Pages

Sunday, December 30, 2012

కార్యాచరణే కాలమానం





కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం
కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక
కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు
కాలం ఒక చిత్రం
కాలం ఒక సూత్రం
కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం సరిపోవాలి గాని చెప్పుకుంటూ పోతే కాలం గురించి ఇలా ఎన్నయినా పరస్పర విరుద్ధ విషయాలు ఏకరువు పెట్టొచ్చు.
కాలం గురించి ఆలోచనా పరులంతా ఏదో చెబుతూనే వచ్చారు. కవులు కావ్యాలు వెలువరించారు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. చేస్తున్నారు. కాలంతో పరుగు తీయాలని మానవులు కలలు కంటూనే వున్నారు. కాలాన్ని జయించేశామనుకునే లోపలే మళ్లీ అది కవ్విస్తూ సవాలు చేస్తూనే వుంది.
ఇన్ని తమాషాలకు కారణం ఒక్కటే- కాలం దానికదే ఏమీ కాదు. కాలమానం ఒక కొలమానం మాత్రమే.
అబ్బిన జ్ఞానాన్ని బట్టి అధ్యయానికి విలువు. వచ్చిన మార్కులను బట్టి రాసిన పరీక్షకు విలువ. వచ్చిన లాభాన్ని బట్టి వ్యాపారానికి విలువ. దిగుబడిని బట్టి సేద్యానికి విలువ.గుణాన్ని బట్టి వైద్యానికి విలువ. రుచిని బట్టి వంటకు విలువ. అలాగే కాలాన్ని విలువ కట్టాలంటే కార్యాచరణతోనే సాధ్యం. కాలాన్ని కొలవడానికి ఏకైక సాధనం కార్యాచరణే. ఎంత సమయంలో ఎంత పని జరిగింది లేదా జరగలేదు అన్నదాన్ని బట్టే కాలానికి విలువ అన్నది మొదటిసూత్రం.
ఎవరు ఏ రంగంలోనైనా వుండొచ్చు. పైన చెప్పుకున్న పనుల్లో ఏది చేసేవారైనా కావచ్చు. సాపేక్షంగా ఎంత సమయంలో ఎంత ఫలితం సాధించారనేదాన్ని బట్టి - లేక ఎంతో సమయంలోనైనా ఏం సాధించారనే దాన్ని బట్టి విలువ కట్టాల్సివుంటుంది.
నీటికి విలువ వుండేది కాదు- ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుని వాడుకోవడం మొదలెట్టాకే బొట్టుబొట్టు లెక్క కట్టడం జరుగుతున్నది. అలాగే జీవరాశులే లేనప్పుడు కాలం గురించిన ఆలోచనే వుండి వుండదు. జంతు జాలమైనా వచ్చాకే వాటి అలవాట్లకు ప్రాకృతిక పరిణామాలకు అనుసంధానం అవసరమైంది. తెలియకుండానే అనుసరించడం మొదలెట్టాయి.మనిషి కూడా మొదటి దశలో ఎన్ని వేల సంవత్సరాలు అనాగరికంగా జంతు సదృశంగా బతికాడో మనకు తెలియదు.ఆ దశలోనూ కాలానికి విలువ గాని లెక్క గాని వుండి వుండదు.మేధా వికాసం జరిగాకే పరిసరాలను అధ్యయనం చేసి విజ్ఞానశాస్త్రం పెంపొందింది. అప్పుడే కాలాన్ని లెక్కగట్టడం మొదలైంది.ఒకసారి మొదలైన తర్వాత వెనకటి కాలాన్ని కూడా గణించే పద్ధతులన్నీ తెలిశాయి. అలా చూసినప్పుడు ఎన్ని సహస్రాబ్దులు అలా స్తబ్దుగా గడిచిపోయాయి? మరి ఇప్పుడో..!
2000 సంవత్సరం నూతన సహస్రాబ్ది వచ్చిందని హడావుడి చేసి అప్పుడే పుష్కర కాలం గడిచిపోయింది. ఆ రోజున అదే పనిగా కేరింతలు కొట్టిన వారు చిందులేసిన వాళ్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవద్దూ.. పన్నెండేళ్లలో సాధించేందేమిటి? అని. అప్పటితో పోలిస్తే ఇప్పుడెక్కడున్నాం?కొత్తగా ఏం నేర్చుకున్నాం? ఏం మార్చుకున్నాం? పుష్కర కాలం పురస్కరించుకుని పరిశీలించుకోవచ్చు.అంత ఓపిక లేకుంటే

Saturday, December 29, 2012

జోహార్లు చిట్టి తల్లీ!


పదమూడు రోజుల పాటు మృత్యువుతో హౌరాహౌరీ పోరాడి అలసి సొలసి ఆఖరి శ్వాస విడిచిన గ్యాంగ్‌రేప్‌ బాధిత యువతి కోసం చెమ్మగిల్లని కళ్లేవీ దేశంలో వుండవు. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అని కవి రాసిన మాటలు ఇక్కడ మొత్తం దేశానికి వర్తిస్తాయి. దేశాధినేతలు అన్ని పార్టీల ప్రముఖులూ సకల జన సమూహాలు శోకతప్త హృదయాలతో ఆమెకు ఆఖరి నివాళి సమర్పిస్తూనే అత్యాచార భారతాన్ని అంతమొందించాలని ప్రతిజ్ఞబూనుతున్నారంటే ఆమె మరణం ఎంత ప్రభావం చూపిందో తెలుస్తుంది. అమాయకంగా అమానుష ముష్కరులకు బలైనా ఆమె మరణంలోనూ దేశాన్ని మేల్కొలిపే సమర సంకేతం కావడం నేటి కాల పరిస్థితులకు ప్రతిబింబిస్తుంది. ఈ రాక్షస కాండపై రగిలిన ఆగ్రహం, పెల్లుబికిన యువచైతన్యం, మహిళలపై దుర్మార్గాలు సాగించే వారికి ఒక హెచ్చరిక అవుతుంది. నిత్యం మహిళా జపం చేస్తూనే వారి రక్షణ పట్ల ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ చాలా సందర్భాల్లో నేరస్తులకు గొడుగు పట్టే పాలకవర్గాలను ప్రకంపింపచేస్తుంది. కాపాడకపోగా కలుషిత సంసృతిని వ్యాపింపచేస్తూ ఆ పైన అమ్మాయిలే అన్నిటికీ బాధ్యులని అవాకులు చవాకులు పలికిన వారికి గుణపాఠం చెబుతుంది. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తర్వాత కూడా అనేక ఘటనలు జరిగాయి గనక వీటికి ముగింపు వుండదంటూ ఎవరైనా మాట్లాడితే అంతకన్నా పోరబాటు వుండదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ప్రజల సహనానికి ఒక హద్దు వుంటుంది. అది చెరిగిపోయిన తర్వాత మామూలు మనుషులే మహౌధృతంగా విజృంభించి పిడుగుల వర్షం కురిపిస్తారు. ఆధునిక చైతన్యం గల విద్యాధిక యువతీ యువకులు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లతోనే లక్షోపలక్షలుగా దేశం నలుమూలలా కదలి వస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. దేశంలో ఇంత కదలిక రావడానికి కారణమైన ఢిల్లీ యువతి అక్షరాలా అమరజీవిగా మిగిలిపోతుంది. అత్యాచారాలపై పోరాడిన ప్రతిసారీ ఆమె గాధ ప్రతిధ్వనిస్తుంది.

ఢిల్లీ టు తిరుపతి - తెలుగు భాష, రాష్ట్రం



చరిత్రలో యాదృచ్చికంగా కనిపించే అంశాల మధ్య వాస్తవికమైన అంతస్సంబంధం వుంటుంది. తెలుగు భాషా వికాసం కోసం తిరుపతిలో మహాసభలూ, తెలుగు రాష్ట్ర భవిష్యత్తుపై ఢిల్లీలో అగ్రనేతల అఖిలపక్ష సమావేశం ఏక కాలంలో జరగడం అలాటి ఒక సందర్భం.
ముందు అత్యంత కీలకమైన ఢిల్లీ అఖిలపక్ష సమావేశం సంగతి తీసుకుంటే గతంలో జరిగిన రెండు సమావేశాలకు దీనికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 2009 డిసెంబర్‌ 9, 23 తేదీలలో చేసిన ప్రకటనల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చర్చించి ఒక పరిష్కారం కనుగొనడంపై మొదటి సమావేశం జరిగింది. శాంతి భద్రతలు కాపాడి పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకారం కుదిరింది. ఆ మేరకు శ్రీకృష్ణ కమిటీ ఏర్పడి తనదైన అధ్యయనం చేసి ఆరు అంశాలతో ఒక నివేదిక సమర్పించింది. దాన్ని చర్చించేందుకు తర్వాత మరో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ కమిటీ నివేదికపట్ల అభిప్రాయం చెప్పకుండానే కేంద్రం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి తన మాయాజాలం కొనసాగించింది. అయితే ఈ సమావేశంలో అలాటి ప్రయత్నానికి ఆస్కారం లేకుండా ముకుతాడు వేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మీడియా కథనాల ప్రకారం చూస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కాంగ్రెస్‌ వైఖరి చెప్పకుండా ఇతరులను అడగడం ఏమిటని నిలదీయడం, కాల పరిమితి లేకపోతే కుదరదని పట్టుపట్టడం హౌంమంత్రి ప్రకటన చేయకతప్పని స్థితికి దారి తీసింది. రాష్ట్ర విభజన వద్దనీ, భాషా ప్రయుక్త సూత్రాన్ని కొనసాగించాలని దేశవ్యాపితంగా చెబుతున్న సూత్రాన్నే సిపిఎం ఇక్కడా గట్టిగా పునరుద్గాటిస్తున్నది.మిగిలిన అనేక పార్టీలు వూగిసలాటలకు గురైనా సిపిఎం నికరంగా ఒక్కమాటమీదే వుందన్న వాస్తవం అందరూ ఆమోదించిన పరిస్థితి.ఆ నైతిక దృఢత్వమే రాఘవులు గొంతుకు బలం చేకూర్చడం సహజం. ఇతర పార్టీలు కూడా అదే వైఖరి ప్రకటించిన తర్వాత హౌం మంత్రి లేదా కేంద్రం తలపెట్టిన కాలయాపన తతంగం సాగని స్థితి. ఫలితంగా వచ్చిందే నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్న మాట.
సమావేశంలో వివిధ పార్టీలు అనుసరించిన వైఖరి వాటి ధోరణికి ప్రతిబింబంగానే వుంది. టిఆర్‌ఎస్‌ ఇటీవలి వరకూ కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ప్రకటిస్తూ విలీనం వరకూ ప్రతిపాదించి విమర్శలకు గురైంది. ఈసారి అఖిలపక్షం ప్రయోజనంపైనా పరిపరివిధాల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలనుంచి వచ్చాయి. తమ జాబితాలో కోదండరాంను తీసుకుపోతామని చెప్పిని అదీ చెల్లుబాటు కాలేదు. చివరకు రాష్ట్రం వస్తుందనే ఆశ భ్రమ లేకుండానే వెళ్తున్నామని కెసిఆర్‌ ముందే ప్రకటించి వెళ్లారు. అందుకు తగినట్టే సమావేశం ముగిసిన తర్వాత అందరూ ఎంతోకొంత సానుకూల సంకేతాలున్నట్టు మాట్లాడితే కెసిఆర్‌ మాత్రం పూర్తిగా ప్రతికూలత ప్రకటించి బంద్‌కు కూడా

Thursday, December 27, 2012

ఐనను పోయిరావలయు హస్తినకు...



ఐనను పోయిరావలయు హస్తిన, కచ్చటి సంధిమాటలె
ట్లైనను,శత్రురాజుల బలాబల సంపద జూడవచ్చు, మీ
మానసమందుగల్గు ననుమానము తీర్పగవచ్చు, తత్సమా
ధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందులెల్లరున్‌

ే తరచూ వినిపించే ఈ పాండవోద్యోగ విజయాల పద్యం ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణా సమస్యపై జరిగే అఖిలపక్ష సమావేశానికి అచ్చంగా సరిపోతుంది. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రమే దానికి ఎలాటి ప్రాధాన్యత లేదన్నట్టు మాట్లాడింది. హౌం మంత్రి షిండే ప్రకటనే ఆలస్యంగా స్పష్టత లేకుండా ఇచ్చారు.మరుసటి రోజునే గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌ వచ్చి కేవలం కొత్తగా శాఖ చేపట్టిన షిండే అవగాహన కోసమే అఖిలపక్షం అని తేలికచేశారు. ప్రత్యేకంగా లేఖ రాసి స్పష్టత ఇస్తామన్న తెలుగు దేశం ఆ లేఖలో అఖిలపక్షం వేస్తే చెబుతామని చెప్పి సరిపెట్టింది. అయతే ఆ లేఖ తమకు అందలేదని చప్పరించిన షిండే ఎంపిలు( నిజానికి తమ పార్టీ వారు) సూచించిన మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించుతున్నట్టు లేఖలో రాశారు. ఆ సూచన ఎప్పుడు చేసిందీ అంటే ఎఫ్‌డిఐ ఓటింగులో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా వున్నప్పుడు! అధిష్టానంపై వత్తిడి పెట్టి ఏదో ప్రకటన తెప్పిస్తామన్న వారు ఆఖరుకు సాధించిందేమిటంటే నిర్దిష్ట అజెండా లేని అఖిలపక్షం. సమావేశం జరిపితే చెప్పేస్తామన్న ప్రతిపక్షం చెప్పేదేమంటే వారు చెబితే మేము చెబుతామన్న దాట వేత. ఈ ఇద్దరి మధ్య అసలు ఆ వూసే మాట్లాడని మూడో పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.
ే మొత్తంపైన ఇప్పుడు పాలిస్తున్న పార్టీ బాధ్యతారాహిత్యం ఒకటైతే గతంలో పాలించి మళ్లీ పాలించాలనుకుంటున్న పార్టీ, మేమే పాలనకు వస్తామంటున్న పార్టీ కూడా దాగుడు మూతలతో కాలం గడిపేశాయి. 28వ తేదీ ముంగిట్లోకి వచ్చి నిలబడినా సమావేశానికి ఎవరు వెళ్తారన్నది గాని వెళ్లిన వారు ఏమి చెబుతారన్నది గాని బయిటపెట్టడం లేదు. పారదర్శకంగా ప్రజాస్వామికంగా నడవాల్సిన రాజకీయ ప్రక్రియ ఈ విధంగా సస్పెన్స్‌ చిత్రంలాగా మారిపోయిందంటే అందుకు అవకాశవాదం తప్ప మరో కారణం లేదు. మా నిర్ణయమే

Tuesday, December 25, 2012

గొంతులో వెలక్కాయ



జగన్‌ కేసులో నిందితులైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించే ఫైలును మంత్రివర్గానికి తిప్పి పంపడం ద్వారా గవర్నర్‌ నరసింహన్‌ పొరబాటును దిద్దుకునే అవకాశం కల్పించినట్టయింది. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గ నిర్ణయాలను పున: పరిశీలనకై పంపించడం తప్ప పూర్తిగా తిరస్కరించే అధికారం వుండదు. తన విచక్షణను ఉపయోగించే అంశంలో మాత్రం గవర్నర్‌ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నియామకం, ఆయనపై గాని మంత్రులపై గాని అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తుకు అనుమతించే అధికారం గవర్నర్‌కు వుంటుంది. దాన్ని ప్రశ్నించే అవకాశం మంత్రివర్గానికి వుండదు. అందులోనూ ే రాజకీయంగా ప్రభుత్వం, పాలక పక్షం అనుదిన అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో గవర్నర్‌ ఫైలును తిప్పిపంపడం కూడా పెద్ద సవాలు. ఈ సమయంలో ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం తప్ప ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మాడభూషి శ్రీధర్‌ వంటి న్యాయ నిపుణులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ధర్మానతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో విచారణ నోటీసులు ఎదుర్కొంటుండగా వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించిందన్న విమర్శలు కూడా మూటకట్టుకుంది.
నైతిక నియమావళి కోసమే పదవికి రాజీనామా సమర్పించానని ధర్మాన గొప్పలు చెబుతున్నా ఆయన రాజీనామా ఆమోదం లేదా తిరస్కారం పొందకుండా అలా త్రిశంకు స్థితిలో సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఎట్టకేలకు ఇటీవలనే క్యాబినెట్‌ సమావేశానికి ఆయనకు ఆహ్వానించడం, తిరస్కరణ సంగతి తేలితేనే వస్తానని

చారిత్రిక పరిణామంలో తెలుగు,,,


చారిత్రిక పరిణామంలో తెలుగు,,,
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట గీతం ఓహౌ అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..అనితల వూగిపోతుంది. తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...
ఇంకాస్త వెనక్కు వెళితే గురజాడ.. ఆ వెనక వేమన్న.. ఆ వెనక తిక్కన. ఆ ముందు నన్నయ్య, నన్నెచోడుడు.. ఇలా కవి పుంగవులు.. పండిత ప్రకాండులు కళ్లముందు కదలాడతారు. అఆలు దిద్దించిన అమ్మలు అమ్మమ్మలు పంతుళ్లు పంతులమ్మలు ఒకరేమిటి చదువుతో ముడిపడిన ప్రతివారూ గుర్తుకొస్తారు. తెలుగు తల్లి, తర్వాత వెలసిన తెలంగాణా తల్లి తదితర వల్లీమతల్లులందురూ మదిలో మెదులు తారు.
మల్లమ్మ పతిభక్తి. రుద్రమ్మ భుజశక్తి, తిమ్మరుసు ధీయుక్తి..కృష్ణ రాయల కీర్తి.. చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. స్వాతంత్ర సంగ్రామం, జమీందారీ వ్యతిరేక పోరాటం.. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు అన్నీ మదిలో మెదులుతాయి. ఇన్నిటిని కలిపి వుంచిన బంధం అక్షరం. తెలుగు అక్షరం. అందచందాల ఒంపుసొంపుల అక్షర ం. 56 అక్షరాలతో ప్రపంచంలో ఏ భాషా పదాన్నయినా రాయగల తెలుగు అక్షర సంపద అనితర సాధ్యం. అరుదైన సంగీత గుణంతో ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ అని పిలిపించుకున్న తెలుగు కు ఆంధ్రం అనీ, తెనుగు అనీ తెనుంగు అనీ పర్యాయ పదాలు. తెలుగు ప్రాతిపదికపై ఏర్పడిన భౌగోళిక విభాగాన్ని విభజించాలన్న కోర్కెతో పాటే తెలుగు భాషలో తేడాలపైనా వివాదాలు నడుస్తున్నాయి గాని తెలుగు ఔన్నత్యంపై భిన్నాభిప్రాయాలు లేవు.
ఇంతకూ ఈ తెలుగు ఎప్పుడు పుట్టింది? దాని తొలి అడుగులేవి?

ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు పి.వి.పరబ్రహ్మశాస్త్రి అధ్యయనం ప్రకారం తెలుగు భాష క్రీపూ5 వ శతాబ్డం వరకూ తెలుగు అనదగిన భాష లేదు. స్థానిక తెలుగు/ఆంధ్ర, బౌద్ధ మత ప్రచారకుల ప్రాకృతం, విద్వత్‌ బ్రాహ్మణుల అలాగే బౌద్ధ జైన ఆచార్యుల సంసృతం అనే మూడు భాషలు వుండేవంటారు. స్థలనామాలు, నదుల పేర్లు , దేవీ దేవతలపేర్లు వంటివి, పనిముట్ల పేర్లు పక్కనపెడితే లిఖితపూర్వకంగా తెలుగు అని చెప్పదగిన ఆధారాలు లేవని తేల్చేశారు. ఆచార్య నాగార్జునుడు క్రీపూ మొదటి శతాబ్దంలో వ్యాఖ్య రాసిన ప్రజా పారమితను అంధక అనే శాఖకు చెందిన అనేక మంది విస్తరించారు. నాగార్జునుని శిష్యులు మరిన్ని బౌద్దగ్రంధాలు వెలువరించారు. ఈ కాలంలోనే ఆపస్తంభ కృతులు కూడా వెలువడ్డాయి.వైదిక ధర్మాలను వివరించే ఈ గ్రంధాన్నే ఆంధ్ర వేద పండితులు మననం

మూడో మోడీత్వం .


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు బిజెపి బులపాటాాలకు సమాధానాలు. ప్రత్యేకించి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చుట్టూ కార్పొరేట్‌ మీడియా సహాయంతో కాషాయ దళాలు సృష్టించిన కాల్పనిక భ్రమలు తొలగిపోవడానికి కూడా దారితీసేవిగా వున్నాయి. సంఘ పరివార్‌ ప్రత్యక్ష ప్రతినిధిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి నేత మోడీ ఆ సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసి అల్లకల్లోలానికి కారకులైనారు. ఇప్పుడేమో ఆ విషయాలన్ని మర్చిపోయి అభివృద్ధినే చూడమని ఆయన చెప్పడం దానికి మేధావులు పారిశ్రామిక వేత్తలనబడేవారంతా వంత పాడటం మహా విచిత్ర దృశ్యంగా గోచరిస్తుంది. ప్రపంచీకరణకు మత మార్కెట్‌ తత్వాలు రెండు ముఖాలనుకుంటే అవి అక్షరాలా మూర్తీభవించిన కాషాయ కరోడా మోడీ. మూడోసారి ఆయన గుజరాత్‌లో సాధించిన విజయం ఎన్నికల ప్రమాణాల రీత్యా ఘనమే అయినా సాగిన ప్రచారాలు అంతులేని అతిశయోక్తులతో పోలిస్తే అంత కాదు! నాలుగు వందల ఏళ్లకిందట బాబర్‌ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేవారు గుజరాత్‌కు వచ్చేసరికి మాత్రం పదేళ్ల కిందటి మారణకాండను మర్చిపొమ్మన్నారు. కొన్ని సర్వేలైతే ఏకంగా 140 వరకూ వచ్చేస్తాయని జోస్యాలు చెప్పాయి. చివరకు అతిశయోక్తులన్నీ అవాస్తవాలుగా తేలిపోయి.ఆయన పరిమితులేమిటో స్పష్టమైంది.
బడా మీడియా ఎంతగా కీర్తిస్తున్నా న్యాయస్థానాల్లోనూ పౌర సమాజంలోనూ మోడీకి ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన జరిగిన దానికి విచారం వెలిబుచ్చిన దాఖలాలు లేకపోగా పరోక్షంగా అహంభావం ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ కారణంగానే ి మోడీని మొదటి నుంచి అభద్రత వెన్నాడుతూనే వచ్చింది. ఆఖరి నిముషంలో వచ్చిన నరహరి అమీన్‌ వంటి కాంగ్రెస్‌ వాదులను కూడా పిలిచి పీట వేశారందుకే. మైనారిటీల పట్ల ఆయన అనుచిత వైఖరి తీసుకోవడమనేదే గాక

Tuesday, December 11, 2012

ఆంధ్రప్రదేశ్‌తో ఆటలా?


దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్‌ను అనిశ్చితిలో ముంచి ప్రజలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు మరింత దారుణమైన దగాకోరు అధ్యాయానికి తెరతీసింది. ఎఫ్‌డిఐ ఓటింగులో కంపించిపోతున్న అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి అదే సమయంలో తెలంగాణా సమస్యపై ఏదో జరగబోతుందన్న భ్రమ కల్పించడానికి డిసెంబరు 28 వ తేదీ అఖిలపక్ష సమావేశ సూచన వదిలింది. అదైనా అధికారికంగా లిఖిల పూర్వకంగా గాక అలకబూనిన టికాంగ్రెస్‌ ఎంపిలను బుజ్జగించే ప్రక్రియలో భాగంగా జరిగిన తతంగం మాత్రమే. తెలంగాణా మనోభావాలు ముఖ్యమంటూనే ఎప్పటికప్పుడు అధికారాన్ని అంతకన్నా ముఖ్యంగా కాపాడుకొస్తున్న సదరు ఎంపిలు చెప్పుకోవడానికైనా ఏదో వుండాలి గనక అఖిలపక్షం పాచిక అక్కరకు వచ్చింది. అయితే అఖిలపక్ష సమావేశం జరపడమే ఘన కార్యమైనట్టు పరిష్కారం వచ్చేసినట్టు ప్రచారం జరిగింది. తెలంగాణా పేరిట ఎఫ్‌డిఐలపై ప్రజా వ్యతిరేక నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయడమే గాక అధినేత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపే ప్రహసనమూ షరామామూలే. అఖిలపక్షం ఎలా జరగాలి, ఎంతమంది హాజరుకావాలి, ఏమి చెప్పాలి వంటి రకరకాల రాజకీయ తర్జనభర్జనలు జరుగుతుండగానే ఆదిలోనే హంసపాదులా గులాం నబీ ఆజాద్‌ భవిష్యద్ధర్శనం చేయించారు. అఖిలపక్ష సమావేశం కొత్తగా వచ్చిన హౌం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ కచేరి వంటిదే తప్ప నిర్ణయాలు తీసుకునేది కాదని తేల్చిపారేశారు! మొత్తం వ్యవహారంపై కొత్తగా పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని ప్రవచించారు. ప్రజా ప్రతినిధులు తాత్కాలికం, ప్రభుత్వ చట్రం శాశ్వతం. మంత్రులు మారినప్పుడల్లా ప్రతిదీ మళ్లీ మొదలు పెట్టేట్టయితే ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థమే వుండదు.
నిజానికి గతంలో ఒక అఖిల పక్ష సమావేశం, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక, తర్వాత మరో అఖిల పక్షం జరిగిపోయాక ఇంకా పార్టీలు కొత్తగా చెప్పవలసింది వినవలసిందీ ఏమీ లేదు. అధికారం వెలగబెడుతూ అనిశ్చితిని సృష్టించిన అధికార పక్షమే చెప్పేదేమీ లేదని పిసిసి అద్యక్షులవారు సెలవిచ్చారు. ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలని తెలుగు దేశం నేతలు సవాలు చేస్తూ తమ వైఖరి దాటేస్తున్నారు. ఈ ఇద్దరినీ దోషులుగా చూపించి తను కూడా అదే చేస్తున్న వాస్తవాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కప్పిపుచ్చుతున్నది. ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలూ దాగుడు మూతలు ఆడటం దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. నిజానికి అలాటి

పోరాడిన మానవులెవ్వరు? మీడియాలో చోటే ఇవ్వరు!!


దయ్యానికైనా రావలసింది ఇవ్వాలి అన్నది ఒక ఇంగ్లీషు సామెత. గివ్‌ ద డెవిల్‌ ఇట్స్‌ డ్యూ. మీడియాకు ఈ సూత్రం మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎవరి నేపథ్యం ఏమైనా ఎవరి రాజకీయాలు ఏవైనా సందర్భాన్ని బట్టి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య ధర్మం. కనకనే ఏ పరిణామం జరిగినా దానికి సంబంధించిన నాయకులు ఎక్కడ వున్నా వెంటబడి మరీ ఇంటర్వ్యూలు చేయడం, ఫోన్‌ఇన్‌లు పెట్టడం జరుగుతుంటుంది. పత్రికలైతే ఆ వార్తతో పాటే దానికి కారకులైన ఉద్యమాల చిత్రాలు వివరాలు ఘట్టాలు విపరీతంగా గుప్పిస్తాయి. మొదటి పేజీలో ఇండికేటర్స్‌ ఇస్తాయి. కాని చారిత్రాత్మకమైందిగా చెప్పుకుంటున్న ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ వాస్తవ రూపం దాల్చిన సన్నివేశంలో మాత్రం ఎందుకనో మన మీడియా ఈ సంప్రదాయాన్ని పాటించకలేదు!
సబ్‌ ప్లాన్‌ కేవలం మా వరప్రసాదం దక్క మరొకటి కాదని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు నానాతంటాలు పడ్డారంటే అదో రకం. ఒకటి రెండు సీట్లు వున్న పార్టీలకు భయపడబోమని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ధైర్య సాహసాలు ప్రకటించినా సరిపెట్టుకోవచ్చు( వాస్తవానికి అలా పరోక్షంగా ప్రస్తావించడంలోనే ఆయన ఎంతగా భయపడుతున్నదీ తెలుస్తుంది. తుమ్మితే వూడే ముక్కులా ప్రతి సభ్యుడిని ప్రాధేయ పడాల్సినస్థితిలో వున్న సర్కారు నేత తిరుగులేని ఆధిక్యతకు తనే ప్రతిరూపంలా మాట్లాడ్డం మరీ హాస్యాస్పదం) ఆయన ధోరణి ఒకటైతే నిష్పాక్షితకు నిలువుటద్దాలమనీ, నిర్భీతికి నిదర్శనాలమనీ చెప్పుకునే మీడియా సంస్థలు వ్యాఖ్యాతలూ కూడా అదే ఫక్కీలో పడటాన్ని ే ఏమనాలి? సబ్‌ ప్లాన్‌కోసం 2002తో మొదలు పెట్టి దశాబ్ద కాలంగా పోరాటాలు జరుగుతూనే వున్నాయి. బి.వి.రాఘవులు తదితరులు ఒక పర్యాయం, జాన్‌ వెస్లీ మరొకసారి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆ తర్వాత దఫదఫాలుగా నిరవధిక నిరాహారదీక్షలు చేయడం పోలీసులు రకరకాలుగా స్పందించడం జరుగుతూనే వచ్చింది.ఒకసారి అర్థరాత్రి దాకా బైఠాయింపు అరెస్టులు ఆ తర్వాతనే ప్రభుత్వం సమ్మతించడం జరిగింది. మాజీ ఉన్నతాధికారులు, దాదాపు 900 సంఘాలు, ఈ పోరాటంలో పాలు పంచుకున్నాయి. శాసనసభ లోపలా, వెలుపలా పదే పదే ప్రస్తావనలు వచ్చాయి. ఇన్ని పోరాటాల ఫలితంగానే సబ్‌ ప్లాన్‌ ముందుకు వచ్చిందన్న సత్యాన్ని సముచిత రీతిలో తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాకు లేదా?
ఒకవైపు చూపు...
సబ్‌ ప్లాన్‌మొసాయిదా శాసనసభలో ప్రవేశపెట్టిన రోజున పత్రికల్లో టిఆర్‌ఎస్‌అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలు ప్రముఖంగా వచ్చాయి.గతంలో గల్లంతు చేసిన25 వేల కోట్టు ఇప్పుడు కక్కించాలన్నట్టు

మత సంబంధాల చిత్రణలో మలుపులు మరకలు..



కులంతో పోలిస్తే మతాల చిత్రణ తెలుగు సినిమాల్లో ఎక్కువగానే వుంటుంది. ఇందుకు సంబంధించిన కొన్ని మూస ధోరణులు కూడా స్థిరపడిపోయాయి. ముస్లిం పాత్రల వేషభాషలను మన సినిమాలు ప్రత్యేకంగానే చూపించడం పరిపాటి. తెలుగులో అష్టావధానం చేయగల ముస్లిములు కూడా వున్నారని తెలిసినా మన దర్శకులు ఎప్పుడూ కృత్రిమ తెలుగు మాట్టాడే పాత్రలనే సృష్టిస్తుంటారు. వారికి పిల్లిగడ్డం, నెత్తిపైన టోటీ, గళ్లలుంగి లేదా పైజామా వంటి వేషాలు వేయిస్తారు. ముస్లిములతో పోలిస్తే క్రైస్తవ పాత్రలు తక్కువగా వున్నా వాటిపై అల్లిన కథలు ఎక్కువగానే వుంటాయి. వీటిలో అనేకం మత సామరస్యం బోధించేవిగా వుంటాయి గాని కాలక్రమంలో అనేక తేడాలు వచ్చాయి.
విజయా వారి మిస్సమ్మలో కథానాయిక సావిత్రి మేరి ఉద్యోగార్థం హీరో ఎన్టీఆర్‌ భార్యగా ఒక వూరు వస్తుంది. తర్వాత కథలో ఆమె మత విశ్వాసాలకు హిందూ సంప్రదాయాలకు మధ్యన ఘర్సణ చాలా సన్నివేశాల్లో వుంటుంది. కరుణించు మేరిమాత అన్న పాట ఆ తరహాలో ఒకే ఒక్కటి అని చెప్పాలి. విశేషమేమంటే ఇదే విజయా సంస్థ ఇంచుమించు ఇలాటి ఇతివృత్తంతోనే మళ్లీ 1975లో శ్రీరాజేశ్వరీ విలాస్‌ కాఫీ క్లబ్‌ నిర్మించటం.ఇందులోనూ కథానాయకుడు కృష్ణ అతని యజమాని జగ్గయ్యతో సహా అనేకులు క్రైస్తవులై వుండి బ్రాహ్మణులుగా వేషం వేసి హౌటల్‌ నడుపుతుంటారు. చివరకు అంతా ఒక్కటే అన్న సందేశంతో ముగుస్తుంది.
విలన్‌ పాత్రల విలక్షణ నటుడు నాగభూషణం స్వంతంగా నిర్మించిన ఒకే కుటుంబం మరో కోవకు చెందింది. ఇందులో ఎన్టీఆర్‌ అనుకోని పరిస్థితుల్లో రహీమ్‌గా పెరుగుతాడు. అందరికీ ఒక్కడే దేవుడు అన్న పాటతో మత సామరస్యం బోధించే ఈ చిత్రంలో కుటుంబ కథ మత ప్రభావం పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ సమయంలోనే అక్కినేని నిర్మించిన మరో ప్రపంచం చిత్రం కులమతాలు వద్దని చెబుతుంది. అందులో అక్కినేని క్రైస్తవ ఫాదర్‌ వేషంలో కనిపిస్తాడు. ఆయనే కథానాయకుడుగా విఠలాచార్య ఫ్రెంచి నవల లే మిజరబులే అధారంగా పునర్నిర్మించిన బీదల పాట్లు చిత్రంలోనూ క్రైస్తవ ఫాదర్‌ ప్రభావంతో మారతాడు. ఎన్టీఆర్‌ తీసిన రామ్‌ రహీమ్‌, హిందీ నుంచి పునర్నిర్మించిన రామ్‌ రాబర్ట్‌ రహీం వీటన్నిటిలోనూ వివిధ మతాలకు చెందిన ప్రధాన పాత్రులుంటాయి. చాలా చిత్రాల్లో కథానాయకుడు ఒక మతానికి చెందినవాడై వుండి మరోచోట పెరగడం వుంటుంది. అయితే ప్రధాన పాత్రలుగా చూపించినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇలాటి పాత్రలను హాస్యానికే


ఇటీవల ప్రజాశక్తి బుకహేౌస్‌ నుంచి ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకఁన్నందువల్ల పోస్టింగులలో అంతరాయం ఏర్పడింది. ఇకపై గతంలో లాగే సంభాషణ కొనసాగించుకోవచ్చునఁ ఆశిస్తున్నాను.

Saturday, December 8, 2012

విశ్వసనీయతకు విఘాతం



ప్రాంతీయ పార్టీలుగా జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర వహిస్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల వూగిసలాటలు, అవకాశవాదాలు పార్లమెంటులో ఎఫ్‌డిఐ ఓటింగులో స్పష్టంగా బయిటపడ్డాయి. ఎఫ్‌డిఐల ప్రవేశంపై సభ బయిట నిప్పులు కక్కుతున్న నేతలే సభలో వ్యతిరేకతను నీరుగార్చేందుకు సాధనాలు కావడం ఘోరం. ్ట ఎస్‌పిది అవకాశవాదం కాగా బిఎస్‌పి ది బూటకపు వ్యతిరేకత. ఆఖరుకు కాంగ్రెస్‌ వ్యతిరేకతకు చిరునామా మేమేనని తరచూ చెప్పుకునే తెలుగు దేశం రాజ్యసభ ఎంపిల్లో అత్యధికులు ఓటింగుకు ఎగనామం పెట్టి మన్మోహన వ్యూహానికి దోహదకారులైనారు. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా అధికారికంగా ఆ పార్టీ నుంచి ఎలాటి తీవ్రమైన ప్రతిస్పందన లేకపోవడం కూడా ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. తెలుగు దేశం విశ్వసనీయతకు విఘాతం కలిగింది. కొంతమంది నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతుంటే మరికొంత మంది సర్దుబాటు సూచనలు చేయడం యుగళ గీతంలా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలోని తెలుగు దేశం సర్కారు ి దాని అధినేత కనపరిచిన అత్యుత్సాహం నేపథ్యంలో దీని వెనక విధానపరమైన వూగిసలాటలు కూడా వున్నాయా అన్న సందేహాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్‌ కుట్రలను కుటిలతలనూ ఎంతగా ఖండించినా ఆ ప్రలోభాల ప్రభావం నుంచి తమ ముఖ్య నేతలనే కాపాడుకోలేకపోవడం తెలుగు దేశం ప్రతిష్టను పలచబారుస్తుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలలో వరుస పరాజయాలు, వలసల నిరోధించడంలో వైఫల్యం, ప్రాంతీయ సమస్యపై అస్పష్టత వంటి పలు సమస్యలతో సతమవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి ఇది తాజా శరాఘాతం. ఎస్‌పి, బిఎస్‌పిలు ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ఢిల్లీలోనూ ఇలాటి విన్యాసాలు చాలా చేసి వున్నందున పెద్ద సమస్య కాకపోవచ్చు గాని తెలుగు దేశంకు మాత్రం ఇది తీవ్రమైన సవాలు. 1993లో పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని, 2008లో అణుఒప్పందం ఓటింగు సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్న చరిత్ర ఆ పార్టీ ఫిరాయింపుదార్లదే. ్ట తెలుగు దేశం అధినేత తీవ్రమైన అస్తిత్వ పోరాటం చేస్తున్న తరుణంలో చరిత్ర పునరావృతమైన రీతిలో తగిలిన ఈ ఎదురు దెబ్బను ఎలా తట్టుకుంటారనేది చూడాల్సిందే. పార్టీలేవైనా వ్యక్తులుగా నేతలెవరైనా విలువలకు విధానాలకు కట్టుబడకుండా పదవులు ప్రయోజనాలే సర్వస్వమనుకునే స్వార్థ రాజకీయాల పరాకాష్ట ఈ పరిణామాలు

Sunday, November 25, 2012

విలాపమూ, వివాదమూ!




కన్నీళ్లు మనుషులను బతికించగలిగితే అమృతం లాగే అవీ ఎప్పుడో అరుదై పోయివుండేవంటాడు ఆత్రేయ ఒక సినిమాలో. నా కోసం ఏడవకుండి మీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అంటాడు కరుణామయుడు! కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడైనా కదిలించాల్సిన విషయమే. అందులోనూ ప్రజా ప్రతనిధులుగా ప్రముఖ నేతలుగా చక్రం తిప్పిన వారు కన్నీరు మున్నీరవడం అసాధారణం.తెలుగు దేశం అగ్గిబరాటాల్లో ఒకరైన పయ్యావుల కేశవ్‌ తను వలస వెళ్తానంటూ వస్తున్న వార్తలపై మనస్తాపం చెంది మీడియా ముందు విలపించిన తీరు ఆ రీత్యా ఎవరికైనా సానుభూతినే కలిగించాలి.అయితే కేశవ్‌ ఏ పార్టీలోకి వెళ్తాడన్న వార్త ఈ సన్నివేశానికి కారణమైందో ఆ పార్టీ ముఖ్యుడైన శ్రీకాంత్‌ రెడ్డి ఈ అశ్రువులను అవహేళన చేస్తూ మాట్లాడారు.అది ఆయన సంస్కారానికి నిదర్శనమని కేశవ్‌ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా వున్నాయంటే ఆ విలాపం కూడా వివాద గ్రస్తమవుతున్నది.ఏమైనా ఇది ఈ ఇద్దరికే పరిమితమైన వివాదం కాదు.
ఆయారాం గయారాంల సంసృతి ఈ దేశానికీ, రాష్ట్రానికీ కూడా కొత్తకాదు. అయితే వైఎస్‌రాజశేఖర రెడ్డి దుర్మరణం, జగన్‌ వారసత్వ సమరం, తర్వాత స్వంత కుంపటి పెట్టుకోవడం నేపథ్యంలో వలసల వరుస కాస్త విచిత్రంగా వున్నమాట నిజం. అధినేత ఆరోపణలు దర్యాప్తులతో జైలులో వున్నా పార్టీ మాత్రం ఎన్నికల విజయాలు సాధిస్తూ ఇతర పార్టీల ప్రతినిధులను ఆకర్షించడం గతంలో చూడని పరిణామం. ఇందుకు దోహదం చేస్తున్న కారణాలేమిటన్నది లోతుగా అధ్యయనం చేయవలసిన అంశం. అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని కొందరు తేలిగ్గా అంటుంటారు . సామాజిక పొందికలను బట్టి మరికొందరు విశ్లేషిస్తుంటారు. ఇవన్నీ పాక్షికమైన భావనలే. జగన్‌, ఆయన పార్టీ బలంగా ఆవిర్భవించడం వెనక అనేక శక్తుల ప్రోత్సాహంతో పాటు తెలుగు దేశం ప్రదర్శించిన ఉపేక్షాభావం కూడా వుంది. జగన్‌ తిరుగుబాటు కాంగ్రెస్‌ను బలహీనపరుస్తుందనే అంచనాతో ఆ పార్టీ చూచీ చూడనట్టు వ్వవహరించింది. కాని జగన్‌ బలం పుంజుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి సంపాదించుకున్నప్పుడు ఆ పనిచేస్తే అతను బలపడతాడన్న కారణంగా తటపటాయించింది.ఈ జంజాటంలో జగన్‌ వర్గం వ్యూహాలకు పదును పెట్టుకుని శక్తి పెంచుకుందనేది వాస్తవం. ఆయనకూ

మన సినిమాల్లో కులమతాలు






దేనికైనా రెడీ చిత్రానికి సంబంధించి ఇటీవల తీవ్రమైన వివాదమే నడిచింది. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు చిత్రాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ అందులో ఒక కులాన్ని కించపర్చే దృశ్యాలు ఇప్పుడు లేవని గౌరవించే అంశాలూ వున్నాయని పేర్కొంది. అయినా ఆ చిత్ర నిర్మాత మోహన్‌బాబుపై మరో కేసుకోసం ప్రయత్నం సాగుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో ఇంటిముందు ధర్నా చేసేందుకు వచ్చిన వారిపై దాడి జరగడం కూడా విమర్శలకు గురైంది. ఈ ఉదంతం తర్వాత చిత్రాలలో పాత్రల పరిధి, కళా స్వేచ్చ సామాజిక సమతుల్యత వంటి విషయాలు మరోసారి చర్చనీయమైనాయి. కుల మతాలు అధికంగా వుండటమే గాక వాటి చుట్టూ రకరకాల రాజకీయాలు అవాంఛనీయ భావాలు కూడా అధికంగా వుండే ఈ దేశంలో ఇలా జరగగడం అర్థం చేసుకోదగిందే.
ప్రస్తుత వివాదాన్ని పక్కనపెట్టి అసలు సినిమాల్లో కుల మతాల చిత్రణ విషయానికి వస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
సినిమా రంగంలో కుల తత్వం అధికమనీ ఒక కులం వారికే అవకాశాలు ఎక్కువనీ ప్రచారం ఎప్పుడూ సాగుతుంటుంది. సమాజంలో వున్న పరిస్థితులు ప్రాబల్యాలే సినిమా రంగంలోనూ గోచరిస్తాయి తప్ప ప్రత్యేకంగా ఏవో సూత్రాలు వుంటాయనుకోవడం అవాస్తవికం. కళాత్మక విలువల కోణంలో చూడాల్సిన విషయాలను కులాత్మకంగా చూడటమే ఒక దౌర్చల్యం. తెలుగు సినిమాలనే తీసుకుంటే మొదటి గొప్ప దర్శకుడు హెచ్‌ఎంరెడ్డి. మొదటి పెద్ద హీరో చిత్తూరు నాగయ్య! తర్వాత కాలంలోనూ ఈ సామాజిక పొందికలు కొనసాగాయి. వివిధ సామాజిక పరిణామాలు సంస్కరణోద్యమాల తర్వాత ఇతర తరగతులు కూడా అభివృద్ధి చెందిన కొద్ది సినిమా రంగంలో స్థానం సంపాదించగలిగాయి. అంతే తప్ప సినిమా రంగంలో కేవలం కులం బట్టి ఆదరించడం నిరాదరించడం అరుదు.ఎవరి ప్రతిభనైనా ఉపయోగించుకుని సొమ్ము చేసుకోవడమే అక్కడ ప్రధాన నీతి! రంగాల వారీగా నటన, రచన, సంగీతం వంటి వాటిని తీసుకుంటే కూడా ఈ సామాజిక విభజన కనిపిస్తుంది.
తెర వెనక విషయాలు ఏమైనా తెలుగు తెరపై కుల ప్రస్తావనలు చాలా తక్కువగానే వుంటాయి. సనాతనులు, దళితులు, వృత్తి చేసుకునే వారు, పెత్తందార్లు ఇలాటి సందర్భాల్లోనే చెప్పనవసరం లేకుండా వాతావరణాన్ని పేర్లను బట్టి కులాలు తెలిసిపోతుంటాయి. సూటిగా చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలోని అత్యగ్ర, అతి దిగువ

Monday, November 19, 2012

తెలుగు భాషా వికాసం: వాస్తవిక దృక్పథం




ఇటీవలి కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ అన్న నినాదం ఎక్కువగా వినిపిస్తున్నది. ఈ పేరుతో అనేక వేదికలు సంస్థలు నెలకొన్నాయి. అధికార అనధికార ప్రముఖులు ముందుండి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమాలని పిలుస్తున్నారు.కొన్నేండ్ల కిందట తమిళ భాషకు ప్రాచీన హౌదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలుగును నిర్లక్ష్యం చేసిందని నిరసనలు మార్మోగాయి. ఎట్టకేలకు ఆలస్యంగానైనా ఆ హౌదా తెలుగుకూ ఇచ్చారు గాని తర్వాత దానివల్ల ఒరిగిందీ జరిగిందీ ఏమిటనేది ఇంకా అస్పష్టంగానే వుంది. డిసెంబర్‌ నెలలో తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు తలపెట్టడం, ఇటీవలనే అధికార భాషా సంఘం అద్యక్షుడుగా మండలి బుద్ధ ప్రసాద్‌ను నియమించడం వంటి పరిణామాలు ఈ అంశపై ఆసక్తి పెంచాయి.
ఇంతకూ తెలుగు భాషను కాపాడుకోవడమంటే ఏమిటి? ఎవరి నుంచి? ఏ విధంగా? ఇప్పుడు మమ్మీ డాడీ చదువుల నుంచి అని టక్కున జవాబు చెప్పేస్తారు. నిజానికి ఈ సమాధానం సమగ్రమైంది కాదు. ఎందుకంటే ఇలాటి ప్రశ్నలకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క జవాబు వుంటూ వచ్చింది. ఇంగ్లీషు నుంచి మాత్రమే గాక సనాతనవాదుల నుంచి సంసృత వ్యామోహం నుంచి తెలుగును కాపాడుకోవడం ఒకనాడు పెద్ద ఉద్యమంగా సాగింది. నిజానికి తెలుగు కోసం పోరాటం సంస్కరణోద్యమంలో పెద్ద భాగం. మా వాళ్లకుతెలుగులో రాయడమంటే చులకన అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వయానా రాసిన మాట. గురజాడ మరింత సూటిగానే చెబుతారు: ' విశాల ప్రజానీకం చదువుకోవడం పూర్వాచార సంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన సాహిత్యం బ్రాహ్మణుని గుత్తసొమ్ము. అతని దృష్టిలో సంసృతం పెట్టిన వరవడి పవిత్రమైనదీ, మీరరానిదీ సంసృత సాహిత్యం క్షీణ దశలో వున్నప్పుడు తెలుగు సాహిత్య సృష్టి ప్రారంభమైనందున ఆ క్షీణ దశ లక్షణాలైన బాషా కళా సంప్రదాయాలు తెలుగులో పాతుకు పోయాయి. రాజకీయ రంగంలో లాగానే భాషా రంగంలో కూడా వేర్పాటు తత్వమూ ప్రభువర్గ తత్వమూ చివరకు పతనోన్ముఖం కాక తప్పదు.అనేకుల అవసరాలు కొద్దిమంది వాటికన్నా ముఖ్యమైనవి. తుదకు వాటిదే పై చేయి అయి తీరుతుంది''
ఇంత స్పష్టతతో గురజాడ గిడుగు సాగించిన వాడుక భాషా పోరాటం కేవలం భావోద్వేగ సంబంధమైంది కాదు. మాతృభాష అందులోనూ ప్రజల భాషను పెంపొందించుకోవడం ఒక ప్రజాస్వామిక అవసరం. అయితే ఆంగ్లేయులు పాలించడం వల్ల తర్వాత ప్రపంచాధిపత్యం సాగిస్తున్న అమెరికాలో మాట్లాడేది కూడా ఆ భాషే కావడం వల్ల(అయితే వారి ఆధిపత్యం కారణంగా అమెరికన్‌ ఇంగ్లీషు!) తెలుగుతో సహా వందలాది దేశ భాషలు కునారిల్లిపోవలసి

ఏక్‌ థా హిట్లర్‌




'' నేను హిట్లర్‌కు గొప్ప ఆరాధకుణ్ణి. అలా చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదు.ఆయన పద్ధతులన్నిటితో నేను ఏకీభవించలేకపోవచ్చు గాని ఆయన అద్భుతమైన నిర్మాణ దక్షుడూ, మహౌపన్యాసకుడు. మాకిద్దరికీ చాలా ఉమ్మడి లక్షణాలున్నాయని నేననుకుంటాను.'' ఆసియా వీక్‌ ఇంటర్వ్యూలో బాల్‌ థాకరే.

బాల్‌ థాకరే మరణవార్తతో పాటు చాలా పత్రికలు ఛానెళ్లు ఇచ్చిన శీర్షిక 'ఏక్‌ థా టైగర్‌'. ఒక హిందీ సినిమా టైటిల్‌. టైగర్‌ అంటే పులి గనక బాల్‌ థాకరే రాజకీయం కూడా మతతత్వం మాఫియాల పులిజూదం లాటిదే. ఈ రాజకీయజూదంలో ఫణం పెట్టిందీ,బలిగొన్నదీ వేలాది మంది అమాయకులు ప్రాణాలు. మత మాఫియా తత్వాలు అన్ని రకాల దురభిమానాలు ఈ రాజకీయ ద్యూతంలో పాచికలు వాటన్నిటికీ ఆద్యుడైన హిట్లర్‌కు అసలు సిసలు ప్రతిరూపం ధాక్‌రే. తనకు తానుగా ఆ భక్తి ప్రపత్తులను బయిటపెట్టుకున్న వ్యక్తి. రాజకీయాల్లో ఆయన ప్రాబల్యం పట్టు గురించి మాత్రమే చెప్పి అందుకు సాధనంగా చేసుకున్న విధానాలను విస్మరించడం అవాస్తవికత అవుతుంది. పునర్వికాసం అనే పత్రిక నడిపిన రచయిత భాషా రాష్ట్ర ఉద్యమకారుడు కెఎస్‌థాకరే కుమారుడైన బాల్‌ థాకరే తండ్రి నుంచి స్పూర్తి పొందినా కొద్ది కాలంలోనే నాజీ హిట్లర్‌ బాట పట్టాడు. మొదట్లో ఆయనకు ఆరెస్సెస్‌తో సంబంధం వుండేది. ముంబైలోని ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో కొంత కాలం కార్టూనిస్టుగా పనిచేసిన థాకరే యాజమాన్యంతో విభేదించి మార్మిక్‌ అనే పేర స్వంత పత్రిక ప్రారంభించాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్థాపించిన సామ్నా పత్రికకే ఎక్కువ ప్రచారం లభించి ఆయన వాణిగా మారింది.
మరాఠీ దురభిమానం...
ముంబాయిలో కాంగ్రెస్‌, సోషలిస్టు సంప్రదాయాలు, కమ్యూనిస్టు కార్మిక సంఘాలు వున్నప్పటికీ ధాకరే మాత్రం మరాఠీ దురభిమానం రెచ్చగొట్టడమే మొదటి నుంచి తన విధానంగా చేసుకున్నాడు. 1960లలో నిరుద్యోగం తాండవిస్తుంటే ఆయన ప్రభుత్వ విధానాలను ఖండించే బదులు భూమి పుత్రుల సిద్ధాంతం ముందుకు తెచ్చి మరాఠీయేతరులే కారణమంటూ వారిపై దాడులకు

Thursday, November 15, 2012

మజ్లిస్‌ మతలబులు- పరివార్‌ పాచికలు



అస్థిరత్వంతో అస్తుబిస్తుగా నెట్టుకొస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవాలని మజ్లిస్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తీవ్రం చేస్తింది. బొమ్మ బొరుసులాటి బిజెపి మజ్లిస్‌ ల పోటాపోటీ రాజకీయ వ్యూహాల ఫలితంగా రాజధాని నగరం ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల మధ్య అందోళనగా గడపాల్సిన స్థితి. దీపావళి సంబరాలకు బదులు అప్రకటిత కర్ఫ్యూ నీడలు దట్టంగా పర్చుకున్న దురవస్థ. చారిత్రాత్మక చార్మినార్‌ను కూడా వదలని మత రాజకీయాల నేపథ్యంలో వెలువడిన ఈ నిర్ణయం మతలబులేమిటో మజ్లిస్‌ నేతలకే తెలియాలి. అయితే పరిస్థితిని ఈ దశకు తెచ్చింది మాత్రం సంఘ పరివార్‌ రాజకీయాలు, అందుకు వత్తాసుగా ఉపయోగపడిన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాలే అనిచెప్పాలి. ఈ తాజా ఘటనలోనూ శాశ్వత కట్టడాలు నిర్మించరాదన్న కోర్టు ఉత్తర్వులు ఒక వైపు, యధాతథ స్థితి కాపాడాలన్న ఉత్తర్వులు మరో వైపు వుండగా మతతత్వ శక్తులు వాటికి రకరకాల భాష్యాలు చెబుతూ ఉద్రిక్తతలు రగిలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వుదాశీనత వహించింది. పరిస్థితి పరాకాష్టకు వచ్చే వరకూ అనుమతించింది. దేవాలయ పరిరక్షణ సమితి పేరిట ప్రచురించిన కరపత్రంలోనూ అక్కడ చేసిన ప్రసంగాలలోనూ సంఘ పరివార్‌ బిజెపిల ప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడి మతభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా ఈ సంక్షోభాన్ని మద్దతు ఉపసంహరణతో ముడివేయడంలో మజ్లిస్‌ నేతల ప్రచ్చన్న అజెండాలు ఏమిటన్న చర్చలు ప్రతిచోటా సాగుతున్నాయి. ఆ తర్వాత క్రమేణా ముస్లిం మైనారిటీలను సమీకరించి రాజకీయ ఒత్తిడిపెంచేందుకు మజ్లిస్‌ నాయకత్వం పెద్దఎత్తునే పాచికలు వేస్తున్నది. కాంగ్రెస్‌ నేతలు కొందరు బుజ్జగింపుగానూ మరికొందరు దాడి చేస్తూనూ అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నారు.
చారిత్రికంగా చూస్తే 1978 తర్వాత మజ్లిస్‌ రకరకాల ఎత్తుగడలు మార్చి కాంగ్రెస్‌ అండదండలతో ప్రయోజనాలు సాధించుకోవడం రివాజుగా చేసుకుంది. 1980లలోనూ, 1990లోనూ కూడా

Wednesday, November 14, 2012

వ్యాఖ్యల్లో వాస్తవాలు, రాజకీయ రాద్ధాంతాలు



ఇటీవలి కాలంలో కొంతమంది ప్రముఖుల వ్యాఖ్యానాలపైన, కొన్ని సినిమాల పైన తీవ్ర దుమారం చెలరేగింది.కొన్ని అంశాలు వాదోపవాదాలకే పరిమితమైతే మరికొన్ని తీవ్ర ఘర్షణలకూ వరకూ వెళ్లాయి. ఇందులో ఏది ఎంత వరకూ సరైంది అనే సమస్య ఒకటైతే అసలు ఈ వివాదాలకు నిజంగా అంత ప్రాధాన్యత వుందా లేక నిరర్థక తతంగాలానే అనే పరిశీలన మరొకటి.
వివేకానందుడు దావూద్‌ ఇబ్రహీంలు ఒకే విధమైన మనస్తత్వం కలిగివున్నారంటూ బిజెపి అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్య, రాముడు మంచి భర్త కాదంటూ అదే పార్టీకి చెందిన రాం జెత్మలానీ వ్యాఖ్య,రవీంద్ర నాథ టాగూరు పెద్ద గొప్పవాడేమీ కాదన్న గిరీష్‌ కర్నాడ్‌ వ్యాఖ్య, గ్రామీణ స్త్రీలు ఆకర్షనీయమైన వారు కాదన్న ములాయం సింగ్‌ యాదవ్‌ వ్యాఖ్య, ఆరెస్సెస్‌ కార్యకర్తలు చాలా అంకిత భావం కలిగిన వారన్న కాంగ్రెస్‌ ఎంపి వ్యాఖ్య ఇవన్నీ వివాదాస్పదంగా మారాయి.
అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నితిన్‌ గడ్కరీ ఏం చెప్పినప్పటికీ వివేకానందుడిని దావూద్‌ ఇబ్రహీంతో పోల్టడం దారుణం. వాస్తవానికి సంఘ పరివార్‌ తన మతతత్వ ప్రచారానికి వాడుకోవడమే ఒక వైపరీత్యం. హిందూ మతానికి సేవా ధర్మం కావాలని, సనాతన ఛాయల్లోనే కాలం

Thursday, November 8, 2012

వీర నరసింహగా కెసిఆర్‌




ఇక నరసింహావతారమేనని టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్ర శేఖర రావు ప్రకటించారు. కాంగ్రెస్‌ మోసం చేసిందని, ఇక నమ్మేది లేదని చెప్పేశారు. ఈ బ్లాగు/ఫేస్‌ బుక్‌ ఎంట్రీలు చదివేవారికి ఆయన మాటల డొల్లతనం ఎప్పుడో అర్థమై వుండాలి. కాంగ్రెస్‌ కన్నా మించి పోయి తెలంగాణా ఏర్పాటు తేదీలు ప్రకటించిన కెసిఆర్‌ అందుకు ఆవగింజంతైనా పశ్చాత్తాప పడింది లేదు. అ దే కోవలో ఇప్పుడు చెప్పిందే ఆఖరి వాక్యమనీ అనుకోరాదు. కాకపోతే రాజకీయంగా బలం పెంచుకోవడానికి వంటరిగా నిలదొక్కుకోవడానికి 100 సీట్లు తెచ్చుకోవడమనే పల్లవి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇతర పార్టీలతో సంబంధాలు జెఎసితో అనుబంధాలు తదితర అనేక అంశాలు చిక్కుముడులుగా వున్నాయి. అ న్నిటినీ మించి తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ వంటి ప్రధాన పార్టీలు పాద యాత్రలతో ప్రచారం చేసుకుంటుంటే మన స్థితి ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడంతో పాటు సంక్ష్ఞభాన్ని సానుకూలంగా మార్చుకోవడానికే కె.సిఆర్‌ తనదైన శైలిలో కొత్త అవతారమెత్తుతున్నారు. ణరదాకోసం చెప్పాలంటే- ఇప్పటికే ఒక నరసింహం రాజ్‌భవన్‌లో మకాం చేసి వుండగా మరో రాజకీయ నరసింహం అవసరమా, అద్యక్షా?

వినోదంలో వికృత వివాదం



రాంబాంబులు రాజకీయాలు అంటూ సినిమాలకు సంబంధించిన వివాదాలపై లోగడ చర్చించాము. ఆ తర్వాత కాలంలో దేనికైనా రెడీలో బ్రాహ్మణులను అవమానించారంటూ మరో దుమారం రేగింది. ఇది మోహన్‌ బాబు ఇంటిముందు ధర్నా, వారిపై దౌర్జన్యం వంటి సంఘటనలకు దారి తీసింది.కులాల కుమ్ములాటగా మారింది. నిజంగా ఏదైనా సినిమాలో ఎవరికైనా కష్టం కలిగితే సంబంధిత అధికారులను ఇక్కడ సెన్సార్‌ బోర్డుకు వెళ్లాలి. పైగా ఏదైనా సినిమాలో ఒక కులానికి చెందిన పాత్రలను చూపించితే అవమానంగా భావించడం అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కథను బట్టి లేదా తీసే వారి సంస్కారాన్ని బట్టి పరిపరివిధాల పాత్రలు పెడుతుంటారు. నౌచిత్యాలు కూడా వుండొచ్చు. ్‌ెూహన్‌ బాబు గత చిత్రాలలోనూ తమను తక్కువగా చూపించారని బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుకు ఆధారాలుండొచ్చు. అ ది కథకు అవసరమా కాదా అన్నది అసలు ప్రశ్న. ఏదైనా కులానికి చెందిన పాత్రను లేదా బృందాన్ని ఎగతాళిగా చిత్రిస్తే బాధ కలగొచ్చు గాని ఆ పేరిట అడ్డుకోవడం మొదలెడితే ఆగేదెక్కడీ చారిత్రికంగా చూస్తే శ్రీనాథుడు కాశీఖండములో చిత్రించిన గుణనిధి, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యములో నిగమశర్మ బ్రాహ్మణపాత్రలైనా చాలా హీన గుణాలతో వుంటాయి. జుురి వారిని ఏమనాలి? ఎందుకనాలి? సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి ఇలా ఒకే విధమైన పేర్లే వస్తున్నాయంటే నరసింహనాయుడు అని పె ట్టారు.అయితే వొరిగిందేమిటి? తరిగిందేమిటి? వినోదానికి(కొన్నిసార్లు వికారానికి కూడా) ఉద్దేశించిన సినిమాలపై వివాదాలు పెంచుకుని దాడులు దౌర్జన్యాల వరకూ రావడం అర్థరహితం. ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కూడా శాంతియుత పరిష్కారం కోసం చొరవ తీసుకోవడం మంచిదే.ఇక ముందైనా ఇలాటి నిరర్థక వివాదాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

మదగజాల గిజగిజ!





దేశాన్ని పాలించే హక్కు తమదేనని హుంకరించే రెండు ప్రధాన పార్టీల దురవస్థ దాచేస్తే దాగని సత్యంలా గోచరిస్తోంది. స్వాతంత్ర సాధనతో సహా అన్నీ తమ ఖాతాలో వేసుకుని ఆ పైన దానికి ఎసరు పెట్టే ఆర్థిక విధానాలనూ వాటిలో భాగమైన అవినీతి అక్రమాలనూ ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ గిజగిజ ఒకటైతే విలక్షణ కమలదళం కటకట మరొకటి. రెండూ స్వయం కృతాపరాధాలే. దేశం ధ్యాస లేని అధికార దాహాలే. ఆ పైన ఒకరికి మతతత్వం అదనపు భుజకీర్తి. దేశ రాజకీయాలనూ ఈ రెంటి మధ్యనే చూపించే దేశ విదేశీ కార్పొరేట్‌ ప్రభువులు వారి మీడియా ఇదంతా చూసి ఆనంద నృత్యం చేస్తున్నారు. ఈ సంక్షుభిత పక్షాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేదెలా అని పొంచికూచున్నాయి. దింపుడు కళ్లం అశచావని వృద్ధ జంబూకాల నుంచి నీరసపు వారసత్వాల యువ రాజుల వరకూ ఈ రంగస్థలంపై దర్శనమిస్తున్నారు.
ఏది ఎలా పోయినా అధికార పక్షం గనక ముందు కాంగ్రెస్‌ వ్యవహారం. వెన్నాడే అస్థిరత్వం వదలని ఓటమి భయం మధ్య రాహుల్‌ రాజకీయ నాయకత్వాన్ని స్థిరపర్చాలన్నదొక్కటే సోనియా గాంధీ ఏకైక ఆశ, ఆశయం. ప్రధాని పీఠాన్ని విశ్వసనీయ విశ్వీకరణ ఆర్థిక వేత్తకు అప్పగించి అందుకు సమయం కోసం నిరీక్షిస్తుంటే కథ అడ ్డం తిరుగుతున్న దృశ్యం. వరుస కుంభకోణాలు అతలాకుతలం చేస్తుంటే- అధిక భారాలను ఆఖరుకు భాగస్వామ్య పక్షాలూ సహించలేక వీడ్కోలు పలికి నిష్క్రమిస్తుంటే పేకమేడలా మారిన యుపిఎ 2. అస్తుబిస్తుగా

Saturday, October 27, 2012

విస్తరణ వివాదాలు- విస్తరించిన విభేదాలు


ఎంతకాలం నుంచో ప్రచారం జరుగుతున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం పూర్తి కానుంది. ే పూర్వ ప్రజారాజ్య నేత మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, బలరాం నాయక్‌, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ పదవులు పొందనున్నారు. ప్రభుత్వం కూలిపోయే స్థితిలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి ప్రాణం నిలిపిన చిరంజీవికి కేంద్రంలో స్థానం కల్పిస్తారని ఎప్పటినుంచో చెబుతున్నా ఆ ప్రక్రియ బాగా ఆలస్యమైంది. దీనిపై అనేక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక కోట్ల సూర్య మాజీ ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ జిల్లాకే పరిమితమై తన వర్గం పనులను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు. రాయలసీమలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కొవడానికి సామాజిక సమీకరణను నిలబెట్టడంలో ఆయనను తీసుకోవడం ఉపయోగమని అంచనా వేసినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో కిల్లి కృపారాణిని తీసుకోవడంలోనూ ఇదే వ్యూహం అనుకోవాలి. తెలంగాణా విషయానికి వస్తే ప్రాంతీయ ఉద్యమం నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం తరపున నిలబడే వారు కావాలి గనక సర్వే, నాయక్‌లు ఎంపికయ్యారు. అనేక సందర్భాల్లో తీవ్ర స్వరంతో ప్రత్యేక నాదం వినిపిస్తున్న వారికి భిన్నంగా సర్వే అధిష్టానం విధేయతను చాటుకున్నారు. అందరూ బహిష్కరించినప్పుడు కూడా ఆయన లోక్‌సభలో వుండి తన వాదం వినిపించారు.ఇప్పుడు పదవి పూర్తిగా సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వల్లనే లభించిందంటూ ఆ విధేయతను రెట్టింపు చేశారు. పైగా వీరికి ఇవ్వడం వల్ల ఎస్‌సి ఎస్‌టి వర్గాల ప్రతినిధులుగానూ వారిని ముందుకు తెచ్చే అవకాశం వుంటుంది.
వాస్తవానికి ఎవరికి ఏ పదవి వచ్చిందన్న దానికన్నా ఎవరు ప్రజల కోసం ఏం చేశారన్నది

పోటీయాత్రల విశేషాలు




అధికార పక్షం సంగతి విభేదాల మయంగా వుంటే ఆ స్తానం మాదంటే మాదని పోటీ పడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు దేశం పాదయాత్రలు పోటాపోటీగా సాగుతూనే వున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకు, షర్మిలకు వ్యక్తిగతంగా పోటీ ఏమిటన్న ప్రశ్న వస్తున్నా రాజకీయంగా మాత్రం పోటీ వున్నప్పుడు పోలికలు కూడా వుంటాయి. చంద్రబాబు యాత్రలో కాంగ్రెస్‌తో పాటు కొన్ని సార్లు అంతకంటే ఎక్కువగా కూడా జగన్‌పార్టీపై విమర్శ కేంద్రీకరిస్తున్నారు.తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ అంటూ ఒకటిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల యాత్రను ఆయన ప్రస్తావించకపోయినా ఇతర నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో పాటు ఇటీవల బైబిల్‌ పట్టుకోవడంపైనా విమర్శలు కేంద్రీకరించారు. నిజానికి ఎవరు ఏ పుస్తకం పట్టుకున్నారు, ఏ దేవుడి బొమ్మకు వేదికపై పూజ చేశారు ఇలాటి అంశాలు ఎప్పుడూ చర్చనీయం కాలేదు.దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలక పార్టీలన్నీ కుల మత భావాలను రాజకీయ లబ్దికి వాడుకోవడం జరుగుతూనే వుంది. కుల సంఘాల సభలకు హాజరవడం, ప్రార్థనా స్థలాల్లో మత పెద్దల మద్దతు పొందడం జరుగుతూనే వుంది. అయితే ఈ స్తాయిలో దానిపై విమర్శలు గతంలో లేవు. తెలుగు దేశం వ్యూహాత్మకంగానే దీన్ని ముందుకు తెచ్చిందనే అభిప్రాయం వుంది. బైబిల్‌ భగవద్గీత ఏదైనా ఆ ప్రస్తావన వారు

Monday, October 22, 2012

రాంబాంబులు- రాజకీయాలు


కెమెరా మెన్‌ గంగతో రాంబాబు చిత్రం కట్స్‌ లేకుండా చూసే అవకాశం నాకు కలగలేదు.అయితే దానిపై విస్తారంగా వెలువడిన సమాచారాన్ని, పూరీ జగన్నాథ్‌, దిల్‌ రాజు వంటివారి స్పందనను చూసిన తర్వాత ఒక అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ వుండదనుకుంటున్నాను.ఎందుకంటే ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా వెళ్లలేని చూడలేని అనేక అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తునే వున్నాము( కొందరు సినిమా వాళ్లు కూడా పూర్తి అవగాహన లేని విషయాలు నచ్చినట్టు చూపిస్తుంటారు) ఇదీ అలాటిదే.

మొదటిది- ఒక సినిమా లేదా టీవీ లేదా పత్రికలో విషయం నచ్చకపోయినంత మాత్రాన విధ్వంసం చేయడం సరికాదు. ముందు నిరసన తెల్పడానికి తొలగింపులు కోరడానికి చాలా మార్గాలు వున్నాయి. ఇలాటి పద్ధతులు ఎవరు ఎవరిపై చేసినా సరికాదు. పైగా పాల్గొన్న వారి సంఖ్య రీత్యా వారే కోట్లమందికి ప్రతినిధులని చెప్పడానికి లేదు. సవరించుకునే సమయం ఇవ్వక తప్పదు..రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న రాజకీయ డ్రామాలను

Wednesday, October 17, 2012

ప్రధాని సందర్శన- పోలీసు పద ఘట్టన



ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాక సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేవిగా వున్నాయి.నిజానికి ఆయన హైదరాబాదుకు రాలేదు, సీవోపీ కి మాత్రమే వచ్చారు. తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన బలం సమకూర్చిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం పట్ల తనకు ఎలాటి బాధ్యత వుందని ఆయన భావించలేదు. అస్తవ్యస్త నిర్ణయాలతో అరకొర ప్రకటనలతో రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితిలో ముంచిన ప్రభుత్వాధినేత ఆ ప్రభావానికి భయపడి నేలమీద కాలు మోపకుండా గాలిలోనే ఎగిరిపోవడం నిజంగా సిగ్గుచేటే. సమయం చాలదనే సాకు ఎంతమాత్రం నిలిచేది కాదు. ఈ దేశానికే అత్యున్నత కార్యనిర్వహణాధినేత తల్చుకుంటే సమయం కుదుర్చుకోవడం సమస్య కానేకాదు. అనిశ్చితికి స్వస్తి చెప్పే ప్రకటన విధాన నిర్ణయం వెలువడాల్సింది ఆయన నుంచే.( రాజ్యాంగ పరంగా) అది గాకపోయినా కనీసం గాయాలు మాన్చి సాంత్వన చర్యలు తీసుకోవలసింది కూడా ఆయనే. సోనియా గాంధీ సరే రెండేళ్ళుగా రాష్ట్రంవైపు చూడనే లేదు.ఈయన రాక సందర్భంలో ప్రజలెవ్వరినీ చూడకుండా

Sunday, October 14, 2012

నంది అవార్డులు- ప్రతి స్పందనలు

నంది అవార్డు విజేతలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెల్పుతూ కొన్ని వ్యాఖ్యలు. దుకంటే చాలా సంవత్సరాలుగా చలన చిత్ర అవార్డులపై నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ సారి నంది అవార్డులు ప్రకటించిన ప్రజాభిప్రాయానికి దగ్గరగా వుందన్న భావన సాధారణంగా వ్యక్తమైంది. అదే సమయంలో అందరినీ సంతృప్తి పర్చడానికి చేసిన ప్రయత్నం కూడా వుంది. దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి అని ఈనాడులో శ్రీధర్‌ వేసిన కార్టూన్‌లో కొంత నిజం వుంది. శ్రీరామ రాజ్యం, జై బోలోతెలంగాణా, దూకుడు ఈ చిత్రాలకు అవార్డులు ఎక్కువగా వచ్చాయి. విజయం జనాదరణ బట్టి చూస్తే వీటిలో దూకుడును ముందు చెప్పుకోవాలి. మహేష్‌బాబు ఎలాగూ ప్రథమ స్థానంలో వున్నాడు గనక ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం కూడా అర్థం చేసుకోవచ్చు. అయిత ఆ చిత్రం ప్రధానంగా హాస్యం వల్ల విజయవంతమైంది.కళ్లకింద క్యారీ బ్యాగులు పెట్టుకుని హీరో అయిపోయాననుకున్న ఎంఎస్‌ నారాయణకు ఉత్తమ హాస్య నటుడి అవార్డు అందుకే వచ్చింది. నా ఉద్దేశంలో మహేష్‌ బాబు నటించిన వాటిలో 'అతడు' నిజంగా కథలో(కమర్షియల్‌గానే) పట్టున్న సినిమా. సత్తా చూపించిన సినిమా. పోకిరీ ఆ ఇమేజ్‌ను కొనసాగించుకున్న ఫలితం మాత్రమే. దూకుడు వెనువెంటనే బిజినెస్‌ మాన్‌ రావడం కూడా అలాటిదే. (ఈ రెండూ పూరీ జగన్నాథ్‌వే కావడం మరో విశేషం) అయినా పేరుకు తగినట్టే ' చిత్ర' పరిశ్రమలో ఇలాటివి వుంటూనే వుంటాయి.
శ్రీరామరాజ్యం నంది అవార్డులు తెచ్చుకుంటుందని అందరూ అనుకుంటున్నదే. నిజానికి జాతీయ అవార్డు రానందుకు నిర్మాత సాయిబాబు వంటివారు కాస్త బాధ పడుతూ మాట్లాడారు.ఆ రోజుల్లో నేను టీవీ చర్చలో వారితో దీనిపై మాట్లాడాను కూడా. సాయిబాబా ప్రయత్నాన్ని బాపు ప్రతిభను పూర్తిగా గౌరవిస్తూనే శ్రీరామరాజ్యం సంభాషణలు, కథాగమనం, సెట్టింగులు అన్నిటిలోనూ మరింత జాగ్రత్త తీసుకుని వుండాల్సిందని చెప్పక తప్పదు. ఉదాహరణకు సింహాసనాల మధ్య మనుష/లు కనిపించడమే గగనమైన సన్నివేశాలున్నాయి. మొహాలపై కన్నీటి చుక్కలు మేకప్‌లో చిక్కుకుపోవడం కనిపిస్తుంది. హౌమ గుండంలో

Friday, October 12, 2012

అనునిత్య ప్రహసనం! అయినా సమర్థనం


తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని గులాం నబీ ఆజాద్‌ పక్షం రోజుల్లో రెండవ సారి చెప్పారు. (ఈ మధ్యలో హౌం మంత్రి షిండే రెండు సార్లు) గత పర్యాయం దేశం ఆ చివరనుంచి చెబితే ఈ సారి మన నట్టింట్లోకొచ్చి చెప్పారు. యుపి, బీహార్‌, మధ్య ప్రదేశ్‌లను విభజించినంత తేలిగ్గా ఏపిని విభజింపలేమన్నారు. కాల పరిమితికి కూడా అంగీకరించడానికి నిరాకరించారు. ఆజాద్‌ వ్యాఖ్యలు అనునిత్య ప్రహసనంలో భాగం అనుకుంటే దానికి ఉపాఖ్యానాలుగా అటు టిఆర్‌ఎస్‌, ఇటు లగడపాటి వ్యాఖ్యలు కూడా ఠంచనుగా వచ్చేశాయి. టిఆర్‌ఎస్‌ వారికి ఈ మాటల్లో తప్పు పెద్దగా కనిపించలేదు. తమ దసరా గడువుకు ఈ ప్రవచనాలకు వైరుధ్యమేమీ లేనట్టే మాట్లాడారు. అయితే ఆయన మాటల్లోని ఒక నిజం- ఆ రాష్ట్రాలకూ ఆంధ్ర ప్రదేశ్‌కు తేడా వుందన్న మాట మాత్రం కొట్టిపారేశారు.( అంతకు ముందే అయిదారు వరకూ వున్న హిందీ రాష్ట్రాలను మరిన్ని ఏర్పాటు చేయడానికి- భాష ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు తమిళ కన్నడ మళయాలీ, బెంగాలీ మరాఠీ కాశ్మీరీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ తదితర రాష్ట్రాల విషయానికి మధ్య ఖచ్చితంగా కొంత తేడా వుంది.) టిఆర్‌ఎస్‌తో సంధానకర్తగా వ్యవహరిస్తున్న పాల్వాయి గోవర్థనరెడ్డి కూడా ఆజాద్‌ మాటలకు తనదైన భాష్యం చెప్పి తాము పార్టీ తరపున దౌత్యం చేస్తున్నామన్నారు. ఇక లగడపాటి షరామామూలుగా పరిస్తితి సున్నితత్వాన్ని మర్చిపోయి ఉస్మానియా విద్యార్థులపైన తెలంగాణా ఉద్యమంపైన ఏవో వ్యాఖ్యలు సంధించారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ బాధ్యతా రహితమైన మాటలు. కేంద్రం నాటకాలు ఆడుతున్నదని సిపిఎం రాఘవులు విమర్శిస్తుంటే ఆజాద్‌ మాటల్లో తప్పు లేనట్టు టిఆర్‌ఎస్‌ స్పందించడం నిజంగానే ఒక విపరీతం. ఇది ఆ రెండ పార్టీల మధ్య సయోధ్యకు సంకేతమంటే తప్పు లేదు. సయోధ్య వున్నంత మాత్రాన సంధిగ్ద వాఖ్యానాలను సమర్థించాల్సిన అవసరం వుందా?కష్టం అని వారన్నా ఇష్టం అని వీరంటున్నారంటే 'ఈ బంధం దృఢమైనది' అనుకోవలసిందే కదా!

మోడీని మోయడానికి కారణం



గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదేళ్ల తర్వాత వీసా ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించడం పాశ్చాత్య దేశాల వ్యూహంలో మార్పును సూచిస్తుంది. రేపు అమెరికా చేసే పని ఈ రోజు బ్రిటన్‌ చేస్తుందనేది ఇరాక్‌ యుద్ధం నుంచి అర్థమవుతూనే వుంది. గత ఏడాది కాలంలోనే అమెరికా సెనేట్‌, విదేశాంగ నిపుణులు నెమ్మదిగా మోడీ వైపు మొగ్గుతుండడం చూస్తున్నాం. రాబోయే ఎన్నికలు మోడీకి రాహుల్‌కు మధ్యనే అని అధికారిక నివేదికలో అభివర్ణించడం కూడా ఇలాటిదే. గుజారాత్‌లో 2002లో జరిగిన జాతి హత్యాకాండకు అధికారంలో వుండి ఆధ్వర్యం వహించిన మోడీ విషయంలో వారి వైఖరి మారడానికి ఇంతకన్నా కారణం లేదు. ఆ మత మారణహౌమంలో ఆయన పాత్ర ఏమైనప్పటికీ ఆ కారణంగా వీసా నిరాకరించడాన్ని దేశంలో పార్టీలన్నీ ఖండించాయి. అయినా వారు పట్టించుకోలేదు. ఇప్పుడు తమకు తామే ఏకపక్షంగా స్వాగతం పలుకుతున్నారంటే ఇది వైదేశిక విధాన అవసరాల కోసమేనన్నది స్పష్టం. వాస్తవానికి ఈ కాలంలో మోడీ గత మంత్రి వర్గ సభ్యులకు కోర్టు శిక్షలతో సహా అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికే యుపిఎను లొంగదీసుకుని మన్మోహన్‌ సర్కారునుంచి అనేక అనుకూల నిర్ణయాలు రాబట్టిన అమెరికా కూటమి మరింత సాధించుకోవడానికి గాను మోడీ మోత మోగించుతున్నట్టు కనిపిస్తుంది. దీనికే ఉబ్బిపోయిన మోడీ మహాశయులు విదేశాలు మనకన్నా ముందు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నాయన్నట్టు మాట్లాడారు.అన్నిటికంటే వింత ఏమంటే మత సామరస్య దృష్టితో పరస్పర కలహాలు వద్దని చెప్పిన వివేకానందుని పేరిట ఆయన యాత్ర చేసి ముగింపులో ఈ ఆణి ముత్యాలు వినిపించడం! హతవిధీ!

వ్యాఖ్యలు- వివాదాలు





. దేశంలో దేవాలయాల కన్నా మరుగుదొడ్ల అవసరం చాలా వుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై చాలా దుమారం రేగింది. ఆయన తరచూ ఇలాటి సంచలనాలు సృష్టిస్తుంటారు గాని ఈ మాటలో దేశంలోని పరిస్థితినే వెల్లడిస్తున్నారు. ఉదయం టీవీ చర్చలకు వెళ్లేప్పుడు బంజారా హిల్స్‌ వంటి అత్యాధునిక ప్రదేశంలో కూడా చెంబు తీసుకుని కొండలపైకి, పొదల మాటుకు వెళ్లే మనుషులు కనిపించినప్పుడల్లా నాగరికత వెక్కిరిస్తుంటుంది. ప్రపంచంలో బహిర్భూమి అన్న మాట వర్తించే వారిలో అత్యధికులు ఇండియాలోనే వున్నారట. అక్షరాలా 48.9 శాతం ఇళ్లకు మరుగుదొడ్ల సదుపాయం లేదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మహిళల విషయంలో ఇదెంత నరకమో భారతీయులందరికీ తెలుసు. మర్యాద విషయం అలా వుంచి ఆర్థికంగానూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఏటా24,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనాగా

క్రేజీ కేజ్రీ హడావుడి



రాజకీయాలలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు గాని సమతుల్యత పాటించాల్సి వుంటుంది. సంచలనాలు ఎల్లకాలం వుండవు. స్వంత బలం లేకుండా ప్రచారాలతోనే పనిగడవదు. మీడియాలో అత్యధిక ప్రచారం పొందిన వారు ఎన్నికలలోనూ ఉద్యమాలలోనూ నిలవలేకపోవడం చూస్తూనే వున్నాం. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంతో ప్రచారంలోకి వచ్చిన అరవింద కేజ్రీవాల్‌కైనా ఈ మాటలు వర్తిస్తాయి. అన్నా ను మరో గాంధీజీ అన్నంతగా హడావుడి చేస్తున్న రోజునా ఈ మాట చెప్పాను. తర్వాత అవన్నీ నిజమై ఆఖరుకు కేజ్రీవాల్‌ కూడా ఆయన నుంచి విడగొట్టుకున్నారు. స్వంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన కేజ్రీవాల్‌ ఇటీవల సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని అందరూ కోరారు. ఆ సందర్భంలో ముందుగా ఖండించిన వ్యక్తి కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌. తాజాగా కేజ్రీవాల్‌ ఆయనపైనా ఆరోపణలు సంధించడమే గాక ఏకంగా రాజీనామా చేయాలంటూ ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు.వాద్రా విషయంలో జరిగిన చర్చ కూడా ఈ అంశంపై జరగలేదు.ఇంతలోనే ధర్నాలు చేసి రాజీనామాలిప్పించాలనుకోవడంలో వాస్తవికత ఏమిటి? ఒక వేళ కేవలం ప్రచారం కోసం ఇలాటి పనులు చేస్తే ఆ ప్రభావం ఎంతో కాలం వుండబోదని టీం అన్నా అనుభవం చెబుతూనే వుంది కదా, క్రేజీ కేజ్రీవాల్‌జీ? పైగా చిల్లర వర్తకంలో ఎఫ్‌డిల వంటి వినాశకరమైన విధాన నిర్ణయాలు వదిలిపెట్టి వ్యక్తుల అవినీతిచుట్టూనే (అదికూడా బిజెపియేతర పార్టీలపై) కేంద్రీకరించడంలో ఆంతర్యం ఏమిటి?

Thursday, October 11, 2012

అవే కుటుంబాలు, అదే మనుషులు, అవే యాత్రలు, అనంత వివాదాలు



చంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్ర సందర్భంగా నేను విమర్శనాత్మకంగా చాలా వ్యాఖ్యలే చేశాను. తన గత పాలనా నమూనా మార్చుకునేది లేనిదీ స్పష్టం చేయకుండా ఆయన నిర్ణయాత్మక పునరుద్దరణ సాధించలేరని కూడా పేర్కొన్నాను. అలాటి లోతుల్లోకి పోకుండా ఆయన 'తన గత పాలనలో తప్పులు జరిగివుంటే క్షమాపణలు చెబుతున్నా' నని పదే పదే అంటున్నారు.దీన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్షమాపణలు చెప్పే పాలనను మళ్లీ ఎందుకు తీసుకురావాలని ఎదురు దాడి చేస్తున్నారు. కాళ్లతో గాక చేతులతో నడిచినా చంద్రబాబును నమ్మరని ధ్వజమెత్తుతున్నారు. అంతటితో ఆగక సిబిఐ తరపునా కోర్టుల తరపున తానే ప్రతినిధి అయినట్టు సిబిఐ విచారణ జరుగుతుందని ముందస్తుగా ప్రకటించి సర్దుకున్నారు. చంద్రబాబు పాలనలో లోపాలు ఒక ఎత్తయితే ఇప్పుడు ప్రతిష్టంభనలో పడిన పరిపాలన సంగతేమిటన్నది ఆయన జవాబు చెప్పాల్సిన ప్రశ్న. ధర్మాన రాజీనామా విషయమే తేల్చడానికి లేని నిస్సహాయతలో తానుండి అంతా అద్బుతంగా జరిగిపోతున్నట్టు మాట్లాడితే కుదిరేపని కాదు.ఇంతకూ నాయకులు పార్టీలు పరస్పరం సహనం కోల్పోతున్నందువల్లనే ఇలాటి పరిస్థితి వస్తుంటుంది. విధానాలపై చర్చ కన్నా వివాదాలతో సరిపెట్టడం జరుగుతుంటుంది.
మరో వైపు చంద్రబాబు యాత్రపై వైఎస్‌ఆర్‌ పార్టీ కూడా తీక్షణంగానే దాడి చేసింది. చివరకు ఆ ప్రచారాన్ని తటస్థీకరించి తమ పార్టీ స్థయిర్యం పెంచేందుకు షర్మిల పాదయాత్ర( చంద్రబాబు కంటే ఎక్కువ దూరం) తలపెట్టింది. నేను టివీ9 కు మంగళవారం వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి ఇందిర బాట చంద్రబాబు మీకోసంకు పోటీ కాగలదా అని ఎస్‌ఎంఎస్‌ పోటీ పెడితే కాలేదని చాలా తేడాతో ఓటింగు వచ్చింది. గురువారం నాటికి షర్మిల యాత్ర ఖరారైనందున ఆ యాత్రకూ బాబు యాత్రకూ పోటీ పెడితే అత్యధికంగా షర్మిల వైపే

Wednesday, October 10, 2012

మరింత 'స్పష్టత'నిచ్చిన షిండే


తెలంగాణా సమస్యపై ఇప్పట్లో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కేంద్ర హౌంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత వుంది. దసరా లోగా అయిపోతుందని కెసిఆర్‌ అంటుంటే దీపావళి నాటికి కూడా నిర్ణయం రాకపోవచ్చని షిండే వువాచ. పైగా ఆయనతో తాము చర్చలు జరపలేదని పిలవలేదని కూడా వాయిలార్‌ రవిలాగే ఈయనా చెప్పాడు. కనక ఇప్పుడు వాస్తవాలు ఆలోచించవలసింది, ప్రకటించవలసింది కెసిఆరే. తాము కాంగ్రెస్‌లో కలసి పోవడం గురించి కూడా సంసిద్ధత ప్రకటించడం తమ త్యాగ నిరతికి నిదర్శనమని కెసిఆర్‌ కుటుంబ సభ్యులే చెబుతున్నారు.కనక మనం చాలా మార్పులు చూడవలసే వుంటుంది. ఈ లోగా జెఎసిపై తన పట్టు పెంచుకోవడానికి కెసిఆర్‌ ఏవైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. కోదండరాం పట్ల ఆయన అసంతృప్తిగా వున్నారనేది నిజమైనా దాన్నిబట్టి వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పడం నిరాధారం. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ లేని జెఎసికి విలువుండదు. ఇతరులను కలుపుకోవడానికి జెఎసి వుండకుండా టిఆర్‌ఎస్‌కు మద్దతుండదు.కనకనే ఈ కోపతాపాలు దిగమింగి సర్దుకోవడం అనివార్యం. పైగా కేంద్రం కుండబద్దలు కొట్టి ప్రతికూల సంకేతాలు ఇస్తుంటే ఇప్పుడు వున్న వేదికలు భంగ పర్చుకోవాలని ఎవరూ అనుకోరు. కనక ఈ విభేదాల కథలకు పెద్ద విలువుండదు. మరో వైపున లగడపాటి రాజగోపాల్‌, టిజి వెంకటేష్‌ వంటి వారు టిఆర్‌ఎస్‌కు సమాధానమిచ్చే పేరిట తెలంగాణా అకాంక్షించే వారిని గాయపర్చేట్టుగా మాట్లాడటం అనర్థదాయకం.ఈ సమయంలోనే డికె అరుణ తమ జిల్లా వారిని తీసుకుని విడిగా వెళ్లడం బట్టి చూస్తే తెలంగాణా రాజకీయాలలో పార్టీలు మాత్రమే గాక వ్యక్తులు కూడా స్వంత వేదికలు ఏర్పర్చుకుంటున్నట్టు అర్థమవుతుంది.సందట్లో సడేమియాలా అజిత్‌ సింగ్‌ ఆర్‌ఎల్‌డి తెలంగాణా శాఖను స్థాపించి వెళ్లాడు. ఇవి గాక సిపిఐ బిజెపి వంటి పార్టీలు వాటి దారిని అవి పోతున్నాయి.కనక తెలంగాణా రాజకీయ రంగ స్థలంపై అందరూ కలసి పనిచేయడం గాని ఎవరికి వారు విడిపోయే సాహసం గాని రెండూ సాధ్యం కావు.

వాద్రాపై ఆరోపణలతో అధిష్టానం అయోమయం



ఇండియా ఎగనైస్ట్‌ కరప్షన్‌ తరపున కేజ్రీవాల్‌, ప్రశాంత భూషణ్‌లు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్‌ వాద్రాపై లేవనెత్తిన ఆరోపణలు అధికార పార్టీని అయోమయంలోకి నెట్టాయి. అవి ఇంకా పూర్తిగా ప్రచారం కాకముందే సోనియా గాంధీతో సహా అగ్రనేతలందరూ ఒక్కుమ్మడిగా ఖండించేందుకు హడావుడి పడ్డారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రపంచంలోని అతి శక్తివంతమైన ఒక కుటుంబ సభ్యుడు ఇంత తీవ్రమైన ఆరోపణలకు గురైతే సంజాయిషీ ఇచ్చి సమగ్ర దర్యాప్తు చేయించేబదులు సమర్థనలకు పాకులాడడం హాస్యాస్పదం. డిఎల్‌ఎఫ్‌ కూ వాద్రాకు మధ్య లావాదేవీలు జరిగినట్టు దీనివల్ల ఆ సంస్థ లాభం పొందినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. యాభై లక్షల రూపాయలతో వ్యాపారం మొదలెట్ల్టిన అల్లుడు గారు 2007 తర్వాత చకచకా పైకి పాకిపోయారంటే ఇలాటి కారణాలు వుండే వుండాలి. ఆయనకు రుణాలు స్థలాలు భవనాలు ఇచ్చి తానూ యథాశక్తి లాభ పడిన డిఎల్‌ఎప్‌ ఈ మొత్తాలు చేతులు మారిన సంగతి కాదనడం లేదు. వాద్రా కూడా జరిగిందాన్ని కాదనలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి స్థలం చేతులు మారడం, వాద్రాకు అప్పు ఇచ్చి మళ్లీ తమ స్థలాన్నే చౌకగా అమ్మడం, ఒక దశలో యాభై శాతం వాటా ఇచ్చి తర్వాత తీసుకోవడం వంటి అనుమానాస్పద వ్యవహారాలున్నాయి. వాద్రాచెట్టుకింద కూచుని వ్యాపారం చేసుకుంటే అది వేరుగా వుండేది. కాకపోతే కాంగ్రెస్‌ వారే దీనిపై ఎలా స్పందించాలో తేల్చుకోలేకపోతున్నారు.మొదట రాగానే ఖండించారు. తర్వాత ఆయన వ్యక్తిగతంపార్టీకి సంబంధం లేదన్నారు. మళ్లీ ఆయనపై దాడి పార్టీపైనే దాడి అని స్పందించారు. ఇప్పుడు మళ్లీ

Monday, October 8, 2012

Paritranaya sampannam
 Vinasayacha samanya
 Kharma  samsthapanarthaya                  
  Santarpanam dine dine…

                     - Manmohan Gita..

శభాష్‌ చావేజ్‌! వివా వెనిజులా!



అమెరికా ఆధిపత్యాన్ని అతి సమీపం నుంచి సవాలు చేసి... అన్ని కుట్రలనూ కుహకాలనూ తట్టుకుని నాలుగో సారి అఖండ విజయం సాధించిన హ్యూగో ఛావేజ్‌ హిప్‌ హిప్‌ హుర్రే! లొంగుబాటు కాదు తిరుగుబాటులోనే భవిష్యత్తు వుందంటూ 21 వ శతాబ్ది సోషలిజం నినాదమిచ్చిన ఈ ధీరుడి గెలుపు వర్తమాన చరిత్రకొక మలుపు. క్యూబా ధృవతార ఫైడెల్‌ కాస్ట్రో తర్వాత సమకాలీన ప్రపంచంలో ఉత్తేజ ప్రదాత, ఉదాత్త నేత చావేజ్‌. అమెరికా కూటమి, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు, ముఖ్యంగా చమురు సంస్థల మాఫియా, అభివృద్ధి నిరోధకులు, ప్రతీఘాత ప్రతిపక్షాలూ కలసి ధనరాశులు గుమ్మరించినా 30 పార్టీల కూటమిగా ఏర్పడి కుట్రలు పన్నినా 54 శాతం పైగా ఓట్లు తెచ్చుకుని విజయ ఢంకా మోగించాడు. చావేజ్‌పై అమెరికన్‌, లాటిన్‌ అమెరికన్‌ బడా పత్రికలన్నీ శాపనార్తాలు పెట్టాయి. ఆయనను ఓడించడానికి ఇదే అదనని హడావుడి చేశాయి. ఆయన స్వల్ప మెజారిటీతో గెలిచినా తట్టుకోలేడని జోస్యాలు చెప్పాయి. ప్రత్యక్షంగానూ బోలెడు ప్రతికూల ప్రచారం సాగించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి.
చమురు సంపన్న దేశాలలో ఒకటైన వెనిజులా స్వంత కాళ్లపై నిలబడటం సామ్రాజ్యవాదులకు ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే చావేజ్‌ చమురు సంస్థల జాతీయ కరణతో సహా అనేక ప్రగతిశీల చర్యలు

విజయమ్మ భేటీ వివాదగ్రస్థం



వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవాద్యక్షరాలు విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవడంపై రకరకాల వాదనలు వచ్చాయి. అనుకున్నట్టుగా జగన్‌ విడుదల కానందున ఆయన తరపున తాను రాష్ట్రపతికి అభినందనలు తెలిపానన్నది ఆమె అధికారిక వివరణ. దాంతో పాటే సిబిఐ 'కుట్ర'ను కూడా దృష్టికి తెచ్చామంటున్నారు. దేశాధినేతను కలిసిన తర్వాత వివిధ విషయాలు ప్రస్తావనకు రాకుండా వుంటాయని ఎవరూ అనుకోరు గాని అది పెద్ద అభ్యంతరక

రం కూడా కాదు. ఎందుకంటే ఎవరిని కలవాలి, ఏమి చర్చించాలి అన్నది ఆయన నిర్ణయం మాత్రమే. గతంలోనూ అన్ని పార్టీలూ సంఘాల ప్రతినిధులూ వ్యక్తులూ కూడా రాష్ట్రఫతులను కలుస్తూనే వస్తున్నారు. ఈ భేటీకి రాజకీయ కోణాలూ వుంటాయనడంలో సందేహం లేదు. అయినా ఆ పేరుతో దీన్ని వివాదగ్రస్థం చేయడం నిలిచేది కాదు. ఎవరిని ఎవరు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఇది ప్రజాస్వామ్యం గనక అందరికీ హక్కులుంటాయి. అసహనాల వల్ల ఫలితం వుండదు.

Friday, October 5, 2012

బెయిల్‌ రాకపోవడం వూహించిందే..


సుప్రీం కోర్టులో వైఎస్‌ఆర్‌పార్టీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురి కావడం వూహించని విషయమేమీ కాదు. గతంలో ఏ కారణాల వల్ల తిరస్కరించారో అవి ఇప్పటికీ వర్తిస్తుండడమే గాక ఇంకా తీవ్రమైనాయి కూడా. ఆయనకు సంబంధించిన కేసులో ఆస్తుల జప్తుకు ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ ఉత్తర్వులివ్వడం నిజానికి చాలా పెద్ద పరిణామం. గతంలో సాక్షికి సంబంధించి జప్తు జరిగినప్పటికీ ఇప్పటికీ హడావుడిలో తేడా ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగు దేశం, కాంగ్రెస్‌ల కుమ్మక్కు వల్లనే ఇలా జరిగిందని వైఎస్‌ఆర్‌ పార్టీ ఆరోపిస్తున్నా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అలాటి ఉద్దేశాలు ఆపాదించడానికి లేదు.ఒక వేళ బెయిల్‌ వచ్చివుంటే అప్పుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం వారు ఆరోపించి వుండేవారు. ఏమైనా జగన్‌ బయిటకు రాలేకపోవడం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. అంటే ఆ పార్టీ స్థయిర్యం కాపాడుకోవడం కష్టమవుతుంది. నాయకుడిపై ఆధారపడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. పైగా ఆయన తర్వాత ఎవరన్న దానిపైనా స్పష్టత ఇచ్చింది లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీలలోంచి వలస వచ్చేవారు ఆగిచూద్దామనుకుంటారు. ఈ తీర్పు ముందే వచ్చివుంటే బహుశా చంద్రబాబు పాదయాత్ర తీరు మరోలా వుండేదేమో. అయితే ఛార్జిషీట్లు అదే పనిగా వేయొద్దని ఒక్కదానితో సరిపెట్టమని సిబిఐని ఆదేశించడం కూడా ముఖ్య పరిణామమే. బెయిలు రాకపోవడానికి సిబిఐ లక్ష్మీనారాయణ తాజాగా ప్రవేశపెట్టిన ఆధారాలే కారణమన్న ప్రచారం ఒకవైపున వుండగా గట్టి లాయర్‌ను నియోగించారన్నది మరో వాదనగా వుంది. వాస్తవానికి సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలోఅవినీతి కేసుల విషయంలో తీసుకుంటున్న వైఖరికి అనుగుణంగానే జగన్‌ బెయిల్‌ తిరస్కరణ వుందని చెప్పొచ్చు.. వైఎస్‌ఆర్‌పార్టీ దీని తర్వాత వ్యూహం మార్చుకునే అవకాశాలు చాలా వుంటాయి. దీనివల్ల నిజంగా తెలుగు దేశం కోలుకుంటుందనుకుంటే అప్పుడు కాంగ్రెస్‌ తీరు మార్చుకోవచ్చు.కనక ఇంతటితోనే కథ ముగిసిపోయిందని మరే మలుపులూ వుండవని అనుకోవడం కూడా తొందరపాటే.

శ్రీకృష్ణ సత్యాలు



తెలంగాణా సమస్యపై కేంద్రం నాటకాలను చెలగాటాలను రాజకీయ పార్టీలు అనేక సార్లు విమర్శించాయి.కాగా ఇప్పుడు సాక్షాత్తూ ఆ కేంద్రమే నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కూడా సూటిగానే ఖండించక తప్పలేదు. తాను సరైన సిఫార్సు చేయనందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయినట్టు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తేల్చిపారేశారు.తనను తోచిన సిపార్సులు చేయమన్నందునే ఆరు మార్గాలు సూచించానని ఒకటే అడిగితే ఒకటే చెప్పేవాణ్నని కూడా అన్నారు. ఆయన సిఫార్సులు వచ్చిన మొదట్లో నైతే తెలంగాణా విభజన వాదులు కూడా తమకు అనుకూలంగా వుందన్నట్టు వాదించేవారు. ఇతర విషయాలు బయిటకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకున్నారు. ఇంతకూ కేంద్రమే ఏదైనా చేయాలనుకుంటే కమిటీలు కమిషన్లు అడ్డం వస్తాయా? అయితే కెసిఆర్‌ మాత్రం ఇప్పుడు తన గడువును మరో నెల పొడగించి ప్రకటన వస్తుందనే చెబుతున్నారు. ఆయన రాజకీయావసరాలు ఆయనవి.

బీమా,పెన్షన్లపై వేటు



సంస్కరణల జ్వరంతో వూగిపోతున్న మన్మోహన్‌ సింగ్‌ సర్కారు తాజాగా బీమా వ్యాపారంలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు రావలసిన పెన్షన్‌ నిధులలోనూ ఎఫ్‌డిఐలకు ద్వారాలు తెరిచి ప్రమాదంలోకి నెట్టింది. సరళీకరణ వల్ల ఉద్యోగ భద్రత ఎలాగూ హరించుకుపోగా పదవీ విరమనాంతరం కూడా వారికి భద్రత లేకుండా చేసే చర్చ ఇది. బీమా రంగం అనేక ప్రతికూల నిర్ణయాల తర్వాత కూడా 2011612 లో

11 దందల కోట్లకు పైగా లాభం సంపాదించింది. ఇక ప్రీమియం ఆదాయం చూస్తే అంతకు ముందు ఏడాది కంటే 25 శాతంపైగా పెంచుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోగా పోటీ పెంచుతున్న నేపథ్యంలోనే ఎల్‌ఐసితో నాలుగు సంస్థలు ఇంతటి విజయాన్ని సాధించాయి. దీన్ని మరింతగట్టి చేసుకునే బదులు 49 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వాలని నిర్ణయించడం చిరకాలంగా అమెరికా చేస్తున్న ఒత్తిడి ఫలితమే. ఒబామా స్వయంగా ఈ మేరకు ప్రకటన చేయడం చూశాం. ఎన్నికల సంవత్సరంలో భారతీయులను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని ఆయన దాడి చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం దేశ ప్రయోజనాలను హారతి పళ్లెంలో పెట్టి అప్పగిస్తున్నది.

Wednesday, October 3, 2012

కెసిఆర్‌ చర్చల 'సఫలత' ఎందులో?



కాంగ్రెస్‌ నేతలతో తన తొలి విడత చర్చలు సఫలమైనాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.సి.ఆర్‌ ఢిల్లీ నుంచి  చేసిన ప్రకటన సారాంశం దురూహ్యంగా వుంది. ముఖ్యమంత్రితో సహా కేంద్ర రాష్ట్ర నాయకులు తెలంగాణా మార్చ్‌ ఘటనలు అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన అంతా అనుకూలంగా వుందని గత వైఖరిని కొనసాగించడం వాస్తవాలతో పొసగదు. మాయలఫకీరు ప్రాణం లా ఎవరికీ తెలియని రహస్యాలు రాజకీయాల్లో వుండటం కుదరని పని. అసలు గత నెల చివరికల్లా ప్రకటన వస్తుందన్న ఆయన తొలి విడత చర్చలు ముగిశాయని చెప్పడంలోనే అనుకున్నట్టు జరగలేదని ఒప్పుకోవడం వుంది. ప్రహసనంగానైనా, తెలంగాణా ప్రాంత మంత్రులు ఎంపిలకు వున్న మేరకైనా కెసిఆర్‌కు అధిష్టానంపై అవిశ్వాసం అసంతృప్తి లేకపోవడం విచిత్రమే! అయినా అదే ధోరణిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్‌తో వ్యూహాత్మక బంధం ఎంత బలంగా వుందో అర్థమవుతుంది. బహుశా హైదరాబాద్‌ రాగానే మరింత నాటకీయమైన వ్యాఖ్యలు మనం వినొచ్చు.

విధానాల సమీక్షలో కూడా వినమ్రత వుండాలి



చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఘనంగానే ప్రారంభమైంది. ప్రచారం ఎలాగూ అదిరిపోయింది. దీర్ఘకాల మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ఆహ్వానించదగింది. దీనిపై అసహనంతో శవయాత్ర అని వైఎస్‌ఆర్‌సిపి వ్యాఖ్యానించడం, నడిస్తే కొవ్వు కరుగుతుందని రేణుకా చౌదరి తిట్టిపోయడం అనుచితంగా వున్నాయి. అయితే లదే సమయంలో తెలుగు దేశం ఈ యాత్రను గురించి చేసుకుంటున్న ప్రచారంలోనూ అతిశయోక్తులు ఎక్కువగానే వున్నాయి. అసలు ఈ యాత్ర తలపెట్టడమే త్యాగమని సాహసమనీ తనను తాను శిక్షించుకోవడమనీ ఎందుకు అం టున్నారో అర్తం కాదు. 80 ఏళ్ల వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వంటి వారు దేశాన్ని పాలించగా లేనిది 60 ఏళ్ల చంద్రబాబు పూర్తి భద్రతతో జాగ్రత్తలతో పాద యాత్ర చేయడంలో త్యాగం ఏమీ లేదు.విజయ సంకేతం నుంచి వినమ్ర పూర్వక వందనం వైపు ఆయన మారడం మంచిదే గాని ఈ వినమ్రత విధాన పరమైన అంశాల పున:పరిశీలనలోనూ వుంటుందా అన్నది అసలు సమస్య.
బాబు మాటల్లోనూ ఆయన పార్టీ వారి వ్యాఖ్యల్లోనూ కూడా ఆయన గత పాలన స్వర్థయుగమైనట్టు అది తిరిగి రావాలనే ప్రజలు కోరుతున్నట్టు పదే పదే చెబుతున్నారు. అయితే ఆ పాలనా కాలంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు పరాకాష్టకు చేరిన ఫలితంగానే చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొన్న

Monday, October 1, 2012

సాగర హారం- సందేశం, సారాంశం



సాగరహారం వూహించినట్టే ఉధృతంగానూ, ఉద్రిక్తంగానూ జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా వినిపించాలన్న జెఎసి లక్ష్యం నెరవేరింది.
మొదటిది- ఈ మార్చ్‌తో మొదటి సారి రాజకీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి జెఎసి,దాని నిర్వాహకులకు దగ్గరగా వుండే సంఘాల నాయకుల పిలుపు అమలు జరిగినట్టయింది. పాలక పక్షమైన కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం నేతలు మాత్రమే గాక ఇప్పటి వరకూ తెలంగాణా ఉద్యమానికి ప్రతీకగా పరిగణించబడిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కూడా వేదికపై కనిపించని,వినిపించని స్థితి మొదటిసారిగా గోచరించింది. పార్టీల పతాకాలు తీసేయాలని పిలుపునివ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని మరింత ప్రస్పుటంచేసే ప్రయత్నం జరిగింది. అయితే సమీకరణలో మాత్రం టిఆర్‌ఎస్‌, న్యూ డెమోక్రసీల తరపున వచ్చిన వారే అత్యధికంగా కనిపించారు.ఆ పైన సిపిఐ,బి.జెపి ఇతర సంఘాలు వుండొచ్చు.
రెండవది- మార్చ్‌ ఉద్రిక్తంగా జరిగిందనడంలో సందేహం లేదు. పోలీసుల పాత్ర, జోక్యం, బల ప్రయోగం చాలా ఎక్కువగానే వున్నాయి. ప్రజాస్వామిక హక్కుగా అనుమతినిచ్చిన తర్వాత ఇలాటి పరిస్తితి రావలసింది కాదు. ఇందుకు పోలీసుల వైఖరి ప్రధాన కారణంగా కనిపించినా ఇతర అంశాలు కూడా వున్నాయి.పార్టీలు విడివిడిగా ఎవరి యాత్ర వారు మొదలెట్టడం ఒక కారణం. చాలా మంది తెలంగాణా వాదులతో సహా అనేకులకు  మార్చ్‌ తేదీ

Saturday, September 29, 2012

ఢిల్లీ మాయాజాలంలో తాజా ఘట్టం?



ఇంతకు ముందే రాజకీయ మాయాజాలం గురించి, సాగర హారం నేపథ్యం గురించి రాశాను.  మరోసారి టీవీ చూస్తే ఢిల్లీలో కెసిఆర్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిసినట్టు అవగాహన కుదిరితే సోనియాగాంధీని కూడా కలిసే అవకాశం వున్నట్టు స్క్రోలింగ్‌లు కనిపిస్తున్నాయి. అంటే ఢిల్లీ మాయాజాలం ఇంకా కొనసాగుతుందన్న మాట.ఒకవేళ గతంలో అసెంబ్లీ మార్చ్‌ ఆఖరి నిముషంలో వచ్చిన ప్రకటన తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందీ చూశాం. అలా జరుగుతుందని నేను ఆ డిసెంబర్‌ 10 ఉదయం చర్చలోనే(ఎన్‌టివిలో టిఆర్‌ఎస్‌ విద్యాసాగరరావు, అప్పటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మరొకరు వున్నారు) చిదంబరం ప్రకటన పాక్షికమనీ, చివరి వాక్యం కాదని చెప్పాను. ఇప్పుడు కూడా అలాటి ఒక నాటకీయ ప్రకటన లేదా వివరణ వచ్చినంత మాత్రాన విలువేముంటుంది? నిన్న గాక మొన్న విభజన సాధ్యం కాదని చెప్పిన ఆజాద్‌తో ఇప్పుడు మరో విధంగా చెప్పినా నమ్మడమెలా సాధ్యం? ఒక రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం ఇలా ఎపిసోడ్ల స్థాయికి పడిపోవడం నిజంగా విచార కరం. అభ్యంతరకరం కూడా. ప్రజలకు కావలసింది సాధికారిక సమగ్ర ప్రకటన తప్ప మంతనాలు, మంత్రాంగాలు కాదు. మాయాజాలం అసలే కాదు.

రాజకీయ మాయాజాలంలో రాష్ట్రం - సాగరహార నేపథ్యం


ఎట్టకేలకు సెప్టెంబరు 30 వ తేదీ తెలంగాణా మార్చ్‌కు ప్రభుత్వం అంగీకరించడం ఆహ్వానించదగినది. స్థలం మార్చుకోవడానికి, శాంతియుత నిర్వహణపై హామీ ఇవ్వడానికి జెఎసి అంగీకరించడమూ మంచిదే. ఆ ప్రకారమే సాగరహారం లేదా మార్చ్‌ శాంతియుతంగా జరగాలని ప్రతివారూ కోరుతున్నారు. ఇక ఈ మార్పులకు ముందు సాగిన రాజకీయ పరిణామాలు మరింత రసవత్తరమైనవి. ఆ పూర్వాపరాలు. అవి నేర్పే గుణపాఠాలు. వాటి వెనక వివిధ శక్తుల ప్రయోజనాల ప్రాకులాటలు. ఆవేశకావేశాలలో ఔచిత్యాలేమిటి? అరోపణలు ప్రత్యారోపణలలో నిజానిజాలేమిటి? ఎవరి విశ్వసనీయత ఎంత?
మొదటి విషయం- ఈ మొత్తం పరిస్థితికి కారణమైన కేంద్ర కాంగ్రెస్‌ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోకుండానే పావులు కదిలించగలిగింది. తెలంగాణా సమస్య లేదా రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయవలసిన బాధ్యత దానిది కాగా ఆ పనిచేయకుండా ఇతరులపై నెపం మోపి తప్పించుకున్నది. కేంద్రం రాష్ట్ర విభజనకు అంగీకరించి తెలంగాణా ఏర్పాటు చేయబోతున్నదంటూ ముహూర్తాలు కూడా ప్రకటించిన టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఢిల్లీలో వాయిలార్‌ రవి తదితర నేతలతో నిగూఢ మంతనాలు సాగిస్తుండగానే ఆ వ్యాఖ్యలను వమ్ము చేసే మాటలు కాంగ్రెస్‌ నేతల నుంచి వెలువడ్డాయి. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల తరపున కాంగ్రెస్‌ నేతలే మాట్లాడుతూ వివాదం పెంచేందుకు కారకులయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్ర విభజనకు ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఇప్పుడు వున్నదని తన కృష్ణా జిల్లా పర్యటనలో పిటిఐతో చెప్పారు. అ తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు హైదరాబాదులో సమావేశాలు జరుపుతూ మార్చ్‌ వివాదం పరిష్కారం చేస్తామన్న హామీలు ఇస్తుంటే జిల్లాల్లో అరెస్టులు అడ్డుకోవడాలు జరుగుతూనే వచ్చాయి.
శాంతియుత ప్రదర్శనకు తమకు అనుమతి ఇవ్వాలని జెఎసి నేతలు కోరుతుంటే ఒక పోలీసు అధికారి హింస జరుగుతుందన్న సూచనలు తమ దగ్గర వున్నాయని ఆందోళన పెంచే విధంగా మాట్లాడారు. విధ్వంసం చేస్తామంటూ మీడియాలో వచ్చిన కొన్ని ప్రకటనలు ఇందుకు తోడయ్యాయి. గత మార్చ్‌ సందర్భంలో ఘటనలూ వున్నాయి. ఏమైనా ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలన్న భావం బాగా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రితో తెలంగాణా మంత్రులు ఆయనతో మాట్లాడుతుండగానే డిజిపి మీడియా గోష్టి నిర్వహించి

Friday, September 28, 2012

మార్చ్‌కు అనుమతి మంచి పరిణామం



సెప్టెంబర్‌ 30న తెలంగాణా మార్చ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ అనుమతి లభించడం ఆహ్వానించదగిన విషయం. అన్ని పక్షాలూ పట్టువిడుపులు ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైంది. అదే సమయంలో తెలంగాణా సమస్యపై వివిధ పార్టీల ధోరణులేమిటో కూడా స్పష్టమై పోయింది. కనుక ఇప్పుడు జరగాల్సింది ప్రజాస్వామికంగా ఎవరి విధానాల మేరకు వారు ఉద్యమాలు చేయడమే. రాష్ట్ర విభజన వద్దని చెప్పే సిపిఎంతో సహా అందరూ ప్రజాస్వామిక హక్కుగా మార్చ్‌ను అనుమతించాలనే కోరారు. బహుశా మంత్రులు కూడా ఇంత సూటిగా బయిటకు రావడం ఇదే మొదటి సారి కావచ్చు. నిజానికి ఇలాటి కసరత్తు గతంలోనే జరిగివుంటే ఇంతటి ఉద్రిక్తత అవసరమై వుండేది కాదు. చివరలో కుదిరిన ఈ పరిష్కారం ఏ ఒక్కరి విజయమని భావించడం గాక తెలంగాణాతో సహా రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక సంప్రదాయాలకు మన్ననగా భావించాలి. ఎందుకంటే ఎవరు ఎన్ని విధాల వివాదాలు సృష్టించినా విద్వేషాలు రగిలించినా రెచ్చిపోవడానికి ప్రజలు సిద్ధం కాలేదు. గతంలో చెప్పుకున్నట్టు ఈ దశలోనూ పలువురు నేతలు(పాలక పక్ష ఎంపిలతో సహా) కవ్వింపు వ్యాఖ్యలు చేయకపోలేదు. రెచ్చగొట్టేందుకు యత్నించక పోలేదు. అయితే చివరకు శాంతియుత వాతావరణం కాపాడుకోవలసిన అవసరాన్ని అందరూ గుర్తించడం ఆహ్వానించదగింది. తెలంగాణాపై కేంద్రం నుంచి ప్రతికూల ప్రకటనలు వచ్చినప్పటికీ దాన్నిబట్టి ఉద్యమాన్ని చిన్నబుచ్చే మాటలు మాట్లాడటం మంచిది కాదు. అలాగే తమ ప్రజాస్వామిక ఆకాంక్షను ఇతరులు గౌరవించాలంటే తాము కూడా సంయమనం పాటించాలని ఉద్యమ నేతలు గుర్తించాలి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటేనే వారికి లభించిన ప్రజాస్వామిక మద్దతు సార్థకమవుతుంది. మొదటినుంచి మార్చ్‌కు అనుమతినిచ్చి శాంతియుతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న వ్యాఖ్యాతగా ఈ పరిణామాన్ని ప్రత్యేకంగా హర్షిస్తున్నాను.(చూడండి:ఆంధ్రజ్యోతి గమనం, 27.9.12)

నితిన్‌ గడ్కరీ నీతి బోధలకు మచ్చ



బిజెపి జాతీయ సమావేశాల్లో అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ అవినీతిపై పోరాటం గురించి బ్రహ్మాండమైన ప్రసంగం దంచుతున్నా ఒక మహిళా స.హ కార్యకర్త దానికి తూట్లుపొడించిందని చెప్పాలి.ఎందుకంటే మహారాష్ట్రలో బయిటపడిన 70 వేల కోట్ల ఇరిగేషన్‌ కుంభకోణం(మన జలయజ్ఞం వంటిది)పై పోరాడటానికి ఆయన వెనుకాడాడని ఒక ఆరెస్సెస్‌ అనుయాయి కూతురైన అంజలీ దమానియా వెల్లడించడం బిజెపిని చాలా ఇరకాటంలో పెట్టింది. దీనిపై బిజెపి నేతలే మొదట దుమారం లేవనెత్తినా తర్వాత రాజీ పడుతున్నారని తెలిసి ఆమె ఆయనను ఆగష్టు 14న కలిసి మాట్లాడారు. ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ అనే సంస్థకు చెందిన ఆమె సూచనలకు గడ్కరీ స్పందించకపోగా తనకు కూడా ఎన్‌సిపి నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయని వెల్లడించారు.దీంతో హతాశురాలైన అంజలీ దమానియా ఆ రోజునే ఆయన వైఖరిని ఖండిస్తూ ఒక ఎస్‌ఎంఎస్‌ పంపించారు. దేశం దేశ సేవ అనే మీరు ఇలా ఎలా చేయగలరని ఆమె ప్రశ్నించారు.ఆరెస్సెస్‌ దేశభక్తి సందేశం ఏమై పోయిందని నిలదీశారు. ఇదంతా జరిగి చాలా కాలమైనా పట్టించుకోని గడ్కరి తమ జాతీయ సమావేశాల సంందర్భంలో బయిటకు రావడంపై మాత్రం చాలా ఆగ్రహించారు. అంతా బయిటపెట్టింది తమ వారైతే ఈమె అనవసరంగా ఆరోపణలు చేస్తున్నదంటూ పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు బిజెపి నేతలు. చాలా కుంభకోణాలలో కాంగ్రెస్‌ బిజెపి ప్రభుత్వాలు ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే వుంటాయి గాని అద్యక్షుని స్థాయిలో ఇది తీవ్రమైన అంశమే. గతంలో ఒక అద్యక్షుడు ముడుపులు తీసుకుని జైలుశిక్షకు గురయ్యారు గనక మామూలే అనుకంటే అది వేరే సంగతి!

Thursday, September 27, 2012

ప్రవీణ్‌ కుమార్‌ తిరుగుబాటు వెనక...



చంద్రబాబు లేఖపై తొలుతగా కినుక వహించి తిరుగుబాటు స్వరం వినిపించిన తంబళ్లపల్లి ఎంఎల్‌ఎ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి చర్య వూహించిందే. ఆయన మొదటి నుంచి రాష్ట్ర విభజనకు గట్టి వ్యతిరేకిగా వున్నారు. డిసెంబర్‌ 9 తర్వాత రాజీనామాలను సేకరించడంలోనూ ముఖ్యపాత్ర వహించారు.ఈ విషయంలో అవసరమైతే పార్టీని వదులుకోవడానికి కూడా వెనకాడబోనని తరచూ అంటుండే వారు. దానికి తగ్గట్టే లేఖ వచ్చిన వెనువెంటనే ధిక్కారానికి దిగారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు చంద్రబాబు లేఖ వల్ల తెలంగాణా ప్రాంతంలో విశ్వాసం కలిగించడానికి అక్కరకు రాదు గాని తక్కిన చోట్ల అసంతృప్తుల తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా వున్నాయి. దానికి తోడు జగన్‌ పార్టీ ఈ విషయంలో ఎప్పటి నుంచో కాచుకుని కూచున్నది. ఆ పార్టీ కూడా స్పష్టమైన వైఖరి తీసుకోకపోయినా ఉప ఎన్నికల విజయాలు సామాజిక సమీకరణాలు కలసి వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి కొంతమంది ఇలాగే వ్యవహరించే అవకాశం వుంది.

దామోదర రాజ నరసింహావతారం!



ఇప్పటి వరకూ తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల ప్రతినిధులుగా కాంగ్రెస్‌ తరపున చాలా మంది మా ట్లాడుతూ వచ్చారు. జానారెడ్డి నివాసంలో సమావేశమైన మంత్రులు కూడా సానుకూలస్వరం వినిపించినా సాత్వికంగానే మాట్లాడారు.అయితే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ మాత్రం వాళ్లందరిని మించిన తీవ్ర భాషణం చేశారు. తెలంగాణా నేతలు 56 ఏళ్లలో ఎనిమిదేళ్లు మాత్రమే పాలించారన్న వాస్తవాన్ని చెబుతూ ఈ కారణం చేత అన్యాయం జరిగిందనుకోవడం సహజమేనని సమర్థించారు. అయితే ఇది కేవలం పదవుల పంపకంలో మల్లగుల్లాల ఫలితమే తప్ప ప్రజలకు సంబంధించింది కాదని చెప్పాలి. తెలంగాణాకే చెందిన పి.వి.నరసింహారావు రాయలసీమలోని నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించినా రెండు ప్రాంతాలకూ వొరిగిందేమిటి? ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపిగా వున్నా జరిగిందేమిటి? నిజానికి లెక్క వేస్తే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులే అత్యధిక కాలం పాలించారు. అయినా ఇప్పటికీ ఆ ప్రాంతం వెనకబడే వుంది. కనక మారాల్సింది విధానాలే గాని విగ్రహాల మార్పుతో ఒరిగేది వుండదు.అయితే సమభావన రావాలన్నప్పుడు అన్ని కోణాలు కొలబద్దలూ కూడా పరిగణనలోకి తీసుకోవలసిందే. దామోదర రాజ నరసింహ కూడా భావి ముఖ్యమంత్రుల జాబితాలో వున్నారు గనక ఆయన మాటలలో చాలా అర్థాలు కనిపిస్తాయి. మిగిలిన వాటికన్నా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించడం ప్రాదాన్యత లేకుండా పోదు. ఏమైనా అందరూ కోరుతున్నట్టుగా తగు కట్టుదిట్టాలతో అనుమతినిచ్చి ప్రశాంతంగా మార్చ్‌ముగిసిపోవడంపై దృష్టి పెడితే మంచిది. లేకపోతే ఇది కూడా అసంతృప్తికి ఆజ్యం పోసి పరిస్తితి మరింత దిగజారడానికి కారణమవొచ్చు.

లేఖతో స్పష్టత కాదు, క్లిష్టతే!



తెలంగాణా సమస్యపై చంద్రబాబు లేఖ రాసి స్పష్టత ఇస్తారన్న ప్రచారాన్ని నేనెప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. నిజానికి దానివల్ల క్లిష్టత, నష్టతలే ఎక్కువని కూడా సరదాగా అనేవాణ్ని. ఇటీవల కేంద్రం అఖిలపక్షం గురించి సంకేతాలు వదిలిన తర్వాత అది వుండకపోవచ్చని తెలుగు దేశం నేతలతో గట్టిగానే వాదించాను. ఒక మాజీ మంత్రి అయితే మరుసటి రోజు కలుసుకున్నప్పుడు బాబు నిజంగానే స్పష్టమైన లేఖ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని మరీ మరీ చెప్పారు. ఆ మరుసటి రోజున మరో ప్రాంతానికి చెందిన మరో ప్రజా ప్రతినిధి లేఖ వల్ల లాభముంటుందా అని అడిగారు. నిజంగా ఏదీ స్పష్టంగా చెప్పే స్తితి లేనప్పుడు ఈ లేఖల ప్రహసనమంతా దేనికని కూడా అన్నాను. నిన్న రాత్రి పొద్దుపోయాక ఇంకా చెప్పాలంటే ఆజాద్‌ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత చంద్రబాబు విడుదల చేసిన లేఖ ప్రతి నేను వూహిస్తున్నంత వరకైనా వెళ్లలేదు.అఖిలపక్ష సమావేశం వేస్తే చెబుతామని చెప్పడం తప్ప ఇందులో చెప్పిందేమీ లేదు. నిజానికి అఖిలపక్షం అనవసర కాలయాపన గనక వెంటనే కేంద్రం నిర్ణయం ప్రకటించాలన్నది ప్రతిపక్షాల సాధారణ కోర్కెగా వుండింది. చంద్రబాబు లేఖతో ప్రధాన ప్రతిపక్షమే అందుకు అభ్యర్థించినట్టయింది. (బహుశా ప్రధాని ఎదరు దాడి లేఖ రాసేందుకు ఇది అవకాశమైనా కావచ్చు) అప్పటికి అక్కడ ఏం చెబుతారనేది అస్పష్టంగా అట్టిపెట్టేశారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించడం పెద్ద విసయమేమీ కాదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన సంగతే. ఆ లేఖకు ఇప్పటికీ కట్టుబడి వుంటామని అంటే అదో తీరు గాని అదీ లేదు. గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు విలువేమీ లేదు. అసలాయనే రాష్ట్రపతి భవన్‌లో కూచున్నారు. దాన్ని వెనక్కు తీసుకోలేదని పదే పదే చెప్పుకోవడం కూడా అర్థం లేనిదే. ఎందుకంటే ఆ అవకాశం ఎలానూ వుండదు. రాజకీయంగానూ దాన్నుంచి వెనక్కు మళ్లినట్టు చెప్పుకునేట్టయితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది గనక అదీ అసంభవమే. ఈ లేఖ వల్ల తెలంగాణాలో తెలుగు దేశం పుంజుకొంటుందని విశ్వసనీయత పొందుతుందని అనుకోవడం అతిశయోక్తి అంచనా అవుతుంది. ఆ లాభం సంగతి ఎలా వున్నా రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ దాడికి తెలుగుదేశం గురి కావలసి వుంటుంది. స్పష్టమైన విధానం చెప్పి లాభనష్టాలను ఎదుర్కోవడం ఒక పద్ధతి. ఇక్కడ స్పష్టత లేకుండా వున్నట్టు కనిపించాలనుకోవడమే సమస్యలకు దారి తీస్తున్నది. తమపై కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు అంటారు. అయితే అస్పష్టతకు అది సమర్థనమెలా అవుతుంది? ప్రత్యర్థుల కుట్రలునూ దాడులను ఎదుర్కోవడం ప్రతిపార్టీకీ వుండే సమస్యే. ఆ మాటకొస్తే వారు కూడా ఆ పార్టీల పట్ల అభిమానంగా ఏమీ వుండబోరు కదా.. ఇప్పుడు చంద్రబాబు స్వంత జిల్లాలో ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో మొదలైన నిరసనలు ఆయనతోనే ఆగకపోవచ్చు. అలాగే తెలంగాణాలోనూ అసంతృప్తి ఆగకపోవచ్చు.

Wednesday, September 26, 2012

ఆజాద్‌ వ్యాఖ్యల అంతర్యం?



తెలంగాణా మార్చ్‌పై ప్రభుత్వం, జెఎసి తలో వైపునుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల నిపుణుడు గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడింది.గతంలో చత్తీస్‌ఘర్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌లను మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల నుంచి విడదీసినప్పటి స్థితికీ తెలంగాణా విభజన కోర్కెకూ పోలిక లేదన్నది ఆయన వాదన సారాంశం. అది మొదటి నుంచి తెలిసిన విషయమే. నిజానికి అవి ఫ్రధానంగా గిరిజన లేదా పర్వత ప్రాంతాలతో కూడిన చిన్న రాష్ట్రాలు. ఒక దశలో లాలూ యాదవ్‌ వ్యతిరేకత తెలిపినా తర్వాత తన పునాది బలహీనపడిందని గ్రహించి తలవొగ్గారు. మిగిలిన చోట్ల ఆ మాత్రం ప్రలికూలత కూడా లేదు. జార్ఖండ్‌ కోసం వంద ఏళ్ల ముందు నుంచి ఉద్యమం వుంది. వాటితో పోలిస్తే తెలంగాణా సమస్య భిన్నమైందే కావచ్చు. అయితే ఈ విషయాలన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు చెప్పడమే హాస్యాస్పదం. డిసెంబర్‌ 9 ప్రకటన తరుణంలోనూ తర్వాత కూడా కేంద్రానికి ఇవన్నీ తెలియదా?తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఇక్కడ ఏకాభిప్రాయం లేదన్న పల్లవి చాటున దాక్కోవడం ఎందుకు? పోనీ ఇదైనా తుది ప్రకటనగా స్పష్టంగా చెప్పేస్తారా అంటే అదీ వుండదు. ప్రజల స్పందన తీరు తెన్నులు గమనించి మళ్లీ సవరణలూ సన్నాయినొక్కులు మొదలెడతారు. నిజానికి కేంద్రం నుంచి ఏవో సంకేతాలు వస్తున్నాయన్న ప్రచారాలు అంచనాలు ఆదార రహితాలని నేను చాలా సార్లు రాశాను. ఇప్పుడు నేరుగానే చెప్పేశారు. అయితే కావలసింది ఇలాటి అరకొర వ్యాఖ్యలు కావు. అధికారిక నిర్ణయాత్మక ప్రకటన. అప్పుడే ప్రజలు ప్రాంతాలు తమ భావాలను బట్టి స్పందిస్తారు. అనిశ్చితి బెడద పోతుంది.

ప్రశాంతంగా మార్చ్‌- ప్రభుత్వం, జెఎసిల బాధ్యత



29న వినాయక నిమజ్జనం, మొదటి తేదీ నుంచి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వున్న దృష్ట్యా వాయిదాను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదే సమయంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అవరోధాలు కల్పించడం జరుగుతున్నది. పోలీసులూ అనుమతి నిచ్చేది లేదని తేల్చేశారు. నిజానికి ఈ సమస్యల సాచివేత, సమాధానాల దాటవేత, సమీకరణల అణచివేత అవాంఛనీయ పరిణామాలకు దారి తీసిన అనుభవాలు గతంలో వున్నాయి గనక అంతకంటే విజ్ఞతతో ప్రభుత్వం వ్యవహరించాల్సి వుంటుది. అనుభవాల నేపథ్యంలో ఈ మార్చ్‌ను నిరాటంకంగా శాంతియుతంగా జరగనివ్వడమే మంచిది. అదేసమయంలో నిర్వాహకులు కూడా తమవైపునుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. గణేష నిమజ్జనం సమయంలో మామూలుగానే హైదరాబాదులో ఉద్రిక్తత అందరికీ తెలుసు. జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తాము గాంధేయ పద్ధతులలో జరుపుతామని అంటున్నా గతంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంస ఘటనలు, ఇటీవలి కొన్ని వ్యాఖ్యలు సందేహాలకు అవకాశమిస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, హైదరాబాదులో జరిగిన కొన్ని విధ్వంసక ఘటనలు, కొందరు నేతల ప్రకటనలు ఉద్రిక్తత పెంచేవిగా మారాయి. కేంద్రం ఉద్దేశపూర్వకంగా చెలగాటమాడుతున్నప్పుడు సంయమనం పాటించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుంటుంది. ప్రత్యేకించి తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక వారసత్వానికి మచ్చ తెచ్చే ఎలాటి చర్యకు లేదా మాటలకూ ఎవరూ పాల్పడకూడదు. ఈ సమయంలో ఎంతో బాధ్యతగా వుండాల్సిన మంత్రులతో సహా కాంగ్రెస్‌ నాయకులు తలో వైపున మాట్లాడుతూ ఉద్రిక్తల వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. ప్రాంతాల వారిగా వర్గాల వారిగా సమావేశాలు,ఢిల్లీ యాత్రలు జరుపుతూ తామే వివాదం పెంచుతున్నారు. నిజానికి ఒకే ప్రాంతం వారు కూడా వేర్వేరు శిబిరాలుగా విడిపోతున్నారు. తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.ఈ సంకుచిత వ్యూహాలు కట్టిపెట్టి ప్రజా శ్రేయస్సు ప్రశాంతత కోణంలో వ్యవహరిస్తే చాలా మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్రను సవ్యంగా నిర్వహిస్తే అన్ని ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు.