Pages

Thursday, September 15, 2011

వైభవ విషాదం- సావిత్రి!


ఆమెను తల్చుకోగానే తెలుగు దనం తొణకిసలాడే ఒక కళాత్మక మహిళా మూర్తి మనసులో కదలాడుతుంది. అభినయం మూర్తీభవించిన విదుషీమణి సాక్షాత్కరిస్తుంది. నటీనటులు ధరించిన పాత్రలూ వారి వాస్తవ జీవితాలూ పెనవేసుకు పోవడం అరుదుగానైనా జరుగుతుంటుంది. అందులోనే అనేక వైరుధ్యాలూ వుంటాయి. అలాటి అరుదైన జీవితం సావిత్రిది! ఆమె తర్వాత ఎంత ప్రతిభా వంతులైన కథానాయికలు వచ్చినా ఒక పట్టాన ఆమెతో పోల్చలేని స్థితి కొనసాగుతూనే వుంది. వాణిశ్రీ, శారద, సుహాసిని, సౌందర్య ఇలాటి వారిని ఎంతగానో ఆరాధించేవారు కూడా. సావిత్రిలోని సంపూర్ణత్వం వుందని మాత్రం పూర్తిగా ఆమోదించలేరు. ఆమె వేసిన ముద్ర అంత ప్రగాఢమైంది.
కొంతమంది లాగా సావిత్రి బంగారు సోపానాలపై నడిచి రాలేదు. వెండి తెర ఆమెకు ఎర్రతివాచీలు పర్చి ఆహ్వానించలేదు. నటనపై ఎనలేని మక్కువతో- ఎన్ని సార్లు కాదన్నా ఎదురీద గల తెగువతో ఆమె పోరాడి నిలదొక్కుకుంది. తెరపై ఒక మూల ఒక్కసారి కనిపించే పాత్రలైనా ధరించేందుకు సిద్ధపడి తర్వాత అక్కడ ఎవరున్నా తననే చూపించకతప్పని
శిఖరాగ్రస్థాయికి చేరింది. మొదటి తరంలో ఇద్దరు హీరోలు- ఏఎన్నార్‌ ఎన్టీఆర్‌. ఆ స్థాయి హీరోయిన్‌ మాత్రం సావిత్రి మాత్రమే. భానుమతి, జమున వంటి వారి దారి వేరు.
ఎల్‌.వి.ప్రసాద్‌ ఇద్దరు అగ్రనటులతో తీసిన 'సంసారం' లో చెలికత్తె పాత్రతో ప్రవేశించిన సావిత్రి తారాపథంలోకి దూసుకెళ్లడం తథ్యమని అందరికీ అర్థమై పోయింది. 'దేవదాసు'లో అనుకోకుండా వరించిన పార్వతి పాత్ర సావిత్రి స్థానాన్ని శాశ్వతం చేసింది. ఆ చిత్రం పూర్తిగా హీరో ప్రధానమైంది. విఫల ప్రేమ, తాగుబోతు జీవితం వగైరాలతో నడిచే ఆ చిత్రంలో నాయిక కూడా మర్చిపోలేని విధంగా జనం హృదయాల్లో నిల్చిపోయిందంటే సావిత్రి నటనే ప్రధాన కారణం. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న యువప్రాయంలోనే అంత బరువైన పాత్రను అవలీలగా ధరించి సావిత్రి సత్తాను చాటుకుంది.
అక్కినేని సావిత్రి పోటీ పడి అటు ప్రేమనూ ఇటు విషాదాన్ని కూడా అద్భుతంగా పలికించి అఖండ విజయాలు సాధించిన చిత్రాలకు లెక్కేలేదు. 'అర్ధాంగి'లో పరిపక్వత లేని భర్తగా నటించిన అక్కినేనిని తీర్చిదిద్దిన పాత్ర ఆ మహానటుని ప్రశంసలందుకొంది. తొలిసారి గోదారి సౌందర్యాలను యధాతథంగా అందించిన చిత్రం 'మూగమనసులు'. ఈ చిత్రంలో విషాద మూర్తిగా సంధిగ్థ జీవిగా సావిత్రి పాత్ర చాలా సంక్లిష్టమైంది. 'సుమంగళి'లో కోరి చేసుకున్న రోజునే భర్త దాంపత్య జీవితానికి పనికి రాకుండా పోతే 'సిగపూలు వాడకనే చెలి బతుకు వాడెనయా' అన్న ఘంటసాల పాటకు సరితూగేది సావిత్రి నటనే. ఒక విధంగా ఆ కథల్లోని నాటకీయతను కూడా పరిహరించి పండించడం ఆమె సహజ నటన ఫలితమే. 'చివరకు మిగిలేది'లో జీవితం తాకిడికి స్థిమితం కోల్పోయిన పాత్రలో సావిత్రి నటన జాతీయంగా ఆ పాత్ర వేసిన హిందీ బెంగాలీ నటీమణులను మించిపోయింది. 'మనుషులు మమతలు, మంచి మనసులు, తోడి కొడళ్లు, మాంగల్యబలం' ఇలా అక్కినేని సావిత్రి కలయికలో విరబూసిన తెరమల్లెలెన్నో! ఈ రొమాంటిక్‌ జంట అన్నచెల్లెళ్లుగా నటించిన 'డాక్టర్‌ చక్రవర్తి' కూడా పెద్ద హిట్టే! తొమ్మిది రోజులూ తొమ్మిది వేషాలతో సాగే నవరాత్రి ఈ జాబితాలో మరో ప్రత్యేక ప్రయోగం.
నటన పరంగా సావిత్రి అక్కినేనితో తులతూగితే మరో కోణంలో చూసినప్పుడు ఎన్టీఆర్‌తో ఆమె జంటగా వేస్తే చాలా నిండుగా వుంటుంది. 'గుండమ్మ కథ' ఇందుకు ఓ ఉదాహరణ. దేవత మరొకటి. ఇద్దరూ కొంచెం పెద్దవారైనాక నటించిన విచిత్ర కుటుంబంలోనైతే కుటుంబ సంబంధాలను అనుబంధాలను కళ్లకు కట్టినట్టు పండిస్తారు. తమ్ముణ్ని బిడ్డకన్నా మిన్నగా ప్రేమించిన తల్లిగా సావిత్రి ఆ ఘర్షణాత్మక పాత్రకు ప్రాణం పోసింది. వారిద్దరూ ఆత్మబంధువులో చదువుసంధ్యలు లేని అమాయకుడైన భర్తగా నటించిన ఎన్టీఆర్‌ను నడిపించే భార్యగా, ఆయనే కలసి వుంటే కలదు సుఖంలో శారీరక లోపం గల పాత్రలో నటిస్తే నడిపించిన భార్యగానూ అంత బాగా చేసింది. పాండవ వనవాసం, నర్తనశాల వంటి పౌరాణిక చిత్రాల్లోనూ రామారావు పక్కన ద్రౌపదిగా కనువిందు చేసింది. సావిత్రి, ఎస్వీఆర్‌లు కలసి నటిస్తే ఆ విషాద గంభీరాన్ని భరించడం ఎంత కష్టమో! ఆత్మబంధువు, బాంధవ్యాలు వంటి చిత్రాల్లో కుటుంబ పెద్దగా ఎస్వీఆర్‌, కీలకమైన ఇల్లాలి పాత్రలో సావిత్రి పోటీపడి నటించిన దృశ్యాలు మనస్సును చలింపచేస్తాయి.
సావిత్రి అంటే సాత్వికతే ప్రధానంగా గుర్తుకు వస్తుంది గాని ఆమె చేసిన హాస్యం తక్కువ కాదు. గురజాడ 'కన్యాశుల్కం'లో మధురవాణి పాత్రకు అతికినట్టుగా సరిపోయింది. 'మాయాబజార్‌'లో ఘటోత్కజుడు (ఎస్వీఆర్‌) శశిరేఖగా మారిన తర్వాత ఘట్టాలలో సావిత్రి నటన ఆమెకే చెల్లింది. 'దొంగరాముడు'లోనూ ఇదే తరహా గడుగ్గాయి పాత్ర. ఇంతకు ముందు చెప్పుకున్న 'అర్థాంగి' కూడా ఆ కోవలోదే. 'అప్పుచేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు' వంటి హాస్య చిత్రాల్లోనూ నటించి నవరసాలు పండించింది.
సావిత్రి కళ్లలో పలికించే భావం అద్భుతం. ఆమె విషాదాభినయం నిజంగానే చాలా బరువెక్కించే అనుభూతిని మిగులుస్తుంది. శరీరం స్థూలమైన తర్వాత కళ్లలో పలికే భావాల కారణంగానే ఆమె దాంపత్య ప్రణయాన్ని అభినయిస్తూనే వచ్చింది. అయితే బాడీ లాంగ్వేజ్‌ తక్కువేనని ఆమె తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాణిశ్రీ ఒక సందర్శంలో చెప్పారు.
'మాతృదేవత'లో ఎన్టీఆర్‌తో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించింది. అన్నట్టు తెలుగులో తొలి మహిళా దర్శకురాలు సావిత్రి. మొత్తం మహిళలతో ఆమె తీసిన చిత్రం చిన్నారి పాపలు ఆమెను ఆర్థికంగా చితక్కొట్టింది.తర్వాత కూడా జగ్గయ్యతో వింత సంసారం, చలంతో చిరంజీవి,మాతృదేవత తదితర చిత్రాల నిర్దేశకత్వం నిర్వహించి సామర్థ్యం చాటుకున్నది.సావిత్రి విదూషీమణి కూడా. అభ్యుదయ కవులు నిర్వహించిన నవత పత్రిక సంపాదకవర్గంలో శ్రీశ్రీ వంటి వారితో పాటు ఆమె కూడా భాగం పంచుకున్న సంగతి చాలా మందికి తెలియదు.అలాగే చదరంగం అసోసియేషన్‌లోనూ. చేతికి ఎముక లేకుండా దానాలిచ్చిన సావిత్రి చివరకు తనే దివాళా తీసే స్తితికి చేరింది. జెమినీ గణేషన్‌తో వివాహం ఒడుదుడుకులకు గురి కావడం, శరీరం స్థూలమై తారాపథం నుంచి జారిపోవడం, దర్శకత్వం దాతృత్వాలతో ఆర్థిక పరిస్థితి తలకిందులవడం, ఆ ప్రభావంతో వ్యసనాలు తీవ్రమవడం ఇవన్నీ కలసి మహానటిని కరగించి వేశాయి. పురాణాలలో సావిత్రి యముడితో పోరాడి మృతుడైన భర్తను బతికించుకుంది. సినీ మాయాబజార్‌లో సావిత్రి కోరిచేసుకున్న భర్తతో దూరాన్ని భరించలేక తన కథనే విషాదాంతం చేసుకుంది. అదో విషాద వైభవం!


సావిత్రిపై చక్కటి పుస్తకం
రాజకీయ వ్యాపార రంగాలలో అభిప్రాయ భేదాలుండొచ్చు గాని కళా రంగంలో అందరికీ అభిమాన పాత్రులైన వారి గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. వాళ్ల గురించిన ఏ చిన్న విశేషమైనా ఎనలేని ఆసక్తి కలిగిస్తుంది. ఆ కోవలో అగ్రగణ్యురాలు సావిత్రి. తెలుగు తమిళ సినీ రంగాలలో ఒకటి రెండు తరాలకు ఆరాధ్య దేవత. నటనకు నిర్వచనం, ప్రసిద్ధికి పర్యాయపదం సావిత్రి. నిజానికి ఆమె తారలకు తార. వైహాయస వీధుల్లోకి దూసుకెళ్లిన సావిత్రి జీవితంలో వెండి వెలుగుల వెంట వెంట విషాదపు చీకట్లు కమ్ముకున్న వైనం ఆమె నటించిన ఏ చిత్రంలోనూ చూడనంత నాటకీయంగా అనిపిస్తుంది. సావిత్రిపై వచ్చిన ఒక పుస్తకాన్ని గతంలో ఈ శీర్షికన చెప్పుకున్నా ఇప్పుడు మరో పుస్తకాన్ని కూడా పరామర్శించుకోవడానికి కారణం అదే. గత ఏడాది ఆగష్టులో విడుదలై మూడు ముద్రణలు పొందిన '' మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి'' కళాభిమానులెవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.కారణం అద్భుతమైన ముఖచిత్రమే! లోపలి చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే వుంటాయి. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు సంబంధించిన పుస్తకాలు అందంగా వెలువడి ఆదరణ పొందడం తెలిసిన విషయమే.
సావిత్రిని అమితంగా అభిమానించే పల్లవి ఈ పుస్తక రచయిత. సీనియర్‌ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు చిన్న 'ముందుమాట' రాస్తూ ''ఈ పుస్తకం చాలా యథార్థంగా సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించింది'' అని అభిప్రాయపడ్డారు. ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ అభిప్రాయం రాస్తూ తెలియని అనేక విషయాలు వెల్లడించిన ఈ పుస్తకంలో తనకు తెలిసిన పలు విషయాలు లేకపోవడాన్ని కూడా ప్రస్తావించారు. ఆ సమగ్రతా లోపం వుండొచ్చు గాని వున్న మేరకు చక్కగా చదివిస్తుంది.
చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతున్న సావిత్రి గురించి వినవచ్చిన రకరకాల వ్యాఖ్యానాల ప్రస్తావనతో పుస్తకం మొదలవుతుంది. అక్కడి నుంచి నేరుగా ఆమె బాల్యంలోకి తీసుకువెడుతుంది. 1936 జనవరి 4న గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టిన సావిత్రికి చిన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సుభద్ర బతుకుతెరువు కోసం సావిత్రిని, ఆమె కన్నా ముందు పుట్టిన మారుతిని తీసుకుని విజయవాడ చేరింది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి అండదండలతో ఆ కుటుంబం బతుకు నెట్టుకొచ్చింది. చిన్ననాడే సావిత్రి చురుకుదనాన్ని , చక్కదనాన్ని గమనించిన వారు నాట్యం నేర్పించమని సలహా ఇవ్వడంతో పెదనాన్న చౌదరి అమలు చేశాడు. బెజవాడలో నాటకాలు వేస్తూ సావిత్రి అందరి మెప్పుపొందింది. తర్వాత కాలంలో అన్నపూర్ణ పిక్చర్స్‌ అధినేత అయిన దుక్కిపాటి మధుసూదన రావు ఆమెను సినిమాల్లోకి వెళ్లవలసిందిగా సూచించారు. పెదనాన్న వెంకట్రామయ్య దాన్ని పట్టుకుని సావిత్రిని తీసుకొని మద్రాసు బయిల్దేరాడు. అప్పుడు ఆమె తొలి స్టిల్‌ ఫోటోలు తీసిన వ్యక్తి గణేష్‌. (తర్వాత ఆమె జీవితంలో అనేక మలుపులకు కారణమైన జెమినీ గణేషన్‌) పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి విసుగు చెందని విక్రమార్కుడిలా తిరుగుతూనే వున్నా సావిత్రి నటిగా నిలదొక్కుకోవడానికి సమయం కొద్ది కాలం ఆగక తప్పలేదు. అగ్ని పరీక్షలో వచ్చిన వేషం వయసు చాలక వెనక్కుపోయింది. సంసారంలో నాగేశ్వరరావుతో నటించడానికి బిడియపడేసరికి మరొకరికి ఆ పాత్రదక్కి సావిత్రి కేవలం ఒక పాటలో కొద్దిగా కనిపించడంతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఇది భరించలేని పెదనాన్న ఆమెపై చేయి చేసుకున్నాడు కూడా. ఆ దశలో దొరికిన స్నేహితురాలు చాముండి సావిత్రికి ప్రాణసమానురాలై మార్గ నిర్దేశనం చేసింది. ఈ క్రమంలో సావిత్రి విజయవారి పాతాళభైరవిలో ఒక నృత్యంతో అందరినీ ఆకర్షించి ఆ పైన పెళ్లిచేసిచూడులో ద్వితీయ నాయికగా తనదైన ముద్ర వేసింది. (విజయవారి చలవే తనను నాయికను చేసినందున కూతురికి విజయ చాముండేశ్వరి అని పేరు పెట్టుకుంది) అంతే. తర్వాత వెనక్కు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు.
దేవదాసు సినిమాలో నటించడం సావిత్రికి పెద్ద మలుపు.అప్పటి వరకూ ఆమె హుషారైన పాత్రలే వేసింది. పల్లెటూరు, శాంతి,ప్రియురాలు సినిమాలు కూడా విడుదలైనాయి. పల్లెటూరు ప్రజానాట్యమండలి వారి సినిమా. పెదనాన్నతో సహా అందరూ ఈ ఏడుపుగొట్టు పాత్ర వద్దని వారించారు.వాదించారు. అయినా ఆమె ఆ పాత్రను విపరీతంగా అధ్యయనం చేసి తనే ధరించి తీరాలని నిర్ణయానికొచ్చింది.
1953 జూన్‌ 26న దేవదాసు విడుదలై సావిత్రిని శిఖరాగ్రాలకు తీసుకెళ్లింది. తర్వాతి అమాయకుడైన భర్తను అసాధ్యుడిగా తీర్చిదిద్దిన అర్థాంగి పాత్ర దాన్ని మించిపోయింది. ఆ పైన అసమాన తార భానుమతి చేస్తున్న మిస్సమ్మ పాత్ర- ఆమె అహంభావంపై చక్రపాణి ఆగ్రహం కారణంగా సావిత్రిని వెతుక్కుంటూ వచ్చింది. ఈ లోగా తమిళమూ నేర్చుకుని అదరగొట్టడం మొదలెట్టింది. వెంటపడి హీరోయిన్‌ను చేసిన పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమె సంపాదనతో సామ్రాజ్యం నిర్మించుకోవాలని విఫలయత్నం చేస్తుండగా, ప్రాణసఖి చాముండి పలు విధాల సందేహిస్తుండగా సావిత్రి జిజి అనబడే జెమినీ గణేషన్‌ను రహస్య వివాహం చేసుకుంది.తర్వాత అది బయిటపడనే పడింది. ఇది స్నేహితురాళ్ల మధ్య సంవాదానికి, ఇంట్లో సంఘర్షణకు దారి తీసింది.ఈ లోగా గురజాడ కన్యాశుల్కంలోని మధురవాణి పాత్రను మహాద్బుతంగా పోషించి రెండో పెళ్లి వాడైన జిజిని తను తిరుపతిలో వివాహం చేసుకున్నట్టు సావిత్రి 1955లో పత్రికల వారికి తెలియజేయడంతో ఒక ఘట్టం ముగిసింది. మరింత కీర్తి మూటకట్టుకుంది.మరో వంక జిజి రేఖ తల్లి పుష్వవల్లిని కొత్తగా పెళ్లి చేసుకున్న వార్తలు.... వీటన్నిటినీ ఈ పుస్తక రచయిత్రి ఆసక్తికరంగా రాశారు.
సినిమా రంగంలో సావిత్రి వైభవ ప్రాభవాలను తెలిపే ఘట్టాలు కొన్ని.. మాయాబజార్‌ షూటింగ్‌ సందర్భంగా గ్లిజరిన్‌ లేకుండా ఏడుస్తానని, పైగా ఎ న్ని చుక్కలు కావాలంటే అన్నే కళ్లనుంచి తెప్పిస్తానని పందెం వేసి గెలుస్తుంది సావిత్రి! పక్కనున్న పితృసమానుడైన ఎస్‌విఆర్‌ పందెం కింద మరో వేషం కోరుకొమ్మని సూచించినా వినకుండా చిన్న మొత్తంతోనే సరిపెట్టుకుంది.అదే షూటింగు సందర్భంలో ఒక సీనియర్‌ నటి సహాయార్థం జరిగే వేడుకకు తన పారితోషికం మొత్తం ఇచ్చి అందరినీ దిగ్భ్రాంత పరచింది. మద్రాసులో బంగళాలు నిర్మించింది. 1958లో ఆమె నెల తప్పిందని తెలిసి నిర్మాతలు హడలిపోయారు.








2 comments: