Pages

Friday, September 16, 2011

సెప్టెంబరు 17: వాస్తవాలు, వక్రీకరణలు


సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరామామూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. పదేళ్ల కన్నా ముందు బిజెపి దీన్ని తెరమీదకు తెచ్చింది. తర్వాత టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తెలుగు దేశం నాయకులూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు దళిత బలహీన వర్గాలు వెనకబడిన తరగతుల పేరిట మరో విధమైన విశ్లేషకులూ బయిలు దేరి ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులపై దాడి ఎక్కుపెడుతున్నారు. మరికొందరు చరిత్ర కారులమంటూ యథాశక్తి గజిబిజి పెంచే పనిలో నిమగమైనారు. బిజెపికి బొరుసు లాటి మజ్లిస్‌ కూడా రంగ ప్రవేశం చేసింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అరవై ఏళ్ల కిందట ఈ తేదీకి ముందు వెనక పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన వీర తెలంగాణా యోధుల కన్నా వీరి హడావుడి ఎక్కువగా వుంది. వీటన్నిటి మధ్యనా వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం
వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం. ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు అది. పది లక్షల ఎకరాల పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్తాపన వగైరా ఆ పోరాట విజయాలను కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ పోరాట కార్యక్షేత్రం తెలంగాణానే అయినా పోరాటంలో పాల్గొన్నవారిని ప్రాంతీయ రేఖలతో,కుల మతాల కొలబద్దలతో విభ'జించడం అచారిత్రికం. పోలీసు చర్యకు బాగా ముందుగానే 1948 ఫిబ్రవరి26న నిజాం ప్రభుత్వ డిఐజి నవాబ్‌ దీన్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌ తమ ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు:
'' గత కొంతకాలంగా ప్రజల దృష్టి నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కల్లోలిత పరిస్తితులపై కేంద్రీకృతమై వుంది. నిజాం స్టేట్‌ ఆంధ్ర మహాసభ(మరో విధంగా చెప్పాలంటే ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీగా పరిచితం) రావినారాయణ రెడ్డి అనే కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఫలితమే ఇది. ఆయనకు 1940 నుంచి భారత కమ్యూనిస్టుపార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి.1945 తర్వాత నెమ్మదిగా కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై 1945 నాటికి పూర్తి స్తాయి కమ్యూనిస్టుగా మారాడు. రైతు రంగంలో కమ్యూనిస్టు విధానాలు కార్యక్రమాలు సాగిస్తున్నాడు. తెలంగాణా ప్రాంతంలోని ఈ కేంద్రాలలో కమ్యూనిస్టు ప్రభావాన్ని విస్తరింపచేయడంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి నుంచి బెజవాడలోని సిపిఐ రాష్ట్ర శాఖ ప్రభావంతో మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నది. పి.సుందరయ్య,కంభంపాటి సత్యనారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య,చండ్ర రాజేశ్వరరావు ఇందుకు సంబందించిన ముఖ్యనాయకులుగా వున్నారు.వీరు తరచూ ఇక్కడ పర్యటిస్తూ కమ్యూనిస్టులకు ప్రత్యేకమైన వివిధ కార్యకలాపాలను నడిపిస్తున్నారు.కిసాన్‌ యాత్రలు, పశు ప్రదర్శనలు, బుర్రకథల వంటివి నిర్వహిస్తున్నారు.
గడచిన రెండున్నర సంవత్సరాలలోనూ నిజామాంధ్ర మహాసభ దేశ్‌ముఖులు వతన్‌ దార్లకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించింది.1945 డిసెంబరు నుంచి ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రెవెన్యూ పోలీసు శాఖల వారికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నది.ఈ కాలమంతటా కూడా వారి ఉద్యమానికి బెజవాడ నుంచి ప్రచురితమయ్యే తెలుగు పత్రిక ప్రజాశక్తి మద్దతునిచ్చింది. ఈ పత్రికలో నిజాం స్టేట్‌, బెజవాడ కమ్యూనిస్టులు ఉభయులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అతిశయోక్తులతో కూడిన రాతలు రాస్తున్నారు.''
నిజాం రజాకార్ల రాక్షస హత్యాకాండకు తలవంచని ఆ పోరాటాన్ని అణచేందుకే కేంద్ర సైన్యాలు దిగాయన్నది చరిత్ర కాదనలేని సత్యం. స్వతంత్ర భారతంలో సంస్థానాల విలీనం కూడా అప్పుడే జరుగుతున్నందుకు తెలంగాణా పోరాట వీరులను అణచివేసే వ్యూహం కూడా దానితో కలసి పోయింది. గోల్కొండ ఖిల్లా కాడ నీ గోరి కొడతం కొడకో అంటూ నిప్పులు కక్కుతున్న వీర ప్రజానీకం బారి నుంచి నిజాంకు రక్షణ ఛత్రం పటేyందుకు పోలీసు చర్య అనబడిన సైన్య ప్రవేశం సోపానమైంది. కూలిపోతున్న రాజును రాజప్రముఖ పట్టంతో అభిషేకించి అంతకు ముందు కన్నా క్రూరంగా పోరాట వీరులను వూచకోత కోసే వున్మత్త హత్యాకాండకు వొడిగట్టింది. జనం తరిమేసిన దొరలకు కాంగ్రెస్‌ టోపీలు పెట్టి గడీల్లో పున:ప్రతిష్టించింది. ఇప్పుడు తెలంగాణా జపంతో రకరకాల రాజకీయ పాచికలు వేస్తున్న వారితో సహా నాటి దొరల వారసత్వం కొనసాగడానికి బీజాలు అక్కడే వున్నాయి. నిజాం రాజ్యం కూలిపోవడం కలసి పోవడం మంచిదైనా దాని వెనక ఇంత చరిత్ర వుంది. ఈ సారాంశం చూడకుండా దాన్నే విమోచన దినం అంటే చరిత్ర నవ్విపోతుంది.
విమోచన కాదు విలీనం అనేది మరో వాదన. స్వతంత్ర రాజ్యంగా వున్న హైదరాబాదును లేదా నిజాం సంస్థానాన్ని తెచ్చి తెలుగు జిల్లాలతో కలిపారు గనక విలీనం అనే వాదనా పాక్షికమే. ఉత్తరాంధ్ర జిల్లాలను ఫ్రెంచి వారికి తర్వాతకట్టబెట్టడంతో మొదలుపెట్టి రాయలసీమను దత్తమండలం చేసేంత వరకూ కూడా తెలుగు ప్రజలను చీలికలు పేలికలు చేసింది నిజాం నిరంకుశత్వం. బ్రిటిష్‌ వారి పాదాల ముందు మోకరిల్లి స్వాతంత్రాన్ని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని అప్పగించడమే కాదు, స్వతంత్రంగా పోరాడే టిప్పు సుల్తాన్‌ వంటివారిని తుదముట్టించేందుకు సహకరించిన దోషులూ ద్రోహులూ నిజా పాలకులు.. విప్లవ ముద్రాంకితులతో సహా కొందరు మేధావులు స్వతంత్ర నిజాంను బలవంతంగా విలీనం చేసినట్టు చెప్పడం వితండ వాదనే. నిజాంను కూల్చడంతోనే స్వాతంత్రం సమైక్యత సహజ సిద్ద పలితాలుగా సంక్రమించాయి. ఆ క్రమాన్ని అడ్డుకోవడానికి నిజాంనాటి దొరల వారసులు కాలడ్డం పెట్టినా కాలం తోసిపుచ్చింది. ఇది రెండో వాదన సంగతి.
సెప్టెంబరు 17కు విమోచన దినం అని పేరు పెట్టి 1998లో ఎల్‌కెఅద్వానీని రావించి రాజకీయ హడావుడి మొదలెట్టింది బిజెపి. నిజాం ముస్లిం రాజు గనక ఆయనను కూలదోయడం విమోచన కాకుండా పోతుందా? అనేది వారి ధోరణి. వాస్తవానికి బిజెపికి లేదా సంఘ పరివార్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతోగాని ఏ ఫ్యూడల్‌ వ్యతిరేక ఉద్యమాలతో గాని ఏ మాత్రం సంబంధం లేదు. ఆంధ్ర మహాసభ' కమ్యూనిసుyల ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేయడానికి ముందు ఆర్య సమాజ్‌ పేరిట సాగిన మతపరమైన తతంగాలు ప్రజాస్వామిక ఉద్యమంగా పెంపొందింది లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక జునాగడ్‌ పాకిస్తాన్‌తో కలవడానికి మంతనాలు జరిపితే, కాశ్మీర్‌, హైదరాబాద్‌ సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకోవడానికి ప్రయత్నించాయి. సాంకేతికంగా ఒకటికానప్పటికీ బిజెపి నాటి పూర్వరూపం లాటి రామరాజ్య పరిషత్‌ హిందువనే ఒకే కారణంతో కాశ్మీర్‌ రాజు కుట్రలకు వంతపాడింది! నిజానికి దేశానికి ద్రోహం చేసిన రాజులలో మీర్జాఫర్లూ వున్నారు, జయ చంద్రులూ వున్నారు.అయితే ఎప్పుడైనా ఎక్కడైనా మత ప్రాతిపదిక తప్ప మానవ సమానత మతతత్వ రాజకీయాలకు అక్కర్లేదు.
అసలు నిజాంను గద్దె దించడమే తప్పన్నట్టు మజ్లిస్‌ చేసే వాదన మరింత తప్పు. నిజాం ఏ మతానికి చెందిన వాడైనా ప్రజాస్వామ్య విలువలను కాలరాసి ప్రజలను వెట్టిచాకిరీకి గురి చేశాడు గనకే వ్యతిరేకించి పోరాడాల్సి వచ్చింది. ఇప్పటికీ ముస్లిం జన బాహుళ్యం దారుణ దారిద్య్రంలో జీవిస్తుండడంలోనే ఈ సత్యం వెల్లడవుతుంది. తెలంగాణా సాయుధ పోరాటంలో ఎందరో ముస్లిం నేతలు కీలక పాత్ర వహించారనేది బిజెపి మజ్లిస్‌ కూడా గుర్తుంచుకోవాలి.
సెప్టెంబరు 17పై మొదట్లో టిఆర్‌ఎస్‌ నేతలు వినిపించిన వాదన మరింత విడ్డూరమైనది. నిజాంను నీ గోరి కడ్డం కొడకో అని హెచ్చరించింది నాటి తెలంగాణా పోరాట వీరులైతే నీ గోరికాడికొచ్చి నేను మొక్త కొడకో అన్నట్టు ప్రవర్తించింది కెసిఆర్‌. గోదావరి కటిyంచిన కాటన్‌ దొరతో పోల్చి ఏదో చెబుతుంటారు. కాటన్‌ స్పష్టంగా పరాయి పాలకుల ఉద్యోగి. ఆయన ఎవరినీ వెట్టిచాకిరీలో పీడించిన దాఖలాలు లేవు. నిజాం గొప్పవాడేనని కె.సిఆర్‌, మరికొంతమంది మేధావులు చెబుతున్నటుy ఒప్పుకుంటే అంత గొప్పవాణ్ని పడగొట్టడం విమోచనం ఎలా అవుతుంది?
ఆ నాడు పోలీసు చర్య అనంతర నిర్బంధానికి కారణమైన కాంగ్రెస్‌ తర్వాత కాలంలో రకరకాలుగా ప్రాంతీయ ప్రజ్వలనాలకు కారణమైంది. గత రెండేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. ఇప్పుడు కూడా ప్రాంతాల వారీ ప్రజ్వలనాలు ఎగదోస్తున్నది. మరో పాలక పక్షమైన తెలుగు దేశం కూడా ఈ ద్వంద్వ రాగమే ఆలపిస్తున్నది. టిఆర్‌ఎస్‌, వివిధ జెఎసిలు వారి వారి అవసరాలకు తగినట్టు వారు మాట్లాడుతున్నారు. ఇప్పటి అవకాశవాదాలు చాలక గత చరిత్రను కూడా వక్రీకరించడం వీర తెలంగాణా పోరాట స్పూర్తికే కళంకం.ఈ హడావుడి చేసే వారెవరూ అసలు వీర తెలంగాణా సాయుధ పోరాటానికి నేతృత్వం వహించి అశేష త్యాగాలు చేసిన కమ్యూనిస్టులను పాత్రను పట్టించుకోకపోగా అపార్థాలు వ్యాప్తి చేస్తారు. నిజాం పై చాలా మంది పోరాడినట్టు ఒక జాబితా ఇచ్చి అందులో కమ్యూనిస్టుల పేరు కూడా జోడిస్తుంటారు..వారికీ కులం లేదా ఆధిపత్యం అంటగడుతుంటారు. కమ్యూనిస్టు వారసత్వం విస్మరించి వీర తెలంగాణా విమోచన గురించి మాట్లాడ్డం చంద్రుడు లేని పౌర్ణిమను చూపించడమే. సూర్యుడు లేని ఉదయాన్ని వూహించడమే. దున్నేవానికి భూమి నినాదం తెలంగాణా పోరాట శ్వాస. వేల ఎకరాలు కార్పొరేట్లకు కుబేరులకు కట్టబెడుతున్న ఇప్పటి సర్కార్ల పోకడలు దానికి పూర్తి విరుద్దం. భూమి ఉపాది సాధన కోసం పోరాడకుండా ఏవో వాగాడంబరాలతో జనాన్ని దారి తప్పించడం అన్నిటికన్నా విద్రోహం అవుతుంది.



2 comments:

  1. //భూమి ఉపాది సాధన కోసం పోరాడకుండా ఏవో వాగాడంబరాలతో జనాన్ని దారి తప్పించడం అన్నిటికన్నా విద్రోహం అవుతుంది.

    Avunu ippudu antha maaji communist party of India [CPI(M)] vaari nayakathvam lo meeru cheppina bhoomi mariyu upadhi koraku poratam cheyali.... vaatini ala anachiveyalo mee alubadi lo jarigina nadigram and singuru lanu chusi ithara palaka vargalu nercgukuntayi.... dani kanna mundu manam urgent ga athyantha nijayithi parudu, karl marx varasudu, prajaswamyam nu kapade charithraka bhadyatha thisukunna chandrababu CM ni cheyali... appudu meeru cheppina bhoomi mariyu upadhiautomatic ga parishkaram avuthundhi le...

    Last ga oka mata... mee adhipathya prantha agra kula durahankarula nundi Telangana asthithva udhyamam eami expect cheyatam ledhu kani daniki marxist musugu vesukovatam matram darunam...

    ReplyDelete
  2. @ siva

    meeku meere evevo anukunu aneste cheppedemuntundi? so called astitwa vada udyama mahanetale kondaru neruga chandrababu kinda batiki chedinavare.meeranna kitabulu evariki eppudu ichhindi ledu. icchedi ledu. naku leni tatwalanni antakattoddu. Telangana prajalanu peedinchina doralu ikkadi vare. srikakulamlo gunnamma, challapallilo viyyamma, telnganalo ayilamma anta sthanika doralapai poradina vere tappa prantala variga udyaminchaledu. ivanni ipudu cheppina mmeku ante vyaktigatanga meeku artham avutayane nammakam ledu. ayina cheppaka tappadu. sapanarthalenduku chuddam palaka paxala pachikalu ela untayoo...

    ReplyDelete