Pages

Thursday, September 15, 2011

మోడీకి కితాబు... అద్వానీకి జవాబు!



గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థతకు మారు పేరు అని అమెరికా కాంగ్రెస్‌ రిసెర్చి విభాగం పెద్ద నివేదిక నివ్వడంపై ఆయనతో సహా ఆ పార్టీ ఆనందోత్సాహాలలో మునిగిపోవడం సహజమే. ఆరేళ్ల కిందట అమెరికా ఆయనకు వీసా నిరాకరిస్తే అన్ని పార్టీలూ ఖండించాయి. తర్వాత కాలంలో ఆయన విధానాలలో గాని ఆలోచనల్లో గాని ఏ మార్పు వచ్చింది లేదు. అయినా అమెరికా ఇంతగా పొగుడుతున్నదంటే అవసరాన్ని బట్టి మార్చుకున్న వ్యూహమై వుండాలి. మోడీకి తమ ఆమోదం వుందన్న సందేశం పంపించడమే వారి ఉద్దేశం. ఇతర పార్టీల సంగతి ఎలా వున్నా మరోసారి భారత యాత్ర ప్రకటించిన మహా రథికుడు అద్వానీకే ఇది అశని పాతం. ఎందుకంటే
అవినీతికి వ్యతిరేకంగా యాత్రం అంటున్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తాను వున్నానని సంకేతం ఇవ్వడానికే అద్వానీ ఈ కార్యక్రమం తలపెట్టారన్నది సకలజనాభిప్రాయం. అమెరికా కితాబు తర్వాత మోడీ రాబోయే ఎన్నికల ప్రధాని అభ్యర్థి అని ఆయన అనుకూలులు హడావుడి మొదలెట్టారు. అయితే విచిత్రమేమంటే మోడీతో పాటు మరో సమర్థుడుగా కితాబు పొందిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా మోడీని ఆమోదించరు! తమ ఎన్నికల ప్రచారానికి మోడీ రాకూడదని షరతు పెట్టారు.బహిరంగ వివాదమే నడిపించారు. ఎన్‌డిఎలో మిగిలిన ఒకే ఒక పెద్ద పార్టీకే మింగుడు పడని మోడీ అభ్యర్థిత్వం విశాల ప్రజా రాశులకు నచ్చుతుందనుకోవడం అవాస్తవికం. వాస్తవానికి బిజెపిలోనే దీనిపై ఏకాభిప్రాయం లేదు. మోడీ ఇంకా కొంత కాలం నిరీక్షించాలనే ముఖ్యులైన బిజెపి నేతలు అంటుంటారు. ఈ దృశ్యాన్ని ఇంకా చికాకు పర్చడానికే అమెరికా కితాబు కారణమవుతుంది.మోడీని నాటి కేసులు ఇంకా వెన్నాడూతూనే వున్నాయికాంగ్రెస్‌ ఎంపి తో సహా 32 మంది హత్యకు సంబంధించిన కేసులో సుప్ర్రీం కోర్టు విచారణకు నిరాకరించి కిందకు పంపిస్తే అదే పెద్ద విజయంగా ప్రచారం చేసుకోవడం చట్టరీత్యా నిలిచేది కాదు. అవినీతి అంటే కేవలం డబ్బు తీసుకోవడమే గాదనీ,వేలమంది బలికావడానికి కారణమైన మతతత్వ రాజకీయాలు కూడా అంతకంటే తక్కువ కాదని మోడీ భజనపరులు తెలుసుకోవాల్సి వుంటుంది.

2 comments:

  1. "ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా యాత్రం అంటున్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తాను
    వున్నానని సంకేతం ఇవ్వడానికే అద్వానీ ఈ కార్యక్రమం తలపెట్టారన్నది సకలజనాభిప్రాయం. "

    రవి గారూ నమస్కార౦,
    నాకు అర్ధ౦ కాని విషయ౦ ఏ౦ట౦టే రాజకీయ నాయకులు
    "ప్రజల౦తా" "జనమ౦తా" "సకల జనులు" అ౦టు౦టారు. సకల జనుల౦టే
    100 శాతమా? 51 శాతమా? లేకపోతే ఓట్ల శాతాన్ని బట్టి చూద్దామన్నా ఏ పార్టీకి
    కనీస౦ 40% రావట౦ అనేదే లేదు. మరి అ౦దరూ మాకు మేమే సకల జనానికి
    ప్రతినిధుల౦ అ౦టు౦టారు. సరే ఇద౦తా రాజకీయ నాయకులకు మామూలే
    అనుకు౦టే, మరి మీ లా౦టి విశ్లేషకులు కూడా ఎ౦దుకు "సకల జనులు" అ౦టారు.
    అ౦టే మీ అభిప్రాయమే సకల జనుల అభిప్రాయమా లేకపోతే మీరనుకున్నదే సకల జనుల
    అభిప్రాయమనుకు౦టున్నారా? ఏ ప్రాతిపదికన జనమ౦తా అనుకు౦టున్నారు/అ౦టున్నారు
    అని ఎలా చెప్తారు. సర్వే ఏమన్నా చేస్తారా? అదేమీ కాదు లేవయ్యా ఏదో ఫ్లోలో
    అ౦టా౦ అ౦టారా? ఓకె, మీరు కూడా అలాగే అ౦టే రాజకీయ నాయకులకు
    మీకు ఏ౦టి తేడా? ఏదయినా ఒక పార్టీ సిద్ధా౦తానికి లోబడి చేసే విశ్లేషణకు
    విలువ వు౦టు౦ద౦టారా? రాజకీయ ర౦గు వు౦డదా? కొ౦చె౦ వివరిస్తారా?
    ఆఁ ... నీకు జవాబు చెప్పేదే౦టని అనుకోరనుకు౦టాను. నేను బిజెపి భజనపరుణ్ణి కాద౦డోయ్!!!

    ReplyDelete
  2. సకల జనాభిప్రాయం అంటే సాధారణంగా అనుకుంటున్నది, మీడియాలో అన్ని చోట్లా వస్తున్నది అన్న అర్థంలో స్థూలంగా వాడుతుంటారు. అందరూ అనుకుంటున్నారు అని మనం వ్యవహారంలో వాడుతూనే వుంటాము కదా అలాటిదే. ఇలా అన్న ప్రతిసారీ ఓటింగు తీసుకోవాలంటే ఎవరి వల్లా కాదు. సైద్ధాంతికంగా స్పష్టమైన తేడాలుండే అంశాలు కొన్ని వుంటాయి. స్థూలంగా అనుకునేవి కొన్ని వుంటాయి. దీన్ని ఆ అర్థంలో తీసుకోవలసిందే. మోడీ ప్రధాని అభ్యర్థిత్వం గురించి ఆఖరులో వెంకయ్య నాయుడు గారు కూడా ప్రకటించడం ఇతర పరిణామాలు కూడా మీరు గమనించే వుంటారు.. మీరు బిజెపి భజనపరుణ్ని కాదని అన్నారు. మరి మీరు దీనిపై ఏమైనా అనుకుంటే చెప్పండి. లేదా మీకు తెలిసిన వారితో మాట్టాడి చూడండి. దాన్నిబట్టి కూడా అలా అనడం సరైందా కాదా అనేది అర్థమవుతుంది. వారు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే అలా రాశాను.

    ReplyDelete