆ పాట సంపూర్ణ స్వరూపం కళ్లముందు నిల్చినట్లవుతుంది.
మొదట సంప్రదాయ సిద్ధంగా భక్తి గీతాలతో మొదలెట్టారు.అందులో 'ఏడుకొండల స్వామీ ఓ వెంకట రమణా' వంటి ప్రసిద్ధ గీతాలున్నాయి (వెనకటికి థియేటర్లలో ఈ పాటతోనే సినిమా ప్రదర్శన ప్రారంభించేవారు). తర్వాత దేశభక్తి పాటలు- 'స్వాతంత్రమే మా జన్మహక్కని చాటండి' (రచన తోలేటి) భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ' అంటూ సరోజినీ దేవిపైన ఆయన రాసిన పద్యాలు, ఆ మొగల్‌ రణధీరులు తాంతియా టోపీ ఝాన్సీ లక్ష్మిల స్వాతంత్య్ర సమర దీప్తి (రచన ప్రయాగ) వంటి పద్యాలు విద్యా సంస్థల్లోనూ జాతీయ దినోత్సవాల్లోనూ మార్మోగుతూనే వుంటాయి.ఇక 'రావోయి బంగారి మామ' అంటూ కొనకళ్ల వెంటకరత్నం రాసిన జానపద గీతం. దాశరథి రాసిన 'తలనిండ పూదండ దాల్చిన రాణి, వెలిగించవే చిన్న వలపు దీపం వంటి పాటలు శ్రోతలకు సుపరిచితమైనవే. ఇక కరుణశ్రీ పద్యాలు- పుష్ప విలాపము, కుంతీ కుమారి, అంజన రేఖ వంటివి మరింత ప్రసిద్ధం. విశేషమేమంటే తెలుగు నాట ఒక గొప్ప పదబంధంగా నిల్చిపోయిన బహుదూరపు బాటసారి, ఇటు రావో ఒక్కసారి అన్న పాట ఆయన స్వయంగా రాసింది కావడం.
లలిత గీతాల తర్వాత పద్యాలు శ్లోకాలు ఇచ్చారు. రంగస్థల కళాకారులు సుదీర్ఘ రాగాలతో పాడిన తెలుగు పద్యానికి కొత్త మలుపు తిప్పిన సంగీత స్రష్ట ఆయన. ఘంట సాల గానం, ఎన్టీఆర్‌ ఎస్వీఆర్‌ వంటి వారి అభినయం కలగలిపితే ఆ సన్నివేశాన్ని మాటలలో చెప్పడం కష్టమే (అయితే ఎస్వీఆర్‌కు చాలా సార్లు మాధవపెద్ది పాడేవారు). ఉద్యోగ విజయాలులో 'జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో...' వంటి పద్యాలు, కృష్ణునికి సంబంధించిన వివిధ చిత్రాల్లో వీనులు విందు కలిగించాయి. లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, భూకైలాస్‌, భీష్మ వంటి పౌరాణిక చిత్రాలకు ప్రాణం పోశాయి. కాళిదాసులో 'మాణిక్య వీణాం ఫలాలయంతీం', వీరాంజనేయలో మనోజనం మారుత తుల్య వేగం వంటి దండకాలో గాత్ర మాధుర్యం ఉచ్ఛారణా వైభవం అనితరసాధ్యం. భక్తి ప్రపత్తులతో సంబంధం లేకుండా సంగీతానురక్తి వున్నవారెవరైనా వీటికి తలూపకుండా వుండలేరు. ఇవేగాక చిత్రాల్లో లవకుశులకు రామలక్ష్మణులకు మధ్య, శ్రీకృష్ణుడికి నారదుడికి మధ్య, భీముడు దుర్యోధనుడికి మధ్య, రామ రావణుల మధ్య , రావణుడికి హనుమంతుడికి మధ్య పద్య సంభరితంగా జరిగిన సంవాదాలను ఆయన గొంతులో భావ యుక్తంగా వింటాము.
ఇక పాటల విభాగం అకారాది క్రమంలో చాలా సముచితంగా తెలుగు వీర లేవరా తో మొదలవుతుంది. హీరో కృష్ణ ఆయన ఆఖరి దశలో బలవంతం చేసి మరీ పాడించిన ఆ పాట జాతీయ ఉత్తమ గీతంగానూ బహుమతి పొందింది. అమర శిల్పి జక్కనలో 'ఈ నల్లని రాలలో, ఎచటకోయి ఈ నీ పయనం' తదితర పాటలు. ఆ పైన సర్వకాలిక జన రంజక గీతం 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' వగైరాలు వస్తాయి. అగ్గిదొర, అగ్గిపిడుగు, అగ్గిబరాటా, అగ్గివీరుడు, వంటి జానపద చిత్రాల పాటల తర్వాత చెప్పుకోదగింది అవే కళ్లులో 'మా వూళ్లో ఒక పడుచుంది' అంటూ చిలిపిగా పాడిన పాట. విజయవారి అప్పుచేసి పప్పుకూడులో అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా, సుందరాంగులను చూసిన వేళల, కాశీకి పోయాను రామా హరి వంటివన్నీ వస్తాయి.
ఈ క్రమంలో వచ్చే వందలాది చిత్రాల పేర్లు పాటల పేర్లు ప్రస్తావించడం కష్టమైనా ఈ పాటల వైవిధ్యాన్ని వీటిలో ఘంటసాల ఆవిష్కరించిన నవరసాలను చెప్పుకోవచ్చు. వీటిని రాసిన కవుల పరంగా చూసినపుడు కూడా చాలా విశేషాలు తెలుస్తాయి. విప్లవగీతాలకు మారుపేరైన శ్రీశ్రీ కలం నుంచి 'నా హృదయంలో నిదురించే చెలీ (ఆరాధన), ఎవరివో నీ వెవరివో( పునర్జన్మ -శ్రీశ్రీ), ఎ వరికి వారౌ స్వార్థంలో (గుడిగంటలు) వంటి మృదు మధుర ప్రేమ గీతాలు జాలు వారాయి. మనసు కవిగా పేరొందిన ఆత్రేయ కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడీ దానా (తోడి కోడళ్లు) వంటి చైతన్యవంతమైన గీతం రాస్తే శ్రీశ్రీ 'మనసున మనసై' అంటూ సహజీవన సౌందర్యాన్ని అక్షరీకరించారు. రాసిందెవరైనా ప్రాణప్రతిష్ట చేసింది మాత్రం ఘంటసాలే! ఇల్లరికంలో 'నిలువవే వాలు కనుల దానా' వంటి కొంటె పాటలు ఎంత హుషారుగా పాడారో 'సుడిగాలిలోన దీపం' వంటి విషాదాన్ని కూడా అంతే గొప్పగా ఆవిష్కరించారు. దేవదాసులోనే 'ఓ పార్వతీ' అంటూ అలవోక ప్రేమ గీతం పాడిన కంఠమే 'కుడి ఎడమైతే పొరబాటు లేదోరు', 'చెలియ లేదు చెలిమి లేదు' వంటి పాటలను అన్నిటినీ మించి 'జగమే మాయ' వంటి పాటల్లో విషాదాన్ని నింపుతారు. నిన్న లేని అందమేదో, ఈ ఉదయం నా హృదయం, అడుగు జాడలులో 'తూలీ తూలెను తూరుపుగాలి, ఉయ్యాల జంపాలలో కొండగాలి తిరిగింది', దేశ ద్రోహులులో జగమే మారినది, భక్త తుకారాంలో 'భలే భలే అందాలు' వంటి పాటలను వింటున్నా ప్రకృతి సౌందర్యం కళ్లకు కడుతుంది. 'తోటలో నా రాజు తొంగి చూసెను నాడు' (ఏకవీర) వంటి పాటల్లో ఆయన స్వరం సుశీల కన్నా మృదువుగా ధ్వనించడం చూస్తే పౌరాణికాల్లో పద్యాలతో చెవుల తుప్పు వది లించిన గొంతు ఇదేనా అని ఆశ్చర్యం వేస్తుంది. మంచి మనసులులో 'శిలలపై శిల్పాలు చెక్కినారు', విచిత్ర కుటుంబంలో 'ఆడవే జలకమ్ములాడవే', కోడెనాగులో 'ఇదే చంద్రగిరి' వంటి పాటలు చరిత్రను పునరావిర్భవింపచేస్తాయి.
గుండమ్మ కథలో 'మనిషి మారలేదు', ఆత్మ బంధువులో అనగనగా ఒకరాజు, ప్రేమ నగర్‌లో 'నేను పుట్టాను', డాక్టర్‌ చక్రవర్తిలో 'ఎవరో జ్వాలను రగిలించారు', దేవతలో 'బొమ్మను చేసి ప్రాణము పోసి', ధర్మదాతలో 'ఓ నాన్న', నిర్దోషిలో 'మల్లియలారా మాలికలారా', జీవిత చక్రంలో 'మధురాతి మధురం', గుడిగంటలులో 'జన్మమెత్తితిరా అనుభవించితిరా', బతుకు తెరువులో 'అందమె ఆనందం', మురళీ కృష్ణలో 'ఎక్కడ వున్నా ఏమైనా' , ఇలా ఒకో పాటలో ఒక ప్రత్యేకత, శ్రావ్యత నింపిన ఘనత ఆయనది. 'పాడుతా తీయగా చల్లగా, ముద్దబంతి పూవులో మూగకళ్ల వూసులో' వంటిపాటలతో మూగమనసులు, నీవేనా నను పిలిచినది, లాహిరి లాహిరి వంటి పాటలతో మాయబజార్‌, ఇంకా ప్రేమనగర్‌, రాముడు భీముడు, మంచి మనిషి, వెలుగు నీడలు, లక్షాధికారి, మనసు మాంగల్యం, భార్యాబిడ్డలు, బుద్ధి మంతులు, దసరా బుల్లోడు, అదృష్టవంతులు, ఆత్మబలం, పూల రంగడు, భార్యాభర్తలు, దాగుడు మూతలు, దేవుడు చేసిన మనుషులు, జయభేరి చిరంజీవులు, గోవుల గోపన్న, ఒకే కుటుంబం, ఇద్దరు మిత్రులు, ఆత్మీయులు తదితర అనేక చిత్రాల్లో ఆయన స్వయంగానూ , ఇతర గాయనులతోనూ కలసి పాడిన అనేకానేక పాటలు నిత్యం చెవుల్లో మార్మోగుతూనే వున్నాయి. జీవితంలో అన్ని సందర్భాలకూ అన్ని రకాల మానవ సంబంధాలు అనుబంధాలకు అద్దం పట్టే గీతాలు వినిపించిన ఘంటసాలను అంతిమ యాత్రలో కూడా 'ఈ జీవన తరంగాలలో..' వంటి పాటలు తప్పక గుర్తు చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన గలవారైతే భగవద్గీత శ్లోకాలు వేసుకుంటారు.
ఘంటసాల గళం నుంచి జాలువారిన గీతాలను పూర్తిగా ఇవ్వడమే గాక ఆయన సంగీత ప్రస్థానానికి సంబంధించిన పలు విశేషాలను పాటల చరణాలే శీర్షికలుగా బాక్సు కట్టి ఇవ్వడం ఆసక్తికరం. ఆ పాటలు తెలిసిన వారిలో ఆ జ్ఞాపకాలను తట్టిలేపడం, మర్చిపోయిన వారికి మళ్లీ గుర్తు చేయడం, సగం సగం జ్ఞాపకంతో సతమతమవుతున్న వారికి పూర్తి సాహిత్యం సమకూర్చడం, మరీ కొత్త వారికి ఆయన గాన వైభవాన్ని పరిచయం చేయడం వగైరా అనేక విధాల ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇంతటి బృహత్‌ సంకలనం చేసిన నారాయణరావు అభినందనీయులు. చిత్రాలు, కాగితం విషయంలో ధరకు అనుగుణంగా మలి ముద్రణల్లో పుస్తకాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దుతారని ఆశించాలి.
0000

3 comments:

  1. రవి గారు, చాల అద్భుతంగా వ్రాసారు మాస్టారి గురించి. మీ వ్యాసం చదివాక అపుడే అయిపోయిందా అని అనిపించిది. శ్రీ ఘంటసాల గారి పాటల సాహిత్యం, సంగీతం చిరపరిచితమై ఎప్పుడు విన్నా వాటితో గల అనుబంధాన్ని ఇంకా బలిష్టం చేస్తుంది నాలో. మీ వ్యాసం ఆఖరులో శ్రీ నారాయణరావు గారు పుస్తక రూపం చేశారని వ్రాసారు. కాని వివరాలు ఇవ్వలేదు. నేనిదివరకు శ్రీ సి.హెచ్.రామారావు గారు సంకలనం చేసిన "ఘంటసాల పాటశాల" చూశాను. మీరు ప్రస్తావించిన పుస్తకం వివరాలు తెలియజేయగలరు. మీకు వీలైతే నా "ఘంటసాలా బ్లాగు చూడగలరు. మంచి వ్యాసం వ్రాసినందుకు మరొకసారి ధన్యవాదాలు. http://vulimirighantasala.blogspot.com/

    ReplyDelete
  2. సూరిగారూ,
    మీ స్పందనకు అభినందనకు ధన్యవాదాలు. ఘంటసాల గానాన్ని తల్చుకోగానే ఆ పాటలు అలా ప్రవహించేస్తాయి. నాకు కొన్ని డజన్ల పాటలు నాలుకపై వుంటాయి.పుస్తకం గురించి మీరు కోరిన వివరాలు- అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల' సహస్ర మధుర గీతాలు' పేరిట విజయవాడకు చెందిన డి.వి.వి.ఎన్‌.వర్మ( సెల్‌ నెం. 9440835473,విజయవాడీ) 900 పేజీల పుస్తకం ప్రచురించారు. ఇందులో చాలా వివరాలు కూడా ఇచ్చారు. కొన్ని పొరబాట్లున్నా అత్యధిక వివరాలు సరిగ్గానే వున్నాయి కూడా. ఖరీదు రు300. జెపి పబ్లికేషన్స్‌,విజయవాడ. ఫోన్‌ 2439464.అక్కినేని అంకితమిచ్చారు. ఘంటసాల సావిత్రి గారు అభినందన వాక్యాలు రాశారు. కొద్ది కాలంలో రెండవ ముద్రణ కూడా వచ్చినట్టుంది.అదీ సంగతి.మీ బ్లాగులు తర్వాత వివరంగా చూసి రాస్తాను.

    ReplyDelete
  3. రవి గారికి, చాల ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు. మరో ఘంటసాల అభిమానిని కలసినందుకు ఆనందంగా వుంది. నేను ఎక్కువగా ఘంటసాల గారి పాటలు పాడుతుంటాను. మీలాగే నాకు కూడ చాల పాటలు నోటికి వచ్చు. అయితే ఇంకా తెలుసుకోవాలనే చిన్న తపన. మీ కృషికి ధన్యవాదాలు.

    ReplyDelete